తెలుగు చలనచిత్ర సీమకు తొలినేపథ్య గాయకులు ఎవరై వుంటారు? … వారిలో గాయకుడెవరు?, గాయని ఎవరు? అనే సందేహం సినీ సంగీత ప్రియులకు కలగటం సహజం. ఎందుకంటే ఈ విషయం పై అనేక సందేహాలున్నాయి. ఎం.ఎస్. రామారావు “నేనే తొలి నేపథ్య గాయకుడిని” అని తనే ప్రకటించుకున్నారు. వాస్తవానికి 01-04-1939 న విడుదలైన వాహినీ వారి ‘వందేమాతరమ్’ (లేక మంగళసూత్రం) సినిమాలో “పూలో- పూలో- పూలో కనీ కొనుడు- పూలూ, మల్లె, మాలతి, జాజీ, గులాబీలు, విరజాజీ, కనకాంబరి, సంపంగీ నీలాంబరి…” అంటూ పాట పాడిన మాస్టర్ సాబు తొలి నేపథ్య గాయకుడుగా రికార్డులకెక్కాడు. అంతేకాని ఎం.ఎస్. రామారావు కాదు. ఈ సినిమాలో కాంచనమాల(జానకి పాత్రలో) కొడుకుగా నటించిన మాస్టర్ కృష్ణ (ఆనంద్ పాత్రలో) తోపుడు బండి మీద పూలు అమ్ముకుంటూ ఈ పాట పాడుకుంటాడు. చిత్తూరు.వి.నాగయ్య సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ పాటను రోడ్డు మీదే ‘లైవ్’ గా రికార్డు చేశారు. అంతటి సాంకేతికత అభివృద్ధి చెందని కారణంగా ఆ పాట సరిగ్గా రికార్డు కాలేదు. అప్పుడు శబ్దగ్రాహకుడు శేఖర్, ఛాయాగ్రాహకుడు రామనాథ్ కలిసి ఈ పాటను మాస్టర్ సాబు చేత స్టూడియోలో మరలా పాడించి, మాస్టర్ కృష్ణ నటించిన పాటమీద సూపర్ ఇంపోజ్ చేసి ఎడిటింగ్ చేశారు. సాంకేతికత లేమితో ఈ పాట లిప్ సింక్ కాలేదు. అందుచేత అందుబాటులోవున్న రికార్డులపరంగా తొలి నేపథ్య గాయకునిగా మాస్టర్ సాబు ని గుర్తించాలి. ఇక ఎం.ఎస్. రామారావు విషయానికొస్తే, 1941లో వచ్చిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో ‘ఈ వసంతము నిత్యము కాదోయి… పోయిన మరి రాదోయి’ అనే ఒక రేడియో పద్యం వుంది. అది రామారావు పాడిందే. కానీ అది ప్లేబ్యాక్ పాట అనిపించుకోదు. అందుకు కారణం ప్లేబ్యాక్ అంటే తెరమీద ఒక పాట గాని, పద్యం గాని సన్నివేశంలో నటించే నటుడికి వెనుకనుంచి గొంతు అరువిచ్చేది అని అర్థం. ఎం.ఎస్. రామారావు ‘తహసిల్దార్’ (1944) సినిమాలో హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి సంగీత దర్శకత్వంలో కమలా కొట్నిస్ (రజని పాత్రలో) తో కలిసి ”ప్రేమలీలా మోహన కలసి చేకొనుమా కలసి- రాగమయీ మన జీవనసరళి భోగమనోహరమా, రాగదే రజనీ” అనే పాటలో సి.చ్. నారాయణరావు (తాసీల్దార్ పాత్రలో) కు ప్లేబ్యాక్ పాడారు. అదే ఎం.ఎస్. రామారావు పాడిన తొలి ప్లేబ్యాక్ పాట. అందుచేత తెలుగు చిత్రసీమలో తొలి ప్లేబ్యాక్ గాయకుడు మాస్టర్ సాబూ అని గ్రహించాలి.
