తెలుగు నాటక దిగ్గజం దుగ్గిరాల సోమేశ్వరరావు గారు ఆగస్ట్ 6 న రంగస్థలం వదిలేసి వెళ్లిపోయారు! నాటక రంగానికి విశేష సేవలు అందించిన దుగ్గిరాల సోమేశ్వరరావు కాసేపటి క్రితం కనుమూశారు. ఆయన వయసు 92. గత కొన్నాళ్ళుగా వృద్దాప్య గుండె సంబంధిత అనారోగ్యంతోహైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నంది నాటకోత్సవాల్లో ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కార గ్రహీత దుగ్గిరాల సోమేశ్వరరావు. నాటక రంగంలో ఏడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించారు. నాటక రంగంలో ధ్రువతార పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ దర్బార్ నుంచి వెలుగు వెలిగిన నట దర్శక ప్రయోక్త దుగ్గిరాల సోమేశ్వరరావు. శ్రీకృష్ణ తులాభారం, శ్రీనాధుడు లాంటి ఎన్నో అద్భుత పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు వారి దర్శకత్వంలో అద్భుతంగా ప్రజాదరణ పొందాయి. రసరంజని నాటక సంస్థ ద్వారా నాటకం కోసం తపించారు. నాటక వికాసం కోసం శ్రమించారు.
గత కొన్నేళ్లుగా వారి పేరిట వారి పుట్టినరోజు సందర్భంగా రంగస్థల పురస్కారాలు ఇస్తూ ప్రత్యేక స్ఫూర్తినిచ్చారు. నాటక ప్రదర్శనలు, నాటకానికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురించారు. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు గుమ్మడి గోపాలకృష్ణ పంజాగుట్ట దుర్గా కాలనీ లోని దుగ్గిరాల స్వగృహంలో వారిని పరామర్శించి పద్యం పాడి వినిపించినప్పుడు స్పందించారు. ఓపిక లేకున్నా చెయ్యి ఎత్తి ఆశీస్సులు అందించారు.
దుగ్గిరాల సోమేశ్వరరావు గారు మంచి పద్య కవి. పద్యాలు రాసి పుస్తకాలు ప్రచురించారు. ఎన్నో వ్యాసాలు రాశారు. నంది నాటకోత్సవాల రూపకల్పనలోనూ వారు ఉన్నారు. న్యాయ నిర్ణేతగా పలుమార్లు వ్యవహరించారు. టికెట్ పెట్టి నాటకం చూసే ప్రేక్షకులు కావాలని తపించారు. ఎందరో కళాకారులను ప్రోత్సాహించారు. ఎన్నో వేదికలు కల్పించి నాటకం కోసమే జీవించారు.
టెలీ కమ్యూనికేషన్ విభాగంలో సివిల్ ఎగ్జిiక్యూటివ్ ఇంజనీర్ గా 1990 లో పదవీ విరమణ పొందారు. నిడదవోలు దగ్గరలోని నందమూరు స్వగ్రామం అయినప్పటికీ నాటక వికాసం కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. పద్మవ్యూహం, వీలునామా, కన్యాశుల్కం, మరో మెహంజోదారో, మృచ్చకటిక, ప్రతాపరుద్రీయం, ముద్ర రాక్షసం తదితర నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. కాకి ఎంగిలి, క్రాస్ రోడ్స్, శ్రీనాధుడు, వీలునామా ఆయన దర్శకత్వంలో విరాజిల్లిన ప్రదర్శనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆయన ఉత్తమ నటుడు గా, ఉత్తమ దర్శకుడుగా ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు.
రెండు రోజుల క్రితం మళ్ళీ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు శివైక్యం పొందారు. నాటక రంగానికి వారు అందించిన సేవలు అజరామరం. ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించే దుగ్గిరాల గారు ఇకలేరంటేనే దుఃఖం ఆగడం లేదు. నాటక రంగానికి సంబంధించి ఏం రాయాలన్న ముందుగా దుగ్గిరాల గారితో చర్చించేవాడ్ని. ఏం సందేహం వున్నా చక్కగా వివరించే వారు. గత మూడు దశాబ్దాల అనుబంధం. హైదరాబాద్ లో వారికి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ వారికి ఉత్తరం రాయడమే అలవాటు. ఫోన్ లో మాట్లాడుతూ అప్పుడప్పుడు రవీంద్రభారతిలోనో, బోట్స్ క్లబ్ లోనో కలుస్తూ వుండే వాళ్ళం. నాటక రంగంలో ఒక గొప్ప మహోన్నత శక్తిని కోల్పోయాం. అశ్రు నివాళి సోమేశ్వరరావు గారు.
- డా. మహ్మద్ రఫీ