సినిమానే నా ప్రపంచం – ఎడిటర్ మోహన్

విజయం ఆయన తారక మంత్రం. జీవితంలోనే కాదు సినిమాల్లోనూ ‘ జయం’ ఆయనను వెన్నంటే ఉంటుంది. ఏది చెబితే ప్రేక్షకుడు స్పందిస్తాడో, ఎలా చెబితే థియేటర్లో ఊగిపోతాడో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. చదువు ఆరో తరగతితోనే ఆగిపోయినా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడాన్ని చూస్తుంటే ఆయన కృషి ఏపాటిదో అర్థమవుతుంది. ఎవరికైనా పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది.. పుత్రులు కూడా తన లాగే ఎదిగితేనే. ఒకరు మోహన్ రాజాగా దర్శకుడిగా ఎదిగితే, ఇంకొకరు ‘జయం’ రవిగా హీరోగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ సక్సెస్ మేన్ ఎవరంటే ఎడిటర్ మోహన్. ‘ఓ ఎడిటర్కు ఇంత పేరా’ అంటే ఆయన సినిమాను కాచి వడపోశారు కాబట్టే అది సాధ్యమైంది. ఎడిటర్‌గా జీవితాన్ని ప్రారంభించి నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రలను అందించిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన సినిమా విడుదలవుతుందంటే వేరే నిర్మాతలు తమ సినిమాలను రెండు వారాలు వాయిదా వేసుకునేవారు. 80 ఏళ్ల జీవితకాలంలో 65 ఏళ్ల సినిమా పయనాన్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా దిగ్గజంతో 64కళలు’ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివి.
ఎలా అనిపించింది సార్ ఈ సినిమా జీవితం?
65 ఏళ్లు సినిమాలకే అంకితమయ్యారు.. మీకు ఏమినిపిస్తోంది? జ: చాలా సంతృప్తిగా ఉందండీ. నాలుగు తరాల నటులతో పనిచేశాను. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలియదు. పెద్దగా చదువుకోక పోయినా సినిమాలు చూస్తూనే అంతా నేర్చుకున్నాను. ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలు చూసేవాడిని. మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం అనిపించేది. మంచి సినిమాలు తీయాలన్న ఆకాంక్షతోనే పనిచేసేవాడిని. ఆ అనుభవంతోనే విజయవంతమైన సినిమాలు నిర్మించాను. నేను తీసిన ప్రతి సినిమా వంద రోజులు ఆడింది. ఆ సంతృప్తి చాలు నాకు. ఇప్పుడు పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాను.
మీది ఏ ఊరు? సినిమా రంగానికి ఎలా వచ్చారు?
అందరూ నేను తెలుగువాడిని అనుకుంటారు. తెలుగువాళ్లే కాదు తమిళియన్లు కూడా నేను తెలుగువాడినే అనుకుంటున్నారు. కాకపోతే తెలుగుతోనే నాకు అనుబంధం ఎక్కువ. తెలుగులో రేలంగి మాదిరిగా తమిళంలో ఓ పెద్ద హాస్యనటుడు తంగవేలు అని ఉండేవారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయన నన్ను తన కొడుకులా పెంచారు. సినిమారంగంతో సంబంధం ఏర్పడటానికి ఆయనే కారణం. తంగవేలుగారితో స్టూడియోలకు తరచూ స్టూడియోలకు వస్తుండేవాడిని. 1958 నుంచి తెలుగువారితో నాకు అనుబంధం ఉంది. తమిళనాడులో మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ తెలుసుకదా.. ఆ సమీపంలోనే ఉన్న ఊరు తిరుమంగళం మా ఊరు. చెన్నైలోని నెప్యూన్ స్టూడియోలో ఎడిటింగ్ విభాగంలో 1960లో చేరాను. ఎడిటర్‌గా నేను

మొదటిసారిగా పనిచేసిన సినిమా ఎంజీఆర్ నటించిన ‘అరసిలన్ కుమరి’. దీంతోపాటు తాతినేని ప్రకాశరావు ‘ఎల్లోరం ఇన్నట్టు మన్నార్’కు పనిచేశాను. ఎడిటర్‌గా పేరు పడింది మాత్రం ‘గురువును మించిన శిష్యుడు’ అనే తెలుగు సినిమా. బి. విఠలాచార్య దీని దర్శకుడు. ఆయనే నాకు గురువు. అక్కడి నుంచే నాకు తెలుగుతో అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాతోనే ఎడిటర్‌గా నా పేరు పడింది. ‘నవగ్రహ పూజామహిమ’, ‘అగ్గిపిడుగు’, ‘కదలడు వదలడు’, ‘చిక్కడు దొరకడు’… ఇలా ఎన్నో సినిమాలకు ఆయన దగ్గర చేశాను. ఎన్టీఆర్ సినిమాలు చాలా వాటికి నేను పనిచేశాను. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ… ఇలా దాదాపు అనేక భాషల సినిమాలు ఉంటాయి. ఎడిటర్ గా 200 సినిమాలకు పనిచేసి ఉంటాను.
నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?
సినిమా మీద అవగాహన పెరిగింది.. నమ్మకం కుదిరింది. ఎడిటర్ గా ఉంటూనే నేను స్క్రిప్టులో కూర్చున్న సినిమా ‘మనవూరి మారుతి’. అంతకుముందు ‘లాస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని ఇంగ్లీషులో ఓ సినిమా వచ్చింది. డాక్యుమెంటరీ తరహాలో నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. నిర్మాతగా మారి దీన్ని తెలుగులో ‘జంతు ప్రపంచం’గా అందించాను. పెంగ్విను మొదటిసారిగా తెరపై చూపించిన సినిమా ఇది. అది మనిషి లాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ‘మనవూరి మారుతి’ని తమిళంలో డబ్ చేస్తే బాగుంటుందని అనిపించి నిర్మాతగా మారి తమిళంలో విడుదల చేశా. ఈ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత మరొకొన్ని తెలుగు సినిమాలను కూడా తమిళంలో డబ్ చేశాను. ఆ తర్వాత శ్రావణ శుక్రవారం’, ‘కంకణం’ అనువాద సినిమాలతో తెలుగులో కూడా నిర్మాతగా మారాను. నిర్మాతగా చేసిన డబ్బింగ్ సినిమాలు 60 వరకూ ఉంటాయి. నా ఎం.ఎం. మూవీ ఆర్ట్స్ బ్యానర్ పైనే చేసిన స్ట్రెయిట్ సినిమాలు తెలుగులో 10, తమిళంలో 5 ఉంటాయి. ఏ బిజినెస్ చేసినా అది దెబ్బతినకూడదు.. లాభం రావాలనే మనస్తత్వం నాది. చిరంజీవి గారిని డబ్బింగ్ సినిమా ద్వారా తమిళంలో పరిచయం చేసింది నేనే. ఆయన నటించిన ‘ఆరని మంటలు’ సినిమాని తమిళంలోకి డబ్ చేశాను. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు.
సినిమా విజయంలో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుంది?
స్క్రిప్టు అనేది ఓన్లీ ఇమేజినేషన్. అది ఊహరూపంలోనే ఉంటుంది. ఎడిటింగ్ అనేది ఇమేజినేషన్ కాదు.. వచ్చిన ప్రొడక్టు జనానికి ఎలా అందివ్వాలని అనుకునేది. నా సినిమా ఇలా ఉంది చూడండి అని దర్శకుడు అనే వాడు చెప్పుకోవచ్చు.. ఇలాగే కెమెరామేన్ కెమెరా కోణంలో చెప్పుకోవచ్చు. సంగీత దర్శకుడు తన కోణంలో చెప్పుకోవచ్చు.. ఎన్నో విభాగాలవారు చెప్పుకునే అవకాశం ఉంది. అలా చెప్పుకోలేని వాడు ఎడిటర్ ఒక్కడే. సినిమాకు సంబంధించిన ప్రతిభాగంలోనూ ఎడిటర్ అనేవాడు ఉంటాడు. ఎమోషన్ని ఎలా చూపిస్తున్నామనేది ఎడిటర్ ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. ఆదుర్తి సుబ్బారావు, మధుసూదనరావు, కె.ఎస్.ఆర్. దాస్… వీరంతా కూడా ఎడిటింగ్ నుంచి వచ్చి దర్శకులుగా ఎదిగినవారే. ఎడిటర్ అనేవాడు సినిమాలో ఎమోషనన్ను తీసుకురావాలి. ఇప్పుడు గ్రాఫిక్ చేసేవారు ఉన్నారుగానీ ఎడిటింగ్ చేసేవారు లేరు. జీవం ఉంటేనే కదా సినిమా రక్తికట్టేది. ఎడిటింగ్ సరిగా లేకపోతే ఎమోషన్ కేరీ అవదు. అది ఎడిటింగ్ టేబుల్ కాదు డిసిషన్ మేకింగ్ టేబుల్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సినిమాలో అందరూ చేసే తప్పుల్ని సరిచేసేవాడు ఎడిటర్ ఒక్కడే. నేటి సినిమాల్లో ఆ ఎమోషన్ లోపిస్తోంది.. అందుకే ప్లాట్లు ఎదురవుతున్నాయి. మా రోజుల్లో ఎఫెక్ట్స్ కూడా మేమే చేసేవాళ్లం. .
మీ కుటుంబం గురించి చెప్పండి..
హీరోగా మా రవికి మంచి విజయాలు ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం సినిమాలో మెయిన్ క్యారెక్టర్ మావాడే. ఇది హిస్టారికల్ మూవీ. రాజాకి దర్శకుడికిగా మంచి విజయాలు ఉన్నాయి. ‘హనుమాన్ జంక్షన్’ మూవీ 175 రోజులు ఆడింది. తమిళంలో ‘తని ఒరువన్’ ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. ఇది తెలుగులో రాంచరణ్ హీరోగా ‘ధ్రువ’గా వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా చేయబోతున్నాడు. నా కూతురు రోజా దంతవైద్యురాలు. నేను చదువుకోకపోయినా పెళ్లయ్యాక మా ఆవిడను చదివించాను. డబుల్ ఎంఏ చేసింది. ఈ జన్మకు నాకీ సంతృప్తి చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap