నాటక వికాసంకోసం తపించిన ‘కళాతపస్వి’ సంజన్న

‘కళాతపస్వి’ సంజన్న వర్థంతి గారి వర్థంతి సందర్భంగా…

నాటకాన్ని మనసారా ప్రేమించి, నాటక వికాసంకోసం తపించి…తపించి… చివరివరకూ.. జీవితాన్ని నాటకం కోసమే అర్పించిన ధన్యుడు కీర్తిశేషులు శ్రీ సంజన్న. నాటకం సంజన్న ఊపిరి.
నాటకం సంజన్న శ్వాస. నాటకం సంజన్న జీవిత విధానం. నాటకం సంజన్న ఆరవ ప్రాణం.

1949 వ సంవత్సరం ఏప్రియల్ 20వ తేదీన సంజన్న జన్మించారు. కీర్తిశేషులు రామన్న, తిమ్మక్కలు ఆయన తల్లితండ్రులు. ప్రీ యూనివర్సిటి కోర్సు చదువుకున్న తరువాత ఆయనకు బి.ఎస్.ఎన్.ఎల్.లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఎంతో శ్రమించి పనిచేశారు. అందులోనే సంజన్న ఛీఫ్ సూపర్వైజర్ గా ప్రమోషన్ అందుకున్నారు. మంచి ఉద్యోగి అని అందరి ప్రశంసలు పొందారు.

1963 నుండి 2020వరకూ సాగిన వారి 37 సంవత్సరాల నాటకప్రయాణం చాలాగొప్పది. ఆమాటకొస్తే, అంత సంపన్నవంతమైన నాటకానుభవం కేవలం కొద్ది మంది నటులకు మాత్రమే ఉంటుంది. వారి నటనా ప్రతిభను మెచ్చిన ఎన్నో పరిషత్తులు వారిని సత్కరించాయి.వారి కళాభిమానాన్ని ఎంతగానో గౌరవించాయి.వారు ఎన్నో నాటికలలో‌, నాటకాలలో నాయక పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలందుకొన్నారు. నాయక పాత్రలతో పాటుగా.. ప్రతినాయక పాత్రల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శించారు. నవరసాలలో వారు పోషించని రసం లేదు.. చూపలేని భావం లేదు. వారికి హాస్యం కూడా చాలా ఇష్టం. బెస్ట్ కమెడియన్ గా కూడా వారెన్నో బహుమతులు అందుకొన్నారు. సంజన్న విలక్షణ నటుడు మాత్రమే కాదు.. విశిష్ట దర్శకుడు కూడా. ఎన్నో నాటక పరిషత్తులు వారి దర్శకత్వ సామర్ధ్యానికి పట్టం కట్టేయి.

సంజన్న గారు ప్రదర్శించిన సాంఘిక నాటికలు ఎన్నో… స్వయంకృతం, ప్రగతిలో పన్నీరు, శాపం గెలిచింది, అసురగణం, కోహినూర్, పుటుక్కు జరజరడుబుక్కుమే, పాపం, పండగ, వశీకరణం, యువతరం, కళ్లు తెరవండోయ్, రచయిత్రి, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, సమాధి, ధర్మాసుపత్రి… వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే, వారు నటించిన సాంఘిక నాటకాలూ చాలా ఉన్నాయి.

దేశంకోసం, ప్రేమపక్షులు, ఆశ్రయం, యథాప్రజ తథా రాజా, కనువిప్పు, కుర్చీ, మరో ప్రస్థానం, మరణ మృదంగాలు వంటి నాటకాలలో సంజన్న ఎన్నో మంచి పాత్రలు పోషించారు. వీటితో పాటుగా చింతామణి, శ్రీకృష్ణరాయబారం, శ్రీకృష్ణ తులాభారం వంటి పౌరాణిక నాటకాలలోనూ ఆయన ప్రతిభ ప్రదర్శితమయ్యింది.

లేడి డిటెక్టివ్, స్నేహ వంటి బుల్లితెర సీరియల్స్ లోనూ ఆయన నటించారు. నవోదయం, తొలిపొద్దు, యమధర్మరాజు వంటి చిత్రాలలో పాత్రల్ని పోషించి చలనచిత్ర రంగంలోనూ సంజన్న మెరుస్తూనే వచ్చారు. అలాగే అప్పుడప్పుడు కొన్ని రేడియో నాటకాలలోనూ ఆయన స్వరం వినిపించింది. అంతేకాదు…ఆశయం నాటకంలో ఫణి పాత్రకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి బహుమతి అందుకొన్న ఘనత ఆయనదే.

సంజన్న మంచి నిర్వాహకులు కూడా.’కర్నూల్ యునైటెడ్ క్లబ్’ సాంస్కృతిక కార్యదర్శిగా, టెలికాం రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకుడిగా, విజేతా ఆర్ట్స్ అధ్యక్షుడిగా కళారంగానికి ఎంతో సేవచేసారాయన.

సంజన్నగారి ఈ కళా ప్రయాణం వెనుక..వారి ధర్మపత్ని శేషమ్మ గారు, వారి అబ్బాయిలు వంశీకృష్ణ, క్రిష్ణ కిషోర్, సుధాకర్, రామకృష్ణల ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉంది. నిర్విరామంగా, నిస్వార్థంగా సుదీర్ఘకాలం పాటు నాటకారంగాన్ని సేవించుకొన్న సంజన్న గారు 2020 సెప్టెంబర్ 12వ తేదీన పరమపదించారు.

వాడ్రేవు సుందర్రావు, నంది అవార్డ్ గ్రహీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap