విమర్శా పరిశోధనా రంగాల సవ్యసాచి

ఒక చేత్తో విమర్శా పావురాలను, మరోచేత్తో పరిశోధనాపాలపిట్టలను ఎగరేయగల ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ సుశీలమ్మ గారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కవయిత్రులు, రచయిత్రులు చాలామంది ఉన్నారు ‌. కానీ విమర్శకులు తక్కువ. అలాంటి విమర్శ రంగంలో పేరెన్నిక గన్న వ్యక్తి డాక్టర్ సుశీలమ్మ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెర సాని పాటల మీద ఎం.ఫిల్, ముళ్ళపూడి సాహిత్యం పై పిహెచ్.డి. చేశారు. స్త్రీవాదం పురుష రచయితలు అనే పరిశోధన గ్రంథాన్ని యూజీసీ కోసం ప్రచురించారు. ప్రాచీన సాహిత్యం లోతును చూశారు. ఆధునిక సాహిత్యం అవగతం చేసుకున్నారు. అధ్యాపనం ,అధ్యయనం ఆవిడ వృత్తి,ప్రవృత్తి‌‌ చాలామంది రచయితలు కొంతకాలం రాసి ఆగిపోతారు. కానీ కొంతమంది సతత జీవనదులు . మొక్కపోదు వారి కలం. వారి రచనలకు లేదు విరామం. సాధారణంగా చాలామంది విమర్శకుల ప్రతిభ ఏదో ఒక రంగానికి పరిమితం. కానీ సుశీలమ్మ గారు కవిత, కథ, నవల, బాలసాహిత్యం మొదలైన విభిన్నమైన ప్రక్రియల మీద తన విమర్శనా దృష్టిని సారించారు. ఆమె పేరడీ, పడమటి వీధి, విమర్శనా విపంచి, కవిత్వం పరామర్శ, తొలి తరం తెలుగు రచయితలలో అభ్యుదయం మొదలగు 13 పుస్తకాలను రచించారు. ఈమె వినుకొండ, గుంటూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అధ్యాపకులుగా , ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు.

నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ వారి కోసం స్పెషల్ తెలుగు మొదటి సంవత్సరం పాఠాలు రాశారు. రెండో సంవత్సరం ఎడిటర్ గా బాధ్యత నిర్వహించారు. మూడో సంవత్సరం వారికి సాహిత్య విమర్శ పేపర్ రాసారు. యూజీసీ వారి మైనర్ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు చేశారు. తన తండ్రి సిహెచ్ లక్ష్మీనారాయణ గారి పేర గత ఐదు సంవత్సరాలుగా విమర్శనా రంగంలో విఖ్యాతులైన వారికి అవార్డులు ఇస్తున్నారు. మీరి ప్రతిభకు అనేక పురస్కారాలు లభించాయి. మద్రాసు తెలుగు అకాడమీ జాతీయ పురస్కారం, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం, పరిశోధనా రంగంలో కవిసంధ్య ప్రతిభా పురస్కారం, గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం. లెక్కకు మిక్కిలిగా ఎన్నో పురస్కారాలు !

సరళమైన శైలిలో గల వీరిరచనలు మొదటినుంచీ చివరివరకూ పాఠకులను చదివింపజేస్తాయి. వర్తమాన కాలంలో జీవిస్తూ, వర్తమాన సాహిత్యాన్ని సృజిస్తున్న డాక్టర్ సుశీలమ్మ, గారి విశేషాలను మరిన్ని తెలుసుకోవడానికి గుంటూరులో గల వారి ఇంటికి వెళదాం పదండి…..

ప్రశ్న: తెలుగులో విమర్శ దీపం చిన్నది అంటారు కానీ విమర్శ రంగంలో మీ పేరు విస్మరించలేనిది. మొదటి విమర్శ ఎప్పుడు చేశారు వివరిస్తారా?

మీ ప్రశంసకు ముందుగా ధన్యవాదాలు హైమవతి గారు. నేను ఎం.ఏ. మొదటి సంవత్సరం (నాగార్జున యూనివర్సిటీ, మొదటి బ్యాచ్) లో ఉండగా ‘విజయ చిత్ర’ మాస పత్రికలో “నేటి సినిమాలలో కథ” అనే పోటీ ప్రకటన చూసాను. “సినిమాల్లో కథేం ఉంది…” అని సరదాగా మొదలుపెట్టి, ఉదాహరణలతో సహా రాసి పంపాను. ద్వితీయ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేత డి.వి. నరసరాజు గారని పత్రిక లో చూసి ఆశ్చర్యానందాలకు లోనైనాను. ఏ రచన చదివినా, ఏ సినిమా చూసినా విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం ముందునుంచీ నాకు అలవడింది. నా ఎం.ఫిల్. విశ్వనాథ వారి ‘కిన్నెరసాని పాటలు – సమగ్ర పరిశీలన’, పిహెచ్.డి. “ముళ్ళపూడి వెంకటరమణ రచనలు” కూడ లోతైన పరిశోధన చేసానని పెద్దలు మెచ్చుకున్నారు.

ప్రశ్న: మీ బాల్యం విద్యాభ్యాసం వివరించండి.

మా నాన్నగారు ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం చేసి, రిటైర్ అయిన తర్వాత ప్రతిరోజు ‘పోతన మహాభాగవతం’ చాలా ఇష్టంగా, తన్మయంతో చదువుకునేవారు. మా అమ్మగారు ఆ రోజుల్లో (1965) ఎమెస్కో వారి ‘ఇంటింటి గ్రంథాలయం’ పేరిట నెలకి 5 రూపాయలు కడితే చాలా పుస్తకాలు ఇంటికి వచ్చేవి. అలాంటి సాహిత్య వాతావరణంలో ఉండడం వల్ల హైస్కూల్ చదివే వయసు నుండి పుస్తకాలు చదవడం అలవాటయింది. ఇంటర్మీడియట్ లో స్పెషల్ తెలుగు గ్రూప్ తీసుకున్నాను. తర్వాత బి ఏ, ఎం.ఏ కూడా తెలుగు భాష సాహిత్యాలు.
పాఠ్య పుస్తకాలు మాత్రమే కాక ప్రాచీన, ఆధునిక సాహిత్యం కూడా లైబ్రరీకి వెళ్లి కూర్చొని చదవటం అలవాటు. బహుశా కో ఎడ్యుకేషన్ కాలేజీలో, ఈ క్లాసులో ఆడపిల్లని నేనొక్కదాన్నే కనుక ఎవరితో మాట్లాడే అవకాశం లేక తరగతి గది, తర్వాత లైబ్రరీ లోనే ఉండేదాన్ని. నాకిష్టమైన తెలుగు సాహిత్యం చదివించిన నాన్నగారి పేరిట శ్రీ లక్ష్మీనారాయణ స్మారక సాహిత్య పురస్కారం 2020 లో నెలకొల్పి, సాహిత్య విమర్శలో కృషి చేస్తున్న వారికి ఆరేళ్ల నుండి పురస్కారం ఇస్తున్నాను.

ప్రశ్న: సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు ఎవరు?

ప్రాచీన సాహిత్యంలో కవిత్రయ మహాభారతం చాలా ఇష్టమండి. ఆధునిక సాహిత్యంలో చాలా చాలా ఇష్టాలు ఉన్నాయి. ప్రక్రియ ఏదైనా కానీ ఆసక్తి కలిగేలా చదివించేటట్లు ఉండాలి. ఆలోచనత్మకంగా ఉండాలి. సామాజిక స్పృహ ఉండాలి. మనసుని మెదడుని కదిలించి తన వైపు లాక్కునేలా ఉండాలి. అలాంటి అద్భుతమైన రచనలు చాలా ఉన్నాయి. ఒక్కటే చెప్పాలి అని అంటే – నిర్ద్వంద్వంగా శ్రీ శ్రీ మహాప్రస్థానం. తర్వాత జాషువా, నారాయణ బాబు, ఆరుద్ర, సినారె. వచన రచన శైలిలో ముళ్ళపూడి వెంకటరమణ, పేరడీలలో శ్రీరమణ. సీరియస్ కథా నవలల్లో కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి. హాయైన శైలి అంటే యద్దనపూడి సులోచనారాణి.

ప్రశ్న: సాధారణంగా విమర్శకులు ఏదో ఒక ప్రక్రియ పైనే దృష్టి సారిస్తారు. కథో, నవలో, పద్యమో ఇలా వారి అభిరుచి మేరకే రాస్తారు. కానీ మీరు అన్ని ప్రక్రియలపై లోతైన విమర్శ చేశారు. దీనికి కారణమేమిటి?

ఎనిమిదో తరగతిలో ఒక కథ రాశాను. పేరు ఏమిటో కూడా ఇప్పుడు గుర్తులేదు. తొమ్మిదవ తరగతిలో “కైలాసంలో కాలం మార్పు” అనే నాటిక వ్రాసి, నేను తమ్ముడు చెల్లెలు మరో ఇద్దరు మిత్రులు వేదిక మీద రెండు సార్లు ప్రదర్శించాము కూడా. ఇంటర్మీడియట్లో కళాశాల మ్యాగజైన్ కి వ్యాసాలు రాసాను. అవి కూడా సరదాగా కాదు. పూర్తిగా అకడమిక్. కానీ మొదటిగా ప్రచురింపబడింది ఎం.ఏ. మొదటి సంవత్సరం లో ఉండగా “వనిత” మాసపత్రికకు వ్రాసిన కవిత. శ్రీ శ్రీ “దేశ చరిత్రలు”కు పేరడీ – “ఏ మగువ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నారీ జాతి చరిత్ర సమస్తం పురుషసేవా పరాయణత్వం”.
తర్వాత విజయ చిత్ర లో బహుమతి పొందిన వ్యాసం. వనిత మాస పత్రిక కథల పోటీలో (10 కథలకు సమాన బహుమతి) ” నేను రాసిన కథ “మగాళ్ళూ మీకు జోహార్లు” కు బహుమతి లభించింది.
కాబట్టి కథ, నాటిక, కవిత, వ్యాసం తోనే నా సాహిత్య ప్రస్థానం మొదలైంది.
తర్వాత ఎక్కువగా పేరడీలు రచించాను. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఎక్కువ పేరడీలు రాసి, వాటిని పుస్తకంగా తీసుకువచ్చిన రచయిత్రి బహుశా నేనేనేమో.

సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రవేశంతో ఆర్ధిక విధానాల వల్ల మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావం చూపిందని, భారతదేశ మూలాలను పెరికివేసే ప్రయత్నాలు జరిగాయని 1992- 2000 లలో జూకంటి జగన్నాథం, పాపినేని శివశంకర్, పాలపిట్ట వెంకట్, పృధ్వీ, నల్లూరి రుక్మిణి వంటి కవులు విస్తృతంగా కవిత్వం వెలువరించారు.
కళాశాల అధ్యాపకులకు ప్రాజెక్ట్ వర్క్ లకు యు.జి.సి. ఆర్ధిక సహాయం అందిస్తుంది.
పై రచయితల కవితలను విశ్లేషిస్తూ “ప్రపంచీకరణ – తెలుగు కవిత్వం” అనే మైనర్ రీసెర్చి ప్రాజెక్ట్ చేసాను.
వ్యవసాయ, వాణిజ్య, విద్య, మానవ సంబంధాలపై కలిగిన దుష్ప్రభావం గురించి వచ్చిన కవితలను సేకరించి వ్యాఖ్యానించి, సమర్పించాను.
తర్వాత మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు మంచి అంశంపై చేయాలని చాలా ఆలోచించాను. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ కమిటీ ముందు నా టాపిక్ “ఫెమినిజం మేల్ రైటర్స్” (స్త్రీవాదము – పురుష రచయితలు) అని చెప్పగానే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారో ఆ మధ్య పుస్తకాన్ని ముద్రించినప్పుడు కూడా పాఠకుల నుంచి అంతే ఆశ్చర్యం, ఆదరణ లభించింది. స్త్రీల మనోభావాలు గురించి స్త్రీలు చెప్పటమే కాదు వాటి పట్ల సహ అనుభూతి (సహానుభూతి) కలిగిన కవులు, రచయితలు చాలామంది రచనలు చేశారు. కె. శివారెడ్డి “ఆమె ఎవరైతే మాత్రం” లో అద్భుతమైన సహానుభూతి ఉంది. ఎండ్లూరి సుధాకర్ “నల్ల ద్రాక్ష పందిరి” స్త్రీ జీవితంలోని ఆటుపోట్లను, అల్లకల్లోలను, అన్యాయాలను చెప్పిన గొప్ప కవిత్వం. స్త్రీవాదం నేపథ్యంలో కథలు పాపినేని శివశంకర్ ‘సగం తెరిచిన తలుపులు’, నవల సలీం ‘వెండి మేఘం’, నాటకాలు దీర్ఘాసి విజయభాస్కర్ వల్లూరి శివప్రసాద్ గారివి తీసుకొని విశ్లేషించి ప్రాజెక్టును సమర్పించాను.

ప్రశ్న: ఇటీవల మీరు కొవ్వలి గారి గురించి పరిశోధించారు ఆ సందర్భంలో మీ అనుభవాలు ఏమిటి?

లాక్ డౌన్ సమయంలో అచ్చు పత్రికలు ఆగిపోవడంతో ఆన్లైన్ మ్యాగజైన్స్ కి విస్తృతంగా విమర్శ వ్యాసాలు రాయటం మొదలుపెట్టాను. ఆ సందర్భంలో ‘భయంకర్’ అనే రచయిత రాసిన “జగజ్జాణ” నవల 25 భాగాలు మా ఇంట్లో ఉన్నాయి అని భువనచంద్ర గారికి చెప్పాను. భయంకర్ కలం పేరుతో రాసింది కొవ్వలి లక్ష్మీనరసింహారావు అనీ, ఆయన వెయ్యిన్నొక్క పుస్తకాలు రాసారని చెప్పారు. సాహిత్యం అభ్యసంలో గాని అధ్యాపనలో గాని వెయ్యిన్నొక్క నవలలు రాసిన ఆ తెలుగు రచయిత పేరు లేకపోవడం నేను ఆశ్చర్యపోయాను. కొంత సమాచారం సేకరించి సంచిక అంతర్జాల పత్రికలో వ్రాయటం మొదలు పెట్టాను. ఎలా తెలిసిందో కానీ కొవ్వలి వారి కుమారులు కొవ్వలి నాగేశ్వరరావు, కొవ్వలి లక్ష్మీనారాయణ గారు నాకు ఫోన్ చేశారు. వారి చిన్నప్పుడు తండ్రిగారి విశేషాలన్నీ చెప్పారు. బయట ప్రపంచానికి తెలియని ‘సాధికారక’మైన కుటుంబ విశేషాలన్నీ వారు చెప్పారు. నేను సీరియల్ గా రాసి, పుస్తకాన్ని ప్రచురించాను. కొవ్వలి వారి నవలలు విశేష ప్రాచుర్యం పొంది, స్త్రీ పురుషులు వయోబేధాలు లేకుండా, అద్దె ‘కాణీ’ లేదా ‘అణా’ కి తెచ్చుకొని పాఠ్య పుస్తకాలలో దాచుకొని చదివేవారట. బడ్డీ కొట్లలో, రైల్వే స్టేషన్లలో, చివరికి రైలు బోగీలలో కూడా సంచీలో పెట్టుకొని “కొవ్వలి నవలలు” అంటూ అమ్మేవారట. ఆనాటి సంప్రదాయవాదులు “శవ సాహిత్యం” అని, “రైల్వే సాహిత్యం” అని ఈసడించారు. జెలసీతో ఆయనను కొట్టడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగాయట. సామాన్య ప్రజలకు, కేవలం అక్షరాలు మాత్రమే నేర్చుకున్న వంటింటి స్త్రీలకు అందుబాటు ధరలో, సరళ భాషలో ఉన్న నవలలు రాసి “రీడబిలిటీ”ని పెంచిన కొవ్వలి వారి గురించి ఈనాటి తరానికి తెలియజేయాలని చాలా కష్టపడ్డాను. అయితే అనూహ్యంగా నాకు చాలా ఫోన్స్, మెసేజెస్ వచ్చాయి. మొదట నేను అడుగుతాను “మీ వయసు ఎంత” అని. తప్పనిసరిగా వారు 60, 70, 80 వయసు వారై ఉంటారు. వారు అడగటమే సంతోషంగా భావించి ఉచితంగా పోస్ట్ ఖర్చులు పెట్టుకొని మరీ పంపేదాన్ని.
తెలుగు సాహిత్యాభిమానిగా, 1001పుస్తకాలు రాసిన ఒక తెలుగు రచయితను నేటి తరానికి పరిచయం చేయటం నా బాధ్యతగా భావించాను. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ వారి “మోనోగ్రాఫ్” విభాగంలో ఆయన రచనలు లభ్యమైనంత వరకు చదివి విశ్లేషించి, జూన్ లో సబ్మిట్ చేశాను. అన్ని పుస్తకాలూ దొరికి ఉంటే, భౌతికంగా మనం సమర్పించగలిగి ఉంటే, ఒక తెలుగు రచయితకు “గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు’లో స్థానం లభించి ఉండేది.

ప్రశ్న: మీరు బోధనా రంగంలో చాలా కాలం పని చేశారు. ఆ సమయంలో మరపురాని అనుభవాలు ఏమైనా ఉన్నాయా?

33 ఏళ్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేశానండి. తెలుగు భాషను ఎంత ఇష్టంగా చదువుకున్నానో అంతే ఇష్టంగా బోధించేదాన్ని కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ లో spl . Telugu ఉండటంతో, ఎం.ఏ. కూడా ఉంటే టెన్త్ పాస్ అయి వచ్చిన ఆడపిల్లలు ఎం.ఏ. డిగ్రీ తో బయటకు వెళ్లి టీచర్ గానో అధ్యాపకురాలిగానో పనిచేసే అవకాశం ఉంటుంది కదా అని భావించాను. నాగార్జున యూనివర్సిటీ వి.సి. గారిని, రిజిస్టర్ గారిని కలిసి గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.ఏ. తెలుగు పెట్టించటం నాకు చాలా ఆనందకరమైన విషయం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేనే నిర్వహించేదాన్ని. తరగతి గదిలో ఎంత సీరియస్ గా ఉంటానో, ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలతో కలిసిపోయి అంత సరదాగా వాళ్ల చేత ( పాటలు, డాన్స్, స్కిట్స్ వంటి) అనేక కార్యక్రమాలు చేయించేదాన్ని.
తరచూ నేను రచనలు చేస్తూ ఉండటంతో, కేవలం మనమే కాదు, విద్యార్థినులకు కూడా రచన పట్ల ఆసక్తి కలిగించాలని “కళాప్రియ” అనే త్రైమాసిక పత్రికను రెండేళ్ళు నడిపాను.

దాదాపు 27 క్రితం క్లాస్ రూమ్ లో ఆడపిల్లని నరికేయడం బహుశా మా గుంటూరులోనే ప్రథమంగా జరిగిందేమో. ప్రసన్నలక్ష్మి అనే అమ్మాయిని సుభాని అనే అబ్బాయి కొబ్బరి బోండాల కత్తితో నరికేశాడు. రాష్ట్రమంతా అట్టుడికి పోయింది. నేను మా కళాశాలలోనే కాక, మిగతా కళాశాలల్లో, సంస్థల్లో అనేక సభల్లో పాల్గొన్నాను. అంతలో విజయవాడలో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మనోహర్ అనే అతను ఇలాగే చంపేశాడు.

