మూడు జిల్లాల నుండి పాల్గొన్న 4500 మంది చిన్నారులతో విజయవాడలో ‘చిత్రకళా పోటీలు’
చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికతీసేందుకు డ్రాయింగ్ పోటీలు ఎంతగానే దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్‌శాఖ కమీషనర్ అనిల్ చంద్ర పునీత IAS గారు చెప్పారు. అనంత్ డైమండ్స్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని (SPA) కళాశాల ఆవరణలో డ్రాయింగ్ పోటీలు 12-11-24, బుధవారం ఉదయం జరిగాయి. అనిత్ చంద్ర పునీత IAS హజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇంత భారీ స్థాయిలో డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తున్న అనంత్‌డైమండ్స్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీని ఆయన అభినందించారు. అనంత్ డైమండ్స్ వ్యవస్థాపకుడు జాస్తి అనంత పద్మ శేఖర్ మాట్లాడుతూ… చిన్నారుల్లో ఉన్న భావాలను వారు చాలా చక్కగా చిత్రాల రూపంలో బహిర్గతం చేస్తారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఛైర్మన్ పి.రమేష్ మాట్లాడుతూ చిత్రలేఖనంపై విద్యార్థులకు ఆసక్తీ పెంపొందించడానికి ప్రతి ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
విజేతలకు ఈ నెల 17వ తేది, ఆదివారం ఉదయం SPA కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులను అందచేస్తామని చెప్పారు. SPA కళాశాల రిజిస్ట్రార్ కేవీ. ఉమామహేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంతోష్‌కుమార్, టి. మాధవరావు, చిత్రకారులు వై. కళాసాగర్, టి.మృత్యుంజయరావు, చిన్న శ్రీపతి, ఎన్. శ్రీధర్, బీ.ఎస్.వీ. రమేష్, పర్యావరణ మానవ సమాజ భద్రత బాధ్యత ఫౌండేషన్ ఛైర్మన్ సింగలూరి శ్రీనివాసరావు, స్పూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో 4500 మంది విద్యార్థులు హజరై చిత్రాలను గీశారు.