పత్రికా సంపాదకుల్లో శిఖర సమానుడు – నార్ల

నాలుగైదు తరాల్ని ప్రభావితం చేసిన మహా సంపాదకులు శ్రీ నార్లవారు. నార్లగారు ఆంధ్రజ్యోతికి వ్యవస్థాపక సంపాదకులు. నేను పునర్వ్యవస్థాపక సంపాదకుట్టి, కాని ఆయనకి, నాకు మధ్య ఎంత అంతరం ఉందంటే 1960 – 2002 మధ్య ఎంత అంతరం ఉందో, 42 సంవత్సరాల అంతరం అంత. అప్పుడు పత్రికా సంపాదకుడికున్న స్వేచ్ఛ ఏమిటి, అప్పుడు వారికున్న హక్కులేమిటి, వారి స్థాయి ఏమిటి? ఇప్పుడు సంపాదకులకున్న స్వేచ్ఛ, హక్కులు, స్థాయి ఏమిటని చూస్తే చాలా అంతరం కన్పిస్తుంది. అయితే మార్పు అనివార్యమైంది. నార్ల వెంకటేశ్వరరావుగారిలాగా ఒక వృత్తిగా పత్రికాసంపాదకత్వాన్ని ఎంచుకున్న వ్యక్తి, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో విషయాల మీద అధికారికంగా జ్ఞానం కల్గి ఉండటం ఇప్పుడు సాధ్యంకాదు. ఆయన మేధావి, పండితుడు. పత్రికా సంపాదకుల్లో శిఖర సమానుడు.

అటువంటి వ్యక్తి మళ్ళీ రావాలంటే అత్యాశ అవుతుంది. ఆరోజుల్లో ఆంధ్రజ్యోతి నార్లగారి కోసం పుట్టిన పత్రిక ఒక సంపాదకుడు ఆంధ్రప్రభ నుండి రిజైన్ చేసి వచ్చాక ఆయనకోసం పెట్టిన పత్రిక. ఇది తెలుగు జర్నలిజంలోనే కాదు, ఎక్కడైనా చాలా అరుదైన విషయం. ఆయన సంపాదకీయాలకోసమే పత్రిక చదివే వారు. అప్పుడు పత్రికలో 6 పేజీలు లేదా 4 పేజీలుండేవి. పండగరోజుల్లో, అడ్వర్టైజుమెంట్లు ఎక్కువగా ఉంటే 8 పేజీల వరకు ఉండేవి. అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇది వరలో టాబ్లాయిడ్స్ లేవు. అప్పుడున్నవి మూడు పత్రికలు, వాటి మధ్యనే పోటీ. కాని ఇప్పటిలా ఎక్కువ పేజీలతో ఉండేవి కావు. ఎక్కువ ఖర్చు పెట్టి సర్క్యులేషన్ పెంచుకోవాలన్న ఆలోచనా ఉండేది కాదు. పత్రిక గౌరవప్రదంగా నడిస్తే చాలని అనుకునేవారు.

పత్రికలు ఆ కాలంలో సంపాదకుల చుట్టూ నడుస్తూండేవి. సంపాదకులే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు.
ఫలానా వైఖరి వలన పత్రికి నష్టం కల్గుతుంది అని చెప్పే సాహసం అప్పట్లో పత్రిక యాజమాన్యానికి ఉండేదికాదు. ఆరోజుల్లో కనుక అలా నడిచింది.

ఇప్పుడలాంటి సంపాదకులు లేరు అనుకోవడం న్యాయం కాదు. ఎందుకంటే అప్పుది. సంపాదకులు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేసేవారు, ఇప్పటివారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. వారి పరిధులు ఏమిటి అని చూస్తే మార్పు అనివార్యం అన్పిస్తుంది. అయితే ఇప్పుడు పత్రికలకి సారథ్యం వహిస్తున్న సంపాదకులు విలువలు లేనివారు వెన్నెముక లేనివారు అనుకోవడం ధర్మంకాదు. ఈ పరిణామక్రమం, పరిస్థితులు, మనం అర్థం చేసుకోవాలి. నార్లవారు ఒక్కమాట పట్టింపుతో రాజీనామా చేశారు. పొత్తూరిగారు కూడా అదేవిధంగా చేశారు.

పొత్తూరి యాజమాన్యం ఆకాంక్ష అంగీకరించి పదవిలో కొనసాగడమా లేక అంగీకరించక పదవికి రాజీనామా ఇవ్వడమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఉదయంలో వారు సంపాదకులుగా ఉన్నప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నాను హైదరాబాదులో, ఆయనతోపాటు నేనూ రాజీనామా చేస్తానన్నాను. ఎందుకంటే ఆయనతోపాటు నాకూ బాధ్యత ఉంది. ఆ వ్యాసాన్ని వ్రాయించడంలో, వేయించడంలోనూ, నా బాధ్యతా ఉంది. కాని వారు నన్ను రాజీనామా చెయ్యవద్దని చెప్పారు. సంపాదకుడిగా నాది నైతిక బాధ్యత’ అని వారన్నారు.

సర్దుకుపోయే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. దానిక్కారణం, సంపాదకుడే పత్రికకి సారధిగా ఉండే రోజులు కావు, ఇవి. సంపాదక విభాగానికి సారథ్యం వహించేవాళ్ళుగా ఉంటే చాలు. పత్రికలో ఇప్పుడు అనేక విభాగాలున్నాయి. ఒక అడ్వర్టైజింగ్ మేనేజరు, ఒక సర్క్యులేషన్ మేనేజరు ఎడిటర్ గారి రూమ్ కి వచ్చి కూర్చుని వారి ఆశీస్సులు స్వీకరించి, సలహాలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏవిభాగానికి ఆ విభాగపు హెడ్ ఒకరుంటారు. అడ్వర టైటింగ్ విభాగం, సర్యులేషన్ విభాగం ఇప్పుడు ఆదాయ వనరుల్ని చేకూర్చేవిగా ఉన్నాయి. ఎప్పుడైతే పత్రిక నిర్వహణకు అధికసొమ్ము పెట్టవలసి వస్తోందో అప్పుడు ఈ విభాగాలకి విలువ పెరిగింది. పత్రిక ఆదాయం పెరిగి, వారి జీతాలు పెరిగేయి. వాళ్ళ ప్రావీణ్యం పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఎత్తున ఉండే సంపాదకుడు స్థాయి కూడా క్రిందకి దిగి కేవలం సంపాదకత్వ విభాగానికే పరిమితముయ్యేడు. “నేను సంపాదకుడిని కాబట్టి, నేను విధాన నిర్ణయాలు చేస్తాను. సమాజానికి మంచిదని నాకు ఏదైతే అన్పిస్తుందో అదే చేస్తాను. అదే రాస్తాను, సంస్థహితం కాక సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తాను’ అంటే కుదరదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాంటి సంపాదకుడిని భరించేందుకు ఏపత్రిక యాజమాన్యం సిద్ధంగా లేదు.

ఇక్కడ రాజీపడటం కావాలి. అదేమిటంటే, నైతిక విలువల్ని పూర్తిగా విస్మరించి, జనహితాన్ని ప్రక్కన పెట్టి రాయమని ఏపత్రికా యాజమాన్యం చెప్పదు. ప్రజల సమస్యలను మనం పట్టించుకోకపోతే, వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చెయ్యకపోతే అది ప్రజలకు దగ్గర కాదు. అటువంటి పత్రిక ప్రజలు కొనరు, ఆదరించరు.

పత్రికా రంగంలో పోటీ ఉంది. ఈ రోజు ఐదారు డైయిలీలున్నాయి. ఆ డెయిలీలన్నింటికి అన్ని మండల కేంద్రాల్లో రిపోర్టర్లున్నారు. అన్ని కూడా మెయిన్ పేపర్లో, టాబ్లాయిడు ఇస్తున్నాయి. కలర్ పేజీలిస్తున్నాయి. అయితే రెండు మూడు పత్రికలకి ఆదరణ ఎక్కువగా ఉంది. ఎందువల్లనంటే ఆ రెండు మూడు పత్రికలు ప్రజలకి అవసరమైన సమాచారాన్నిచ్చి, ప్రజల సమస్యల్ని కూడా అవి ప్రతిబింబిస్తున్నాయి.

అంటే ప్రజలు తమ అభిరుచికి అనుగుణంగా పత్రిక లేకపోతే దానిని తిరస్కరిస్తారన్న భయం యాజమాన్యానికి ఉంటుంది. ఆ తిరస్కార భయం వలన యజమానులు పత్రికను ఇష్టం వచ్చినట్లు ప్రచురించరు. అది ఎలా నడపాలో సంపాదకులకు తెలుసు కనుక వారికి అప్పజెప్తారు లేదా ఎలా నడపాలో నేర్చుకుని వారే నడుపుతారు.

నార్లగారి సమయంలోనూ ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే, నార్లవారి సమయంలో సంపాదకుడికి చాలా తీరిక ఉండేది. ఒక సంపాదకీయం రాయటమో లేదా న్యూస్ ఎడిటర్లో, సబ్ ఎడిటర్లనో పిలిచి సంపాదక పేజీలు ఏవేవి, ఏవ్యాసాలు వుండాలి అవి చర్చించిన తరువాత ఆసాయంత్రానికి చదువుకుందుకు, రాసుకుందుకు సమయం ఉండేది. వేరే సమావేశాలకి వెళ్ళే వ్యవధి ఉండేది.

నేటి సంపాదకులకి అలాంటి అవకాశం లేదు. నేటి తరం సంపాదకులు ఒక్క సంపాదకీయం రాయడమే కాదు. నిజానికి సంపాదకీయాలు సంపాదకుడు రాయడు. సంపాదకీయ రచయితలు వేరే ఉంటారు. అసిస్టెంటు ఎడిటరు సంపాదకీయాలు రాస్తుంటారు. ముఖ్యమైన విషయాలను సంపాదకుడు రాస్తాడు. స్వయంగా సంపాదకీయాలు రాసుకునే సంపాదకులు ఇప్పుడు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు సంపాదకులకి పరిపాలనా సంబంధమైన బాధ్యతలు ఎక్కువైనాయి. విభిన్న మనస్తత్వాలు కల్గిన వ్యక్తుల్ని ఒక త్రాటి మీద నడిపించడం ఇప్పుడు ప్రధాన బాధ్యత.

సంపాదక వర్గంలోనూ, రిపోర్టింగ్ వర్గంలోనూ ఉండే రకరకాల వ్యక్తులు కలిసి పనిచేసేలా చూసి, రాయించదలచిన వ్యాసాల్ని రాయించుకోగల్గడం ఇప్పుడు ప్రధాన బాధ్యత. వారి జీతాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, – ట్రాన్స్ ఫర్లు, డిసిప్లెనరీ యాక్షన్లు ఇలాంటివన్ని ఇప్పుడు సంపాదకుడి బాధ్యత. ఇది కాకుండా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంటుకి, సర్క్యులేషన్ డిపార్ట్మెంటుకి కొన్ని కోర్కెలుంటాయి. వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని బట్టి పత్రిక ఈ విధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారనీ, అపుడే తాము అడ్వర్టైజ్మెంట్లు తేగలమనీ చెబుతారు. అంటే సర్క్యులేషన్ డిపార్టుమెంటుకి వచ్చిన సమాచారం ఆధారంగా పత్రిక తయారు చెయ్యవలసిన అవసరం ఉంది. ఆ చాకచక్యం సంపాదకుడికి ఉండాలి. ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ జ్ఞానం సంపాదకుడికి ఉండాలి. మార్కెట్ పట్ల అవగాహన ఉండాలి. పత్రికా రంగంలోని పోటీ ఏమిటో తెల్సుకోవాలి. ఇవన్నీ చూస్తూ, అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వర్తమాన విషయాలు పరిశీలిస్తూ, చరిత్ర చదువుతూ, రాజకీయాల్ని అర్థం చేసుకుంటూ, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వార్తల్ని విశ్లేషించగల శక్తి ఉండాలి. అంటే రోజుకి పది, పదిహేను గంటలు సంపాదక మండలిలో పనిచేసేవారికి అవసరం. అంటే ఆఫీసులో పదిపన్నెండు గంటలు ఉంటే ఇంటి దగ్గర నాలుగైదు గంటలు అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఉంది.

వారు విదేశాలకు వెళ్ళడం, సభలకు, షికార్లకు వెళ్ళడం సాధ్యం కాదు. నేను నా ఆంధ్రజ్యాతి సంపాదకత్వంలోంచి విరమించుకునేందుకు కారణం నా సాయంత్రాలు నాకు కావాలని అనుకోవడమే. దాదాపు ముప్పైరెండు సంవత్సరాలు సాయంకాలాలన్నీ ఆదివారాలతోసహా ఆఫీసులోనే గడిపి, అంకితభావంతో పనిచేస్తే, వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో సాయంకాలాలు లేకుండాపోయాయి. ఎప్పుడూ భార్యాపిల్లలతో బయటకుపోయిన పరిస్థితిలేదు. ఒక నాటకం చూడలేదు. ఒక సిన్మా చూడలేదు. ఒక సంగీత కచేరికి వెళ్ళలేదు. ఇంత జీవితం కోల్పోయేం అనిపించింది. ఇటువంటి పరిస్థితి పూర్వ సంపాదకులకి లేదు. నార్ల వెంకటేశ్వరరావుగారికి అసలే లేదు. ఆయన చదువుకోవాల్సినది ఆయన చదువుకున్నారు. రాయాల్సింది రాసుకున్నారు. చూడాల్సినవి చూడగల్గారు.

అటువంటి సావకాశం ఇప్పుడు లేదు. పరిస్థితులు మారాయి. ఇది ఒక పరిశ్రమ అయిపోయినప్పుడు, న్యూస్ పేపర్ ఒక ప్రొడక్టు అయినప్పుడు, మార్కెట్లో అనేక న్యూస్ పేపర్లున్నప్పుడు, ఆ పోటీ తట్టుకోవాలంటే మనకు తోచినట్లు పత్రిక తెస్తే సరిపోదు. ప్రజలు కోరుకునేది తెల్సుకోవాలి, దాన్ని అమలు చెయ్యాలి, ప్రజలు మెచ్చే పత్రికను తీసుకురావాలి. దీనికోసం వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పనిచెయ్యాలి. ఇది కష్టసాధ్యమైన పని.

చాలామంది అంటారు – అప్పటితరం వేరు, ఇప్పటి తరం వేరు, అప్పటి విలువలేంటి? ఇప్పటి విలువలేంటి అని.

విలువల విషయంలో కొంత రాజీపడిన మాట వాస్తవమే, పత్రికలు కొంత పతనం అయ్యాయన్నది వాస్తవమే కొంతమేరకు. పత్రికలకి, సంపాదకులకి ఇదివరకున్న గౌరవం లేదు. కాని పత్రికల ప్రాచుర్యం పెరిగింది. పత్రికలు చదివేవారి సంఖ్య పెరిగింది. ప్రజాస్వామ్యంలో మిగతా వ్యవస్థతో పోల్చుకుంటే పత్రికావ్యవస్థ అంత అన్యాయంగా ఏమీ లేదు. మనం కోరుకున్నట్లు లేకపోవచ్చు. కాని అంత పతనం మాత్రం జరగలేదు. గుండెలు బాదుకోవలసిన పరిస్థితి లేదు. నేటి జర్నలిస్టులు క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారని గ్రహించగల్గితే వారిని సానుభూతిగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.
ఆంధ్రజ్యోతిలో ఇప్పటికి అనేక బ్యాచు అయినాయి. పదకొండు బ్యాచ్ జర్నలిస్టులకి ట్రెయినింగ్ ఇచ్చాము. … ఒక నార్ల వారిని, ఒక పొత్తూరి వారిని చెప్పి ఇలా అధ్యయనం చెయ్యాలి, ఇలా ఆదర్శంగా తీసుకోవాలి, ఇలా వాక్యనిర్మాణం ఉండాలని ఎప్పటికప్పుడు నూరిపోస్తున్నాం, ఈ తరంలో కూడా ఆదర్శంగా ఉంటూ, అధ్యయనం చేస్తూ జీవితాన్ని పూర్తిగా పత్రికకే అంకితం చేసిన యువతరం సంపాదకులున్నారు. వాళ్ళే పత్రికారంగానికి ఆశాజ్యోతులు.. నార్లవారి శతజయంతిని పురస్కరించుకుని నేను చెప్పేది ఏమిటంటే వారు ఈ తరానికి కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. ఇప్పటికీ నార్లవారిని ఆదర్శంగా తీసుకుని పనిచేసే యువ జర్నలిస్టులున్నారు. ఈ తరానికే కాదు ముందు తరాలకి కూడా ఆయన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారని నా విశ్వాసం.

-కె. రామచంద్రమూరి
(2014 విజయవాడ పుస్తక మహోత్సవం రజతోత్సవ సంచిక నుండి)

1 thought on “పత్రికా సంపాదకుల్లో శిఖర సమానుడు – నార్ల

  1. నేటి పత్రికా ప్రపంచంలో కొండొకచో విలువలు లుప్తమయాయి.సెన్సేషన్ అనే పదాన్ని నమ్ముకొని పచ్చి అబద్దాలను జనాల్లోకి నిస్సిగ్గుగా చేరవేస్తున్నాయి. ఇందువల్ల సమాజం ఎంతకలుషితమవుతుందో ననే భయం ఏకోశానా కలుగడంలేదు.వార్తలలో నిగ్గుతేల్చాల్సిన సంస్థలు దీర్ఘ నిద్ర పోతున్నాయి.తప్పుడు వార్తలను శిక్షించే విధానంలేనంతకాలం అథోలోకానికి పరుగెడుతున్న ఈపత్రికా ప్రపంచానికి మోక్షమేలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap