హాస్య పాండిత్య సినీ దార్శనికుడు… జంధ్యాల

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది…ఆస్వాదించేది ‘హాస్యం’. అందుకే పూర్వకాలం సినిమాల్లో హాస్య పాత్రలు కథలో భాగంగా ఇమిడిపోయేవి… వినోదాన్ని పంచేవి. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరే ఇతర చిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్ళుగా పురోగమించింది. ‘నవ్వటం ఒక యోగం…నవ్వించటం ఒక భోగం… నవ్వక పోవటం ఒక రోగం’ అంటూ జంధ్యాల హాస్యానికి స్వరూప నిరూపణ చేశారు. పెద్దకళ్ళేపల్లి ఊరులో తెలుగు వసంతోత్సవాలు జరిగే అన్నిరోజులూ ఆహూతులను తన హాస్యరస వర్షంలో ఓలలాలించేవాడు. తన వ్యంగ్య భాషణంతో హాస్యరసాన్ని జోడించి రసజ్ఞుల మది గెలుచుకునేవాడు. సినీ రచనలో ఒక భావుకుడిగా, హాస్య స్రష్టగా ప్రేక్షక హృదయాల్లో సముచిత స్థానం సంపాదించాడు. చార్టర్డ్ అకౌంటెంట్ గా స్థిరపడదామని అనుకున్న జంధ్యాలను తెలుగు సినీరంగం ఆహ్లాదకరమైన హాస్యసృష్టిగావించమని ఆహ్వానించింది. సకుటుంబంగా చూడదగ్గ సినిమాలను తీర్చిదిద్దమని ప్రేరేపించింది. అద్భుత సినీ రచయితగా, జయప్రదమైన దర్శకుడిగా జంధ్యాల అధిరోహించని సోపానాలు లేవు. ఇంటిపేరుతోనే ప్రశిద్దుడైన ఈ వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి 50 ఏళ్ళ వయసులోనే లింగైక్యం కావడం సినీప్రేక్షకుల దురదృష్టం. జూన్ 19 న జంధ్యాల వర్ధంతి సందర్భంగా ఆ హాస్యబ్రహ్మను తలచుకుంటూ ఆయన జీవిత విశేషాలను గుర్తుచేస్తాను.

ఆడిటర్ కాబోయి సినీమతల్లి ఒడి చేరి…

జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్’ రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన SRR ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు, వాటిలోని పాత్రల ఆహార్యం అంటే చాలా ఇష్టపడేవాడు. స్కూలు లోను, కాలేజీ లోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ఉత్తమ నటుడి బహుమతి లభించింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పత్రికలకు కథలు రాసి చిరు పారితోషికాలు కూడా అందుకున్న ఘనుడు జంధ్యాల. స్కూలు ఫైనల్ చదువుతుండగా ‘ఆత్మాహుతి’ అనే నాటకం రాశాడు. అదే జంధ్యాల తొలిరచన. రెండవ రచన ‘బహుకృత వేషం’. కానీ జంధ్యాల రాసిన ’ఏక్ దిన్ కా సుల్తాన్’ నాటిక బహుళ ప్రజాదరణ చూరగొంది. ఇతర భాషల్లోకి అనువదించబడి పదివేలకుపైగా ప్రదర్శనలకు, పదిహేనుసార్లు పునర్ముద్రణకు నోచుకుంది. తరవాత రాసిన ‘జీవనజ్యోతి’, ‘ఆత్మాహుతి’, ‘డాక్టర్ సదాశివం’, ‘మరీచిక’, ‘మండోదరి మహిళామండలి’, ‘ఓ చీకటి రాత్రి’, ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటికలు ప్రేక్షకుల హర్షద్వానాలను అందుకున్నాయి. పరిషత్తు ప్రదర్శనల్లో బహుమతులు కొల్లగొట్టాయి. జంధ్యాల రచించి ప్రదర్శించిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటక ప్రదర్శన చూసి గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రశంసిస్తూ, మద్రాసు కళాసాగర్ సంస్థ తరఫున ‘కలైవానర్ అరంగం’లో ప్రదర్శించే అవకాశాన్నికల్పించారు. ఆ నాటకానికి హాజరైన ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి తను తీయ తలపెట్టిన సినిమా రచనకు ఆహ్వానించారు. అయితే దురదృష్టం కొద్దీ బి.ఎన్.రెడ్డి చనిపోవడంతో నిరుత్సాహపడుతున్న జంధ్యాలను దర్శకుడు కె.విశ్వనాథ్ భుజంతట్టి నైతిక మద్దతు ప్రకటించారు. అలా 1976లో లక్ష్మి ఫిలిం ఆర్ట్స్ సంస్థ తరఫున హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి మాటలు సమకూర్చారు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి 1977లో నిర్మించిన ‘పెళ్లి కాని పెళ్లి’ జంధ్యాల మాటలు రాసిన రెండవ చిత్రం. నాటకాలు రాసిన అనుభవం, చిలకమర్తి, కందుకూరి, పానుగంటి, భమిడిపాటి వారు రచించిన హాస్యరచనలు చదవడం వలన అవి జంధ్యాల హాస్యం వైపు కాస్త మొగ్గుచూపేందుకు చాలా ఉపకరించాయి. అలాగే ఉడ్ హౌస్ రచనలు జంధ్యాలకు స్పూర్తిగా నిలిచాయి. కేవలం ఐదేళ్ళలోనే దాదాపు ఎనభై సినిమాలకు సంభాషణలు రాసి రికార్డు సృష్టించాడు జంధ్యాల. 1976లో చింతా రామకృష్ణారెడ్డి గీతాకృష్ణా కంబైన్స్ పతాకంమీద ‘సిరిసిరిమువ్వ’ చిత్రాన్ని నిర్మించినప్పుడు, దర్శకుడు కె. విశ్వనాథ్ జంధ్యాలకు సంభాషణలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. కుటుంబ పరమైన విలువలతో కూడిన మంచి సినిమాలకు రూపకల్పన కల్పించాలనే విషయాన్ని జంధ్యాల, విశ్వనాథ్ సినిమాల ద్వారా నేర్చుకున్నారు. ఆ సినిమాలో జంధ్యాలకు మాటల సరళికి వేటూరి సుందర రామమూర్తి పాటలు తోడయ్యాయి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రచయితగా జంధ్యాల స్థిరపడ్డారు. తరవాతికాలంలో వేటూరి పాటలు, జంధ్యాల మాటలు కలబోసిన బాక్సాఫీస్ హిట్ చిత్రాలెన్నో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ముందు చెప్పుకోవలసిన సినిమా 1977 ఎన్టిఆర్ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘అడవిరాముడు’. ఆ చిత్రానికి జంధ్యాల సంభాషణలు రాసి తిరుగులేని రచయితగా పేరుతెచ్చుకున్నాడు. 1978లో కృష్ణ సినిమా ‘బుర్రిపాలెం బుల్లోడు’ కి, 1979 లో ‘తాయారమ్మ బంగారయ్య’ హిట్ సినిమాలకు జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.

దశ, దిశ మార్చిన శంకరాభరణం సినిమా…

1979లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మాగ్నం-ఓపస్ ‘శంకరాభరణం’ చిత్రానికి జంధ్యాల రాసిన సంభాషణలు అద్భుతంగా అమరాయి. మాటల రచయితగా జంధ్యాల విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం ‘శంకరాభరణం’. అలతి పదాలతో అనంతార్ధాలు పంచిన సంభాషణలు ఆ సినిమాలో కోకొల్లలు. లోకేశ్వరునికి తప్ప లోకులకు భయపడనురా మాధవా” అంటూ సోమయాజులు అల్లు రామలింగయ్యతో చెప్పే మాట; “ఆచారవ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదీయటానికి కాదు తులసీ” అంటూ మంజుభార్గవి కి సోమయాజులుచేసే ఉద్బోధ; “నేను వయసులో వున్నప్పుడు మావూళ్లో మొగాళ్లెవరూ కాపురాలు చెయ్యలేదు ఆరోజుల్లో” అంటూ కూతురు మంజుభార్గవికి సానితనం లక్షణాలను నేర్పే ప్రయత్నం చేసే ఝాన్సి మాటలు; “దొరకునా ఇటువంటి సేవ” పాటకు ముందు సోమయాజులు చేత సంగీత కళను గురించి “పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయపు సంగీతజ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతిని అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో, వారికి శతసహస్ర వందనాలర్పిస్తున్నాను. శుష్కించి పోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుంకట్టిన ఆ మహామనీషికి శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ. అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి వున్నా సరే ఈ అమృతవాహిని ఇలా అనంతంగా ప్రవహిస్తూనే వుంటుంది. మనిషి నిలువెత్తు దానం సంపాదించినప్పటికీ…” అంటూ చెప్పించిన ఉపోద్ఘాత వాక్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఈ చిత్రం మేలుకొలుపు పాడింది. ప్రతి తెలుగువాడి గుండెలోతుల్లోకి ఈసినిమా వెళ్ళింది. అందుకు జంధ్యాల రాసిన పదునైన మాటలు బాగా సహకరించాయి. సర్వమనోరంజక చిత్రంగా ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ స్థాయిలో ‘స్వర్ణకమలం’ బహుమతి లభించింది. మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాంలు ఉత్తమ గాయకులుగా జాతీయ బహుమతులు గెలుచుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది బహుమతులు ఐదు, ఒక ఫిలింఫేర్ బహుమతి ఈ సినిమా గెలుచుకుంది. 1981లో నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘సప్తపది’ చిత్రానికి జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు. తరవాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘వేటగాడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘రౌడీరాముడు-కొంటెకృష్ణుడు’, ‘అమరదీపం’, ‘భలేకృష్ణుడు’, ‘ఆఖరిపోరాటం’ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రాలకు; విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’, ‘సీతామాలక్ష్మి’, ‘సాగరసంగమం’ ‘ఆపద్బాంధవుడు’, ‘స్వాతికిరణం’ చిత్రాలకు; సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సొమ్మొకడిది-సోకొకడిది’, ‘ఆదిత్య369’, కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’, ‘విజేత’ వంటి విజయవంతమైన చిత్రాలకు జంధ్యాల మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్య తొమ్మిది సంవత్సరాల కాలంలో జంధ్యాల అలా క్లాస్ ని మాస్ ని అలరించిన సుమారు రెండు వందల సినిమాలకు పైగా సంభాషణల రచయితగా పనిచేశారు. వాటిలో అధికశాతం సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నవే.

ముద్దమందారం తో దర్శకుడుగా ఎదిగి…

నిర్మాత కానూరి రంజిత్ కుమార్ 1981లో నటనాలయ సంస్థ పేరుతో నిర్మించ తలపెట్టిన ‘ముద్దమందారం’ సినిమా లో జంధ్యాలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని కలిపించారు. ఆ టీనేజి లవ్ స్టోరీకి జంధ్యాల తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యలు నిర్వహించారు. రచయితగా మంచి పేరుతెచ్చుకుంటున్న సమయంలో దర్శకత్వం ఎంచుకోవడం జోడెడ్ల మీద సవారి అని స్నేహితులు వారించారు. అయితే దర్శకత్వం మీద మమకారం వున్న జంధ్యాల ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. కొత్తవాళ్ళతో ప్రయోగానికి సిద్ధపడ్డారు. తను రాసిన ‘ఓ చీకటి రాత్రి’ నాటక ప్రదర్శన చూసి అందులో అద్భుత నటన ప్రదర్శించిన ప్రదీప్ కుమార్ ని హీరో గా తీసుకున్నారు. హీరోయిన్ గా మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన పూర్ణిమను ఎంపిక చేశారు. వైజాగ్ నావల్ యార్డులో పనిచేస్తున్న సుత్తి వేలును హాస్యనటుడిగా వెండితెరకు పరిచయం చేశారు జంధ్యాల. తన రంగస్థల గురువు విన్నకోట రామన్న పంతులు కి మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమాలో జంధ్యాల డబ్బింగ్ కూడా చెప్పడం విశేషం. అధికభాగం సినిమా విశాఖపట్నం లోనే తయారైంది. రమేష్ నాయుడు సంగీతం అద్భుతంగా అమరిన ఈ చిత్రం 11 సెప్టెంబరు న విడుదలై 25 కేంద్రాల్లో విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. అలా తొలి ప్రయత్నంలోనే జంధ్యాల దర్శకునిగా జయకేతనం ఎగురవేశాడు. నూతన నటవర్గంతో ప్రయోగాత్మకంగా లఘు బడ్జెట్ చిత్రాలు నిర్మించి మంచి ఫలితాలు రాబట్టిన దర్శకులలో జంధ్యాల పేరు ముందుంటుంది. రెండవ ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం 1982లో విడుదలైన ‘మల్లెపందిరి’. చల్లా వెంకట్రామయ్య నిర్మించిన ఈ చిత్రంలో విజ్జిబాబు ని హీరోగా పరిచయం చేశారు. ‘తూర్పువెళ్ళే రైలు’ ఫేమ్ జ్యోతి హీరోయిన్ గా నటించగా ‘షేక్ మోజెస్’ గా గాయకుడు బాలు, మరో పాత్రలో గేయ రచయిత వేటూరి అతిథి పాత్రలు పోషించారు.

నాలుగు స్తంబాలాటతో విజయ పరంపర…

‘మల్లెపందిరి’ వచ్చిన నెల రోజుల గ్యాప్ తో విడుదలైన జంధ్యాల చిత్రం ‘నాలుగు స్తంబాలాట’ సూపర్ హిట్ గా నిలిచింది. నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో రెండు జంటలుగా నరేష్-పూర్ణిమ, ప్రదీప్-తులసి నటించారు. నరేష్ కి హీరోగా ఇదే తొలి చిత్రం. ఇందులో వీరభద్రరావు, వేలు చేత “సుత్తి” అనే పదప్రయోగం చేయించి వారిని “సుత్తిజంట” గా పాపులర్ చేసిన ఘనత జంధ్యాలది. సినిమాలో వీరి కామెడీ ట్రాక్ ని రికార్డుగా విడుదల చేశారు. నరేష్ కు బాలు డబ్బింగ్ చెప్పారు. ఇ.వి.వి. సత్యనారాయణ ఈ చిత్రంతోనే జంధ్యాలవద్ద దర్శకత్వ శాఖలో చేరారు. ఈ సినిమా ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ఆడింది. హైదరాబాద్ దేవి థియేటర్లో 175రోజులు ఆడి శతదినోత్సవం జరుపుకున్న తొలిచిత్రం ఇదే. వరసగా మూడు ప్రేమకథా చిత్రాలను విజయవంతం చేసిన జంధ్యాల, నాలుగో ప్రయత్నంలో తన ట్రాక్ మార్చి ‘మతంకన్నా మానవత్వం మిన్న’ అనే సందేశమిచ్చే ‘నెలవంక’ (1983) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ద్వారా రాజేష్, కిరణ్ అనే ఇద్దరు నటులను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. రాజేష్ పాతతరం హీరో అమరనాథ్ కుమారుడు. ఇందులో పాటలన్నీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మతో రాయించడం విశేషం. శివుని జటాజూటంలోను, ముస్లింల జండాలోను ప్రధానంగా వుండేది నెలవంక. మతసామరస్య నేపథ్యం వున్న సినిమా కావడంతో సినిమాకు ‘నెలవంక’ అని పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం ఫ్లాపయింది. ‘రెండుజెళ్ళ సీత’ (1983) పేరుతో శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్ వారికి జంధ్యాల ఒక చిత్రం చేసిపెట్టారు. ఇందులో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ నలుగు కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్ నటి పుష్పలత కూతురు మహాలక్ష్మి ని హీరోయిన్ గా తొలిసారి పరిచయం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించాలని విజయశాంతి, భానుప్రియ, శోభన సెలక్షన్లకు వచ్చారు. కానీ అవకాశం రాలేదు. ఇందులో హాస్యనటిగా నటించిన శ్రీలక్ష్మి పాతతరం నాయకుడు అమరనాథ్ కూతురే. రమేష్ నాయుడు స్వరపరచిన “కొబ్బరినీళ్ళ జలకాలాడి” పాటలో “మాగాయే మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యా మహా సుందరి” అంటూ వేటూరి రాసిన మాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. సినిమా బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. 1983లో జంధ్యాల అక్కినేనితో ‘అమరజీవి’ అనే ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో తనకు ఇష్టమైన విప్రనారాయణ పాత్రతో ఒక ఘట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో కోట శ్రీనివాసరావుకు నటించే అవకాశాన్ని కల్పించారు జంధ్యాల. అయితే ఈ సినిమా విజయానికి దరిచేరలేదు. తరవాత చంద్రమోహన్-రాధిక జంటగా ‘మూడుముళ్ళు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనసులు కలిస్తే మూడుముళ్ళు మూడు ముడులవుతాయి, కలవని మనసుల మూడు ముళ్ళు మూడు ‘ముళ్ల’వుతాయి అనే నేపథ్యంలో సినిమా నడుస్తుంది. “లేత చలిగాలులు”, “నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో” వంటి మంచి పాటలతో సినిమా హిట్టయింది. ఈనాడు పత్రికాధినేత రామోజీరావు జంధ్యాల దర్శకత్వంలో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాన్ని నిర్మించారు. వారి సంస్థ వెలువరించే ‘చతుర’లో వచ్చిన పొత్తూరి విజయలక్ష్మి నవల ‘ప్రేమలేఖ’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్-పూర్ణిమ జంటగా నటించారు. రమేష్ నాయుడు అద్భుత సంగీతం అందించారు. “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు”, “లిపిలేని కంటిబాస” పాటలు అద్భుతాలే. ఈ చిత్రం ద్వారా విద్యాసాగర్, మెల్కోటే వెండితెరకు పరిచయమయ్యారు. సీరియస్నెస్ లేని ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. 1984 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందభైరవి’ చిత్రాన్ని మరో ‘శంకరాభరణం’ గా భావించవచ్చు. ఈ చిత్రంకోసం గిరీష్ కర్నాడ్ రెండు నెలలు శేషు మాస్టారివద్ద నాట్యం నేర్చుకున్నారు. గిరీష్ కర్నాడ్ కు బాలు డబ్బింగ్ చెప్పారు. చాలా విరామం తరవాత ఇందులో కాంచన నటించింది. ఆమె ఆఖరి చిత్రం కూడా ఇదే. జంధ్యాలలోని దర్శకత్వ ప్రతిభను ద్విగుణీకృతం చేసిన ఈ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసి శతదినోత్సవం జరుపుకుంది. నంది బహుమతితోబాటు అనేకసంస్థలు ఈ చిత్రానికి వివిధ బహుమతులను అందించాయి. రమేష్ నాయుడు స్వరపరచిన “కొలువైతివా రంగసాయి”, “పిలచిన మురళికి వలచిన మువ్వకి యెదలో ఒకటేరాగం” పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక క్లాసికల్ ఆధారిత సినిమాను కమర్షియల్ హిట్ చెయ్యడం ఒక్క జంధ్యాలకే సాధ్యమైంది. పరకాయప్రవేశ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో జంధ్యాల సినిమా ‘రావూగోపాల్రావూ’. 1985లో నరేష్-పూర్ణిమ జంటగా జంధ్యాల ‘పుత్తడిబొమ్మ’ నిర్మించారు. కార్టూనిస్టు జయదేవ్ సీరీస్ ‘బాబాయ్-అబ్బాయ్’ ఆధారంగా సుత్తి వీరభద్రరావు-బాలకృష్ణ లతో జంధ్యాల మరో చిత్రాన్ని సృష్టించారు. ఉషోదయా వారి సినిమాలో బాలకృష్ణకు ఇదే తొలిచిత్రం. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు వైజాగ్ ప్రసాద్ చేత కామెడీ పాత్రను పోషింపజేశారు. తరవాత ముద్దపప్పు కుర్రాడి ముద్దుముచ్చట తీర్చిన మరో జంధ్యాల చిత్రం ‘శ్రీవారి శోభనం’ లో నరేష్ కు జంటగా అనితారెడ్డి నటించింది. ఆ తరవాత భానుప్రియ-నరేష్ జంటగా జంధ్యాల దర్శకత్వం నిర్వహించిన చిత్రం ‘మొగుడూ-పెళ్ళాలూ’. ప్రముఖ నటి భానుమతి చేత ‘బామ్మగారి మనవరాలు’ చిత్రంలో బామ్మపాత్రలో నటింపజేసిన జంధ్యాల విజయవంతమయ్యారు. ఇక రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ లతో నిర్మించిన ఓ తమాషా ప్రేమకథ ‘రెండురెళ్ళు ఆరు’ చిత్రం బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. యువచిత్ర నిర్మాత మురారి జంధ్యాల దర్శకత్వంలో ‘సీతారామకల్యాణం’ (1988) చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా నిర్మించారు. ఈ చిత్రం 14కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. యాక్షన్ హీరోగా ముద్రపడిన చిరంజీవిని విభిన్న కోణంలో చూపిస్తూ ఆయనచేత చార్లీ చాప్లిన్ ను పోలిన హాస్యపాత్రను పోషింపజేసిన సినిమా ‘చంటబ్బాయ్’. మల్లాది సీరియల్ ని సినిమాగా తీసిన జంధ్యాల ఈ చిత్రంలోని టైటిల్స్ ని వ్యంగ్యచిత్రాల రూపంలో పొదిగారు.

Jandhyala with Allu

సప్తసముద్రాలు దాటిన జంధ్యాల…

‘ఆనందభైరవి’ సినిమా జైత్రయాత్ర సందర్భంగా ఆ చిత్ర యూనిట్ అమెరికాలో పర్యటించింది. అక్కడి ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వారితో ఒక సినిమా తీసేందుకు జంధ్యాల ప్లాన్ చేశారు. అదే ‘పడమటి సంధ్యారాగం’. ఆ యూనిట్ తో వెళ్లిన బాలుని సంగీతదర్శకుడుగా నియమించి ఆయనచేత “పిబరే రామరసం” పాటను పాడించి వాషింగ్టన్ లోని ఒమేగా స్టూడియోలో రికార్డు చేశారు జంధ్యాల. ఈ సినిమాని 45 రోజుల్లోనే అమెరికాలో షూట్ చేశారు. సినిమా గొప్పగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. తెలుగు తెరమీద హాస్యానికిమహారాజయోగం పట్టించిన జంధ్యాల సినిమా డి. రామానాయుడు నిర్మించిన ‘అహ నా పెళ్ళంట’. రెండు మనసుల కలయిక ప్రేమ అనే నిజాన్ని రుజువుచేయడానికి కోటీశ్వరుడైన తండ్రిని ఎదిరించి సాధారణ మనిషిగా తన లక్ష్యాన్ని సాధించిన యువకుని పాత్రలో రాజేంద్రప్రసాద్ అద్భుత హాస్యాన్ని పంచాడు. అతని తండ్రిగా నూతన్ ప్రసాద్ నటన గొప్పగా వుంటుంది. సిల్వర్ జూబిలీ చేసుకున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంలది గొప్ప కాంబినేషను. పిసినారి పాత్ర కావడంతో కోట చేత ముతక పంచె, బనియను, పగిలిన కళ్ళద్దాలు ధరింపజేశారు. బ్రహ్మానందం కెరీర్ ను మలుపుతిప్పిన వెర్రివెంగళప్ప లాంటి నత్తి ‘అరగుండు’ పాత్ర పేరుతోనే తరవాతి సినిమాల్లో టైటిల్స్ కార్డులమీద ‘అరగుండు బ్రహ్మానందం’ అని కనిపించేది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. భమిడిపాటి రాధాకృష్ణ కథను ‘చిన్నికృష్ణుడు’ పేరుతో విజయ సినీ క్రియేషన్స్ సంస్థ సినిమాగా నిర్మించింది. జంధ్యాల ఈ చిత్రాన్ని అమెరికాలో నిర్మించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ సంగీతం సమకూర్చగా, ఆశా భోస్లే బాలుతో కలిసి పాటలు పాడటం విశేషం. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ హీరోగా నటించగా ఖుష్బూ హీరోయిన్ గా నటింహింది. పాతతరం దర్శకుడు డి. యోగానంద్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేయడం మరో విశేషం. సినిమా చిత్రీకరణ అమెరికాలో జరిగింది. రాజేంద్రప్రసాద్ తో నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో బాలు పోలీసు ఇనస్పెక్టర్ గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ‘నీకు నాకు పెళ్ళంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హై హై నాయకా’, ’జయమ్ము నిశ్చయమ్మురా’, ‘లేడీస్ స్పెషల్’, ‘బావా బావా పన్నీరు’, ‘బాబాయ్ హోటల్’, ‘ప్రేమా జిందాబాద్’ వంటి జంధ్యాల సినిమాలు బాగా ఆడాయి. మొత్తంమీద జంధ్యాల 350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

మరికొన్ని విశేషాలు…

“హాస్యం ఉప్పువంటిది. అది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. సినిమాకూడా అలాంటిదే. ఆ పదార్ధాన్ని తగుపాళ్ళలో మేళవిస్తే సినిమా విజయవంతమౌతుంది” అని నమ్మిన వ్యక్తి జంధ్యాల. ఆయనకు చార్లీ చాప్లిన్ అంటే యెంతోఇష్టం. తన ఇంటి ముంగిట్లో కనిపించే మొదటి ఫోటో చార్లీ చాప్లిన్ దే. ఆరోజుల్లో జంధ్యాల అంటే నిర్మాతలకు కొంగుబంగారం! ఆయన దర్శకత్వం వహిస్తే సినిమా హిట్టవుతుందనే నమ్మకం!! జంధ్యాల అకాల మరణంతో కొన్ని సినిమాల నిర్మాణం ఆగిపోయింది. వాటిలో చలసాని గోపి (అడవి దొంగ ఫేమ్), కోగంటి హరికృష్ణ(అశోకచక్రవర్తి ఫేమ్), ఎస్. గోపాలరెడ్డి (మంగమ్మగారి మనవడు ఫేమ్), నవతా కృష్ణంరాజు (నాలుగు స్తంబాలాట ఫేమ్), రామానాయుడు చిత్రాలు కొన్ని మాత్రమే. అలా నిలిచిపోయిన సినిమాల జాబితా ఇరవైకి పైగానే వుంటుంది. దర్శకత్వం వహించేటప్పుడు జంధ్యాల మల్లెపూల లాంటి తెల్లటి షర్టు, ప్యాంటు వేసుకుని భుజంమీద తెల్లటి రుమాలు తో పూలరంగడిలా కనిపించేవారు. భార్య అన్నపూర్ణతో యెంతో సఖ్యతగా వుండేవారు. వారికి చాలాకాలానికి గాని సంతు కలుగలేదు. ముచ్చటగా కవల పిల్లలు పుట్టారు. వారికి సాహితి, సంపద అని పేర్లు పెట్టారు. వీరికి నాలుగేళ్ల వయసుండగా జంధ్యాల అకాల మరణం చెందారు. కాలేజీలో చదువుకునేటప్పుడే కారులో వెళ్ళేవాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు జంధ్యాలకు కాలేజి మేట్. అశ్వనీదత్, సుబ్బరాయశర్మ, కోనేరు రవీంద్రనాథ్, సుత్తి వీరభద్రరావు, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ అందరూ జంధ్యాలకు కాలేజి మేట్స్ కావడంతో అంతా తరచూ కలుసుకుంటూ వుండేవారు. స్నేహానికి ప్రతిరూపమైన జంధ్యాల 19 జూన్ 2001 న గుండె ఆగడంతో హైదరాబాదులో మరణించారు. అటు కమర్షియల్, ఇటు కళాత్మకమైన సినిమాలను తనదైన శైలిలో నిర్మించి కొత్త తరహా చిత్రాలకు నుడికారం చుట్టిన జంధ్యాలను ప్రేక్షక లోకం మరువదు కాక మరువదు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap