సుస్వర మందారం – కర్ణాటక సంగీతానికి ముఖద్వారం

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 10

ఒక “కళ” ద్వారా అది అభ్యసించిన వ్యక్తికి కళ రావడం సహజం. ఒక వ్యక్తి ద్వారా ఒక కళకు “కళ” రావడం అరుదైన విషయం ! ఎలాగంటే…. ద్వారం వెంకటస్వామి నాయుడు అభ్యసించడం వలన “వయోలిన్” వాయిద్యానికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కింది ! 14 ఏండ్ల చిరుప్రాయంలోనే తన వయోలిన్ వాదనంతో విమర్శకుల మన్ననలు పొంది “ఫిడేల్ నాయుడు” అన్న బిరుదుతో పాటు ఓ వజ్రపుటుంగరం సొంతం చేసుకున్న “వయోలిన్ వజ్రం” మన నాయుడు. వందల కొలది సంగీత సాధనాల్లో ఒకటిగా మరుగున పడివుండే వయోలిన్ ధ్వనిని ప్రపంచ నలుమూలలా మారుమ్రోగేలా దాని తీగలాగి తన గుండె నరాలతో పలికించి వయోలితోనే సంగీత సభలు నిర్వహించిన మొట్టమొదటి సంగీతకారుడు ద్వారం నాయుడు. గురుదేవులు రవీంద్రుని మెప్పులు పొందిన గొప్ప వయోలిన్ విద్వాంసుడీతడు. ఇంత మహిమ వయోలిన్లో లేదు. అది ద్వారం గారి వాదనం లోనే వుంది. మన ఆంధ్రులకు అపర గంధర్వుడు, అమర గాయకుడు అయిన ఘంటసాలంతటివాడు కూడా కర్ణాటక బాణీలు ఈయన వద్దే అభ్యసించాడు. ప్రపంచంలో కర్ణాటక సంగీతానికి వయోలిన్ ద్వారా…. తెరచిన ద్వారం మన వెంకటస్వామిగారు. సంగీత కళానిధి, పద్మశ్రీ, వీరి పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల, కళాప్రపూర్ణలాంటివి ఎన్నో, ఎన్నెన్నో ఈయనను వరించాయి. ఇటువంటి సంగీత సితార నేటికీ మన ధృవతార.

(ద్వారం వెంకటస్వామి నాయుడు జన్మదినం నవంబర్ 8, 1893)

1 thought on “సుస్వర మందారం – కర్ణాటక సంగీతానికి ముఖద్వారం

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link