నాటకం వ్యాపారం కాదు…!

ఆఖరికి నాటక కళాకారులందరినీ వ్యాపారస్థుల్ని చేసారు. నాటకం కోసం జీవితాలు, కుటుంబాలు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళ విషాద కధలు సీనియర్ నటులకు బాగా తెలుసు. ఇప్పుడంటే ప్రదర్శనా పారితోషికం, నగదు బహుమతులు ఇస్తున్నారు గానీ, గతంలో చప్పట్లు, ఈలలు వినే నీళ్లతో కడుపు నింపుకొనేవారు కళాకారులు. అదీ వ్యాపారమేనా? ఇప్పుడు మాత్రం డబ్బు మిగులుతోందా? ఉదా.. మూక నాటకాన్ని సంజీవిగారు 30 మందితో ఆడేవారు. వచ్చేది 10-15 వేలకు మించి ఉండదు. చార్జీలు, ఆహార్యం, మ్యూజిక్ లకు, మిగతా ఖర్చులకు సరిపోవు. సినిమా రంగానికి వెళ్లిన నాటక రచయితల్లో క్రమం తప్పక యేటా ఒకటి రెండు నాటికలు రాసి ప్రదర్శనలిచ్చే సంజీవి గారి తృష్ణని దేనితో కొలుద్దాం? అదే మార్గంలో ఎమ్మెస్ చౌదరిగారు, కృష్ణేశ్వరరావుగారు, కీర్తి శేషులు జె. పి. గారు..అది వ్యాపార ధోరణి కాదే. అలాగే “ఎడారి కోయిల “ని నాయుడు గోపిగారు 30-40 మందితో ఆడేవారు. ఎమ్మెస్ చౌదరిగారు ఇప్పటికి 40-50 మందితో, భారీ సెట్స్ తో ఆడుతుంటారు. అలాగే వాసుగారు కూడా సుమారు 30-40 మందితో ఆడుతున్నారు. వాళ్ళకి డబ్బు మిగులుతుందా? మిగలదు. మరి దాన్ని వ్యాపారం అందామా? దయచేసి రంగస్థల కళాకారులు చేసేది వ్యాపారం కాదని గమనించాలి.
ఇక ఎంటర్టైన్మెంట్ గురించి.. అది కావాలి.. కాదనను. కానీ అది మాత్రమే కావాలనుకుంటే నాటకాలెందుకు? సెల్ చేతిలో ఉంటే చాలదా? థియేటర్ లో కూర్చుంటే దొరకదా? కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్నారు. నాటకం ప్రయోజనం అది. అందుకే థియేటర్ కి రాని, రాలేని ప్రజల కోసం వీధి నాటిక పుట్టుకొచ్చింది. ఆలా ప్రజల చెంతకు వెళ్లి నాటకాలాడే కళాకారులు వ్యాపారులా? మనం ప్రజలకు నవరసాలు చూపించాలి. నిజమే. కానీ నాటకం ప్రేక్షకుడిలో కదలిక తేవాలి. మనిషి మారకపోయినా, మనసులో చిన్నపాటి ఆలోచన రేకెత్తించగలిగితే నాటక లక్ష్యం సిద్ధిస్తుంది. ఆ సదాశయం తోనే నాటకాలాడే కళాకారులు వ్యాపారాలు కారు. ఇక వినోదం… నేను అన్ని ఫార్మెట్లలో సుమారు 40 హాస్య, వ్యంగ్య నాటికలు, స్కిట్స్ రాసాను. చాలా ప్రదర్శనలు ఆడాను. ప్రేక్షకులకు వినోదాన్ని పంచాను.. అయితే ఆ వినోదం తాత్కాలికమే. ఒక కప్పలు, NGO, మరో మొహంజొదారో, వెంకన్న కాపురం, ఇల్లమ్మబడును, ఈరోజు బ్రాకెట్టు, కుక్కపిల్ల, గుండెలు మార్చబడును, నథింగ్ బట్ ట్రూత్, కలికాలం, కదలిక, నీరుపోయ్, ఈ చరిత్ర ఏ సిరాతో, రాజ్యహింస, మూక, నరకం మరెక్కడో లేదు, శ్వేతపత్రం, రావణ కాష్టం, పిపీలి కం వంటి నాటిక /నాటకాల సరసన వినోద ప్రధాన నాటికలు ఎందరికి గుర్తు ఉంటాయి..
ఇంత సుదీర్ఘ సుత్తి దేనికంటే.. నాటక కళాకారులు చేసేది వ్యాపారం కాదు. కళాసేవ.. సమసమాజ కాంక్ష..కాదంటే కొందరి దృష్టిలో పిచ్చి.. తీరని తృష్ణ..తీయని దురద..(గోక్కున్నా కొద్దీ హాయిగా ఉంటుంది)..

  • వీర్ల వర ప్రసాద్

1 thought on “నాటకం వ్యాపారం కాదు…!

  1. మనం నాటక కళను అప్ డేట్ చేసుకోం.. ” లైక్ పొరుగు కర్నాటిక.. మహారాష్ట్ర లకు మల్లే! అందుకే ఎప్పుడూ బీద అరుపులు1 నాటకం నుంచి సినిమాకు ఎదిగినా క్రమం తప్పకుండా నాటకాలు ఆడే గిరీష్ కర్నాడ్ .. లాంటి కమిటెడ్ ఆర్టిస్టులు తెలుగులో కాగడా వేసి గాలించినా దొరికే పరిస్థితి లేదు తెలుగులో! గతించి పోయిన నూతన్ ప్రసాద్ లాంటి వాళ్లు . ప్రస్తుతమున్న కొండవలస వంటివాళ్లు పూర్వాశ్రమంలో ప్రసిద్ధ నాటకకళాకారులే! వాళ్ల కాంట్రిబ్యూషన్ ఇప్పుడు నాటికరంగానికి ఎంత ? జీరో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap