-పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం..!
-విశ్వామిత్ర, కాలకౌశిక, భీమ, ధుర్యోధనుడి పాత్రల్లో రాణింపు..!
-డీవీ సుబ్బారావు, పద్మశ్రీ యడ్ల గోపాలరావు, అమరాపు సత్యనారాయణలతో కలిసి ప్రదర్శన..!
-రంగసింహ బిరుదుతో జాతీయస్థాయి గుర్తింపు…!
_________________________________________________________________
ఆయనొక సాధారణ రైతు కుటుబం నుంచి వచ్చిన వ్యక్తి.
కళలన్నా.. కళాకారులన్నా చిన్ననాటి నుంచే ఆసక్తి.
ఆ ఇష్టమే ఆయనను చిన్నవయస్సు లోనే పౌరాణిక నాటకాలవైపు నడిపించింది. అనతి కాలంలోనే మంచి కళాకారుడిగా రాణించి ప్రజల మన్ననలతో పాటు పెద్దలు ఆశీర్వాదాలతో ఎన్నో సత్కారాలు పొందారు. ఇప్పటికీ సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్ర పాత్ర అంటే ఆయన పేరే అందరికి గుర్తుకు వస్తుంది. ‘నాటకరంగ సింహ’ బిరుదును దక్కించుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారుడు సత్యవరపు రాము. రాము 1973 వ సంవత్సరంలో రైతు కూలీ కుటుంబానికి చెందిన పాపిశెట్టి, అచ్చమ్మ దంపతులకు రాజాం మండలం ఆగూరు లో జన్మించారు. 1995 సంవత్సరంలో పౌరాణిక రంగస్థల ప్రవేశం చేసిన సత్యవరపు రాము రైతు కుటుంబీకుడు. ఇప్పటికీ వన్నెతగ్గని నిండైన రూపంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన 4 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
కళా ప్రస్థానం:
తన కుటుంబ పరిస్థితులు కారణంగా చదువుకు దూరంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే రాము భవిష్యత్ లో నటుడు అవుతాడని గాని, అక్షరముక్క రాని అతడు, క్లిష్టమైన పౌరాణిక పద్యాలను అలవోకగా ఆలపిస్తాడని గాని ఎవరు వూహించలేదు. చిన్నచిన్న బుర్రకథలతో నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే పౌరాణిక రంగస్థలంపై పట్టు సాధించారు. ఆయన గాత్రం బాగుంటుందని జాతీయ స్థాయి కళాకారుడు చప్పా అప్పారావు నాయుడు ప్రశంసించి, ప్రోత్సహించడంతో విశ్వామిత్ర పాత్రలో సత్యహరిశ్చంద్ర నాటకంలో తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన అనంతరం వీరబాహుడు, కాలకౌశికుడు, సాత్యకి సహదేవుడు, బలరాముడు, భీముడు, ధుర్యోధనుడు, అర్జునుడు వంటి పాత్రలతో పాటు హరిశ్చంద్రుడి పాత్రలో కూడా రాణించి ఎన్నో సత్కారాలు పొందారు. పద్మశ్రీ యడ్ల గోపాలరావు, అమరాపు సత్యనారాయణ, చీకటి రామారావు, కెల్ల బలరాంస్వామి, కురిటి సత్యనారాయణ, ఏవీ వేంకటేశ్వరరావు, ఎం.వై. నాయుడు, డీ.వీ. సుబ్బారావు, మంగాదేవి, పీఎస్.మాధవ్, నెల్లూరు సుధాకర్, కిలారి లక్ష్మి, బొబ్బిలి సావిత్రమ్మ, విజయరాజు, జయనిర్మల, ఆబోతుల విశ్వనాథం తదితరుల సరసన నటించి, పోటాపోటీగా ప్రదర్శనలు ఇచ్చారు. తన 51 ఏళ్ల జీవితంలో 32 ఏళ్లుగా కళారంగానికి సేవలు అందిస్తూ వస్తున్నారు. పారితోషకమే ప్రధాన అంశంగా కాకుండా కళామ్మతల్లిపై మక్కువతో ప్రతిచోటా ప్రదర్శనకు ముందుకు రావడం వీరి కళాతృష్ణకు నిదర్శనం.
ప్రతిభకు పట్టాభిషేకం:
పార్వతీపురం శ్రీ వాణి ఆర్టిస్ట్ వారి సౌజన్యంతో 29 జూన్ 2014న నిర్వహించిన ఉత్తరాంధ్ర స్థాయి పౌరాణిక, పద్య, ఏకపాత్రులు మరియు ప్రత్యేక సీనులు పోటీల్లో విశ్వ విత్రుడు ఏకపాత్రాభినయంకు రాము గారు ప్రధమ బహుమతి పొందారు. బొబ్బిలి రాజా ఆర్ ఎస్ ఆర్ కె రంగారావు స్మరక సంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన నాటక పోటీల్లో విశ్వామిత్ర పాత్రకు ద్వితీయ బహుమతి లభించింది. రాజం కళాసాగర్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పౌరాణిక పద్య నాటక పోటీల్లో అర్జునుడి పాత్రకు ప్రధమ బహుమతి వరించింది. గాజువాకలో 6 అక్టోబర్ 2018న ఉత్తరాంధ్రస్థాయి నాటక పోటీల్లో అర్జునుడు పాత్రకు ప్రధమ బహుమతి లభించింది.
కడప, కంది, మల్లయ్యపల్లె, హైదరాబాద్, తాడేపల్లి గూడెం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన ప్రదర్శనలు ప్రేక్షకులకు కనువిందుచేశాయి. ఇత్తడి కిరీటాలు, బంగారు, వెండి బహుమతులతో పాటు పలువురు పెద్దల సత్కారాలు పొందిన ఆయనకు మందరాడ బాలభారతి కళా నాట్యమండలి రంగస్థల రంగసింహ బిరుదు అందజేసి ఘనంగా సత్కరించింది. బొబ్బిలి, పార్వతీపురం, విశాఖపట్నం, రాజాం, కవిటి, వంతరాం, కొత్తకంచరాం, ఆగూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో విశ్వామిత్ర పాత్రలకు ఎన్నో సత్కారాలు పొందిన ఆయన ఐదువేలకుపైగా సన్మానాలు దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రస్థాయి నాటక పోటీల్లో అర్జునుడి పాత్రకు ప్రథమ బహుమతి లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అతని నాటక రంగ కళాసేవకు వరించిన సన్మానాలు సత్కారాలు అవార్డులు ప్రశంసలు అనేకం.
అందుకున్న సత్కారాలలో ముఖ్యమైనవి:
1) బొబ్బిలి ఎమ్మెల్యే సృజయ్ కృష్ణ రంగారావు గారిచే సత్కారం.
2) పార్వతిపురంలో డాక్టర్ పి.జే. నాయుడు గారిచే సత్కారం.
3) శ్రీ కళా సమితి వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి పోతుల సోమరాజు గారిచే సత్కారం (బొబ్బిలి).
4) విశాఖపట్నం గాజువాక మద్దిలపాలెం లో సత్కారం.
5) కళాసాగర్ నాటక సంక్షేమ సేవా సంఘ రాజంలో ప్రముఖ న్యాయవాది మెట్ట దామోదరరావు గారిచే సత్కారం.
6) కవిటి మండలంలో కెళ్ళ అప్పలనాయుడు గారిచే సత్కారం.
7) వంతరంలో సర్పంచ్ గారిచే సత్కారం.
8) ఎస్.వి.ఆర్. కళాపరిషత్ రాజం వారిచే సత్కారం.
9) కొత్త కంచరంలో సత్కారం.
10) ఆగూర్ కంచరాంలో కలిశేట్టి తవిటి నాయుడు గారిచే సత్కారం.
11) ఆగూరు పెద్దల ప్రోత్సహయే నా సత్కారం.
కళయే దైవం.. కళయే జీవితం… అని నమ్మే సత్యవరపు రాము గారి కళారంగ జీవితం మరింత శోభాయమానం కావాలని, అభినందిస్తూ 64కళలు పత్రిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
–కళాసాగర్ యల్లపు