అందమైన అనుభవాల సమాహారం…

నివురు కప్పిన నిప్పు ఎక్కువ కాలం దాని వెలుగును కప్పిపుచ్చుకోలేదు. గాలి సోకిన మరుక్షణం ఆ నివురు చెదిరి మరలా సహజమైన దాని వెలుగును విరజిమ్ముతూనే వుంటుంది. అందుకే నిజానికి నిప్పుతో పోలిక పెట్టారు మనపెద్దలు. జీవితంలో కొన్నికలయికలు ఒక్కోసారి భవిష్యత్ లో మరిన్ని కలయికలకు దారితీస్తూ వుంటాయి. అది ఆ వేళా విశేషం. అలాగే సత్యాన్ని మరుగుపరిచిన సంఘటనలు గాని స్థాయికి మించి ఒక వ్యక్తి లేదా సంస్థలు జరిగించే కొన్ని మంచి కార్యాలు భవిష్యత్తులో ఒక్కోసారి చాలా వింతగా ఆశర్య కరంగ మనకు కనిపిస్తాయి. వివరాలలోకి వెళ్తే …..

అది 24-12-2007 సోమవారం :
విశాఖ జిల్లా నర్సీపట్నంలో అడపా చిత్ర కళాపరిషత్ నిర్వహిస్తున్న పదమూడవ రాష్ట్రస్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు పోటీలకు చర్లలో వున్న నా మిత్రులు బీరశ్రీనివాస్, ముత్యాల రావు, నేను ముగ్గురం ఒక్కొక్కరు రెండింటి చొప్పున మొత్తం ఆరు చిత్రాలను పంపించడం జరిగింది .ఒకానొక రోజున ఆ సంస్థ నిర్వాహకులు పోటీ పలితాలు తెలియజేస్తూ 24-12-2007 న తాము నిర్వహించబోయే ప్రదర్శనకు రావాల్సిందిగా ఆహ్వానం పంపడంతో ముగ్గురం నర్సీపట్నం వెళ్ళాలనుకున్నాం. ఇందులో మిత్రుడు బీర శ్రీనివాస్ చిత్రం మూడవ బహుమతి గెల్చుకుంది. ముత్యాలరావు మరియు నాయొక్క చిత్రాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి గాని బహుమతి గెల్చుకోలేదు, అయినప్పటికి ముందుగా అనుకున్న విదంగా ప్రధర్శనరోజు నర్సీపట్నం చిత్ర ప్రదర్శనకువెళ్ళాలనుకున్న మా ముగ్గురిలో ముత్యాలరావు ఆఖరి నిముషంలో ఆగిపోవడంతో నేను నామరో మిత్రుడు బీర శ్రీనివాస్ ఇద్దరం కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం.

Charla Bus station

ముందు రోజు అనగా 23-12-2007 నాటి సాయంకాలం ఖమ్మం జిల్లా చర్ల నుండి బయలుదేరి భద్రాచలం వచ్చి అక్కడ నర్సీపట్నంమీదుగా వెళ్ళే వైజాగ్ బస్ ఎక్కాం. చర్ల నుండి భద్రాచలనికి 55 కిలోమీటర్ల దూరం. ఆతర్వాత మరలా బద్రాచలం నుండి నర్సీపట్నం మద్య దాదాపు 271 కిలోమీటర్ల దూరం. పూర్తిగా ఘాట్ రోడ్ లో దట్టమైన అటవీ ప్రాంతంగుండా బస్ వెల్తూవుంటే స్వచ్చమయిన ఆ పచ్చటి ప్రకృతి వొడిలో అక్కడక్కడా మనకు కనిపించే అందమైన ఆవాసాలతో కూడిన చిన్న చిన్న గిరిజన పల్లెలు చాలా ఆహ్లాదాన్ని కలిగించడమే గాకా సముద్రమట్టానికి అల్లంత ఎత్తులో అనేక వంకీలు తిరుగుతూ ఒకపరి ఎగువకు మరొకపరి దిగువకు వున్న ఆ ఎత్తైన ఘాట్ రోడ్ మలుపులను సర్రున దాటుకుంటూ సాగుతున్న బస్ ప్రయాణం ఒక్కోసారి చాల బయం గొల్పుతుంది కూడా.

Ghat Road

271 కిలోమీటర్ల ఆ ఘాట్ రోడ్ దారిలో దాదాపు నలబై చిన్న చిన్న వూర్లు కనబడినా ప్రదానంగా చెప్పుకోదగిన బస్ ఆగే ప్రదేశాలు మాత్రం ఓ ఐదారుంటాయి . అవి ఏటపాక, నెల్లిపాక , చింతూరు, డొంకరాయి, సీలేరు, చింతపల్లి (మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోలీసు స్టేషన్ పై దాడి చేసి ఆంగ్లేయుల ఆయుధాలను కొల్లగొట్టింది ఈ చింతపల్లి పోలీసుస్టేషన్ లోనే ) ఆతర్వాత వచ్చే పెద్ద వూరే నర్సీపట్నం. భద్రాచలంలో సాయంత్రం ఆరున్నర గంటలకు బయలు దేరిన బస్ రాత్రి ఎనిమిది ఆ ప్రాంతంలో అనుకుంటాను చింతూరు లో ఆగింది బోజనాలు చేసే నిమిత్తం. మేమిరువురం దిగి ముందుగానే శ్రీనివాస్ గారి శ్రీమతి యువశ్రీ గారు పార్సెల్ చేసి పెట్టిన పులిహోర పొట్లాలు విప్పుకుని మా డిన్నర్ పూర్తి చేసాము. ఆలాగే బస్లోని ప్రయాణీకులంతా కూడా అక్కడ తాటాకు పాకలో వున్న హోటల్లో బోజనాలు ముగించిన అనంతరం మరలా బస్సు నడక ప్రారంభమయ్యింది.కొంత దూరం వెళ్ళాక మధ్యలో అడవి మరింత దట్టంగా మారింది. కిటికీ ఓపెన్ చేసి చూస్తే దట్టమైన ఆ అటవీ వృక్షాల నుండి ఒక్క వుదుటున వచ్చి పడిన ఆ హేమంతపు చలిగాలికి ఒళ్ళు జల్లుమంది. లోపలి నుండి ఒకసారి పరికించి చూస్తే అది డొంకరాయి, సీలేరు ఏరియా అని తెలిసింది . ఆ తర్వాత చలిగాలితో నిండిన ఆ చీకటిరాత్రి లో మేము ఏమి గమనించే ప్రయత్నం చేయలేదు. కారణం ఆ ఆచిమ్మ చీకటిలో బస్ కిటికీ తెరచీ చుట్టూ వున్నా పరిసరాలను తిలకించే ప్రయత్నం చేసినా దట్టమైన ఆ కీకారణ్న్యం నందలి చెట్ల నుండి వచ్చే ఆ చలిగాలికి వంట్లో వణుకు తప్ప కంటికి కనిపించేదేమీ లేదు . అందుకే వెంటనే కిటికి మూసీ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాం. అలా సాగిన మా బస్ వేకువ జామున సుమారు మూడుగంటలకనుకుంటాను నర్సీపట్నంలో ఆగడంతో మేము దిగాము.

నర్సీ పట్నం చిత్రకళా పోటీలకు రావడం నాకిదే ప్రధమం. మిత్రుడు శ్రీనివాస్ కి మాత్రం త రెండేల్లుగా ఇక్కడ పోటీలకు చిత్రాలు పంపిన అనుభవం వుంది . అందుకే బస్ దిగిన వెంటనే మిత్రుడు శ్రీనివాస్ ఆ ప్రదర్శన నిర్వాహకులలో ఒకరికి ఫోన్ చేసారు . ఆయన పేరు బాబి మాస్టర్ అని నాకు బాగా గుర్తుంది . అప్పటికి ఆయన అడపా చిత్రకళాపరిషత్ కి కార్యదర్శిగా వున్నారనుకుంటాను. వారికి పోన్ చేసిన వెంటనే అంత చలికాలపు రాత్రి సమయము లో కూడా ఆయన వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని దూరం నుండి వచ్చే మాలాంటి వారికోసం కోసం ముందుగానే వారు బుక్ చేసిన లాడ్జి కి తీసుకెళ్ళి మమ్మల్ని రూంలో దించి వారు వెళ్లడం జరిగింది. ఒక చిత్రకళా ప్రదర్శన నిర్వాకులు అంత చలికాలపు రాత్రి సమయంలో కూడా స్పందించి మా పట్ల ఇంత శ్రద్ధ చూపడం నిజంగానే మాకు ఎంతో ఆనందమయ్యింది. కాసేపు ఆ ఘాట్ రోడ్ లోని జర్నీ విషయాలు. చిత్రకారుల పట్ల ఇక్కడ నిర్వాహకుల యొక్క శ్రద్దాసక్తుల గురించి మాట్లాడుకుని నిద్రపోయి మరల ఉదయం లేచాము. వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదికాలు ముగించుకున్న తదుపరి ఇద్దరం సిద్దమయ్యి నర్సీ పట్నం టౌన్ లోకి ఎంటరయ్యాము. కాంటీన్లో టిఫిన్ చేసేందుకు వెళ్లేసరికి అక్కడ న్యూస్ పేపర్లలో ఆరోజు జరుగుతున్న చిత్రప్రదర్శన గురించి “సృజనకు నిలువుటద్దం “అబ్బురపరుస్తున్న చిత్రకళ “అన్న పేరుతో ఈనాడు విశాఖపట్నం ఎడిషన్ లో పెద్ద ఆర్టికల్ రావడం, దానిలో నా “మేన్ అండ్ ది టైం” అన్న చిత్రం ఆరోజు అవార్డ్ గెలుపొందిన చిత్రాలన్నింటికంటే కూడా బాగ పెద్ద సైజులో ప్రింట్ కావడం నిజంగా నాకే గాక నా మిత్రునికి కూడా ఆశ్చర్యం ఆనందం కలిగాయి.

ఉదయకాలపు అల్పాహారం తిని తేనీరు సేవించడం అయిన తర్వాత చిత్రప్రదర్శన జరిగే హాల్లోకి ప్రవేశించాము. ప్రదర్శనకు వచ్చిన ఒక్కో చిత్రాన్ని చూసుకుంటూ వెళ్తున్నాం . ఒక్కో చిత్రానిది ఒక్కో మాధ్యమం, ఒక్కో శైలి ,కొందరు జల వర్ణాల్లో, కొందరు ఎక్రలిక్ వర్ణాల్లో ఇంకొందరు తైల వర్ణాల్లో మరికొందరు రంగులేమీ వుపయోగించకుండా వివిధ రంగురంగు కాగితపు ముక్కలను అతికించి రూపొంచిన కొలేజ్ వర్క్ చిత్రాలు ఇంకా పేస్టల్ వర్క్ చిత్రాలు . చిత్రీకర ణలో కూడా కొందరు రియలిస్టిక్ మరికొందరు సర్రిరయలిస్తిక్ ఇంకొందరు ఆబ్స్త్రాక్ట్ శైలుల్లో మరియు విషయంలో కూడా బిన్న విభిన్న అంశాలతో కొందరు పురాణ సంభంద మైనవి కొందరు చారిత్రక ఇంకొందరు ఆధ్యాత్మిక మరికొందరు సాంకేతిక బావాలు , రూప చిత్రాలు భావ చిత్రాలు, గ్రామీణ నేపధ్య చిత్రాలు మరి కొందరు సందేశాత్మక చిత్రాలు ఇలా భిన్న విభిన్న శైలుల్లో వేసిన చిత్రాల్లో కొన్ని కాపీ చిత్రాలు కూడా కనిపించాయి . ఒక్కొక్కటి చూసుకుంటూ గమనిస్తూ వెళ్తున్నాం . అలా వెళ్తున్న మేము ఒక చిత్రం దగ్గర చాలా సేపు నిలబడిపోయాం. కారణం ఆ చిత్రం మమ్మలని అంతలా కట్టిపడేసింది . మమ్మల్నే కాదు మాతో పాటు ఆ ప్రదర్శనకు వచ్చిన చాలామందిని ఎక్కువసేపు తన వద్ద నిలబడి తిలకించేలా చేసుకున్న చిత్రాలు ఓ ఆయిదారు వున్నాయి. వీటిల్లో అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షించిన చిత్రం శైశవ గణపతి అన్న చిత్రం .విషయం కంటే ఆచిత్రంలో ఆ చిత్రకారుడు చిత్రించే నైపుణ్యం అందర్ని కట్టిపడేసేలా చేసింది . అల్లసాని పెద్దన మనుచరిత్రంలో ఒక అంకము జేరి శైలి తనయాస్తావ దుగ్ధం “అన్న పద్యానికి ఆయన చిత్రం వేసారు. అర్ధనారీస్వరంలోని పార్వతీ దేవి వద్ద పాలు తాగుతున్న బాల వినాయకుడిని అత్యంత హృద్యంగా అద్భుతంగా చిత్రించారు. జల వర్నాలనుపయోగించి ఆ చిత్రకారుడు వాష్ టెక్నిక్ లో అంత ప్రకాశ మానంగా ఆ చిత్రంలో రంగులు వేయడం ఒక ఎత్తయితే, కలంతో మాత్రమే సాధ్యమయ్యే అతి సన్నని నాజూకు రేఖలను రంగులో ముంచిన కుంచెతో ఎక్కడా తేడా రాకుండా ఏక మందంతో చిత్రంలో గీయడం ఎలా సాధ్యమయ్యిందని ఓకటే సందేహం చాలామందిలో. చిత్రకారుడి పేరుని గమనిస్తే మంచెం అని ఇంటిపేరు మాత్రమే వుంది . అతనికోసం గాలించాము గాని మాకు తారసపడలేదు. ఆ తర్వాత వికృతివోడిలో “ అన్న పేరుతో స్థానిక నర్సీపట్టణానికే చెందిన ఒక చిత్రకారుడు వేసిన చిత్రం కనిపించింది.

ప్రకృతి అంతా కరువుతో నిండిపోయిన తరుణంలో రెండు పక్షులు తిండి లేక తమ గుడ్లనే పొడుచుకుని తింటున్న ఒక దయనీయ దృశ్యాన్ని తైల వర్ణాల్లో చాలా అద్భుతంగా వేసాడు. చాలా ఆలోచనాత్మకమైనదై ప్రత్యేకంగా వుండిన ఈ చిత్రం కూడా ఎక్కువమందిని ఆకట్టుకుంది. ఇక గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ నామిత్రుడు బీర శ్రీనివాస్ హార్వేస్టర్ పేరుతో నీటి రంగుల్లో వేసిన చిత్రం నర్సీ పట్టణానికే చెందిన మరో చిత్రకారుడు కన్నబాబు డివైన్ మెలోడి పేరుతో వేసిన మరో చిత్రం ఇంకా తణుకు నుండి వచ్చిన వెంపటాపు అనే చిత్రకారుడు రాజమండ్రి నుండి వచ్చిన తారా నగేష్, పి.ఎస్. ఆచారి లాంటి నాకు తెలిసిన కొందరి చిత్రకారుల చిత్రాలతో బాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన మరికొందరి చిత్రాలు ఆ ప్రదర్శనలో ప్రేక్షకుల మనసులు దోచుకునే విదంగా వున్నప్పటికీ అన్నింటి కంటే ఎక్కువగా మంచెం గారు వేసిన అర్ధనారీస్వరుడి లోని పార్వతినుండి పాలుతాగుతన్న శైసవ గణపతి చిత్రం మరియూ వికృతి వొడిలో అన్న చిత్రాలు అత్యదికంగా బాగా వీక్షకులను ఆకర్షిస్తున్నాయి . మేము అన్ని చూసిన తర్వాత ఆరెండు చిత్రాలను రచించిన చిత్రకారులకోసం అడుగుతున్న తరుణంలో మొదట వికృతి వొడిలో వేసిన చిత్రకారుడు గమనించి తానే ఆ చిత్రం వేసానని రోజురోజుకూ చిద్రమౌతున్న ప్రకృతి గురించి తో ఆలోచనతో వేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన ఆర్టిసి డిపార్ట్మెంట్ నందు పని చేస్తున్నట్టుగా చెప్పిన గుర్తు . అద్భుతమైన చిత్ర రచన చేసిన అతనిని మేము హృదయపూర్వకంగా అభినందించాము.

మధ్యాహ్నం బోజనాలనంతరమనుకుంటాను మరల మేము ప్రధర్శన హాల్ లోకి వెళ్లి చిత్రాలను తిలకిస్తున్న మమ్మల్ని చూసి ఒక సన్నగా పొడవుగా టక్ చేసి హుందాగా వున్న ఒక కొత్త వ్యక్తి మమ్మల్ని పలకరించి చాల సౌమ్యంగా ఎక్కడనుండి నుండి అని మాగురించి అడిగారు. మేము మా వివరాలు చెప్పిన తర్వాత మా ముగ్గురిలో ముత్యాలరావు బీర శ్రీనివాస్ ల చిత్రాలు చూసి చాలా మెచ్చుకుని అభినందించారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వేసి పంపిన నా రెండు చిత్రాలు చూసి ఐడియాలు బాగున్నాయి కాని ఇంకా టైం తీసుకుని వర్క్ చేయాలని సలహా ఇచ్చారు. ఉదయం పూట ఏ చిత్రం గురించి మాతో బాటు అక్కడ వీక్షకులంతా ఎక్కువగా చర్చించుకున్నామో నాటి పోటీలో ప్రధమ బహుమతి వచ్చిన ఆశైశవ గణపతి చిత్రాన్ని వేసింది ఆయనే . ఆయనే మంచెం సుబ్రహ్మన్యేశ్వర రావుగారు. అప్పటికే ఆయన శ్రీకాకుళం జిల్లా రణస్థలం నందు ఆంధ్రాబాంక్ కి సంభందించిన రైతు సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని తెలిసి మాకు మరింత గౌరవం ఏర్పడింది. ఆయనే ఈ చిత్రాన్ని రచించింది అని తెలిసిన వెంటనే వారికి హృదయపూర్వక అభినందనలు నందనలు తెలియజేశాము .

ఆ సాయంత్రం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది .ముఖ్య అతిధులుగా వచ్చిన అక్కడ స్థానిక రాజకీయ నాయకులు నాటి అటవీ శాఖా మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తదితరులు ప్రసంగిస్తూ అడపా చిత్రకళా పరిషద్ గొప్పతనం గురించి తెలియజేస్తుంటే ఒక కమ్మర్శియల్ ఆర్తిస్ట్ గా పనిచేస్తున్నఒక అడపా రాజు అనే ఒక యువ చిత్రకారుడు ఒక నాడు ప్రముఖ శిల్పి అయిన తన తండ్రి స్మారకార్ధం స్థానిక ఔత్సాహికుల సహకారంతో ఇంతటి మహత్కార్యాన్నీ ఇన్నేళ్ళుగా చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా తోచింది..

ఈ ప్రసంగాల సమయంలోనే మరలా నూతనంగా పరిచయం అయిన మంచెం గారితో నేను మిత్రుడు బీరశ్రీనివాస్ కలిసి దాదాపు ఒక గంట సేపు అలా నిలబడే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం వేదికపై ప్రసంగాలు అయిననంతరం బహుమతి ప్రధానోత్సవం లో ప్రధమ బహుమతిగా మంచెం గారు అందుకున్న మూడు వేల రూపాయల నగదు బహుమతిని వారు కమ్మర్శియల్ ఆర్టిస్ట్స్ట్ లచేత ఎంతో చక్క గా నడపబడుతున్న ఆ సంస్థకే తిరిగి ఇచ్చేయ్యడం నిజంగా ఎంతో గొప్పగా అనిపించింది. తర్వాత సెకండ్ ప్రైజ్ అనంతరం మూడవ బహుమతిని నా మిత్రుడు బీర శ్రీనివాస్ అందుకున్నారు. నేను మంచెం గారు మిత్రునికి అభినందనలు తెలియజేశాము.

ఈ పోటీలలో ఒక ప్రత్యేక అంశం ప్రదర్శన రోజునాడే వీక్షకులచే వోటింగ్ ద్వారా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఒక చిత్రాన్ని ఎంపికచేయడం. అలా ఎక్కువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి వీక్షకుల ఆదరణ పొందిన చిత్రంగా నర్సీపట్నం ఆర్టిస్ట్ వేసిన “వికృతి వొడిలో” అన్న చిత్రానికి ఊహించినట్టుగానే వచ్చింది. నాకు ప్రైజ్ రాలేదు గాని ప్రదర్శనా బహుమతిగా జ్ఞాపికను అందించారు. చాలా సంతోషమయ్యింది . రాత్రి వేడుక అయ్యేసరికి బాగా లేట్ అవ్వడంతో ఆ రాత్రికి కూడా మేము వారు బుక్ చేసిన లాడ్జ్ రూము లోనే వుండి పోయీ ఉదయం మా ఆరు చిత్రాలను తీసుకుని మరల భద్రాచలం బయలుదేరాము. మొన్నరాత్రి వేళ నర్సీపట్నం వెళ్ళేటప్పుడు ఆ కటిక చీకటిలో మిస్ అయ్యిన ఆ అడవి అందాలను నేటి పగటిపూట హేమంతకాలపు మబ్బులమధ్య ఆహ్లాదకరంగా సాగిన ప్రయాణంలో బాగా వీక్షించి ఆనందించగలిగాము.

మనిషి జీవన యానంలో జరిగిన ఒక్కో కలయిక భవిష్యత్తు లో మరిన్ని కలయికలకు ఒక్కోసారి దారితీస్తుంది అని చెప్పిన విదంగా ఆ ప్రదర్శన అయిన అనంతరం నేను చిత్రకళా రచయితగా రాష్ట్రంలోని వివిధ చిత్రకారులను ప్రత్యక్షంగా కలిసి ఆర్టికల్స్ రాసే క్రమంలో నేను, మంచెం గారు బీర శ్రీనివాస్ తో బాటు నా మరో చిత్రకార మిత్రులు రాజా రాంబాబు, అన్వేష్ కూడా ఒక భావజాలంతో కూడిన ఆత్మీయ మిత్రులుగా మారాం ప్రఖ్యాత చిత్రకారులయిన కొండపల్లి శేషగిరిరావు గారి గురించి నేను ఆర్టికల్ రాయడంలో బాగంగా మేమంతా ఒకరోజు శేషగిరిరావు గారిని హైదరాబాదు నందు వారి ఇంట్లో కలిసి అజరామమైన వారి ఒరిజినల్ చిత్రాలు చూడడం మాకు ఒక గొప్ప అనుభూతి. ఆతర్వాత చిత్రమయి స్టేట్ ఆర్ట్ గాలరీలో జరిగిన మంచెం గారి చిత్ర ప్రదర్శనకు చర్ల నుండి మేము వెళ్లి వీక్షించడమే గాక అక్కడ నుండి మరలా మేము మంచెం గారి కారులోనే మెదక్ జిల్లా సిద్ధిపేట కూడా వెల్లి ప్రఖ్యాత జానపద చిత్ర కారులు కాపురాజయ్య గారిని కలిసి ఇంటర్వ్యూ చేసి సిద్ధిపేటలోని వారి చిత్ర ప్రదర్శన శాల లలితకళా కేంద్రాన్ని కూడా దర్శించి రాజయ్య గారి చిత్రాలు వీక్షించడం మరో గొప్ప అనుభూతి. ఇంకా మంచెం గారి చిత్ర ప్రదర్శన ప్రఖ్యాత దామెర్లరామారావు ఆర్ట్ గేలరీ రాజమండ్రి లో జరిగిన సందర్భం, గువ్వలకెనడీ దంపతుల గురించి అర్టికల్ రాసే సమయంలో నేను మంచెం గారు ఇలా ఎన్నోమా కలయికలు పలు విలువైన సందర్భాలుగా మారాయి.

Artists with Kondapalli Sheshagirirao

నేను 64కళలు.కం లో 2010 నుండి రెగ్యులర్గా ఆర్టికల్స్ రాయడంలో బాగంగా రాష్ట్రంలో వివిధ చిత్రకారులను స్వయంగా కలవడం ఒక ఎత్తయితే చిత్రకళా సాహిత్యాన్ని చదవడం మరో ఎత్తు. ఈ క్రమంలోనే నాకు ఒక గ్రంధంలో కనిపించిన ఒక అద్భుతమైన చిత్రం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఆ చిత్రమే నాటి అడపా చిత్రకళా పరిషద్ పోటీలలో అత్యధిక వీక్షకుల ఆదరణ పొందిన చిత్రంగా బహుమతి పొందింది. అయితే ఇక్కడ చిత్రకారుడు పేరు నాడు తన మది నుండి వచ్చిన ఆలోచనతో సృష్టించిన చిత్రంగా మాకు ఆ చెప్పిన చిత్రకారుడిది కాదు. పోలెండ్ దేశానికి చెందిన గొప్ప సర్రియలిస్ట్ చిత్రకారుడు రాఫెల్ ఆల్ బిన్ స్కి (RAFAL ALBINSKI) పేరు ఆ చిత్రం పై వుంది. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి కారణమైంది. అంటే ఆల్ బిన్ స్కి చిత్రాన్ని ఆయన కాపీ చేశాడన్నమాట. నిజం నిప్పులాంటిది.

Adapa Art Academy

ఎప్పుడో ఒకప్పుడు అది బయట పడక తప్పదు. అయితే అది కాపీ చిత్రమే అయినప్పటికి దానిని ఒరిజినల్ లా చిత్రించడంలో నాడు ఆ చిత్రకారుడు చూపిన ప్రతిభ చాలా గొప్పదనే చెప్పాలి. కనుకనే దానిని రెగ్యులర్ పోటీలో గాకుండా నిర్వాహకులు కేవలం ప్రేక్షకాధారణ చెందిన చిత్రం విభాగంలో మాత్రమే పెట్టారనుకుంటాను.

అడపా చిత్రకళా పరిషద్ తర్వాత నేను వ్యక్తిగతంగా చాల పరిషద్ పోటీలలో వ్యక్తిగాతంగానూ మరియు పైన పేర్కొన్న నా మిత్రులతో కూడా కలిసి కొన్ని పోటీలలో పాల్గొని అక్కడకు వెళ్ళిన సంధర్భాలు వున్నాయి. అయితే రాజోలు చిత్రకళా పరిషద్ లో మరలా అలాంటి మంచి ఆదరణను నేను చూడడం జరిగింది. అక్కడ కూడా దూరం నుండి వచ్చిన చిత్రకారులకు లాడ్జ్ రూమ్స్ బుక్ చేయడమేగాక ఆ రోజు ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులందరికి మధ్యాహ్నం బోజనాల నిమిత్తం ఏవో బయట బోజనశాలలకు వెళ్ళనవసరం లేకుండా ఆ సంస్థ వాళ్ళే ప్రత్యేకంగా వంటలు చేయించి చిత్రకారులంతా ఒకేసారి కలిసి భోజనం చేసేలా ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం.

నేడు అడపా చిత్రకళా పరిషత్ మనుగడలో లేదు. కాని అది చేసిన కళా సేవ ఆశ్చర్యకరమైన చరిత్రలా కనిపిస్తుంది. కారణం అది ఒక సాధారణ కమ్మర్శియల్ ఆర్టిస్ట్ గా పనిచెసే అడపా రాజు అనే ఒక 21 ఏళ్ళ యువకుడికి దివంగత శిల్పి అయిన తన తండ్రి అడపా అప్పారావు గారి స్మారకార్ధం ప్రతియేటా రాష్ట్రస్థాయి చిత్ర కళా పోటీలు నిర్వహించాలనే కళాత్మకమైన ఆలోచన రావడమే ఒక గొప్ప విషయమైతే, దానిని తన మిత్రులు మరియు చిత్ర కళాభిలాషులయి న GSRS కుమార్ (బాబిమాస్టర్) సువర్ణ మెడికల్ శ్యాం, ఇంకా తోటి కమ్మర్శియల్ ఆర్టిస్టులు కన్నబాబు, శ్రీనివాస రావు, ఎం.విం. రావు, మహేష్ లాంటి సాధారణ వ్యక్తులతో ఒక చిత్రకళా సంస్థను స్థాపించడం, దాన్ని స్థానిక పట్టణ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించి పరిపూర్ణమైన కళా దృష్టితో పదమూడేల్లపాటు సమర్ధ వంతంగా ఇంతటి మహత్కార్యాన్ని వాళ్ళు నిర్వహించారు అంటే తెలిసిన వాళ్లకెవరికైనా ఆశ్చర్యం కలిగించకుండా ఎలా వుంటుంది.? . ఇటీవలనే మంచెం గారి నుండి ఆ నాడు విపరీతమైన ఆ చలి రాత్రి సమయంలో కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుని మాకు ఆతిధ్యం కల్పించిన బాబి మాస్టర్ ఫోన్ నంబర్ తీసుకుని వారితో మాట్లాడిన తర్వాత నాకు ఈ విషయాలన్ని తెలిసాయి. మరికొంత సమాచారం కోసం ఈ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపకుడైన అడపా రాజు గారితో మాట్లాడితే మరిన్ని విషయాలు తెలియజేశారు.ప్రముఖ శిల్పి అయిన తన తండ్రి అడపా అప్పారావు గారి స్మారకార్ధం 1995 లో అడపా చిత్రకళా పరిషత్ ను ప్రారంబించడం జరిగిందని అప్పటికి తన వయసు 21 ఏళ్లని చెప్పినప్పుడు నాకు మరింత ఆశ్చర్యం కలిగింది.

ఒక కళా సంస్థను ఏర్పాటు చేయడం అన్నది ఒక ఎత్తైతే దానిని అన్నేల్లు విజయవంతంగా నడిపి ఎందరికో మధుర స్మృతుల్ని అందించడం మరో ఎత్తు .ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈ కార్య నిర్వాహణకు ఔత్సాహిక స్థానిక ప్రముకులతో బాటు అక్కడ రాజకీయ ప్రముఖులైన సి. హెచ్. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడుల సహకారం వుండేదని, కాలక్రమేనా చిత్రకారులు తమ చిత్రాలు పంపే వారి సంఖ్య తగ్గిపోవడంతో ఈ చిత్రకళా పోటీల నిర్వాహన నిలిపివేశామని ఆ కార్యక్రమ వ్యవస్థాపకుడైన అడపా రాజు తెలియజేయడం జరిగింది.

చివరిగా ఒక బలమైన సంకల్పం స్థిరమైన చిత్తశుద్ధి గనుక మనసులో వుంటే అది ఎంతటి అసాధ్యమైనదైనా సుసాధ్యం చేయవచ్చు అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ అడపా చిత్రకళా పరిషత్ నిర్వాహణ. అయితే అందుకు నిజాయితిగా కష్టపడే తత్వం తో పాటు చుట్టూ వున్న సమాజంతో సత్సంభందాలు కలిగి అందరిని మెప్పించి ఒప్పించగల నేర్పు వుండాలి . అలాంటి బలమైన నమ్మకాన్ని, నిజాయితీని, విశ్వాసాన్ని సభ్యుల్లో చూసినప్పుడే సమాజం నుండి కూడ తగిన ప్రోత్సాహం లబిస్తుంది. అడపా చిత్రకళా పరిషద్ సభ్యులు పేరుకి కమ్మర్శియాల్ ఆర్టిస్టులే అయినా కమ్మర్శియాల్ గా గాకుండా కళాత్మక దృష్టితో వారు చేసిన సమిష్టి కృషి వల్లనే సమాజం నుండి అంతటి ప్రోత్సాహం అందుకున్నారు. తద్వారా నర్సీపట్టణ చరిత్ర గ్రందానికి వన్నె తెచ్చే కళాత్మకతమైన కొన్ని అందమైన పేజీలను అందించింది అడపా చిత్ర కళా పరిషత్. అందుకు అడపా చిత్రకళా పరిషత్ నిర్వాహకులు నిజంగా ఎంతో అభినందనీయులు. అయితే అందమైన ఈ చరిత్ర కేవలం చరిత్రలోనే మిగిలిపోకుండా వర్తమానం లో కూడా కొనసాగితే నిజంగా ఎంతబాగుంటుందో కదా….!

–వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

2 thoughts on “అందమైన అనుభవాల సమాహారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap