ఫిబ్రవరి 21న, మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ, కేంద్రీయ విద్యాలయం నం.2 విజయవాడ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. 850 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య కవి-చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ రచించి, ప్రచురించిన ఫింగర్ పెయింటింగ్ మారథాన్ ‘వర్ణాంచిత అంగుళీ విన్యాసం’ అన్న గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది.
విద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.ఎస్.ఎస్.ఎస్.ఆర్. కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విద్యాలయంలో చిత్రకళ అధ్యాపకులుగా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ, చిత్రకారుడిగా 2010లో కేవలం చేతివేళ్ళతో గం. 13.26 నిమిషాల్లో చిత్రించిన 100 చిత్రాలతో రికార్డు సృష్టించారు. నేడు కళాకారుని జీవితంలోని జరిగిన స్వల్పకాల వ్యవధినే తీసుకొని రూపొందించిన బృహత్తర గ్రంథంగా రచించారు. ఈ మోనోగ్రాఫ్ ప్రపంచంలోనే తొలి ప్రయత్నం. ప్రచురణ రంగంలోను, కళారంగంలోను అరుదైన సంఘటన అన్నారు.
మారుతున్న రోజులకు అనుగుణంగా సాహిత్యకార్యక్రమాలు నిర్వహించే వేదికలు జనాలవద్దకే తరలి రావాలని, పిల్లలకు పుస్తకావిష్కరణ మహోత్సాన్ని ఒక పండుగలా జరిపి చూపాలన్న ఉద్దేశ్యంతో విద్యార్థుల మధ్య నిర్వహించామని, వారిని సాంస్కృతిక చైతన్యం వైపు నడిపించాలని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
పంచాంగం రవితేజ సంస్కృత అధ్యాపకులు గ్రంథ సమీక్ష చేసారు. ఒక చిత్రకారుడు! తన కళ ద్వారా ప్రపంచ రికార్డుకు ఎలా ప్రయత్నంచాడో… తెలుసుకోవాలనుకునే వారికి, ప్రపంచ రికార్డులు సాధించాలనుకునే వారికి ఈ గ్రంథం ఉపయోగంగా ఉంటుందని, సమగ్ర విషయాల సంగ్రహంగా రూపొందించటం జరిగిందని అన్నారు.
అనంతరం ఆత్మకూరు రామకృష్ణను విద్యాలయ ప్రిన్సిపాల్ దుశ్శాలువాతో సత్కరించారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
-కళాసాగర్
నా ఈ ప్రపంచ రికార్డు వార్తను తొలుత ముద్రించిన 64 కళలు.కామ్ కు, ఎడిటర్ గారికి ధన్యవాదములు.