నాన్న పాపల ముచ్చట్లు… అమరింది కావ్యమై!

ఇంటిల్లిపాదినీ తమ అల్లరితో ముంచెత్తే నవజాత శిశువుల సమక్షాన్ని మనం ఆనందిస్తూ అన్యాపదేశంగా గంటలు, దినాలు ఇట్టే గడిపేస్తాం. నెలలు, సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. కాని, ఈ కవి మాత్రం ప్రతి క్షణాన్నీ ఆశ్వాదించారు. అలా ఆశ్వాదించిన అనుభూతుల్ని సృజనమయం చేసుకున్నారు. పసి హృదయాల ముదిమి పలుకులను అక్షరబద్ధం చేసారు. రసాస్వాదకులైన పాఠకుల కొరకు మూటగట్టారు.
అవధానుల మణిబాబు కవిగా పిల్లల్నే కాదు, పిల్లలపై సాహిత్యకారులు గతంలో వెలువరించిన సాహిత్యాన్నంతటినీ తరచి చూశారని వారి ముందు మాటల ద్వారా తెలియవస్తుంది. “పసి మనసును పదిల పరుచుకున్న పెద్దలందరికీ ఈ పుస్తకాన్ని అంకితమిస్తూన్నా”న్న అవధానుల మణిబాబు పలికిన తొలిపలుకుకు… పుటవెంబడి పుటను తిరగేస్తూ 64 పేజీల పుస్తకాన్ని శాంతం చిటెకలో చదివేలా చేయటమేకాక, దైనందిన జీవితపు ఆరాటంలో తలమునకలైయ్యే పెద్దోళ్ళ వసివాడిన హృదయాలను చిగురులెత్తేలా చేస్తుందీ చిరు కావ్యం.

తన పాపతోపాటుగా తన చుట్టూ తిరగాడే మరో అరడజను పిల్లలు… వారి పేర్లతోను, పలుకులతోను కవితలల్లి సంబరపడే సృజనకారుల ప్రేరణ, ప్రోత్సహాలతో ఈ పుస్తకం అమరినట్లు కవి చెప్పుకుంటారు. వెరసి బాల్యాన్ని గుర్తు చేసుకునే వ్యక్తులు, కనిపెంచే తల్లిదండ్రులు, పిల్లల పిల్లల్ని చూసి మురిసే అవ్వతాతల భావానురాగాలు ఓ దొంతరగా అమరినట్లు ఈ పుస్తకం చదివాక మనకూ అనిపిస్తుంది.
‘నిన్న భోగి, నేడు తెల్లారితే రేపు పెద్ద పండుగ…’ ఇలా ఎలా మారిందో కవి ఇంట… పాప చేష్టలు ఇలా ఎలా మార్చాయో! తెలుసుకోవాలంటే ‘పెద్ద పండుగ’అన్న కవిత చదవి తీరాలి. కవి తన పాపతో పొందిన అనుభవాలను, అనుభూతులను, సృజనాత్మకంగా కవిత్వీకరించి మన చేతుల్లో ఉంచిన సుందర కావ్యం ‘నాన్న… పాప… ’

“ప్రతి పిల్లవాడు పుట్టుకతో కళాకారుడు” అన్న పికాసో సూక్తి ఈ కవితాసంపుటిలోని ఏ ఒక్క కవిత చదివినా స్ఫష్టం అవుతుంది. చిన్నారి పాప నోటవొలికిన ముత్యాలను 58 కవితా సరాలుగా కట్టి, ఊహాతీతమైన చిగురు భావాలకు కవితాగౌరవాన్ని అద్ది, స్వీయ జీవితాన్ని కవితామయం చేసుకున్న కవి నిజానుభవ కావ్యం ‘నాన్న… పాప…’. అనుభవైక్యసారంగం పాడుకుంది. పిల్లల మనసంత స్వచ్ఛమైన మనసు ఉంటేతప్ప పిల్లల మాటల్లో దాగిన మర్మాన్ని పట్టుకోలేము. కాలం విలువైందనే సూక్తిని ప్రతిఒక్కరూ ఎరిగిందే! పుట్టిన బిడ్డ బాల్యంలో జారుతున్న కాలాన్ని, పాఠకుని పఠనా సమయాన్ని ఎంతో విలువైనదిగా గ్రహించిన మణిబాబు కవిగా ఈ కావ్యాన్ని రూపొందించారన్నది నా అవగాహన.
కవిలోని సృజనకు, సూక్ష్మతకు అద్దం ఈ నాలుగు మాటలు పరికించండి… “పాపాయి బుగ్గ చిదిమి / వేళ్ళని ముద్దాడాను / అరే! బుగ్గ అక్కడే ఉంటే / నా వేళ్ళు అంత ముద్దొస్తున్నాయేం?”

ఈ కవితలను చదివేందుకు క్షణమే సమయం, ఆస్వాదన ఫలం మన మనసుకు చుట్టిపట్టిన అనుభూతి కలకాలం అలా ఉండిపోతుంది.
చిత్ర కవితలు ఇందులో మచ్చుకి “పాప దీపం వెలిగించింది / ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడమంటే / ఈ రోజు కొత్తగా అర్థమైంది”
ఓ రోజు తండ్రితోపాటు పాప స్కూలుకెళుతూ మార్గమధ్యంలో గణేషుని నిమజ్జనంలో పాలుపంచుకున్నది. ఇక్కడ జరిగిన సన్నివేసము, పాప మాటల చతురపు పలుకులు గమనించండి… “గోదారి ఒడ్డున ఆడుకుంటుంటే “చాలా సేపయింది, ఇక చాలు పద” అన్నాను. / బ్యాగ్ తగిలించుకుంటూ పాపంది / “పుస్తకాలూ దేవుడే కదా నాన్నా, / నిమజ్జనం చేసేద్దామా?” అని.
ఈ సంపుటిలో మూడు చిరు వాక్యాలతో అల్లిన కవితలున్నాయి అనుకుంటే, రెండు వాక్యాలతోనూ అల్లిన కవితలున్నాయి.
“గేదెలన్నీ రోడ్లు పాడు చేస్తున్నాయ్. / వీటికి డైపర్లు వెయ్యరా నాన్నా! అంది పాప”.
ఏక వాక్యంతో కూడా ప్రయత్నించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఈ కవితా సంపుటిలో నాన్న భావాలు పాప పలుకులతో పోటీ పడతాయి. మచ్చుకకు… “తొమ్మిది నెలలు మోసిందని/ అమ్మను పొగుడుతాం గానీ,/ నాన్న బొజ్జపై పాప గడిపిన కాలమెంతని?”
పాపతో కుక్కాట ఆడిన తండ్రి పలుకులు చెబితే నమ్మరు … “వెధవ కుక్క బతుకు / ఎంత వేడుకగా ఉందో!”
“పాపాయి కదా /ఏం చేస్తుందనుకున్నాను… /చూశారా! ఓ పుస్తకమే రాయించేసింది.”

పాప అడగటం తండ్రి చెప్పటం అర్థం కాక పోయేందుకేముంటుంది. పోదుపుపై అవగాహన చూడండి… “పొదుపంటే ఏమిటి?” అడిగింది పాప / “దగ్గరున్నవి దాచుకుని / తరువాత వాడుకోవడం” అన్నాను. / రాత్రి భోజనాలపుడు … / “పులుసులో దుంప ముక్కల్ని వదిలేశావే?” అని అడిగితే / “అవి పెరుగన్నంలోకి పొదుపు చేస్తున్నా నాన్నా!” అంది.
పాపాయి మాటల్లోని సృజనను దక్కించుకున్న తండ్రి కవి ఘనుడు – మణిబాబు.

పాపను చూచినప్పుడల్లా … “తనలో పోలికలు దాచుకున్న వారందరికీ / పొద్దున్నే పొలమారేలా చేస్తుంది.” ఆనందమయ జీవితంలో అయినవారు గుర్తుకొచ్చినప్పుడు కవి మనసు పరిమళించిన వేళ మాత్రమే సృజించగలిగిన వాక్యాలివి.
“ఏదో కని, పెంచి ఉద్ధరించామనుకొంటాం గానీ / ఈ వేలాది ఆనందాలకు వెలకడితే / జమ చెయ్యడానికి జన్మలు చాలవేమో! ”
కవి డైరీలోని కొన్ని పేజీలను మన కొరకు ఏర్చికూర్చి, సంపుటీకరించినట్లు అనిపిస్తుంది.
“ఈ మధ్య ప్రతి సినిమా బావుందంటున్నరే!” అన్న శ్రీమతి ప్రశ్నకు జవాబుగా “రెండున్నర గంటలు పాప నా బడిలోనే ఉంటోందిగా” అంటారు కవి.

పిల్లలు ఎదిగేకొద్దీ విషయం సన్నగిల్లి పోతుందన్నది… భావ ప్రకటనకు తెలియని పొరలు కమ్ముతాయని మనలను మనం తరచి చూసుకున్నప్పుడు తెలిసివస్తుంది. పాపాయి బుడిబుడి అడుగులకు మల్లే చిట్టి చిట్టి పొట్టి కవితలు పేజీకంతటికీ ఒక్కటిగా… ఓ ప్రక్కగా… స్వల్పంగా… పుటనిండుగా కనిపంచాల్సిన అక్షరాలు తరిగి రెండు, మూడు, నాలుగు వాక్యాలలో… కనిపిస్తాయి బలంగానే!
ఓ రోజు గ్రౌండ్లో స్కేటింగ్ చేస్తున్న పిల్లలవైపు చూస్తూ తండ్రి పాపనడిగిన మాట- “మనమూ ఆ షూస్ కొనుక్కుందామా?” అని. పాప అంది “ఒద్దు నాన్నా, మనం రెక్కలు తెచ్చుకుందాం” ఎగురుతున్న పక్షుల గుంపును చూపిస్తూ.
ఇందలి కవితలు ప్రతి సామాన్య పాఠకునికి అర్థమయ్యేట్లు ఉన్నాయి. ఈనాటి కాలం తెలుగు చదవలేని తెలుగు మాట్లాడే తెగులు పిల్లలకు ఈ కవితలను చదివి వినిపించి వారిలోని సృజనాత్మకతను, కవితా పఠణంపై ఆసక్తిని, సూక్ష్మభావాలను అర్థం చేసుకునే తార్కిక శక్తిని పెంపొందించవచ్చు.

ఈ కవితలు ప్రతి ఇంట పాపాయితోటి గడపిన అలనాటి ముచ్చట్లను పెద్దలకు బాగా గుర్తుచేస్తాయి. నవ్వు మరిచిన జీవితాలకు సృజనాత్మక జీవినవిలువల్ని నేర్పుతాయి. అందని వాటి గురించి కాక అందుబాటులో ఉన్న వాటిని ఆస్వాదించటం నేర్పుతాయి.
ప్రతులకు కవి / రచయిత: అవధానుల మణిబాబు (99481 79437)

సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap