డైరెక్టర్స్ డే కాదు.. రికార్డింగ్ డాన్స్ డే!

దర్శకరత్న దాసరి ఊసే లేని డైరెక్టర్స్ డే!
19-05-24 (ఆదివారం) సాయంకాలం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన డైరెక్టర్స్ డే ఈవెంట్.. “వచ్చినవారి పెదవి విరుపుకు గురి అయింది” అనడంలో సందేహం లేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.

“డైరెక్టర్స్ డే” అనే పదం పుట్టింది ఎక్కడో తెలుసా?
మన తెలుగు తేజం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి నాడు వారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న కొంతమంది ఆయన అభిమాన దర్శకుల ఆలోచనల్లోంచి. అలాంటిది ఆయన ఊసే లేదు. కనీసం ఆయన ఫోటో లేదు. ఒక్కరైనా ఆయన్ని గుర్తు చేసుకున్నదీ లేదు.

బహుశా ఐదేళ్ల క్రితం.. అలాంటి ఆలోచన పుట్టింది. ఆ ఐడియాలజీని అప్పటి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్.. దాసరి గారి జయంతిని “డైరెక్టర్స్ డే” పేరుతో ఒక ఉత్సవంగా జరుపుకోవాలని ప్రపోజ్ చేసి, ఆ సంఘం కార్యవర్గ తీర్మానంతో అమలు చేసి.. ఈ మహోత్సవానికి తెర తీశారు. అప్పటినుంచి ఈ కార్యక్రమం ఒక వేడుకగా జరుపుకుంటూ వస్తున్నారు. గత ఏడాది వరకు ఎఫ్.ఎన్.సి.సి. క్లబ్ లాంటి వేదికలపై ఇండోర్ లో జరుగుతున్న ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది దర్శకుల సంఘం డైరెక్టర్స్ డే కార్యక్రమాన్ని లాల్ బహుదూర్ స్టేడియంలో అవుట్ డోర్ లో భారీ ఎత్తున జరిపే ప్రయత్నం చేసింది. నిస్సందేహంగా ఈ సంకల్పం గొప్పదే సందేహం లేదు. కానీ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించే ముందు చేయాల్సిన కసరత్తు సరిగా చేయలేదు అనిపించింది ఈ వెలవెల బోయిన వేడుకను చూసినప్పుడు. అనుభవ రాహిత్యంతో ఈ ఈవెంట్ మేనేజర్లు ఈ కార్యక్రమాన్ని సర్వనాశనం చేశారు. టికెట్ కొని మరీ వచ్చిన ప్రేక్షకులు తిట్టుకుంటూ వెళ్లారు. ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసి ఇది డైరెక్టర్స్ డే కాదు రికార్డింగ్ డ్యాన్స్ డే అని తిట్టుకుంటూ వెళ్లారు.

అసలు దాసరి గారి జయంతి మే నాలుగో తేదీన విధిగా ఈ ఉత్సవం జరుపుకోవాలి. చివరి నిమిషంలో సరైన పర్మిషన్ల సాధనలో విఫలమైన ఈవెంట్ మేనేజర్లు ఈ కార్యక్రమాన్ని రద్దుచేసి మళ్లీ మే నెల 19వ తేదీ ఆదివారం నాటికి పోస్ట్ పోన్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లాల్ బహుదూర్ స్టేడియం పరిసర ప్రాంతాలలో భారీ జన సమీకరణ జరిగే ర్యాలీలు సభలు ఎక్కువగా ఉన్నందున ఈ ఈవెంట్ కు పోలీసులు తగిన అనుమతిని ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది.
ఇక ఇంకో ముఖ్య విషయం ఈ భజన ఈవెంట్ కు టిక్కెట్లు పెట్టి బుక్ మై షో లో అమ్మడం. ఇది నిజంగా ఒక విస్మయం. పెళ్లికి పిలిచి.. భోజనం పెట్టి.. చేతిలో ఆ భోజనానికి టికెట్ కూడా పెట్టి..డబ్బులు అడిగినట్టు అనిపించింది. ఒక మహా దర్శకుడి సంస్మరణలో వేడుక జరుపుకుంటూ.. ఆ వేడుక విజయవంతం కావడానికి ప్రేక్షకుల అవసరం ఉంది కాబట్టి..అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించి..మళ్లీ అదే వేడుక చూసేందుకు వచ్చేవారికి టిక్కెట్ పెట్టడం పరస్పర వైరుధ్యం.. ఈ రెండూ ఒకదానికొకటి పొసగని విషయాలు!

ఎందరో ప్రముఖులైన హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు డైరెక్టర్లు వస్తారని ఊదరగొట్టిన దర్శకుల సంఘానికి ప్రాక్టికల్ గా అది సాధ్యం కాకపోవడంతో.. కేవలం కొద్ది మంది హీరోలు మాత్రమే రావడంతో.. తత్వం బోధపడింది. మెగాస్టార్ చిరంజీవి నేషనల్ స్టార్ ప్రభాస్ రామ్ చరణ్ తేజ్ లాంటి పెద్ద హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఒక పెద్ద మైనస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే వీరిని ఆదుకున్న పెద్ద స్టార్. అల్లు అర్జున్ మయమైపోయింది ఈ వేడుక. సీనియర్ నటులు డాక్టర్ మురళీమోహన్ తో పాటు నేచురల్ స్టార్ నాని, అల్లరి నరేష్, సుధీర్ బాబు, అడవి శేషు, ఆనంద దేవరకొండ లాంటి హీరోలు మాత్రమే ఈ పెద్ద కార్యక్రమానికి దిక్కయ్యారు. ఒక్క పెద్ద హీరోయిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం విశేషం.
సభలో కూర్చున్న ఎంతోమంది తెలుగు సినిమా ప్రేమికులు.. ముఖ్యంగా దాసరి అభిమానులు.. ఎంతో బాధపడిన విషయం యునానిమస్ గా ఒక్కటే. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడిగా వరల్డ్ రికార్డు సాధించి, నేల మీద ఉన్న దర్శకుడి పేరును అమాంతం మేఘాలకు చేర్చి ఆకాశానికి ఎత్తేలా చేసిన చరిత్రకారుడు దర్శక ధీరుడు దాసరి నారాయణరావు గారి ఫోటో గాని, ఆడియో వీడియో క్లిప్పింగ్ గాని, కనీస ప్రస్తావన గానీ లేకుండా రాకుండా జాగ్రత్త పడిన నిర్వాహకుల అజ్ఞానానికి..దురహంకారానికి అందరూ విస్మయం చెందుతూనే బాధపడ్డారు.

అసలు డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రాత్రి 8 గంటల వరకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది! కార్యక్రమం రద్దు చేసుకుందామా అనే పరిస్థితిలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ద్వారా పోలీసుల అనుమతి వచ్చిందట! రాత్రి 8 50 నిమిషాలకు అల్లు అర్జున్ వేదికకు వచ్చారు ఆ తర్వాతే దర్శకులు నృత్య ప్రదర్శనలు మొదలుపెట్టారు! జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ ను ఘనంగా సత్కరించి తమ కార్యక్రమాన్ని ముగించుకున్నారు! దర్శకులు ఏమోగానీ అల్లు అర్జున్ మాత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు సేవలను కొనియాడటం కొస మెరుపు!

-మహమ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap