పామర్తి శంకర్ ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ మరియు కేరికేచరిస్ట్. ఆయన ప్రస్తుతం తెలుగు దినపత్రిక సాక్షి లో చీఫ్ కార్టూనిస్ట్ గా హైదరాబాద్ పనిచేస్తున్నాడు. పుట్టింది మార్చి 3న 1966 సంవత్సరం నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లి లో. తండ్రి లైన్ మేన్ గా ఉద్యోగం చేస్తుండడంతో పాఠశాల విద్య వివిద ఊర్లలో జరిగినప్పటికీ… ఇంటర్, డిగ్రీ కాలేజీ చదువంతా నల్గొండలోనే. ఇంటర్ చదివే రోజుల్లో ఆర్టిస్ట్ చిత్ర దగ్గర సైన్ బోర్డ్స్ రాయడంలో మెళుకువలు నేర్చుకొని, డిగ్రీ పూర్తి కాగానే ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా ఉ ద్యోగంలో చేరి పిల్లలకు బొమ్మలు గీయడంలో తర్ఫీదు ఇచ్చాడు. ఆ సమయంలో స్కూల్ లైబ్రరీలో ‘ది వీక్‘ ఇంగ్లీష్ పత్రికలో ప్రకాష్ శెట్టి కేరికేచర్లు తనను బాగా ఆకర్షించాయంటాడు శంకర్.
హైదరాబాద్ వచ్చాక ఆర్టిస్ట్ మోహన్ గారి శిష్యరికంలో ఆరితేరి, మిత్రుల పరిచయాలతో తనలోని కళకు మెరుగులు దిద్దుకొని గమ్యాన్ని వెతుక్కున్నాడు. రెండున్నర దశాబ్దాలుగా బొమ్మలే సర్వసంగా కృషిచేస్తున్న శంకర్ తన కెరీర్ ను 1998 సం.లో వార్త దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా ప్రారంభించాడు. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో కార్టూనిస్ట్ గా ఐదేళ్ళు పనిచేసి, 2008 సంవత్సరం నుండి సాక్షి దినపత్రికలో చీఫ్ కార్టూనిస్ట్ గా కొనసాగుతున్నాడు. పొలిటికల్ కార్టూనిస్ట్ కు కేరికేచర్లు గీయాల్సిన అవసరం వుంటుంది. అయితే ఆ అవసరానికి మించిన పేషన్ తో కేరికేచర్ రంగంలో కృషి చేసాడు, ఎన్నో ప్రయోగాలు చేసాడు కాబట్టే శంకర్ 18 ఇంటర్నేషనల్ అవార్డులు అందుకోగలిగాడు.
శంకర్ గీసిన నెల్సన్ మండేలా కేరికేచర్ కు పోర్చుగల్ లో ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు-2014’ గ్రాండ్ ఫిక్స్ అంతర్జాతీయ అవార్డ్ వరించింది. ఆసియాలో ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి శంకర్. భారతదేశంలో కార్టూన్ మరియు కేరికేచర్ పోటీలలో అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి శంకర్. శంకర్ అనేక అంతర్జాతీయ మరియు జాతీయ పోటీలకు జ్యూరీగా ఆహ్వానించబడ్డాడు. సినిమాలకు ఆస్కార్ అవార్డ్ ఎలాంటిదో, కార్టూనిస్టులకు వరల్డ్ ప్రెస్ కార్టూన్ అవార్డు అలాంటిదంటాడు శంకర్. ఇంత గొప్ప అవార్డు పొంది సాక్షి పత్రిక ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టిన శంకర్ కు సాక్షి యాజమాన్యం రెండు లక్షల రూపాయల ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది.
తన కేరికేచర్ చిత్రాల ప్రత్యేకత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే, కాని అపహాస్యం చేయడం కాదు. శంకర్ గీసిన గాంధీ, హిట్లర్, చార్లీ చాప్లిన్, అబ్దుల్ కలాం, యం.ఎస్. సుబ్బులక్ష్మి, మథర్ థెరిసా, దలైలామా, సద్దాం హుస్సేన్ లాంటి ప్రముఖ వ్యక్తుల కేరికేచర్ చిత్రాలకు విస్తృత ప్రశంసలు లభించాయి.
శంకర్ గీసిన కేరికేచర్లతో నిర్వహించిన తొలి ప్రదర్శన 2004లో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. 2019 సం.లో హైదరాబాద్ లో కార్టూనిస్ట్ గా ఇరవయ్యేళ్ళ పత్రికారంగ ప్రయాణాన్ని ప్రతిభింబించే విధంగా తన కార్టూన్లను, కేరికేచర్లను ప్రదర్శించాడు.
2019 సం.లో గాంధీ 150 వ జయంతి సందర్భంగా ‘గాంధీ-150 ‘ పేరుతో హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్ గేలరీలో గాంధీజీ 40 కేరికేచర్లను ప్రదర్శించాడు.
2015 సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కార్టూనిస్ట్ శంకర్ ను విశిష్ట పురస్కారంతో సత్కరించారు.
శంకర్ అంతర్జాతీయంగా బ్రెజిల్, చైనా, ఇరాన్, అమెరికా లాంటి అనేక దేశాలలో తన కేరికేచర్లకు ఎన్నో బహుమతులు, ప్రశంసలు అందుకున్నాడు.
-కళాసాగర్
Nice Article on great caricaturist
శంకర్ గారు మీ కెరీకేచర్స్ ప్రత్యేక శైలి లోవుంటాయి.కార్టూన్లు చూరుకు మనిపిస్తాయి.
డ్రాయింగ్ టీచర్ గామొదలు పెట్టి కార్టూనిస్ట్ గా, ఒకఅంతర్జాతీయ క్యారికేచరిస్టుగా ప్రఖ్యాతి గాంచి ఎన్నో అవార్డులు గెలవడం వెనుక *శ్రీ శంకర్ గార్కి *కళ పట్ల నిర్విరామ కృషి, అంకితభావం కారణం. మిత్రులు శంకర్ గార్కి హార్దికాభినందనాలు. 👌👍Bomman