“కళ్ళు రెండైనా చూపు ఒక్కటే, కాళ్ళు రెండైనా చేరే గమ్యం ఒక్కటే”- అన్నట్లు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి వేరొకటిగా ఉండి రెండింటిలో అత్యంత ప్రతిభాపాటవాలును కనబరుస్తున్న “కవి వైద్యులు”డా. మక్కెన శ్రీను. పశు వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి శస్త్రచికిత్సలో నైపుణ్యాన్ని సంపాదించి ‘కత్తెర’ పట్టి, తన వృత్తిలో రాణిస్తూ… పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామీణ నేపధ్యం కావటంతో సామాజిక శాస్త్రవేత్తగా సమాజాన్ని బాల్యం నుండే అధ్యయనం చేసిన డా. మక్కెన ‘కలం’ పట్టి సాహితీ సేద్యం చేస్తూ అచిరకాలంలోనే పండిత ప్రకాండుల చేత మన్ననలు పొందారు.
ఇంతటి ఘనతకెక్కిన మక్కెన పూర్వాపరాల్లోకి వెళదాం. ప్రకాశం జిల్లా, పర్చూరుకు అతి సమీపంలో వున్న వీరన్నపాలెం గ్రామంలో మక్కెన రామసుబ్బయ్య, అంజమ్మ పుణ్యదంపతులకు మొదటి సంతానంగా 24-4-1971న జన్మించారు. బాల్యం నుండే గురువు ముత్యాల వెంకటేశ్వర్లు గారి శిక్షణలో చురుకైన విద్యార్ధిగా తీర్చిదిద్దబడ్డారు. పాఠశాల, కళాశాల విద్యాబ్యాసం అనంతరం, తిరుపతిలోని పశువైద్య కళాశాలలో బి.వి.ఎస్.సి., ఎమ్.వి.ఎస్.సి. అనంతరం పిహెచ్.డి. పట్టా కూడా పొందారు.
వృత్తి : ప్రస్తుతం గన్నవరం పశువైద్య కళాశాలలో శస్త్రచికిత్స విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. గత 19 ఏళ్ళుగా శస్త్రచికిత్సలో మెళకువలను ఔపోసన పట్టిన వీరు సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రంలో మెరుగైన శస్త్రచికిత్స నిపుణుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. తొలుత అనంతపురం జిల్లా, పెద్ద వడుగూరులో 1997లో పశువైద్యునిగా విధుల్లో చేరారు. 1998-2001 మధ్యకాలంలో తిరుపతి పశువైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. 2001-2011 వరకు గన్నవరం పశువైద్య కళాశాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. కరీంనగర్ జిల్లా, కోరుట్ల పశువైద్య కళాశాలలో 2012-15 మధ్యకాలంలో ఆచార్యులుగా సేవలందించారు. 2015 సం. నుండి గన్నవరం పశువైద్య కళాశాలలో ఆచార్యునిగా, శస్త్రచికిత్స విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు.
సత్కారాలు : రాష్ట్రంలో వివిధ సంస్థలతో ఉత్తమ బోధకునిగా, వైద్యునిగా సత్కరించబడ్డారు. 2018 సం.లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీరిని ప్రభుత్వం తరఫున ‘ఉత్తమ ఆచార్యునిగా’ గుర్తించి సత్కరించడం వారి సేవలకు మంచి గుర్తింపు వచ్చింది.
సాహిత్యా భిలాష – రచనలు : చదువరై పుట్టాక కాస్తంత సాహితీ సేవ చేయాలనే తలంపుతో ఎవరికీ తలవంపులు రాకుండా రాష్ట్రంలో కవులు, రచయితల సాహిత్యాన్ని తన సునిశిత దృష్టితో పఠించి, అవగాహన చేసుకున్నాక తానూ నేను సైతం కలం పట్టి ‘సాహితీలోకానికి సేవ చేస్తాను’ అనే దృక్పధంతో, ఆలోచనతో ముందుకు అడుగువేశారు. కలానికి పదును పెట్టి అదను దొరికినప్పుడల్లా తన మస్తకంలోని భావాలకు అక్షర లక్షలుగా పురుడుపోసి, పదాలు అల్లి, పుస్తకాలుగా తెలుగు పాఠకులకందించారు. 2015 సం.లో తన సాహితీ జీవితం ‘జీవన కవనం’ అనే వచన కవితా సంపుటితో ప్రారంభమైంది. అప్పటినుండి యేటా కనీసం 2 రచనలకు తగ్గకుండా సాహితీ పంట పండిస్తున్నారు.
రచనలు : 2015వ సం.లో ‘జీవన కవనం’, ‘మట్టికుదుళ్ళు’ అనే రెండు కవితా సంపుటాలు ఆవిష్కరించబడ్డాయి. 2016వ సం.లో ‘భావ తరంగం’ పేరుతో దీర్ఘకవితను ఆవిష్కరించి ఎందరో కవులను దీర్ఘాలోచనలో పడేశారు. 2017 సం.లో తనవృత్తికి సంబంధించిన ‘పశువైద్య వ్యాసావళి’ అనే వ్యాస సంపుటిని, 2018వ సం.లో ‘మౌన సవ్వడి’ అనే కవితా సంపుటిని, 2019వ సం.లో ‘అక్షర గవాక్షం’ అనే సమీక్షా సంపుటితో పాటు ‘గోరంత కవిత’ అనే నానో ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2020వ సం.లో ప్రముఖ కవి యక్కలూరి శ్రీరాములు రచనలపై విశ్లేషించి, సమీక్షించిన వ్యాసాలను ‘యక్కలూరి సాహిత్యం – ఒక అనుశీలన’ అనే పేరుతో ఆవిష్కరించారు. అనంతరం ‘అక్షర ఊయల’ పేరుతో సమీక్షా సంపుటిని కూడా తీసుకొచ్చారు.
జక్కన చెక్కని శిల్పాకృతి లేదన్నట్లు, సాహిత్య ప్రక్రియలో మక్కెన వ్రాయని కవిత్వ ప్రక్రియ లేదు. నానో, నానీ, కవిత, దీర్ఘకవిత, కథ, సమీక్ష, వ్యాసం, చిత్రకవిత – ఇలా అన్ని ప్రక్రియలను స్పృశించడం అంత తేలికైన పని కాదు. ఒకే కవిలో భిన్న ప్రక్రియలను మనం చూడొచ్చు. కలంలో విభిన్నమైన పోకడలను గమనించవచ్చు. కేవలం ఐదేళ్ళ కాలంలో 10 పుస్తకాలను ప్రచురించడం అంటే సాహిత్య ప్రస్థానంలో వీరికొక ఆస్థానం ఉందనే చెప్పాలి.
సాహితీ సేవ : తాను కవిగా, రచయితగా పాఠకులకు పరిచయమే. ఎందరో అపరిచిత కవులు, రచయితలు వారి పుస్తకాలను ముద్రించాక సమీక్ష చేయండని డా. మక్కెన శ్రీనుకు పంపుతున్నారంటే వీరి సాహితీపట్టు తేనెపట్టులాంటిదని వారు గుర్తించారని మనం ఒప్పుకోక తప్పదు. తాను కవిగా, రచయితగా ఎదిగాక సాహితీ లోకానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పధం రావడం ఎంతో ముదావహం. ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారు. విజయవాడలోని డా. పట్టాభి కళాపీఠము సౌజన్యంతో యేటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభా మూర్తులకు ‘ఆచార్య నెల్లుట్ల స్మారక ప్రతిభా పురస్కారం, మక్కెన రామసుబ్బయ్య స్మారక ప్రతిభా పురస్కారాలను’ అందివ్వడం వారి సేవా నిరతికి తార్కాణం. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, డా. బీరం సుందరరావు, గెంటాడ గౌరీనాయుడు, శైలజా మిత్ర, సిరికి స్వామినాయుడు, కాటూరు రవీంద్ర త్రివిక్రమ్, డా. పెళ్ళకూరు జయప్రద, సి. హెచ్. నరసింహారావు, సింహ ప్రసాద్ ఉన్నారు.
నెల్లూరుకు చెందిన ‘విశాలాక్షి’ మాసపత్రిక సౌజన్యంతో మక్కెన రామసుబ్బయ్య స్మారక కథల పోటీ, కవితల పోటీ నిర్వహిస్తూ నగదు పురస్కారాలు అందిస్తున్నారు. విశాఖపట్నంలోని ‘విశాఖ సంస్కృతి’ మాసపత్రిక సౌజన్యంతో బాలసాహిత్యంపై పోటీలు నిర్వహించి నగదు పురస్కారాన్ని అందిస్తున్నారు.
డా. మక్కెన పొందిన సాహితీ పురస్కారాలు :
- హైదరాబాద్ కు చెందిన ‘నెలవంక నెమలీక’ మాసపత్రిక 2015 సం. రానికి ‘ఉత్తమ సమీక్షకుని’గా ‘కలహంస’ పురస్కారం అందించింది.
- 2015వ సం. లో వీరు వ్రాసిన కవితను ‘ఉత్తమ కవిత’గా ఎంపికచేసి ‘కలహంస’ పురస్కారం అందించింది.
వృత్తిరీత్యా పొందిన అవార్డులు, రివార్డులు, అభినందనలు, సేవలు :
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘ఉత్తమ పశువైద్య ఆచార్యుని’గా, శస్త్రచికిత్స నిపుణుడుగా పేరెన్నిక గన్నారు. బి.వి.ఎస్.సి., ఎమ్.బి.ఎస్.సి. విద్యార్ధులకు ‘ప్రయోగశాల నిబంధనావళి’ని తయారుచేశారు. 16 మంది ఎమ్.వి.ఎస్.సి. విద్యార్ధులకు, ఇద్దరు పరిశోధన విద్యార్ధులకు గైడ్ గా వ్యవహరించారు. Indian Society of Veterinary Surgery వంటి అనేక సంస్థల్లో జీవిత సభ్యునిగా ఉన్నారు. అనేక పశువైద్య శాస్త్ర పత్రికలకు సలహాదారులుగా ఉన్నారు. ‘International Journal of livestock Research’ పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా సేవలందిస్తున్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ క్రింద దాదాపు 140 గ్రామాల పరిధిలో 51 ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు.
క్షణం తీరికలేని వృత్తి, మాటరాని మూగజీవులకు వైద్యం చేయడమంటేనే యుక్తి. కేవలం ఆయా పశువుల ప్రవర్తనను కంటిచూపుతో చూసి, గమనించి, మనసుతో వ్యాధి తత్వాన్ని ఆలోచన చేసి, అంచనావేసి వైద్యం చేయడం అంటే అది బుద్ధికుశలత ఉన్నవారికే వీలౌతుంది. అలాంటి వృత్తిలో నిర్లిప్తత లేకుండా నిబద్ధత, నిపుణత సాధించిన డా. మక్కెన కీర్తి నిచ్చెనకు ఎన్ని మెట్లో మనం లెక్కించలేం.
ఒక పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మరి ఈ కవి వైద్యుని కీర్తి బావుటా సాహితీ ఆకాశంలో రెపరెపలాడటానికి చేయూత తన సహధర్మచారిణి సుధారాణి. తాను ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, భర్త తెలుగు సాహితీ సేద్యానికి మేడిగర్ర, ముళ్ళుగర్ర అయి వెన్నుదన్నుగా ఉండటం విశేషం. ఏకైక పుత్రిక చి. సాయి మేఘన ప్రాధమిక విద్యాభ్యాసం చేస్తూ చురుకైన, తెలివైన విద్యార్ధినిగా వెలుగొందుతూ ఉంది. భవిష్యత్తులో తండ్రికి మించిన తనయగా విరాజిల్లగలదని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చరిత్ర అందరికీ ఉంటుంది. కానీ ఘనచరిత్ర కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే డా. మక్కెన. వారి వృత్తి – ప్రవృత్తి అంతరం ఎరుగక నిరంతరం నిర్విఘ్నంగా కొనసాగుతూ భావితరాలకు మార్గదర్శి అవ్వాలని మనమందరం ఆశిద్దాం.
– డా. తూములూరి రాజేంద్రప్రసాద్ (9490 33 2323)
_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.
“జక్కన చెక్కని శిల్పాకృతి లేదన్నట్లు, సాహిత్య ప్రక్రియలో మక్కెన వ్రాయని కవిత్వ ప్రక్రియ లేదు. ”
మా ప్రక్కనే తిరిగే మిత్రుని గొప్పతనం డా.తూములూరి వ్యాసం చదివాకే తెలిసివచ్చింది. ఓ గొప్ప కవిని పరిచయం చేసిన 64కళలు.కామ్… కళా సాగర్ గారికి ధన్యవాదాలు.
thank you sir
Sir,
Good morning. U are double edged knife. Very Surgeon on the one hand n becoming popular poet on the other hand. Anyhow, U are doing great job. Keep it up.
thanks lot sir
పశు వైద్యరంగంలో అత్యున్నత శిఖరాలను అధిగమించి, ప్రవృత్తి లో తనకు తానే ఘనాపాటిగా వాసికెక్కిన ‘మక్కెన’
శస్త్రచికిత్సలో అవలీలగా కదిలే నీ చేతివేళ్ళు
కవితాకూర్పులో అసమాన ప్రతిభను చూపే నీ కలం
భావితరాలకు మరింతస్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ…నీ డా.మాదిన
thank you dr madina … you always with me since college days
Doctor sahab, it’s really exciting to see you excelling in literary field…… I had an opportunity to witness one of your many contributions… Let your literary spree continue to cherish the social kind
thanks lot dr
“చరిత్ర అందరికీ ఉంటుంది. కానీ ఘనచరిత్ర కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే డా. మక్కెన. వారి వృత్తి – ప్రవృత్తి అంతరం ఎరుగక నిరంతరం నిర్విఘ్నంగా కొనసాగుతూ భావితరాలకు మార్గదర్శి అవ్వాలని మనమందరం ఆశిద్దాం.” – అన్న మాటలు డాక్టర్ గారి పట్ల అక్షర సత్యం. కవి వైద్య రచయితగా మక్కెన శ్రీను గారిని చక్కగా అంచనా వేశారు తూములూరివారు
thank you sier
Congrats Dr. Srinu Garu
thank you sir
Wonderful service in different fields, keep it up sir.
thank you sir
Congrats sir
thank you