ఇక తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతీదేవి అని అందరూ అనుకుంటారు. అది కూడా నిజం కాదు. తొలి నేపథ్య గాయనిగా బెజవాడ రాజరత్నం అని గ్రహించాలి. తెలుగు టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో నేపథ్య గాయకులు, నేపథ్య గాయనీమణులు అంటూ ఎవరూ వుండేవారు కాదు. మహిళా పాత్రలు ధరించిన నటీమణులే వారి పాటల్ని సొంతంగా పాడుకునేవారు. చరిత్రను తిరగేస్తే ఈ వివరాలు లభిస్తాయి. 07-01-1943 న కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన వాహినీ వారి ‘భక్తపోతన’ సినిమాలో చిత్తూరు.వి.నాగయ్య సంగీత దర్శకత్వంలో భోగిని అనే నర్తకి కల్యాణి రాగంలో ఒక జావళి పాడుతూ నాట్యం చేస్తుంది. “ఇది మంచి సమయము రారా చలమేల చేసేవేరా” అనే ఆ పాటను బెజవాడ రాజరత్నం పాడగా సామ్రాజ్యం అనే నర్తకి మీద ఛాయాగ్రాహకుడు రామనాథ్ చిత్రీకరించారు. అదే తెలుగు సినిమాలో తొలి నేపథ్య గీతం. ఆ విధంగా బెజవాడ రాజరత్నం తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. హరిశ్చంద్ర(1934) సినిమాలో కన్నాంబ; శ్రీకృష్ణ లీలలు(1935)లో రామతిలకం; విప్రనారాయణ(1937)లో కాంచనమాల; మాలపిల్ల(1938)లో సుందరమ్మ; సంజీవని (1938)లో కృష్ణవేణి; మళ్ళీపెళ్లి(1939)లో బెజవాడ రాజరత్నం; బారిస్టర్ పార్వతీశం (1940)లో జి.వరలక్ష్మి; ఇల్లాలు (1940)లో రావు బాలసరస్వతీదేవి, లక్ష్మీరాజ్యం; సుమంగళి(1940)లో కుమారి; దేవత(1941)లో టంగుటూరి సూర్యకుమారి & బెజవాడ రాజరత్నం వంటి సీనియర్ తారలు నటిస్తూ తమ పాటల్ని తామే పాడుకున్నారు. రావు బాలసరస్వతీదేవి విషయానికి వస్తే ఇందిరాదేవి ఫిలిమ్స్ వారు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో నిర్మించిన ‘ఇల్లాలు’(27-09-1940) సినిమాలో మధు అనే కవి పాత్రలో సాలూరు రాజేశ్వరరావు సైకిల్ తొక్కుతూ పాడే యుగళగీతం “కావ్యపానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలాన్ని తిరిగొచ్చినానే” (హచ్చిన్ గ్రామఫోన్ కంపెనీ వారి రికార్డు నంబరు S.N.832), ”సుమకోమల కనువేల… కలకాదనుమా బాలా” అనే ఉద్వేగపు మరో యుగళగీతం రెంటినీ రావు బాలసరస్వతీదేవి (సరళ పాత్రలో) పాడారు. ఈ రెండు పాటలను చిత్రీకరించింది రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి మీద కనుక బాలసరస్వతీదేవి విషయంలో అది నేపథ్య గీతం అనిపించుకోదు. ఇక్కడ మరో సంఘటన కూడా గుర్తు చేయాలి. 04-03-1943 న పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన శ్రీ రేణుకా వారి ‘భాగ్యలక్ష్మి’ సినిమా విడుదలైంది. అందులో కమలా కొట్నిస్ ‘కుంజీ’ అనే జిప్సీ యువతిగా నటించింది. భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వంలో రావు బాలసరస్వతీదేవి ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా… తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా” అనే పాట పాడగా, కమలాకొట్నిస్ నాట్యం చేస్తుంది. ఈ పాటనే బాలసరస్వతీదేవి తొలి నేపథ్యగీతంగా పేర్కొంటూవుంటారు. కానీ అంతకుముందే బెజవాడ రాజరత్నం తొలి నేపథ్యగీతాన్ని ఆలపించివుండడం మరువరాదు. తొలి నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం అనే విషయాన్ని గతంలో ప్రముఖ సినీ విమర్శకుడు, విశ్లేషకుడు వి.ఎ.కె.రంగారావు ధృవీకరించగా ప్రముఖ సీనియర్ నటుడు, విజయచిత్ర సినీ పత్రికకు 26 సంవత్సరాలు సంపాదకత్వ సేవలు అందించిన రావి కొండలరావు గారు ఏకీభవించారు. చరిత్ర వక్రీకరణకు గురి కాకూడదన్నదే ఈ సుదీర్ఘ వివరణకు కారణం.
ఎం.ఎస్. రామారావు గురించి:
1921లో గుంటూరు జిల్లా మోపర్రు గ్రామంలో జన్మించిన ఎం.ఎస్. రామారావు 1972-74 మధ్యకాలంలో హనుమాన్ చాలీసా, సుందరాకాండను తెలుగులో రచించి, ఆలపించడం ద్వారా బాగా ప్రసిద్ధులయ్యారు. రామారావు వీటితోబాటు బాలకాండ, అయోధ్యాకాండ కూడా అద్భుతంగా ఆలపించారు. భక్తి పాటలు పాడడం ద్వారా 1977లో ‘సుందరదాసు’ అనే బిరుదు పొందారు. 1944-64 మధ్యకాలంలో రామారావు తెలుగు సినిమాలలో కొన్ని పాటలు పాడారు. ‘నీరాజనం’ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ రామారావు రచించిన ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా’ అనే గీతాన్ని ఆలపింపజేశారు. రామారావు కు 1946లో లక్ష్మి సామ్రాజ్యం తో వివాహమైంది. 1941లో వాహినీ వారి ‘దేవత’ సినిమాలో రామారావు ‘ఈ వసంతము నిత్యము కాదోయి… పోయిన మరి రాదోయి’ అంటూ రేడియో వినిపించే పద్యాన్ని ఆలపించారు. 1944లో వై.వి.రావు నటించి నిర్మించిన ‘తహసిల్దార్’ సినిమాలో కమలా కొట్నిస్ తో కలిసి ”ప్రేమలీలా మోహనకలసి చేకొనుమా కలసి- రాగమయీ మన జీవనసరళి భోగమనోహరమా, రాగదే రజనీ” అనే పాటను సి.చ్. నారాయణరావు కోసం ప్లేబ్యాక్ పాడారు. అది ఎం.ఎస్. రామారావు పాడిన తొలి ప్లేబ్యాక్ పాట. తర్వాత 1948లో ‘ద్రోహి’ చిత్రంలో ‘ఇదియేనా నీ న్యాయము దేవా, ఈవలపక్షము తగునా’ అనే నేపథ్య గీతాన్ని పాడారు. ఎన్.టి. రామారావు పరిచయమైన మనదేశం చిత్రంలో ‘ఏమిటో ఈ సంబంధం, ఎందుకో ఈ అనుబంధం’; ‘ఛలో ఛలో ఛలో ఛలో రాజా ఛలో ఛలో ఛలో’ అనే రెండు పాటలు కృష్ణవేణితో కలిసి పాడారు. 1952లో ‘లవకుశ’ శంకరరెడ్డి నిర్మించిన ‘మానవతి’ సినిమాలో రావు బాలసరస్వతీదేవి తో కలిసి రామారావు ఆలపించిన ‘ఓ మలయపవనమా నిలు నిలు నిలుమా’ అనే యుగళగీతం బాగా పాపులర్ అయిన పాట. కార్తవరాయని కథ, రాజనందిని, సీతారామ కల్యాణం వంటి సినిమాలలో రామారావు కొన్ని మంచి మంచి పాటలు పాడారు. 1975లో ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ సినిమాలో కె.వి. మహదేవన్ ‘శరణము నీవే శ్రీరామా’ అనే అద్భుతమైన పాటను పాడించారు. ఏప్రిల్ 20,1992 న రామారావు తన 70 వ యేట హైదరాబాద్ లో పరమపదించారు.
బెజవాడ రాజరత్నం గురించి:
బెజవాడ రాజరత్నం పుట్టింది 1913లో. ఆమె జన్మస్థలం గుంటూరు జిల్లా చినరావూరు. జొన్నవిత్తుల శేషరిరావు వద్ద ఆమె శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. 1934లో వేల్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘సీతా కల్యాణం’ లో సీత పాత్ర పోషించే అవకాశం ఆమెకు దక్కింది. 1939లో జగదీష్ ఫిలిమ్స్ బ్యానర్ పై వై.వి.రావు (యరగుడిపాటి వరద రావు) సమర్పిస్తూ దర్శకత్వం వహించిన ‘మళ్ళీపెళ్ళి’ చిత్రంలో రాజరత్నం వై.వి.రావు సోదరి కమల పాత్రను పోషించింది. అందులో ఆమె ఆలపించిన ‘గోపాలుడే మా గోపాలుడే … ఏతెంచేనే మన వ్రేపల్లెకు’ ; ‘చెలి కుంకుమయే పావనమే నయన మనోమోహనమే’ పాటలు నాటి ప్రేక్షకులకు వీనులవిందు చేశాయి. 1940లో వై.వి. రావు నిర్మించిన ‘విశ్వమోహిని’ చిత్రంలో హేమలత పాత్రను పోషిస్తూ ఆలపించిన ‘ఈ పూపొదరింట సేదదీర్చుకొని పోదువు రావోయి కృష్ణయ్యా’ వంటి పాటలు యువతరాన్ని వుర్రూతలూగించాయి. తర్వాత 1941లో వాహినీ సంస్థ బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘దేవత’ చిత్రంలో విమల పాత్రలో నటించిన రాజరత్నం ‘జాగేలా, వెరపేలా, త్రాగుము రాగ సుధారసము, అనురాగ సుధారసము’ వంటి అద్భుతమైన పాటలు పాడి రాగసుధారస మధురిమను ప్రేక్షకులకు పంచి, అటు నటిగా మరోవైపు గాయనిగా మంచి పేరు గడించింది. ముఖ్యంగా ‘రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ’ పాట నేటికీ బాగా గుర్తుండిపోయే పాట. ‘అదిగో అందియలరవళి…జగమే రాపాడిపోయె’, ‘ఎవరు మాకింక సాటి వేరే’ పాటలు కూడా మంచి హిట్లే. ఇదే సినిమాను 1967లో ‘పావప్పెట్టవళ్’ పేరిట మలయాళంలో నిర్మించారు. తర్వాతి రోజుల్లో రాజరత్నం నటనకంటే పాటలకే మంచి ప్రాముఖ్యత వచ్చింది. ముఖ్యంగా ‘మాయాలోకం’ (1945), ‘ముగ్గురు మరాఠీలు’(1946) సినిమాలలో ఈ విషయం స్పష్టమౌతుంది. బెజవాడ రాజరత్నం చివరిసారి నటించి, పాటలు పాడిన చివరి సినిమా 1947లో విడుదలైన తమిళ చిత్రం ‘కన్బగవల్లి’. అయితే రాజరత్నం గొంతు వినిపించిన ఆఖరి తెలుగు సినిమా విజయా వారి ‘జగదేకవీరుని కథ’ (1961). అందులో దేవకన్యలు పాడే ‘జలకాలాటలలో కలకల పాటలలో’, ‘ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా సేవలంది మాకు వరములీయవమ్మా’ పాటలకు లీల, సుశీలతో కలిసి గళం కలిపింది. తొలి నేపథ్యగాయనిగా 1943లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘భక్తపోతన’ చిత్రంలో భోగిని గా నృత్యం చేసే సామ్రాజ్యం కు బెజవాడ రాజరత్నం ‘ఇది మంచిసమయము రారా…చలమేమి చేసేవౌరా’ అనే జావళి ఆలపించింది. అలాగే తమిళ సినిమా ‘మోహిని’ (1948)లో కథానాయిక మాధురి పాత్రకు గళం ఎరువిచ్చి నేపథ్యగాయనిగా పేరు తెచ్చుకుంది.
–ఆచారం షణ్ముఖాచారి
Very good and informative article