డబ్బింగ్ సినిమాలకు మాటలు, పాటలు రాయడం ఒక అద్భుతమైన కళ. పాత్రధారుల పెదవుల కదలికలకు అనుగుణంగా, కథాగమనం దెబ్బతినకుండా మాటలు, పాటలలో వున్న సాహిత్యానికి అనుగుణంగా డబ్బింగ్ పాటలు రాయడం క్లిష్టతరమైన ప్రక్రియే. డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో శ్రీశ్రీ ఆద్యుడు కాగా, తరవాతి కాలంలో ఆరుద్ర, పినిశెట్టి వంటి కవులు డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు సమకూర్చారు. ఈ డబ్బింగ్ చిత్రాలెన్నో తెలుగులో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్న దృష్టాంతరాలు కూడా వున్నాయి. కొన్నిపాటలు సంగీతాభిమానులను అలరించి కాలానికి నిలుస్తున్నాయి కూడా. నాటక రచయితగా మంచి పేరు సంపాదించి, సినిమారంగంలో అడుగుపెట్టి, పినిశెట్టి శ్రీరామమూర్తి వద్ద శిష్యరికం చేసి స్ట్రెయిట్ చిత్రాలకే కాదు, డబ్బింగ్ చిత్రాల రచనకు మకుటాయమానంగా నిలిచిన వారిలో రాజశ్రీ అగ్రగణ్యులు. ఆగస్టు 14న రాజశ్రీ వర్ధంతి సందర్భంగా కొన్నివిశేషాలు…
నాటకరంగం నుండి వెండితెరకు…
రాజశ్రీ పూర్తిపేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. పుట్టింది 31 ఆగస్టు 1934న విజయనగరంలో. అక్కడి మహారాజా కళాశాలలో ఫిజిక్స్ ప్రధానాంశంగా బి.ఎస్.సి పట్టా పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాబోర్డు (నేటి జిల్లాప్రజా పరిషత్)లో టైపిస్టు గాను, బోర్డు వ్యక్తిగత కార్యదర్శిగాను పనిచేశారు. ‘నటన’, ’వదిన’, ‘ఆంధ్రశ్రీ’ వంటి నాటక రచనలు చేసి, తరవాత సినీరంగ ప్రవేశం చేశారు. తొలుత పినిశెట్టి శ్రీరామమూర్తి వద్ద సహాయకుడుగా పనిచేశారు. రాజశ్రీ సినీరంగ ప్రవేశం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ప్రభా సంస్థ పేరిట వై. నారాయణస్వామి, ఎం. వెంకటరామదాసు నిర్మించిన ‘ఆడపెత్తనం’ (1958) చిత్రంతో మొదలైంది. ఈ చిత్రానికి పినిశెట్టి కథ, సంభాషణలు సమకూర్చగా రాజశ్రీ పినిశెట్టికి సహాయకుడిగా పనిచేశారు. అందుచేత సినిమా టైటిల్స్ లో రాజశ్రీ కి క్రెడిట్స్ లేవు. రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ నిర్మాత కడారు వెంకటేశ్వర్లు సి.ఎస్.రావు దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నతమ్ముడు’ (1958) చిత్రానికి మాటలు సమకూర్చిన పినిశెట్టికి రాజశ్రీ సహాయకుడిగా పనిచేశారు. అదే సంవత్సరం శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు సి.ఎస్. రావు దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీకృష్ణ మాయ’ చిత్రానికి సహాయ దర్శకుడుగా రాజశ్రీ పనిచేశారు. రాజశ్రీ పేరు మొదట వెండితెరమీద కనిపించిన చిత్రం ఇదే. తరవాత 1959లో వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద కడారు నాగభూషణం దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘వీరభాస్కరుడు’ చిత్రానికి రాజశ్రీ కడారు నాగభూషణంకు సహాయకుడుగా వ్యవహరించారు. 1960లో రవుతూ పిక్చర్స్ నిర్మాత తోట కృష్ణమూర్తి పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకత్వంలో ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ చిత్రం నిర్మిస్తే ఆ చిత్రానికి కూడా రాజశ్రీ సహాయకుడుగా పని చేశారు. 1961లో మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన ‘శాంత’ చిత్రానికి కథ, మాటల విభాగంలో సముద్రాల జూనియర్ తో కలిసి రాజశ్రీ పనిచేశారు. గేయరచయితగా రాజశ్రీ పేరు సినిమా క్రెడిట్స్ లో పడిన చిత్రం మహేశ్వరీ ప్రొడక్షన్స్ పతాకం మీద ఎస్. భావనారాయణ హున్సూరి కృష్ణమూర్తి దర్శకత్వంలో నిర్మించిన ‘రమాసుందరి’ (1960) సినిమా. సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఘంటసాల ఆలపించిన ‘ఓహో రాజకుమారీ విధి పగబూని ఎదురాయెనా… నవ వధూవిలసితవై నగరు విడిచి పోవలెనా’ అనే నేపథ్య గీతం రాజశ్రీ ప్రధమ చలనచిత్ర రచన. తరవాత 1963లో జూపూడి వెంకటేశ్వరరావు వాల్టా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మానాపురం అప్పారావు దర్శకత్వంలో నిర్మించిన ‘పరువు ప్రతిష్ట’ చిత్రంలో సుశీల ఆలపించిన ‘ప్రభు గిరిధారి శౌరీ రావయా నను కరుణించి వరములీయ రావయా’ అనే పాటను, ఘంటసాల ఆలపించిన ‘ఇలా ఇలా జీవితం పొతే పోనీ ఈ క్షణం… స్వర్గమనూ నరకమనూ ఏది ఏమనూ’ అనే పాటలను రాజశ్రీ రచించారు. పెండ్యాల స్వరపరచిన ఈ రెండు పాటలు మంచి హిట్లుగా నిలిచాయి. అలా గేయరచయితగా రాజశ్రీ సినిమాలలో నిలదొక్కుకోవడానికి అవకాశం కలిగింది. అటు గేయరచయితగా తన వునికిని చాటుకుంటూనే రాజశ్రీ 1961లో ప్రసాద్ మూవీస్ బ్యానర్ మీద దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ తమిళంలో నిర్మించిన ‘’తాయిళ్ల పిళ్ళై’ తమిళ చిత్రానికి కథ సమకూర్చిన పినిశెట్టి కి సహకరించారు. ఈ చిత్రానికి కరుణానిధి స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. హిందీలో ఎల్.వి. ప్రసాద్ ‘ససురాల్’ పేరుతో నిర్మించిన ‘ఇల్లరికం’ చిత్రానికి ప్రసాద్ కు సహాయకుడుగా రాజశ్రీ వ్యవహరించారు. 1965లో శ్రీ సరస్వతీ మూవీస్ & శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో ’శ్రీ సింహాచలక్షేత్ర మహిమ’ అనే చిత్రాన్ని నిర్మించారు. బి.వి. ప్రసాద్ కు దర్శకునిగా ఇదే తొలిచిత్రం. అందులో కాంతారావు, కృష్ణకుమారి, రేలంగి, రాజనాల, గిరిజ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు, పాటలు అన్నీ రాజశ్రీ రాయడం విశేషం. టి.వి. రాజు సంగీత పర్యవేక్షణలో కొన్ని అద్భుత పాటలు ఈ సినిమాలో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఘంటసాల ఆలపించిన ‘సింహాచలము మహా పుణ్యక్షేత్రమూ…శ్రీ వరాహ నరసింహుని దివ్యధామమూ’ అనే టైటిల్ సాంగ్ సింహాచల దేవస్థానంలో రోజూ వినిపిస్తూనే వుంటుంది. ఇతర వైష్ణవాలయాలలో కూడా ఈ పాట నిత్యనూతనమే. నారద పాత్రకు పి.బి. శ్రీనివాస్ పాడిన ‘జయహే మోహనరూపా గానకలాపా ఆది స్వరూపా ఆశ్రితమణిదీపా’ అనే పాట కూడా ప్రజాదరణ పొందినదే. ఇక పురూరవుడు, శిరీష పాత్రలకోసం పి.బి. శ్రీనివాస్, జానకి ఆలపించిన యుగళగీతం ‘రావోయి రాజా కనవోయి రాజా చెలి నేరాలు మన్నించరావా అనురాగాల తేలించ రావా’ కూడా బహుజనాదరణ పొందినది కావడం విశేషమే. ఎల్.ఆర్ ఈశ్వరి పాడిన జానపద గీతం ‘నీలాటి రేవుకాడ నేరేడు చెట్టు నీడ ఆనాడు నాతో చేరి సై అన్నాడు… మావ చేతిలో చెయ్యేసి నువ్వే నన్నాడు’ సరదాగా సాగింది. ఇందులో మొత్తం పదకొండు పాటలు, ఒక పద్యం వున్నాయి. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సి.ఎస్. రావు దర్శకత్వంలో నిర్మించిన ‘బంగారు గాజులు’ (1968) చిత్రానికి రాజశ్రీ కథ సమకూర్చగా, పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు రాశారు. ఈ చిత్రానికి మాటలు రాయడంలో కూడా రాజశ్రీ పినిశెట్టికి సహకారం అందించారు. ఈ సినిమాకు ఉత్తమచిత్రంగా నంది బహుమతి లభించింది. అంతగా ఆడలేకపోయిన ‘మూఢనమ్మకాలు’ చిత్రానికి కూడా రాజశ్రీ రచన చేశారు.
చలంతో రచనానుబంధం…
‘ఆంధ్రా దిలీప్’ అని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నిఅందుకున్న హాస్యనటుడు చలం నిర్మాతగా మారి భార్య రమణ పేరుతో ‘శ్రీరమణ చిత్ర’ అనే సంస్థను నెలకొల్పి కొన్ని అద్భుతమైన సినిమాలు నిర్మించాడు. అలా చలం నిర్మించిన తొలిచిత్రం ‘సంబరాల రాంబాబు’ (1970) అఖండ విజయాన్ని సాధించింది. తమిళంలో కె. బాలచందర్ కథ సమకూర్చి నిర్మించిన ‘ఎదిర్ నీచల్’ (1968) సినిమాకు తెలుగు రూపమే ఈ చిత్రం. జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వం వహించగా చలం, శారద, ఎస్.వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది రాజశ్రీ. తమిళ మాతృకకు సంగీతం నిర్వహించిన వి. కుమార్ ‘సంబరాల రాంబాబు’ చిత్రానికి కూడా అవే బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా బాలు ఆలపించిన ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం, కృషి చేశావంటే ఎదురీదావంటే సాధించేవు గెలిచేవు నీదే జయం’ అనే ప్రబోధ గీతం బాగా పాపులర్ అయింది. ‘మామా చందమామా వినరావా నా కథ, వింటే, మనసు వుంటే కలిసేవు నా జత’ అనే పాటను సుశీల, బాలు విడివిడిగా పాడారు. ఇందులో ‘మింటిపైన నీవు ఒంటివాడవై అందరికీ వెన్నెల పంచా రేయంత తిరగాలి… ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికీ సేవలు చేయ రేయి పవలు తిరగాలి… లేరు మనకు బంధువులూ లేరు తల్లిదండ్రులూ… మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవ్వరూ’ అంటూ హీరో అంతరంగాన్ని చంద్రునితో పోల్చి రాయడం రాజశ్రీ పనితనమే!. ఈ పాట నేటికీ నిత్యనూతనమే. ఈ చిత్రంలో మరికొన్ని పాటలు ‘విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు’ (మాధవపెద్ది బృందం), ‘కన్నులే నవ్వేయి వెన్నెలను చిందేయి’ (పి.బి. శ్రీనివాస్), ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా’ (పిఠాపురం, సుశీల) కూడా హిట్టయినవే. రాజశ్రీ సమకూర్చిన మాటలు సరళంగాను, సునిశితంగాను వుండి ప్రేక్షకులను రంజిపజేశాయి. చలం 1972లో నిర్మించిన సినిమా ‘బుల్లెమ్మ-బుల్లోడు’. నాగాంజనేయులు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు రచించింది రాజశ్రీ. చలం, విజయలలిత హీరో, హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి సత్యం సంగీతం సమకూర్చారు. బాలు, సుసీల ఆలపించిన ‘కురిసింది వానా నా గుండెలోనా నీ చూపులే జల్లుగా’ అనే పాట నేటికీ సూపర్ హిట్ పాటే. అలాగే ‘ఈ పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీవెంత వుంటానురా, నిను వీడి పోలేనురా’ (జానకి), ‘నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు’ (బాలు) పాటలు కూడా హిట్టయ్యాయి. చలం 1973లో కె.వి. నందనరావు దర్శకత్వంలో ‘దేవుడమ్మ’ సినిమా నిర్మించారు. ఇందులో కూడా చలం, విజయలలిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కూడా కథా రచన, మాటలు, పాటలు సమకూర్చింది రాజశ్రీ. సత్యం సంగీత దర్శకత్వంలో బాలు ఆలపించిన ‘ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాషా చూస్తున్నావు… సామీ’ అనే పాట బాగా హిట్టయింది. బాలు, సుశీల పాడిన ‘నీ మాటంటే నాకు అదే వేదము నీ తోడుంటే చాలు అదే లోకము’ అనే యుగళగీతం కూడా అదే కోవలోనిదే. 1974లో చలం నాగాంజనేయులు దర్శకత్వంలోనే ‘తులాభారం’ చిత్రాన్ని నిర్మించారు. అందులో చలం కు శారద జోడీ. ఈ సినిమాకు కథ, మాటలు రాజశ్రీ సమకూర్చి కొన్ని పాటలు మాత్రమే రాశారు. వాటిలో సత్యం స్వరకల్పన చేసి సుశీలచేత ఆలపింపజేసిన ‘రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం మాధవ నిలయం ప్రేమకు దేవాలయం’ పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అందులో ‘నీ ప్రియవదనం వికసిత జలజం, నీ దరహాసం జాబిలి కిరణం, నీ శుభచరణం ఈ రాధకు శరణం’ అంటూ మహాద్భుతంగా సాగుతాయి చరణాలు. 1972 లో ఎం.ఎస్. రెడ్డి ‘ఊరికి ఉపకారి’ చిత్రం నిర్మించారు. చలం, ఆరతి అందులో నాయకా నాయికలు. ఆ సినిమాకి రాజశ్రీ మాటలు సమకూర్చారు. అందులో బాలు, సుశీల ఆలపించిన ‘ఏమయ్యో రామయ్యా ఎట్టాగున్నదీ నీ చిన్నారి చిలిపి మనసు యేమంటున్నదీ’; బాలు ఆలపించిన సోలో పాట ‘విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు’ అనే రెండు పాటలు కూడా రాశారు. ఆ తరవాత చలం, వాణిశ్రీ నటించగా పి. ఏకామ్రేశ్వరరావు బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1973లో నిర్మించిన ‘రాముడే దేవుడు’ సినిమాకు రాజశ్రీ మాటలు సమకూర్చి’పాటకు రాగాలు కోటి కానీ పల్లవి ఒకటే ఒకటి’ వంటి మూడు పాటలు కూడా రాశారు. 1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున, గిరిజ షెట్టర్ ల సినిమా ‘గీతాంజలి’ కి మాటలు సమకూర్చింది రాజశ్రీ నే.
మణిరత్నం అనువాద చిత్రాలకు అధిపతిగా…
రాజశ్రీ అసంఖ్యాక అనువాద చిత్రాలకు మాటలు పాటలు సమకూర్చారు. వాటిలో అధిక శాతం తమిళం నుండి తెలుగులోకి అనువదించిన సినిమాలే ఎక్కువ. తమిళంలో ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకున్న మణిరత్నం సినిమా ‘మౌనరాగం’ (1986) ను సేనా క్రియేషన్స్ వారు తెలుగులోకి అనువదించినప్పుడు ఆ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది రాజశ్రీ. తమిళంలో వాలి రాసిన పాటలకు దీటుగా రాజశ్రీ అనువాదం చేశారు. ‘మల్లెపూల చల్లగాలి మంటరేపే సందె వేళలో ఏల ఈ వేళ కోరుకున్న గోరింకను చేరదెలా రామచిలక’ (బాలు), ‘ఓహో… మేఘమొచ్చెను మేఘం లాలి పాడెను, వీచే పూలగాలులే పలికే పగటి గాధలే’ (జానకి) మచ్చుకు కొన్ని మాత్రమే. 1987 లో మణిరత్నం తమిళంలో నిర్మించిన ‘నాయకన్’ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ ‘నాయకుడు’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ చిత్రానికి రాజశ్రీ మాటలు, పాటలు సమకూర్చారు. బాలు, సుశీల ఆలపించిన ‘ఏదో తెలియని బంధమిది యెదలో ఒదిగే రాగమిది’ పాట సూపర్ హిట్టయింది. అలాగే ‘నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా యెవరు కొట్టారు’ (బాలు), ‘సందెపొద్దు మేఘం, పూలజల్లు కురిసెను నేడు’ (బాలు, సుశీల), ‘చలాకీ చిన్నది వుంది మజాలకు రమ్మంటుంది’ (బాలు, జానకి) హిట్టయిన పాటలుగా నిలిచాయి. మణిరత్నం మాగ్నం ఓపస్ ‘అగ్ని నచ్చత్తిరం’ చిత్రాన్ని తెలుగులో ‘ఘర్షణ’ (1990) పేరుతో నిర్మించినప్పుడు ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది రాజశ్రీ. తమిళంలో వాలి రాసిన పాటలకు అచ్చుగుద్దేట్టు రాజశ్రీ తెలుగులో అనువదించి సాహిత్యపరంగా కూడా హిట్ చేశారు. ‘కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను విరిచూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవే శ్రీకారమే కావే’ (బాలు, వాణిజయరాం), ‘నిన్ను కోరి వర్ణం, సరిసరి కలిసేనే నయనం, ఉరికిన వాగల్లె తొలకరి కవితల్లె తలపులు కదలేనే, చెలిమది విరిసేనే రవికుల రఘురామా’ (చిత్ర), ‘ఒక బృందావనం సోయగం, ఒక కోలాహలం క్షణక్షణం, ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా’ (వాణిజయరాం), ‘రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె విందులే, ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు’ (వాణిజయరాం), ‘నీవే అమరస్వరమై సాగే శ్రుతిని నేనే’ (బాలు, చిత్ర) పాటలు వేటికవే గొప్పవి. ఈ పాటల్ని అనువాద పాటలు అని చెప్పగలమా! అదే రాజశ్రీ కలం గొప్పతనం!! మరో మణిరత్నం ఆణిముత్యం తమిళం నుండి అనువాదమైన ‘దళపతి’ (1991) చిత్రం. తమిళ మాతృక కు పాటలు రాసింది వాలి. తెలుగు డబ్బింగ్ వర్షన్ కు మాటలు సమకూర్చింది రాజశ్రీ. ఈ సినిమా డైలాగులు పరమాద్భుతాలు. 1992లో బాలచందర్ సమర్పించగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మరో బాక్సాఫీస్ అనువాద చిత్రం ‘రోజా’. సంగీతం సమకూర్చింది ఎ.ఆర్. రెహమాన్. ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది రాజశ్రీ. తమిళంలో వైరముత్తు రాసిన పాటలకు అతికినట్లువుండే సాహిత్యాన్ని రాజశ్రీ అందించారు. వాటిలో ‘చిన్నిచిన్ని ఆశ చిన్నదాని ఆశ, ముద్దుముద్దు ఆశ ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’ (మినిమిని), ‘నా చెలి రోజావే నాతో వున్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలోన నీవే కనిపించవో అందించవో తోడూ’ (బాలు, సుజాత), ‘నాగమణి నాగమణి సందకాడ ఏంది సద్దు, ఆకతాయి వూసులకు ఆటవిడుపు లేదు లేదు’ (బాలు, చిత్ర) అజరామరాలైన పాటలే కదా!మరో మణిరత్నం సినిమా ‘దొంగ దొంగ’ (1993)కు కూడా ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. మాటలు పాటలు రాజశ్రీ సమకూర్చారు. అలా అనిసెట్టి సుబ్బారావు తరవాత ఎక్కువ కాలం అనువాద చిత్రరంగంలో రాణించి వాటికి మాటలు, పాటలు రాసి మంచి పేరు తెచ్చుకున్న కవివరేణ్యుడు రాజశ్రీ. మొత్తం మీద రాజశ్రీ వెయ్యి పైగా చిత్రాలకు రచన చేసి వాటికి మాటలు, పాటలు సమకూర్చారు. వాటిలో సింహభాగం తమిళ డబ్బింగ్ సినిమాలే.
ఇతర విశేషాలు…
‘చదువు-సంస్కారం’, ‘నిజం నిద్రపోదు’ వంటి స్ట్రెయిట్ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా రాజశ్రీ నిర్వహించారు. రాజశ్రీ కి సంగీతం మీద కూడా మంచి పట్టు వుంది. దాసరి దర్శకత్వం వహించిన ‘వెంకన్న బాబు’, ‘మామా కోడలు’ చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ‘తులసిదళం’ స్ట్రెయిట్ చిత్రానికి మాటలు రాశారు. ‘నినైవిల్ నిన్ద్రావల్’, ‘సెల్వ మగళ్’ తమిళ చిత్రాలకు కథలు సమకూర్చారు. ‘ప్రేమికుడు’ చిత్రం షూటింగు జరుగుతుండగా రాజశ్రీ నిద్రలోకి జారుకున్నారు. మరలా ఆతడు లేవనేలేదు. ఇది జరిగింది 14 ఆగస్టు 1994లో చెన్నైనగరంలో. అదే రాజశ్రీ పనిచేసిన చివరి డబ్బింగ్ సినిమా. రాజశ్రీ తరవాత అతని తనయుడు సుధాకర్ కొన్ని సినిమాలకు మాటలు పాటలు సమకూర్చినా రాజశ్రీకి వారసుడుగా వెన్నెలకంటి మంచి పేరు తెచ్చుకున్నారు.
… ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
Rajasri is the legend in dialogue and song creation. Tamil to Telugu cinema dubbing has no value without recognising the talent of great RAJASRI.