హస్తకళలకు కరోనా కాటు

లాక్ డౌన్ కారణంగా  ఏటికొప్పాక కళాకారులు విలవిల …

ఏటికొప్పాక హస్త కళకారులది వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలనూ కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరవైంది. ఆకలి కేకలు మిగిలాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వీరికి ఇలా కష్టాలు వస్తాయని ఎప్పుడు ఊహించలేదు. అనుకోని ఈ దుస్థితి వీరి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది.

లక్కబొమ్మల పేరు చెప్పగానే వెంటనే ఏటికొప్పాక గ్రామం గుర్తుకొస్తుంది. ఈ కళ వల్లే గ్రామానికి ప్రపంచ చిత్రపటంలో ఓ స్థానం లభించింది. పూర్వం నుంచి 400 కుటుంబాలు ఈ కళపై ఆధారపడి జీవించేవి. క్రమేపీ ఈ సంఖ్య 200కి తగ్గిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు
బొమ్మల తయారీ ద్వారా సగటున రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తారు. వీటిలో కొన్ని స్థానిక దుకాణాలకు విక్రయించగా ఎక్కువ శాతం ఎగుమతులు చేస్తారు. మన రాష్ట్రంతో పాటు పలు దేశాలకు జరిగే ఈ వ్యాపార లావాదేవీలు ప్రతీ నెలా రూ. లక్షల్లో ఉండేవి. కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లి ముడిసరుకు తెచ్చుకునే పరిస్థితులు లేవు. ఉన్న సామగ్రితో బొమ్మలు తయారు చేసినా గ్రామాల్లోని దుకాణదారులు కొనుగోలు చేయడం లేదు. గ్రామానికి పర్యాటకులు వచ్చే అవకాశం లేకపోవడం, బొమ్మల దుకాణాలు తెరవకపోవడం వల్ల స్థానికంగా వీటి అమ్మకాలు నిలిచిపోయాయి.

పదివేలిచ్చి ఆదుకోండి : నిత్యం రంగురంగుల బొమ్మల తయారీతో కళకళలాడుతూ కనిపించే కళాకారుల కాలనీ బోసిపోయి కనిపిస్తోంది. మోటార్ల చప్పుడు లేదు. బొమ్మల కళ లేదు. ఇప్పుడు పనుల్లేక యంత్రాలు తుప్పు పడుతున్నాయి. స్థానిక మహిళలు బొమ్మల తయారీ నేర్చుకుని రోజువారీ కూలి చేసుకునే వారు. వారు కూడా ఉపాధి కోల్పోయారు. ఉన్నది వండుకుని తినడం. లేకుంటే పస్తులుండటం మినహా మరో మార్గం లేదు. 55 రోజులుగా ఇదే పరిస్థితి. లాక్ డౌన్ ముగిసేవరకూ ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించాలని వీరు కోరుతున్నారు.
ఇతరులపైనా ప్రభావం: గ్రామంలో కళాకారులు తయారు చేసిన బొమ్మలను కొంతమంది మహిళలు కొనుగోలు చేసి హైదరాబాద్ గల్లీల్లో తిరిగి అమ్ముకుని ఉపాధి పొందుతుండేవారు. ఇలాంటి వారు 400 మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం వీరూ ఉపాధి కోల్పోయారు. అంకుడు కర్ర విక్రయించేవారు, లక్క వ్యాపారం చేసేవారు.. ఇలా ఇతరులపైనా ఈ ప్రభావం పడింది. లాక్ డౌన్ ఎత్తివేసినా వెంటనే

వీరందరి పరిస్థితి మెరుగవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే వీరు తయారు చేసే బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి, షో కేసుల్లో పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కరోనా దెబ్బకు వివిధ రంగాల ప్రజల జీవనోపాధి దెబ్బతింది. చేతిలో డబ్బులేకపోతే ఇక బొమ్మలు కొనేది ఎవరని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి విదేశీ బొమ్మలను నిషేధించాలని కోరుతున్నారు.

చైనా బొమ్మలు : చైనా బొమ్మలు కొనడం మానండి.. లక్కబొమ్మలు కొనండి.. మా కళను బతికించండి. ఈ కష్ట కాలంలో ప్రజలు మాకు సహకరించకపోతే హస్తకళ అంతరించిపోయే ప్రమాదం ఉంది. చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. అనుకోని కష్టం వచ్చింది. అధికారులు మా గ్రామంలో పర్యటించి మా కష్టాలు చూడాలి. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాల్సిన సమయమిది.
– బంగారు వెంకటరత్నం, హస్తకళారులు

అప్పు కూడా ఇవ్వడం లేదు: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ అప్పులు కూడా ఇవ్వడం లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లు గడవని కుటుంబాలు చాలా ఉన్నాయి. కరోనా కారణంగా ఈ కళ అంతరించిపోకుండా చూడాలి. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆదుకోవాలి. ప్లాస్టిక్ బొమ్మల వాడకాన్ని నిలిపివేసి మేము తయారు చేసిన బొమ్మలు కొనాలి. దీనిపై ఆధారపడిన కళాకారులకు ప్రత్యేక ప్యాకేజీ అందచేయాలని కోరుతున్నారు.

– టి.శ్రీను, కళాకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap