వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఎంతో తపోనిష్టతో రూపొందిన ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంలో ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ళ క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 1912లోనే “రాజా హరిచంద్ర” పురాణకథనే చిత్రాంశoగా ఎన్నుకున్నారు. ఫాల్కే నిర్మించిన తొలి చిత్రాలు “మోహినీ భస్మాసుర”, “సత్యవాన్ సావిత్రి” కూడా పౌరాణికాలే. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య కూడా తొలుత ‘భీష్మ ప్రతిజ్ఞ” అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు., 1932లో అర్దేషిర్ ఇరాని హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద”… అలాగే తమిళంలో 1931లో నిర్మించిన తొలి టాకీ ‘కాళిదాస్’ సినిమా కూడా పౌరాణికమే. ఆ పరంపరలోనే చిత్తజల్లు పుల్లయ్య “లవకుశ”, “సీతా కల్యాణం” వంటి సినిమాలనే తీశారు. ఈ సినిమాలకు ఆధారం ఆ మహత్తర గ్రంధాలే. అలనాడు బడిలో పిల్లలకు రామాయణ, భారత కథల్నే పాఠ్యాంశాలుగా చెప్పేవారు. అటువంటి సినిమాలకు ఊపిరులద్దిన అతికొద్ది దర్శకరత్నాలలో కమలాకర కామేశ్వరరావు ప్రథములు. అందుకే కమలాకరను చిత్రసీమ ‘పౌరాణిక చిత్రబ్రహ్మ” గా గుర్తించి ఆదరించింది. ఈ అద్భుత చలనచిత్ర నిర్దేశకుని వర్ధంతి సందర్భంగా కొన్నివిశేషాలు…
తెలుగు కమలం
చలనచిత్ర దిగ్దర్శకుడు కమలాకర కామేశ్వరరావుది పదహారణాల తెలుగుతనం వుట్టిపడే విగ్రహం. నెరసిన జుట్టు, గ్లాస్గో పంచె, తెల్లని మల్లెపూల వంటి జుబ్బా, నుదుట కాసంత కుంకుమ బొట్టు… ఇదీ అతని ఆహార్యం. ఆయన 1937లో చిత్రపరిశ్రమలో చేరిననాటినుంచీ అదే వస్త్రధారణ. 1911 అక్టోబరు నాలుగున మచిలీపట్నంలో జన్మించిన కామేశ్వరరావు బి.ఎ. పట్టభద్రుడు. మొదటినుంచీ సినిమాలంటే కమలాకరకు ప్రాణం. పుస్తకాలు బాగా చదివేవారు. సినిమాలను చూసి వాటిమీద సమీక్షలు రాస్తుండేవారు. ఆరోజుల్లో “కృష్ణాపత్రిక” కు చాలా మంచి పేరుండేది. ఆ పత్రికలో కమలాకర సినీ సమీక్షలు అచ్చవుతూ వుండేవి. కథా సంవిధానం ఎలావుంది, సాంకేతిక విలువలు ఎలావున్నాయి అనే విషయాలమీద చలనచిత్ర సమీక్షలు రాస్తుండేవారు. ఆరోజుల్లో కొత్త సినిమాలన్నీ నాటి బెజవాడలో విడుదలవుతూ వుండేవి. ఒక్క తెలుగు సినిమా సమీక్షలే కాదు, బెజవాడలో విడుదలయ్యే సినిమాలనన్నిటినీ ఆయన శ్రద్ధగా, నిశితంగా చూసేవారు. సమీక్షకు అర్హమైనవాటిని గుర్తించి కృష్ణా పత్రికకు రాస్తూ వుండేవారు. ఆ సమీక్షలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా వుండేవి. మట్నూరి కృష్ణారావు కమలాకర సమీక్షలను చాలా మెచ్చుకొనేవారు. 1931లో నోబెల్ బహుమతి గ్రహీత పెరల్ బక్ రాసిన “గుడ్ ఎర్త్” నవలను 1937లో సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో ఇర్వింగ్ టాల్ బర్గ్ సినిమాగా నిర్మించాడు. ఇందులో పాల్ ముని, లూసీ రైనర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఐదు ఆస్కార్ బహుమతులకు గట్టి పోటీ ఇచ్చి ఆస్కార్ ను గెలుచుకుంది. ఈ సినిమా గురించి కమలాకర వరసగా నాలుగు వారాలు సమీక్షలు రాశారు. నిశిత దృష్టితో రాసిన ఆ సమీక్షలు పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆరోజుల్లో బెజవాడ సరస్వతీ టాకీస్ వారు సి.యస్.ఆర్, కన్నాంబ నటించగా హెచ్.వి. బాబు దర్శకత్వంలో “ద్రౌపదీ వస్త్రాపహరణము” సినిమాను నిర్మిస్తే, లక్ష్మిఫిలిమ్స్ వారు జగన్నాథ స్వామి దర్శకత్వంలో బళ్ళారిరాఘవ, బందా కనకలింగేశ్వరరావు, కమలాబాయి నటించిన “ద్రౌపది మాన సంరక్షణము” సినిమాను సమాంతరంగా నిర్మించారు. ఇరవైరోజుల తేడాలో ఈరెండు సినిమాలు 1936 మార్చినెలలో విడుదలయ్యాయి. ఈ సినిమాలమీద కూడా కమలాకర సమీక్షలు వరసగా నాలుగు వారాలు కృష్ణా పత్రికలో వచ్చాయి. ఆ సినీ సమీక్షలే దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మం దృష్టిని ఆకర్షించాయి. “ద్రౌపదీ వస్త్రాపహరణం” సినిమా ఆర్ధికంగా విజయవంతమై, రెండవ సినిమా పరాజయం పాలయింది. కానీ కమలాకర రెండవ సినిమానే బాగుందని రాశారు.
మద్రాసులో కామేశ్వరం
కమలాకర సమీక్షలకు ఆకర్షితుడైన రోహిణీ అధిపతి హెచ్.యం.రెడ్డి “కనకతార” సినిమా తర్వాత తలపెట్టిన “గృహలక్ష్మి” సినిమాలో కమలాకరకు పనిచేసే అవకాశం కలిపించారు. అప్పుడే కమలాకర మద్రాసులో అడుగు పెట్టారు. రోహిణీ వాళ్లకు ఒక లాడ్జి వుండేది. అందరితోపాటు కమలాకరరావుకు కూడా అక్కడేబస ఏర్పాటైంది. అక్కడే బి.యన్.రెడ్డి, కె.వి. రెడ్డి, రామనాథ్, శేఖర్, సముద్రాల వంటి పెద్దలతో పరిచయాలు పెరిగి అనుభవం సంతరించుకున్నారు. కె.వి. రెడ్డి అప్పుడు రోహిణీ సంస్థకు క్యాషియర్ గా వుండేవారు. గృహలక్ష్మి సినిమా పూర్తయ్యాక ఆసినిమాకు కమలాకర బెజవాడ, ఏలూరు కేంద్రాల్లో ఫిలిం రిప్రజెంటేటివ్ గా వ్యవహరించారు. తరువాత బి.యన్. రెడ్డి, రామనాథ్, శేఖర్ కలిసి వాహినీ సంస్థను ఆరంభించారు. వారు నిర్మించిన “వందేమాతరం” చిత్రానికి కమలాకర సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి బి.యన్ దర్శకుడు కాగా, కె.వి రెడ్డి ప్రొడక్షన్ మేనేజరుగా వ్యవహరించారు. బి.యన్ దర్శకత్వంలో “సుమంగళి” సినిమాకు పనిచేశాక, 1941లో వాహినీ వారు “దేవత” సినిమా నిర్మించి నప్పుడు బి.యన్ కు సహకార దర్శకుడిగా కమలాకర పదోన్నతి పొందారు. 1943లో వాహినీ పతాకం మీద కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన “భక్త పోతన” సినిమాకి కూడా కమలాకరే సహకార దర్శకుడు. అపుడే సినిమా టైటిల్స్ లో కె.వి. రెడ్డి సరసన కమలాకర పేరు కనుపించడం గొప్పవిషయం. వాహినీ వారి “గుణసుందరి కథ” సినిమా కోసం కథను తయారు చేసినవారిలో కమలాకర కూడా ఒకరు. “యోగి వేమన” తరువాత వాహినీ సంస్థ విజయాలో విలీనమైనప్పుడు కమలాకర విజయా సంస్థలో నిలదొక్కుకున్నారు. పింగళి నాగేంద్రరావును కె.వి. రెడ్డి, బి. యన్. రెడ్డి లకు పరిచయం చేసింది కామేశ్వరరావే. “పాతాళ భైరవి” కథాచర్చలలో కమలాకర పాల్గొని అద్భుతమైన కథను అల్లే ప్రక్రియలో నాగిరెడ్డి-చక్రపాణిల అభిమానం చూరగొన్నారు. అతని ప్రతిభను గుర్తిస్తూ “చంద్రహారం” సినిమాకు దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని విజయావారు కమలాకరకు అప్పగించారు. “చందనరాజు కథ” ను చంద్రహారంగా తీర్చిదిద్దగా దురదృష్టవశాత్తు ఆ తొలి అవకాశం అమలాకరకు సత్ఫలితాలను ఇవ్వలేదు. కానీ విమర్శకుల ప్రసంసలు మాత్రం దక్కాయి. ఈ సినిమా టెక్నిక్ కొత్తగా వుండడంతో కొన్ని దృశ్యాలను విదేశీ టెలివిజన్లు (ఆరోజుల్లో అక్కడ టెలివిజన్ సౌకర్యం వుండేది) ప్రసారంకూడా చేశాయి. తర్వాత సాహిణీ సంస్థవారి “పెంకిపెళ్ళాం” సినిమాకు దర్శకత్వం చేపడితే అదికూడా కాసులు రాల్చలేదు. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ చిత్రం కమలాకర దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక అత్యుత్తమ చిత్రమని చెప్పవచ్చు. ఈ చిత్ర గొప్పదనం ఖండాంతరాలు దాటి జకార్తాలో జరిగిన ‘ఆఫ్రో ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలుచుకుంది. ఈ చిత్రంలో అతి తక్కువ వ్యవధిగల కీచకపాత్రలో అత్యద్భుత నటన ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించిన ఎస్.వి. .రంగారావుకు ఉత్తమ నటుని పురస్కారం; చిత్రంలో అత్యంత కళాత్మకమైన సెట్టింగులు వేసి అలనాటి మహాభారత ప్రాభవాన్ని కళ్ళకద్దినట్లు రూపకల్పన చేసిన కళాదర్శకులు టి.వి.ఎస్. శర్మకు ఉత్తమ కళాదర్శకుని అవార్డు దక్కాయి. అంతర్జాతీయ అవార్డులను అందుకున్న మొదటి కళాకారులుగా వీరిద్దరి పేర్లు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయాయి.
ప్రతిభకు పట్టం
అయితే కమలాకర ప్రతిభను గుర్తించిన యన్.టి. రామారావు మాత్రం తన సొంత సినిమా “పాండురంగ మహాత్మ్యం” సినిమాకు కమలాకరనే దర్శకునిగా ఎన్నుకున్నారు. 1957లో విడుదలైన ఆ సినిమా విజయభేరి మ్రోగించింది. ఆ విజయంతోనే “శోభ”, “మహాకవి కాళిదాసు” వంటి విజయవంతమైన సినిమాలకు నిర్దేశకత్వం వహించి కమలాకర మంచి పేరు గడించారు. 1962లోనే వచ్చిన విజయావారి సాంఘిక కామెడీ సినిమా “గుండమ్మ కథ”, చారిత్రాత్మక చిత్రం “మహామంత్రి తిమ్మరుసు” సూపర్ హిట్లు కావడంతో ఇక కమలాకర వెనుకకు తిరిగి చూసుకోలేదు. మహామంత్రి తిమ్మరుసు సినిమాకు జాతీయస్థాయిలో రాష్ట్రపతి రజత పతకం లభించింది. 1963లో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావులు నిర్మించిన “నర్తనశాల” కు అంతర్జాతీయ కీర్తి లభించింది. ఇక 1965లో మాధవీ ప్రొడక్షన్స్ పతాకం మీద ఎ.యస్.ఆర్ ఆంజనేయులు నిర్మించిన “పాండవ వనవాసము” చిత్రం 13 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని, ఒక కేంద్రంలో రజతోత్సవాన్ని కూడా చేసుకుంది. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినికి తొలి అవకాశమిచ్చి, ఆమెచేత ఈ సినిమాలో నాట్యం చేయించిన ఘనత కూడా కమలాకరదే. ఇక కమలాకర కామేశ్వరరావు దర్శకత్వానికి తిరుగులేక పోయింది. “శ్రీకృష్ణ తులాభారం”, “కాంభోజరాజు కథ”, “శ్రీకృష్ణావతారం”, “వీరాంజనేయ”, ‘పాండవ వనవాసము’, వంటి పౌరాణిక చిత్రాలు కమలాకర దర్శకత్వంలో వచ్చి ఆయనను “పౌరాణికబ్రహ్మ”గా నిలబెట్టాయి. “కలసిన మనసులు”, “మాయని మమత” వంటి సాంఘికాలు కూడా మంచి చిత్రాలుగానే పేరుతెచ్చుకున్నాయి. వీనస్-మహీజా నిర్మాత సి.హెచ్. ప్రకాశరావు పూర్తిగా బాలలతో నిర్మించిన “బాలభారతం” రంగులచిత్రాన్ని కమలాకర విజయవంతం చేశారు. జనపదులకు, పౌరాణికాలకు ఆదరణ తగ్గిన రోజుల్లో కూడా అటువంటి సినిమా నిర్మాణంపై యేదైనా చర్చవస్తే సినీజగత్తులో తొలుత వినిపించే పేరు కమలాకరదే. 70వ దశకంలో కూడా కమలాకర కొన్ని పౌరాణిక సినిమాలకు నిర్దేశకత్వం నిర్వహించక పోలేదు. వాటిలో నటుడు కృష్ణ నిర్మించిన “కురుక్షేత్రం” గురించి చెప్పుకోవాలి. సాంకేతికంగానూ, సందేశపరంగానూ అతి తక్కువ వ్యవధిలో అత్యద్భుతంగా నిర్మించిన చిత్రమది. ఆ ర్రోజుల్లోనే వచ్చిన “శ్రీదత్త దర్శనం”, “సంతోషిమాత వ్రతమహాత్మ్యం”, “అష్టలక్ష్మి వైభవం” సినిమాలు కూడా ఆ కోవలోనివే. పౌరాణిక సినిమాలు తెరమరుగవడంతో కామేశ్వరరావు చేతికి పనిలేకుండా పోయింది. ఆ సమయంలోనే పౌరాణికాలకు మహర్దశ రాకపోతుందా అనే విశ్వాసంతో ఆయన కొన్ని సినిమా కథలకు స్క్రిప్టు తయారు చేసిపెట్టుకున్నారు. వాటిలో “శ్రీకృష్ణ కుచేల”, “శ్రీరంగనాథ వైభవం”, “మహిషాసుర మర్థని” సినిమా కథలు కొన్ని. సరైన నిర్మాతలు లేక, వున్నా కొందరు ముందుకురాక ఆ స్క్రిప్టులు రూపకల్పనకు నోచుకోలేకపోయాయి. ఈ బ్రహ్మర్షి యెంత గొప్పవాడంటే పారితోషికాల విషయంలో ఏనాడూ ఖచ్చితంగా వ్యవహరించలేదు. అతని మనసెరిగిన వారు ఆదరిస్తే, అతని మనస్తత్వం తెలిసిన నిర్మాతలు వాడుకొని వదిలేశారు. అయినా కమలాకర ఏనాడూ బాధపడలేదు. ఒక మంచి సినిమాను తీయగాలిగాననే తృప్తితోనే కాలం వెళ్ళబుచ్చారు. మద్రాసు ఫిలిం ఫ్యాన్స్ సంఘం కామేశ్వరరావును రెండుసార్లు ఉత్తమ దర్శకునిగా యెన్నుకుంది. “సినిమాలో అన్ని శాఖలూ, అందరూ కనిపించాలి గాని, దర్శకుడు మాత్రం కనిపించకూడదు. అన్ని శాఖలనూ కనిపింపజేయడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రం వుంటుంది. అది అన్ని మణులను కలిపి హారంగా రూపొందిస్తుంది. కానీ, సూత్రం మాత్రం పైకి కనిపించదు. చిత్ర దర్శకుడు కూడా ఆ సూత్రంలాంటివాడే” అని దర్శకుని పాత్రగురించి ఆయన గొప్పగా చెప్పేవారు. ఈ దర్శకరత్న పుంగవుడు మద్రాసు విడిచి తన కుమారుని వద్ద వుంటూ జూన్ 29, 1998న తన 86వ యేట తనువు చాలించారు.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)