సంపాద‘కవి’త్వ సంపుటి

కలం తిరిగిన చేయి వ్రాసేది ఏదయినా సృజననే కోరుకుంటుంది. సమాజం గొంతుకను అనుసరించే కలం కవిత్వాన్నే ఒలికిస్తుంది. ఈతకోట సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదక బాధ్యతలతోపాటు రచయితగా ఇప్పటికి 15 పుస్తకాలను ప్రచురించారు. మరికొన్ని పుస్తకాలు వీరి సంపాదకత్వంలో పురుడు పోసుకున్నాయి.
సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకీయ కవిత్వ ప్రక్రియను చేపట్టిన తొలినాళ్లల్లోనే కొత్తగా, కొంత వింతగా అనిపించినా… సాహిత్య పత్రికకు సంపాదకత్వం వినూత్నశోభనే తెచ్చింది. సాహిత్య ప్రియులనేకాక, రచయితలను అమితంగా ఆకర్షించిన సంపాదకునిగా సుబ్బారావు కృతకృతులయ్యారు.
69 నెలల పంట ఈ 69 కవితల సంపుటి. నెలకొక్క కవితగా రాసుకున్న సంపాదకత్వ సరిగమ. ఓ కవిని సంపాదకత్వాన్ని నెరిపేందుకు ఎన్నుకున్న పత్రికాధినేతగా కోసూరి రత్నం గారిని ప్రశంసించాలో; సంపాదకత్వ బాధ్యతను నెత్తికెత్తుకున్న కవిగా సుబ్బారావు గారిని పొగడాలో అర్థం కాని గజిబిజి!… దగ్గరగా చూసే మాలాంటి వారికి.

సంపాదకీయాన్ని సృజనాత్మకపుటంచులకు చేర్చినదా అన్న చందంగా ఈ కవితాసంపుటికి కే. శ్రీనివాస్ మాట, కాచి వడపోసిన కాఫీలా ఘుమ ఘుమలను పంచేందుకు తొలిపేజీలల్లో ముందుమాటగా సమకూరిందని పాఠకులకు స్పష్టముగా దర్శనమిస్తుంది. సంపాదకీయ కవిత్వ చరిత్ర పుట్టు పూర్వోత్తరాలతో పాటు, ఈతకోట సుబ్బారావు కవితా వాక్యాలను చాలానే ఉటంకింస్తూ ఆ కవిత్వ విశిష్టతలను తన అక్షరాల్లో నిక్షిప్తం చేసారు.
శీర్షిక రచయితలు కాల్పనిక వచన రచయితలో, కవులో అయి ఉండవచ్చు. వారు తమ సృజనాత్మకతను విస్తరించేందుకు పరిమితులు, నిగ్రహాలు తక్కువగా ఉండే వ్యాఖ్యాన శీర్షికలో తమ ఆవేశ ఉద్వేగాలను వ్యక్తం చేయడానికి కవిత్వ ధోరణిని ఆశ్రయించి ఉండవచ్చు. సంపాదకీయం అంటేనే “పాఠకుల ఆలోచనలకు పదునుపెట్టే ప్రక్రియ కదా!” విశాల‘నయనం’ సంపాదకీయ కవిత్వం కొరకు ఈతకోట సుబ్బారావు ఈ నూ’తన’ ప్రక్రియకు పూనుకొని వుంటారని ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
అలాగే ‘సంపాదకీయంలోకి కవిత్వం అతిథిగా మాత్రమే రాగలదు… తిష్ట వేసి కూర్చో లేదు’ అన్న సంప్రదాయ ధోరణికి విరామ బిందువును ఉంచారు. ఈ సమకాలీన సాహిత్య సమాజంలో ఒక సీరియస్ కవి ఈతకోట సుబ్బారావు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతోపాటు అనేక విశిష్ట గుర్తింపులను పొందారు. విశాలాక్షి సంపాదకీయాల్లోను రాజకీయాలను సీరియస్ గానే రాశారు.

“ప్రతి భారతీయుడు నన్ను కాదు తన్నుతాను తల ఎత్తి చూడాలి / అభివృద్ధి విగ్రహాల్లో కాదు / ప్రపంచం యావత్తు నావైపు కాదు నాదేశంవైపు చూడాలి!”అంటూ భారీ పఠేల్ విగ్రహ నిర్మాణపై స్పందించారు.
జాతీయ, సాంస్కృతిక పర్వదినాల సందర్భంగా కవిత్వం తొనికిసలాడే సంపాదకీయాలు రాయడం సుబ్బారావు ఒక ఆనవాయితీగా మారింది. నేలపట్టు పక్షుల రాకతో నెల్లూరోళ్ళు జరుపుకునే పండుగ సందర్భాన్ని ‘భారతీయం’ అన్న సంపాదకీయాన్ని కవితగా వినిపించారు. “నైజీరియా గాలిపటాలుకొన్ని / నేలపట్టు చెట్టుకొమ్మల్లో గూడల్లుకొన్ని / వంశాభివృద్ధికి పునాదులు లేపుతుంటాయి”.
గాన గంధర్వుడు బాలు చనిపోయినప్పుడు, మండేలా మరణించినప్పుడు, ముళ్ళపూడి కన్నుమూసినప్పుడు, ‘ముసురు’ పెద్ది భొట్ల ‘మహాకావ్యం మధ్యలో ఆగిపోయినప్పుడు’, సోమసుందర్ కాలధర్మం చెందినప్పుడు, మహాస్వప్న, ఛాయాదేవి, సినారె నిష్క్రమించినప్పుడు సుబ్బారావు సంపాదకీయ కవిత్వం రాశారు. సినీనటి సాయిపల్లవిపై ద్వజమెత్తిన గోరక్షక దళంకు తన వైఖరిగా ‘పల్లవి లేని పాట’ను కరతాళం ద్వానం వినిపించారు.
“కిరాతక హత్యల్ని తవ్వి తీసిన ఈ పురాతత్వ పరిశోథక బృందాలని సన్మానించేదెవరు? మానవతా వాదుల మహిత త్యాగాన్ని స్మరించిందెవరు?”అంటూ ‘మూడో కన్ను’అన్న శీర్షికలో తాను ఒక పాత్రికేయునిగా తన ఆవేదనను వ్యక్తపరిచారు. “ఎన్నాళ్లు చేతులు కట్టుకుంటాం… అక్షరాల గులకరాళ్లు వొడిసెల్లో సంధించి/ గూట్లోని డేగరాజుపై గురిపెట్టకపోతే/ సప్త సముద్రాలు రక్త సముద్రాలౌవుతాయి!”అంటారు.

‘నడక మరిచిన నది’అన్న కవితలో “రేపటి సూర్యుడు చీకట్లోంచి కాదు/ పిడికిళ్లలోంచి పుట్టుకొస్తాడు” అంటారు. ‘హృదయంలేని వాళ్ళ కోసం’అన్న కవితలో “మనిషికి ఉనికి లేనప్పుడు దేవుడికి ఉనికి లేదని / అర్థం చేసుకోలేని దివాంధ జీవులు మీరు” అంటూ మానవత్వ మహిమను ఎరుక చేస్తారు.
శతజయంతి జరుపుకుంటున్న కవి పఠాభికి 100 పదాలను మల్లికల్లా మాలగాగూర్చిన కవితా మాలిక ‘వంద పదాల వందనం’ ఓ నూతన ప్రయోగం.

13 సంవత్సరాలుగా వర్తమాన పరిణామాలపై పాత్రికేయ వ్యాఖ్యానాల్ని, కవిత్వ ఉద్వేగాన్ని కలగలిపి సంపాదకీయ కవిత్వంగా రాస్తున్న తనను గుర్తించి… ఇది అరుదైన విషయంగా పెద్దలు, సాహితీవేత్తలు, సాహితీ మిత్రులు అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ రావటమే ఈ సంపాదకీయ కవిత్వం నేడు సంపుటిగా వెలువరించడానికి ప్రధాన కారణం అంటూ తనమాటగ ‘విశాల ఆనందం’అన్న శీర్షికన సుబ్బారావు వ్రాసుకున్నారు.
పి.ఎస్. బాబు చిత్రించిన అందమైన ముఖచిత్రంతో సింగారించుకుని వెలువడిన విశాలనయనం కవితా సంపుటి కలకాలం కావ్యజగత్తులో నిలిచిపోతుంది. సుబ్బారావు గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా శోభిస్తుంది.

పేజీలు: 126, వెల: 100/-
ప్రతులకు: ఈతకోట సుబ్బారావు, రచయిత (94405 29785)

ఆత్మకూరు రామకృష్ణ

1 thought on “సంపాద‘కవి’త్వ సంపుటి

  1. ఈతకోట సుబ్బారావు గారి గురించి బాగా తెలియచేసారు కళాసాగర్ గారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap