ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా …
తెలుగు ప్రచురణ రంగంలో సుదీర్ఘ చరిత్ర కల్గిన ‘ఎమెస్కో ‘ సంస్థ గురించి ఎమ్.ఎన్.రావు గారి అమ్మాయి రాజశ్రీ గారు రాసిన వ్యాసం అక్షరయాత్ర(2014) పుస్తకం నుండి….
రావుగారు మరణించి 27 సంవత్సరాలయినా ఆయన చిరస్మరణీయుడుగా ఎందుకున్నారంటే పుస్తక – ప్రచురణలో విస్తరణలో ఆయన చేపట్టని ప్రక్రియలేదు. అభినందించని వ్యక్తులు లేరు. కొలవని లోతులు లేవు. ఇవన్నీ ఒకెత్తయిన ఆయన ఫాలో అయిన విన్.విన్ ఫిలాసఫీ ఇంకొక ఎత్తు. ఆ ఫిలాసఫీ ఏమిటంటే నేను నెగ్గుతాను. విజయం పొందుతాను. నువ్వు నెగ్గుతావు. నువ్వు విజయం పొందు. ఆయన ప్రచురణ కర్తలనందరినీ కలుసుకొని ఈ ప్రచురణరబ్గం మన అందరిదీ కలసి చేసుకుందాం అనేవారు. నువ్వూ లాభం పొందు నేనూ లాభం పొందుతారు. ఆలోచన లోంచి వచ్చినదే ఇంటింటి స్వంత గ్రంథాలయమనే ప్రణాళిక.
ఇంటింట సరస్వతీ పీఠం నెలకొలిపి స్వామీ గ్రంథానందగా పాత్రని సృష్టించి బాపుగారి చేత బొమ్మలు వేయించి ఆయన చేతిలో పుస్తకం పెట్టి ఆయన చేత పుస్తకాలకు బూజు పట్టేను మనసా, పుస్తకాలే వదలగొట్టేను మనసా అనే స్లోగన్ ఆంధ్రదేశమంతాటా, ఇంకా తెలుగు చదివే ఇతర దేశదేశాలు వెళ్ళేలాగ ‘చదవాలి, కొని చదవాలి, కొని తెచ్చి చదవాలి, దాచుకొని మరీ మరీ చదవాలి’ అన్న భావాన్ని అందరిలో వేళ్ళూనూలా చేశారు. ఆ పుస్తకాలు తాను ప్రచురించినవే కానక్కర్లేదు. ఎవరు వేసినవయినా సరే కావాలి.
దానితోపాటు పుస్తక ప్రపంచమనే పత్రికా కూడా పంపించేవారు. ఆ పుస్తక ప్రపంచం కోసం అందరూ ఎదురు చూసేవారు. అందులో పాఠకులకు చిన్న కథలూ, సమస్యాపూరణలు ఇలా ఎన్నో రకాలుండేవి. అందులో ముఖ్యమైనది బకాయి అసురుడివధ. మామూలుగా చందా కట్టేస్తాం. నెలకు పది రూపాయలు కడ్తే మొదటి నెల కట్టగానే ఒక పుస్తకం వచ్చేది. ఎవరైనా తరువాతి నెల బద్దకించి మానివేసినా నష్టం ఉండేది కాదు. చివర వరకు కట్టినవారికి నూట యాభయి రూపాయల పుస్తకాలు ప్లస్ పోస్టేజి ఉచితం. ప్లస్ ఉచిత పుస్తకాలు ప్లస్ పుస్తక ప్రపంచం లభించేవి. ఇలా మానకుండా చందా కట్టమని సుతారంగా చెప్పేదే బకాయాసుర కథ. ప్రతినెల చందా కట్టడానికి బాధపడితే ‘ ఆ చందా కేం లెద్దురూ ‘ అనేవాడు బకాయాసురుడు. అలా కాదని ఇంతలో స్వామీ గ్రంథానంద ప్రత్యక్షమై ఆ బకాయాసురుడికి బుద్ధి చెప్పి పంపించేలా చేసేవారు. అలా సుతిమెత్తగా పాఠకులకు గుర్తు చేస్తూండేవారు. ఇలా హెచ్.ఎల్.బి. ఆయన సాధించిన ఒక విజయమయితే, ఎమెస్కో పాకెట్ బుక్స్ అనేది ఇంకొక ఘన విజయం.
ఎమెస్కో ఎక్కడ నుంచో రాలేదు. ఎమ్. శేషాచలం అండ్ కంపెనీని కుదిస్తే వచ్చింది. ఆది ఎలా వచ్చిందంటే ఆయనకు ఐస్బెర్గ్ అనే విదేశీ స్నేహితుడుండేవాడు. ఆయన “హిందీలో పాకెట్ పుస్తకాలు ఇవ్వగాలేనిది, తెలుగులో ఎందుకివ్వలేరు. మీకు పాఠకుల కొరతా? ప్రచురణకర్తలకు కొరతా? ఎందుకు మీరిది ఆలోచించటం లేదు?” అని అడిగారు. అప్పటికే రావుగారి పెద్దమ్మాయి పుస్తకాలలో మునిగితేలుతూ ఉండటం చూసి రావుగార్కి కూడా పుస్తకాలు వేద్దాం అని ఆలోచన కల్గింది. ఆ ఆలోచన రావటమే తరువాయి ఆచరణలో పెట్టటం ఆయనకి కష్టం కాదు అన్నట్టు మొదలెట్టారు. కాని దీనికి ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. కేవలం రెండు రూపాయలకి పుస్తకాలా? అదీ నాలుగు పుస్తకాలా? రెండు వందల పేజీలలో మాత్రమేనా? మీకు పేరున్న రచయితలెవరైనాపుస్తకాలు ఇస్తారా? ఒక్కసారి నాలుగు రచయితలను నిర్వహించుకురావటం మాటలా? అని రకరకాల విమర్శలు, తూటాలు,విమర్శకవాక్యాలు ఎదురుకొనవలసి వచ్చింది. వారందరికీ చిరునవ్వేరావుగారి సమాధానం.
నాలుగు పుస్తకాలు మొదటి విడత వేశాం. అవి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారివీ, కొమ్మూరి వేణుగోపాల రావువీ, అప్పటికే పుస్తక ప్రపంచంలో పెద్దపీట వేసుకు కూర్చున్న పేరున్న రచయితలవి వేశారు. అయ్యో అన్న నోటితోనే ఔరా అనిపించుకొన్నారు. ఇంకా మధ్యలో ముద్రాపకులు సమయానికి అందివ్వక, పోస్టు ఆఫీసులో కొన్ని సమస్యలున్నా కూడా వాటిని దాటుకొని సమయానికి అందించేసరికి సంచలనం కల్గించినట్లయింది.
మా నాన్నగారు ఓ విషయం ఎప్పుడూ చెబూండేవారు. ఒక విజయుడయిన వ్యాపారవేత్తని ఎవరో అడిగారట. నువ్వింత విజయం ఎలా సాధించావు అని ఏముందీ మంచి అవకాశం వచ్చినపుడు గెంతి అందిపుచ్చుకోవడమే. అది మంచి అవకాశమని ఎలా తెలుస్తుందీ అని అవతల ఆయన అడిగారట. అందుకే అవకాశాల కోసం అలా గెంతుతూ పోవాలి అన్నాడట వ్యాపారవేత్త. అలా మా నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. అన్నీ విజయవంతమయ్యాయి. ఎమెస్కోయే ఒక ప్రయోగశాల. అందులో రకరకాల ప్రయోగాలు. ఒక నెల అన్నీ కవితలే. ఒక నెల అన్నీ నాటకాలు. ఒకనెల ఒకే రచయితవి వేశారు. మాతీచందూర్ వి వేశారు. ఒక నెల విద్యార్థులవి, మూడు విశ్వవిద్యాలయంలో ఉండే -విద్యార్ధులకి కథల పోటీ పెట్టి బహుమతులిప్పించి, బహుమతులొచ్చిన కథల పుస్తకాలు ప్రచురించేవారు. అట్లా ఎమెస్కో వారు నా పుస్తకం స్వీకరించారని రచయితలు చెప్పుకొనే స్థితికి వచ్చారు. నాలుగు పుస్తకాలా అని ఆశ్చర్యపడిన స్థాయి నుండి, నాలుగేనా అని అడిగే స్థాయికి వచ్చారు. కొంతమంది రచయితలని సుతిమెత్తగా తిరస్కరించవలసి వచేది. రాయల్టీ – పారితోషికం – అందించటమే కాక, వారి పుస్తకాలు ఇవ్వడమే కాక, ఇతర రచయితల పుస్తకాలను కూడా వారికి అందించేవారు. అప్పటినుండి ఆ రచయితలవి ఇంటింట గ్రంథాలయ సభ్యులుగా చేర్చుకున్నట్లయింది. అంత రాచమర్యాదలుగా కనబడటం వల్ల అందరూ ఇష్టపడేవారు.
ప్రజల వద్దకు పాలనలాగ, ప్రజల వద్దకు పుస్తకాలు వెళ్తేనే వాళ్ళకి తెలుస్తాయని, తనంతట తను పుస్తక ఉత్సవాలు నిర్వహించేవారు. విజయవాడ పుస్తక మహోత్సవ వేదికకు మా నాన్న పేరు పెట్టారు. ఎంతో ఆనందం కల్గింది. ఆయన ఎన్నో పుస్తక మహోత్సవాలు పెట్టారు. అందరి ప్రచురణ కర్తలను కూడగట్టుకొని జాతీయ ప్రదర్శనలలో తెలుగు ప్రదర్శన శిబిరం తప్పక ఉండాలని ఏర్పాటు చేయించారు. ఫ్రాంక్ ఫర్డ్ లో ప్రదర్శనలో మొదటిసారిగా తెలుగు స్టాలు పెడితే తెలుగువారెవరో వచ్చి తెలుగు పుస్తకం కావాలని అడిగారు. ఆ రోజుల్లో పుస్తకం ఖరీదు రెండు రూపాయలు. తెలుగువారు తెలుగు పుస్తకం వచ్చి అడిగారు కదా, అదే చాలు అని ఉచితంగా ఇచ్చారు.
అలా దక్షిణాదినే కాదు, మొత్తం భారతదేశ ప్రచురణకర్తల సమాఖ్యకే ఆయన అధ్యక్షుడిగా చేశారు. అది రెండుసార్లు ముత్తం పన్నెండు సంవత్సరాలు. ఇలాటి సమాఖ్యకు రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అప్పటికి మా నాన్నే ముదటివారు. ఈ అనుభవాలతో పుస్తక ప్రచురణ ఎలా అనే గ్రంథం రచించారు. పుస్తకం ప్రచురణ రంగానికి జనమాలు దిద్దించిన పుస్తకంగా ఆంగ్ల దేశంలో పేరు తెచ్చుకొంది. అక్కడికి పిలిచి సన్మానించారు. ముఖ్యంగా ఆయన అందులో చెప్పినదేమిటంటే ప్రచురణ కర్త కేవలం డబ్బు కోసమే పనిచేయడు. అతను సాంఘిక బాధ్యత కూడా సంవర్చుతాడు అని. అలా వ్రాయడమే కాదు. ఆయన తను ఆ పాత్రని తూచ పాటించి, ఎమెస్కో వచన రామాయణం, బొమ్మల రామాయణం, ఎమెస్కో సాంప్రదాయ సాహితి, సంస్కృతి అంతర్జాతీయ సంస్థ పేరిట, బాపు రమణులతో కలసి ప్రత్యేక బొమ్మలతో విదేశాలలోని మన తెలుగు వారి కోసం తయారు చేశారు.
ఆయన పేరు మద్దూరి నరసింహారావు. పేరులో ఉగ్రరూపం తోచే పేరు కాని ఆయనకి ఉగ్రరూపం ధరించగా మమెవరమూ చూడలేదు. మాతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవారు. మా నలురు పిల్లలనూ సమానంగా చూశారు. అక్షరమ్ ఆయన శ్వాస. పుస్తకాలే ఆయన తరగని ఆస్తి రచయితలు ఆత్మబంధువులు, తోటి ప్రచురణ కర్తలే ఆయన శ్రేయోభిలాషులు అలా ఆయన బ్రతికారు. ఒక పుస్తక ప్రదర్శనలో ఆయన మరణించారు.
-ఎమ్. రాజశ్రీ
మంచి వ్యాసం అందించారు
ఎమెస్కో పబ్లిషర్స్ వారి గురించిన విషయాలు పుస్తక విస్తరణకు, తెలుగుపాఠకలోకానికి చేసిన సే వ గురించి వారి అమ్మాయి రాజశ్రీ గారుఎంతో బాగా వివరించారు. కృతజ్ఞతలు. 64కళలు కామ్ ద్వారా ఇలాంటి ఉపయుక్తమైన విషయాలు ప్రచురిస్తున్న మీకు ధన్యవాదములు –బొమ్మన్ ఏలూరు.
ఎమెస్కో బుక్స్ ..ఇంటింటి దీపాలు గా వెలిగిన రోజుల్లో నేనూ చదువుకున్నా ..ఆ చదువరి తనం వ్యసనం ..అయిందని తెలుసుకున్నా