చలసాని ప్రసాదరావు గారి 19 వ వర్థంతి సందర్భంగా….
ప్రముఖ రచయిత, చిత్రకారులు చలసాని ప్రసాదరావు. కృష్ణాజిల్లా మువ్వ మండలం భట్ట పెనుమర్రు గ్రామంలో అక్టోబర్ 27 1939 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నారు. చిన్నతనంలో ఈయన్ని టైఫాయిడ్ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయారు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించారు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరారు.
1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఆయన 1956 నాటికి వరంగల్లు చేరుకున్నారు. కాకతీయ పత్రిక అనే వారపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదారాబాద్ లోని ప్రభుత్వ ఫైనార్ట్స్ కళాశాలలో కమర్షియల్ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశారు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చారు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973 నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించారు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం.
‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే! యునెస్కోసంస్థ 1964లో ‘బుక్ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరారు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశారు. ఉస్మానియా నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందారు.
1971లో వసుధ అనే పత్రికకి సంపాదకుడయ్యారు. 1974లో ఈనాడులో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్ టైమ్ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత విపుల,చతుర మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించారు.
ఈనాడు పత్రికలో చలసాని ప్రసాదరావు ‘కబుర్లు’ అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించారు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశారు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే “కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ.” నిజానికి కబుర్లు శీర్షికని ‘వసుధ’ అనే మాసపత్రికలో 1971 లో ప్రారంభించారు. ఆ తర్వాత జ్యోతి అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబర్ 22 నా దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించారు. నిరాఘాటంగా తన జీవితాంతం ఈనాడు లోనే కబుర్లాడారు. జూన్ 12 2002 నా చలసాని ప్రసాదరావు మరణించారు
చలసాని ప్రసాదరావు రచనలు:
రవి కథ (రవీంద్రనాథ్ టాగూర్ ఆత్మకథ), కాకతీయ శిల్పకళా వైభవం, ఆధునిక చిత్రకళ, రష్యన్ చిత్రకళ, కథలూ కాకరకాయలు, మాస్టర్ పీచు, రసన, మార్పు (చైనా కథల అనువాదం), నిజాలు (మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల గురించి), రాజులబూజు (అనువాద కథల సంపుటి), ఆరడుగులనేల (అనువాద కథల సంపుటి), రక్తాక్షరాలు (జూలియస్ పుజిక్ రచన అనువాదం), ఇలా మిగిలాం, శత్రువు (కథల సంపుటి), జాగ్తేరహో (ఎంపిక చేసిన ‘కబుర్లు’).
మంచి సమాచారం