అదే సమయంలో ప్రతి కళాశాలకు NAAC గుర్తింపు ఉండాలి అని యూజీసీ నిబంధనను విస్తృతపరిచింది. 1942 లో ఏర్పడిన మా మహిళా కళాశాలలో “విమెన్ వింగ్” ఏదైనా ఏర్పరచాలని యూనివర్సిటీ కి వెళ్లి వి.సి. గారిని లిఖిత పూర్వకంగా ఆభ్యర్ధించాను. ఆచార్య వేణుగోపాల్ గారు “విమెన్ డెవలప్మెంట్ సెల్” పేరుతో అనుమతి నిచ్చారు. ఆనాడు ఉన్న ఐ.ఏ.యస్., ఐ.పి.యస్. ఆఫీసర్స్ ని కళాశాలకు ఆహ్వానించి ఈవ్ టీజింగ్, డొమెస్టిక్ వాయొలెన్స్ గురించి అవగాహనా సదస్సులు ఎన్నో ఏర్పాటు చేశాను. అది మా ఆర్. జె. డి. గారి ద్వారా (ఉమ్మడి రాష్ట్రం) కళాశాల కమిషనర్ గారికి అంది, ప్రతి కళాశాలలో W.D.C. ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేను ఒక్కదాన్ని ప్రారంభించిన ఈ చైతన్యం రాష్ట్రమంతా ఉన్న కళాశాలలకు చేరిందంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది.
రామ్ గోపాల్ వర్మ “మధ్యాహ్నపు హత్య” అనే సినిమా కి “మీ భార్యను చంపాలనుకుంటున్నారా” అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రకటన ఇచ్చాడు. సినిమా విడుదల అయిందో లేదో తెలియదు కానీ మేము పత్రికల ద్వారా అభ్యంతరం తెలియజేసి, ఆనాటి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఛైర్మన్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఏదో పనిమీద గుంటూరు వస్తే, మా కళాశాలకు ఆహ్వానించి మేము చేసిన కార్యక్రమాలు ఫోటోలు చూపి, ఈ సినిమా విషయం ప్రస్తావించాను. తర్వాత ఆమె ఢిల్లీలో ఈ విషయం ప్రస్తావించారని న్యూస్ పేపర్ ద్వారా తెలిసి కొంత ఆనందించాను.
అలాగే “రౌడీ టీచర్” అనే సినిమా రాబోతోందని తెలిసి సెన్సార్ బోర్డుకి నేను ఇద్దరు ముగ్గురు మిత్రులతో కలిసి లెటర్ పెట్టాను. తర్వాత వారు రౌడీ “గారి” టీచర్ అని పేరు మార్చి నాకు లెటర్ రాసారంటే నమ్ముతారా!
మెగసేసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా, కాత్యాయనీ విద్మహే, కె. శివారెడ్డి, అదృష్ట దీపక్, సుద్దాల అశోక తేజ, పెనుగొండ లక్ష్మీనారాయణ, పాపినేని శివశంకర్, కందిమళ్ళ సాంబశివరావు వంటి వివిధ ప్రక్రియల్లో దిగ్గజాలను కళాశాలకు ఆహ్వానించాను. సాహిత్య వారోత్సవాలు నిర్వహించాను.
రేడియో, దూరదర్శన్ లో ప్రసంగాలు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పత్ర సమర్పణ మాత్రమే కాక, నేను రెండు రాష్ట్ర, జాతీయ సెమినార్ లు నిర్వహించాను. నా గైడెన్స్ లో నలుగురు ఎం. ఫిల్. చేసారు.

ప్రశ్న: మీకు ఇష్టమైన కవి విమర్శకుడు ఎవరు, ఎందుకని?

కవి, రచయిత, విమర్శకుడు డా. పాపినేని శివ శంకర్ దాదాపు 55 ఏళ్ల నుంచి పరిచయం. చదువుకునేటప్పుడు నాకు ఒక సంవత్సరం సీనియర్. తర్వాత కూడా సభల్లో తరచూ కలుస్తూనే ఉంటాను. దాదాపు 5 సంపుటాలలో వచ్చిన తన కవితలన్నీ నాకు నచ్చినవే. మహా సౌందర్యరాశి కవిత, సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి కథ, నిశాంత విమర్శ చాలా ఇష్టం. ముఖ్యంగా ద్రవాధునికత ( Liquid Modernity) చదివి చాలా ప్రభావితురాలి నయ్యాను. సమాజంలో ఎక్కడ ఏ కొత్త మార్పులు చూసినా ఆ పుస్తకం గుర్తుకువస్తుంది. అందులో ప్రస్తావించిన ఏదో ఒక అంశంతో సమన్వయిస్తూ ఆలోచిస్తుంటాను.

ప్రశ్న: మీరు కొందరు రచయితలతో చేసిన ఇంటర్వ్యూలు సంచికలో, రవళిలో, ఉషా పత్రికలలో వచ్చాయి కదా. ఆయా సందర్భాలలో మీ అనుభూతులు ఏమిటి?

“సంచిక” అంతర్జాల పత్రికలో రెగ్యులర్ గా రాస్తూ ఉంటానండి. “నెచ్చెలి” అంతర్జాతీయ అంతర్జాల పత్రిక సంపాదకురాలు కె. గీత సూచించిన విధంగా “పాత రచయిత్రుల” యొక్క కథలను పరిశోధించడం మొదలుపెట్టాను. పాత అంటే ఎంత?
మొట్టమొదటి రచయిత్రి బండారు అచ్చుమాంబ దగ్గర నుంచి మొదలుపెట్టి 25 నెలలు 25 మంది రచయిత్రుల (1900-1955) “అభ్యుదయ ధోరణి” (వ్రతాలు, పూజలు కాదు) కథలను వెదికి, విశ్లేషించాను. కొందరు రచయిత్రుల వివరాలు దొరకలేదు. కానీ కథ బాగుంటే స్వీకరించి, విశ్లేషించి, రచయిత్రి వివరాలు ఎవరికైనా తెలిస్తే పత్రిక గాని నాకు గాని తెలియజేయమని అభ్యర్థించాను. “రవళి” పత్రిక లో “జీవించి ఉన్న రచయిత/త్రుల మొదటి నవల” గురించి రాయాలని ఆయా సీనియర్ రచయితలను సంప్రదించాను. దాని వల్ల – ఆనాటి సమాజం, సాహిత్యం, వీరిపై ప్రభావం, నాటి రచనా వైఖరి, శైలి నేటి రచయితలకు మార్గదర్శకం గా ఉంటుందని ప్రారంభించాను. కొందరు ఉత్సాహంగా నాటి తమ నవలలు పంపారు. నేను చదివి మళ్ళీ జాగ్రత్తగా వారికి పంపాను. నేను భయపడినట్లే కొందరు వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల మాట్లాడలేకపోయారు.
“ఉషా” పత్రిక ప్రారంభ సంచిక 2024 జనవరి నుండి వైవిధ్యభరితమైన కథలు, నవలలు స్వీకరించి వ్యాసాలు వ్రాసాను. వాటికి ఆయా రచయితలను ఇంటర్వ్యూ చేసి జోడించాను. అన్ని వ్యాసాలు పెద్ద సంచలనం కలిగించాయి. పత్రికకు, నాకు స్పందనలు తెలియజేసారు. ఆ వ్యాసాలన్నీ నాకు చాలా తృప్తినిచ్చాయి.

ప్రశ్న: స్త్రీవాద సాహిత్య అభిమాని మీరు. ప్రస్తుతం స్త్రీవాద సాహిత్యంలో రావలసిన మార్పులు ఏమిటి?

“నీలి మేఘాలు” నాకు ఆల్ టైం ఫావరెట్. దాదాపు కంఠస్థం. పైగా తెలుగు ఎం.ఏ. సిలబస్ లో ఉండటం వల్ల ఐదేళ్లు విశ్లేషిస్తూ బోధించాను. ఓల్గా మా కళాశాలకు తన నృత్య బృందంతో వచ్చి తను రచించిన దృశ్య రూపకం “యుద్ధము – శాంతి” ప్రదర్శింపజేసారు. తరం తరం కీ స్త్రీవాద రచనల్లో మార్పు వస్తోంది. రావాలి కూడా. పైట నుండి, వంటిల్లు నుండి, లేబర్ రూం నుండి బైటకు వచ్చిన స్త్రీకి ఇంకా కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న కవితలు, కథలు, నవలలు ఈ సమస్యలను చర్చించడం నాకు నచ్చుతోంది.

ప్రశ్న: ప్రస్తుతం ఏం రాస్తున్నారు? భవిష్యత్తులో మీ రచన కార్యక్రమాల గురించి చెప్పండి.

ఇటీవలే ఒక సుదీర్ఘమైన వర్క్ పూర్తి చేశాను. ఎన్నో పుస్తకాలు చదవాల్సిన పుస్తకాలు ఉన్నాయి. చదవటమే నాకు చాలా ఇష్టం. వాటిలో నాకు నచ్చినవి, పది మందికీ తెలియాల్సిన అవసరం ఉన్న వాటిని తప్పకుండా నేను విశ్లేషిస్తాను. స్త్రీలకు, స్త్రీ వ్యక్తిత్వానికి దెబ్బతీసే రచనలు ఉంటే కచ్చితంగా, తీవ్రంగా విమర్శిస్తాను. బహుశా అందుకే నాకు మిత్రులు తక్కువ. ప్రచ్చన్న శత్రువులు కూడా ఉండి ఉంటారు.
ఇదిగో, ఇలా మీలాంటి వాళ్ళు పలకరించినప్పుడు నా కళాశాల జ్ఞాపకాలు గుర్తుకొస్తే చాలా సంతోషమేస్తుంది. కొందరు సూచించారు “మీ తరం వారు ధైర్యంగా నిర్వహించిన కార్యక్రమాలు, ఆ జ్ఞాపకాలను అందరికీ పంచవచ్చు కదా, నేటి తరానికి ఉపయోగపడుతుంది” అని. రాయాలని మొదట నాకు అంతగా ఆసక్తి అనిపించలేదు. కానీ ఇప్పుడిప్పుడే మంచి జ్ఞాపకాలను పంచుకోవాలని అనుకుంటున్నాను.

అలాగే నేటి విమర్శ ఎంత పలుచనగా తయారవుతుందో రాయాలనుకుంటున్నాను. నేను వ్రాసిన పుస్తకాల రచయితలు ఎవరో 10% మంది కూడా నాకు తెలియదు. నాకు రచనతోనే సంబంధం. రచనలోని మంచి చెడులను, గుణదోషాలను కచ్చితంగా చెప్తాను. కానీ చాలామంది ‘ఒకరినొకరు పొగుడుకోవడం, ఆకాశానికి ఎత్తేయటం చేస్తున్నారు తప్ప, ఎన్ని తప్పులు దొర్లుతున్నాయో, ఎంత చెరుపు కలిగిస్తోందో ‘ నిర్మొహమాటంగా చెప్పటం లేదు. నెమలి ఈకతో సున్నితంగా స్పృశిస్తున్నారు. రా.రా. గారిలా కొరడా పెట్టుకోనవసరం లేదు కానీ, ఉన్న విషయాన్ని ఉన్నట్టు తీవ్రంగా కఠినంగా చెప్తే తప్పేముంది!
“సరియైన విమర్శ” ఎలా ఉండాలో ఉదాహరిస్తూ రాయాలనుకుంటున్నాను.
ఈ రెండు ధారావాహికంగా రాస్తూ, పుస్తకాలపై నా విశ్లేషణ కొనసాగిస్తాను.

ఈ విధంగా 64 కళలు.కాం పాటకులకు పరిచయం చేసిన మీకు, ఎడిటర్ గారికీ ధన్యవాదాలండీ.

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)

Share via
Copy link
Powered by Social Snap