ఈ ఏడాది దీపావళి కానుకగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చిన సినిమాలలో ఫర్వాలేదు అనిపించుకున్న చిత్రాలకు సైతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో దీపావళి సీజన్‌ను ఉపయోగించుకోవడానికి తెలుగు నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. నవంబర్ మొదటి వారాంతంలో అనువాద చిత్రాలు మూడు విడుదల కాగా, స్ట్రయిట్ తెలుగు సినిమా ఒక్కటే దీపావళికి విడుదలైంది. వీటితో పాటే సూర్య తమిళ చిత్రం ‘జై భీమ్’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
గత కొంతకాలంగా రజనీకాంత్ ఒకే వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ‘కబాలి, కాలా’ చిత్రాలతో పాటు ఆ తర్వాత వచ్చిన ‘దర్బార్, పేట’ కూడా ఘన విజయాన్ని పొందలేక పోయాయి. దాంతో దర్శకుడు శివ ఈ తమిళ సూపర్ స్టారను మరోసారి కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేశాడు. అలా తెరకెక్కిన ‘అన్నాతే’ను తెలుగులో ‘పెద్దన్న’గా డబ్ చేశారు. అయితే మరీ ఎనభైల నాటి కాలానికి చెందిన ఈ కథ ఈ తరాన్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. తల్లి చనిపోతూ తన చేతిలో పెట్టిన చెల్లిని అల్లారుముద్దుగా పెంచే వీరన్న అనే గ్రామ పెద్ద పాత్రను రజనీకాంత్ ఇందులో పోషించాడు. అతని చెల్లిగా కీర్తిసురేశ్ నటించింది. అన్నయ్య కోసం ప్రాణం పెట్టే ఆ చెల్లి సరిగ్గా పెళ్లి రేపు అనగా ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఆమె ఎందుకు అలా చేసింది? ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడింది? ఆ సమయంలో చెల్లి మనసెరిగి ఆ అన్నయ్య ఎలా ఆమెను ఆదుకున్నాడు? అనేదే ఈ సినిమా. కథ, కథనాలలో ఏ మాత్రం కొత్తదనం లేని ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా, రజనీకాంత్ అభిమానులు సైతం దీనిని చూసి డీలా పడిపోయారు. నేల విడిచి సాము చేసిన ‘ఎనిమి’ విశాలకు తమిళంలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలానే ఆర్యకూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో ‘అవన్ – ఇవన్’ అనే సినిమాను బాల దర్శకత్వంలో చేశారు. తిరిగి పదేళ్ల తర్వాత వీరిద్దరితోనూ ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ అనే సినిమా తీశాడు. మైండ్ గేమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం దర్శకుడు చాలా బలహీనమైన కథను రాసుకున్నాడు. బాల్యంలోనే ప్రకాశ్ రాజ్ చేతిలో కొంత శిక్షణ పొందిన ఇద్దరు పిల్లలు ఆ తర్వాత వేర్వేరు దారులు పడతారు. ఒకరు హీరో అయితే, మరొకరు విలన్. ఆ తర్వాత కొన్నేళ్లకు ఒకరికి ఒకరు తారసపడినప్పుడు వారి ఎత్తులు, జిత్తులు ఎలా ఉంటాయన్నదే ఈ సినిమా. కాస్తంత ఫాదర్ సెంటిమెంట్ ను ఈ యాక్షన్ మూవీకి దర్శకుడు జత చేశాడు. కానీ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏ ఒక్క సన్నివేశమూ ప్రేక్షకులను కట్టిపడేసేలా లేకపోయింది. యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నా, కథలో బలం లేకపోవడంతో ‘ఎనిమి’ నేల విడిచి సాము చేసినట్టు అయ్యింది.
పెద్దంతగా ఆకట్టుకోని ఇటర్నల్స్’
దీపావళి కానుకగా రెండు తమిళ చిత్రాలు తెలుగులో డబ్ కాగా, మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఆంగ్ల త్రీడీ చిత్రం ‘ఇటర్నల్స్’ సైతం తెలుగువారి ముందుకు వచ్చింది. సూపర్ హీరోస్ సినిమాలకు మార్వెల్ స్టూడియోస్ పెట్టింది పేరు. అవెంజర్స్ సీరినకు గత యేడాది ఈ సంస్థ ఫుల్ స్టాప్ పెట్టడంతో ఇప్పుడు కొత్త సూపర్ హీరోను తెర మీదకు తీసుకొస్తూ ‘ఆటర్నల్స్’ను నిర్మించింది. ఇందులో సూపర్ పవర్స్ ఉన్న పదిమంది వ్యక్తులు మనకు తారసపడతారు. ఏడు వేల సంవత్సరాల క్రితం భూమిని రాక్షసుల బారి నుండి రక్షించడానికి వేరే గ్రహం నుండి ఇక్కడికి వచ్చిన వీరు, ఇక్కడే రకరకాల ప్రదేశాలలో ఉంటారు. తాజాగా మరోసారి ప్రళయం ముంచుకొచ్చినప్పుడు వారు దాన్ని ఎలా ఎదుర్కొ న్నారు? అందులో కొందరు ఎలా కన్నుమూశారు? అనేదే ఈ సినిమా. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్ సీన్స్ బాగున్నా, కథలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
విఫలమైన మారుతి ప్రయోగం!
దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ పడటంతో ఖాళీగా ఉండకుండా ఆ టైమ్ లో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా తీశాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించలేక పోయింది. కొలిగ్ తో ప్రేమలో పడిన తన కూతురు ఎక్కడ చేజారిపోతుందో అని మథనపడే ఓ తండ్రి వ్యథ ఇది. అయితే వినోదం పేరుతో మారుతీ నటీనటులతో చేయించిన ఊర కామెడీ జనాలకు వెగటు పుట్టించింది. దాంతో ఈ స్ట్రయిట్ తెలుగు సినిమానూ వారు తిరస్కరించారు. మొత్తం మీద దీపావళి కానుకగా వచ్చిన నాలుగు సినిమాలు తడిచిన బాణసంచా మాదిరి తుస్సుమన్నాయి. మరి కార్తీకమాసం తొలి వారాంతంలో వచ్చే సినిమాలైనా కాకరపువ్వొత్తుల్లా వెలుగులు విరజిమ్ముతాయేమో చూడాలి.
-జాగృతి అరుణ