మనిషికి కనీసం కృతజ్ఞత ఉండదా? ఆయన చేతికి ఎముక లేదు అన్నారు! శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు! సాంస్కృతిక రారాజు అన్నారు! ఆయన వున్నన్నాళ్లు దోచేసారు. పోయాక మాత్రం కనీస కృతజ్ఞత లేదు! నిన్న (2-12-24) త్యాగరాయ గానసభలో కళా జనార్ధనమూర్తి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహిస్తే వేదిక పై 15 మంది, వేదిక కింద పట్టుమని పది మంది వున్నారు. ఐదేనా కృతఙ్ఞత? ఇదేనా అభిమానం?
అభినవ దానకర్ణుడుగా విరాజిల్లిన మహనీయమూర్తి లయన్ డా. అరిగపూడి విజయ్ కుమార్ మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటు. ఆయన 2010 నుంచి సాంస్కృతిక రంగానికి అండగా వున్నారు. అడిగిన వారికి కాదనకుండా ఆర్థిక సహకారం అందించారు. దాదాపు వందకు పైగా సంస్థలు ఆయన ఇచ్చే ఆర్ధిక సహకారంతోనే ఏర్పాటు అయ్యాయి. ఆయన ఇచ్చే సాయంతోనే కార్యక్రమాలు నిర్వహించే వారు.
విజయ్ కుమార్ గారు వస్తుంటేనే ఒక రాజసం కనిపించేది. ఆయన అందరిని ఆప్యాయంగా పలకరించే వారు. ఆయన వేదిక దిగి వెళుతున్నప్పుడు ఎంతో మంది ఆయన ఆశీస్సులు కోసం అటు ఇటు నిలబడేవారు. కారు ఎక్కిన తరువాత అక్కడ చుట్టు ముట్టిన వారికి ఐదొందల నోట్లు అలా పంచేస్తుండే వారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, అటు వరంగల్, కరీంనగర్, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ లలో అతని ఫోటో వేసి కార్యక్రమం నిర్వహిస్తే వారి అకౌంట్ లో డబ్బులు వేసే అంతటి గొప్ప మనసు ఆయనది. “నా కోసం కాదయ్యా, ఆర్గనైజర్ బతుకుతాడు, ఏదొక కార్యక్రమం చేస్తాడు కాబట్టి కళలు వికసిస్తాయని” గొప్ప మాట చెబుతుండే వారు! అదీ ఆయన నిండు మనసు!
సరే, ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన డబ్బులు తిన్నవాళ్లు, దోచేసిన వారికి కొంతయినా కృతజ్ఞత ఉండొద్దా? త్యాగరాయ గానసభకు ఎంతో సాయం అందించారు. తెలుగు వెలుగులు పేరిట చక్కని పెయింటింగ్స్ ఏర్పాటు చేయించి కొత్త కళను తీసుకొచ్చారు. లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయించారు. అందుకే త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి ముందుగా స్పందించి విజయ్ కుమార్ గారి సంతాపసభ నిర్వహించి అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. తీరా చూస్తే మొత్తం కలిపి పాతిక మంది కూడా లేరు. ఆయన సాయం పొంది మహారాజు అంటూ కీర్తించిన ఆర్గనైజర్లు ఏమైపోయారు? కనీసం హాజరై కొంత సమయాన్ని ఆయన కోసం వెచ్చించి నివాళులు అర్పించి చిన్నపాటి కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేని వారిని ఏమనాలి? బహుశా అలా సాంస్కృతిక రంగానికి దానం చేస్తున్నప్పుడు విజయ్ కుమార్ గారు కూడా అలోచించి ఉండరు. మరీ ఇంత స్వార్ధంగా వుంటారా అని ఆయన అనుకుని ఉండరు. ఇది కలికాలం. ఎవ్వరికీ ఎవ్వరి గురించి పట్టదు. వున్నన్నాళ్ళు అవకాశం ఉన్నంత వరకు దోచుకోవడమే. కనీసం కృతజ్ఞత అనే పదం కూడా మరచిపోయారు. అంతేలే ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అన్న సినారె మాట అక్షర సత్యం అనిపిస్తోంది.
లయన్ డా.విజయ్ కుమార్ గారు చిరస్మరనణీయులు. వారి సేవలు అజరామరం. ఎవరు గుర్తుంచుకున్నా గుర్తించుకోపోయినా ఆయన సాంస్కృతిక రంగంలో మహా మనీషిలా శాశ్వతంగా ముద్ర వేసుకున్నారు. ఇకనైనా మేల్కొని సాయం పొందిన సంస్థలు తమ వంతు బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిసారి ఆయన పేరును స్మరించుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చిరంజీవిలా మార్మోగుతూనే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
డా. మహ్మద్ రఫీ