భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ను ఇంపీరియల్ మూవీటోన్ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరు లోని సూర్యా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్ మూవిటోన్ నిర్మాత, దర్శకుడు అర్దేషిర్ ఇరాని వద్ద సహాయకునిగా పనిచేస్తూ కొన్ని మూకీ చిత్రాలకు స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. తొలి టాకీ ‘ఆలం ఆరా’ విజయంతో దక్షినాది భాషల్లో కూడా టాకీ చిత్రాలు నిర్మించాలని అర్దేషిర్ ఇరాని నిర్ణయించి తనవద్ద వున్న అనుభవజ్ఞుడైన హెచ్.ఎం.రెడ్డి కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అలా అర్దేషిర్ ఇరాని నిర్మించిన తొలి తమిళ టాకీ ‘కాళిదాస’ (31 అక్టోబరు 1931), తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (6 ఫిబ్రవరి 1932) చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి టాకీ చిత్రాల దర్శక పితామహునిగా హెచ్.ఎం.రెడ్డి పేరు గడించారు. అలా తెలుగు తొలి టాకీ ‘భక్త ప్రహ్లాద’ తొలి ప్రదర్శన బొంబాయి న్యూ చార్లీ రోడ్డు లోని కృష్ణా సినిమా హాలులో నిర్వహించిన ఘనత హెచ్.ఎం.రెడ్డి గారిదే. తరవాత కాలంలో హెచ్.ఎం. రెడ్డి మద్రాసులో ప్రముఖ దర్శకుడు బి.ఎన్. రెడ్డి, బి. నాగిరెడ్డి, ప్రముఖ నటి కన్నాంబ లను భాగాస్వాముగా చేసుకొని ‘రోహిణి పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి ‘గృహలక్ష్మి’ (1938) చిత్రాన్ని నిర్మించారు. అదే బ్యానరు మీద ‘వందేమాతరం’ (1939), ‘తెనాలి రామకృష్ణ’ (1941), ‘సత్యమే జయం’ (1942), ‘నిర్దోషి’ (1951), ‘ప్రతిజ్ఞ’ (1953), ‘వద్దంటే డబ్బు’ (1954), ‘బీదల ఆస్తి’ (1955) వంటి చిత్రాలను హెచ్.ఎం.రెడ్డి నిర్మించారు. అటువంటి ఈ తొలితరం దర్శక పితామహుని జయంతి జూన్ 12 న జరుగుతున్న సందర్భంగా ఈ ‘మీసాల పులి’ గురించి కొన్ని విశేషాలు…
పోలీసు అధికారి దర్శకునిగా మారి…
“మీసాల పులి” గా చలనచిత్రరంగాన్ని హడలెత్తించిన హనుమప్ప మునియప్ప రెడ్డి కన్నడిగుడు. పుట్టింది జూన్ 12, 1882 న బెంగుళూరులో. ఆయన బెంగుళూరు నగరంలోనే చదివి అక్కడే పోలీసు అధికారిగా చాలాకాలం పనిచేశారు. ఆరోజుల్లో పోలీసు శాఖ బ్రిటీష్ వారి ఆధీనంలో వుండేది. వారి క్రింద పనిచేయడం ఇష్టంలేని హెచ్.ఎం. రెడ్డి పోలీసు అధికారి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. సినిమాలమీద మోజుతో తన సోదరుని కుమారుడు హెచ్. వి. బాబును వెంటపెట్టుకొని బొంబాయి నగరం చేరుకున్నారు. అక్కడ బి.పి. మిశ్రా కు సహాయకుడిగా పనిచేశారు. తరవాత ఇంపీరియల్ స్టూడియో యజమాని, టాకీ సినిమాలకు ఆద్యుడు అర్దేషిర్ ఇరాని వద్ద తొలుత లైట్ బాయ్ గా చేరి, మూకీ సినిమా నిర్మాణ మెళకువలు అధ్యయనం చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేశారు. అర్దేషిర్ ఇరాని హెచ్.ఎం. రెడ్డి ప్రతిభను గుర్తించి తనవద్ద సహాయ దర్శకునిగా నియమించుకున్నారు. తరవాత 1930 లో ‘ప్రిన్స్ విజయకుమార్’ అనే మూకీ చిత్రానికి దర్శకునిగా నియమించారు. ఆ చిత్రంలో పృధ్వీరాజ్ కపూర్ హీరో. అర్దేషిర్ ఇరాని తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’ (14 మార్చి, 1931) బొంబాయిలో ఇంపీరియల్ మూవిటోన్ పతాకం మీద నిర్మించారు. అందులో పృద్విరాజ్ కపూర్, మాస్టర్ విఠల్, ఎల్.వి. ప్రసాద్, జుబేదా, జీలూమా నటించగా ఫిరోజ్ షా మిస్త్రి, బి. ఇరాని సంగీతం సమకూర్చారు. ‘ఆలం ఆరా’ చిత్రానికి హెచ్.ఎం. రెడ్డి సహాయ దర్శకుడుగా వ్యవహరించారు. ముందుగా స్క్రీన్ వర్షన్ తీసి, తరవాత టనర్ సింగిల్ కెమెరాతో సౌండ్ సిస్టం రికార్డుచేసి సినిమాకు జతచేసి తొలి టాకీ పూర్తిచేశారు. ఈ టాకీ చిత్రాన్ని చూడడానికి జనం ఎగబడడంతో పోలీసు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది. సినిమా విడుదలైన ఎనిమిది వారాలు బొంబాయి మెజెస్టిక్ సినిమా హాలులో హౌస్ ఫుల్ తో నడిచింది. ఒక రాజకుమారునికి (మాస్టర్ విఠల్), ఆలం ఆరా (జుబేదా) అనే ఒక ఆటవిక జాతి వనితకు మధ్య జరిగిన ప్రేమాయణం ఈ చిత్ర నేపథ్యం. ఈ చిత్ర విజయంతో అర్దేషిర్ ఇరానికి దక్షిణ భాషల్లో కూడా సినిమా తీయాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పబలం ఇరానీ ఇచ్చిందే. వెంటనే తమిళంలో ‘కాళిదాస’, తెలుగులో ‘భక్త ప్రహ్లాద’ చిత్రాల నిర్మాణానికి హెచ్.ఎం. రెడ్డి నడుం బిగించారు.
తొలి తెలుగు, తమిళ టాకీలు నిర్మించి…
ఆరోజుల్లో వనారస సోదరులు గోవిందరావు, చిన్నరామయ్య సురభి నాటక సమాజం స్థాపించి తమ కుటుంబ సభ్యులే పాత్రధారులుగా, రంగస్థల నటనే జీవనాధారంగా చేసుకుంటూ, పల్లెలు పట్టణాలలో ప్రదర్శనలు ఇస్తుండేవారు. సురభివారు ప్రదర్శించే పౌరాణిక నాటకాల్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం ఆరోజుల్లో బాగా పేరుతెచ్చుకుంది. హెచ్.ఎం. రెడ్డి సురభి నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళికను రూపొందించారు. అక్కడే కృష్ణా మూవిటోన్ స్టూడియోలో ‘భక్త ప్రహ్లాద’ చిత్ర నిర్మాణం జరిగింది. ఇందులో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, ఇంద్రునిగా దొరస్వామి నాయుడు, బ్రహ్మగా చిత్రపు నరసింహా రావు, ప్రహ్లాదుని సహాధ్యాయి మొద్దబ్బాయిగా ఎల్.వి. ప్రసాద్ నటించారు. అలాగే హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కాళిదాస’ లోకూడా ఎల్.వి. ప్రసాద్ నటించడం విశేషం. సురభి కమలాబాయి నటనకు మెచ్చి మొదట అనుకున్న 500 రూపాయలకు బదులుగా వెయ్యినూట పదహార్లు పారితోషికాన్ని అర్దేషిర్ ఇరాని బహూకరించారు. ఎవరి పద్యాలు, పాటలు వారే పాడుకోగా హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి హార్మోనియం మీద సంగీత సహకారాన్ని అందించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. బ్లాక్ లో టికెట్లు కొని మరీ సినిమాను చూశారు. అయితే ఈ సినిమామీద కొన్ని విమర్శలు రాకపోలేదు. సినిమా ప్రింటు మసక మసకగా అగుపించిందని, సంభాషణలు, పద్యాలూ మధ్య మధ్యలో తగ్గుతూ కొన్నిచోట్ల హెచ్చుతూ వినిపించాయని అనుకున్నారు. అయితే తొలి టాకీ కావడంతో అటువంటి లోపాలు సహజమేనని సర్దుబాటు చేసుకున్నారు ప్రేక్షక్లులు. ‘భక్త ప్రహ్లాద’ సినిమాతో సమాంతరంగా నిర్మించిన ‘కాళిదాస’ సినిమాకి కూడా హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వం చేశారని చెప్పుకున్నాం కదా. ఇందులో కాళిదాసుగా జి. వెంకటేశన్, విద్యాధరిగా టి.పి. రాజ్యలక్ష్మి, దేవాలయ అర్చకుడిగా ఎల్.వి. ప్రసాద్ నటించారు. ఈ చిత్రానికి జర్మన్ టెక్నాలజీతో కూడిన శబ్ద గ్రహణ యంత్రాలను ఉపయోగించారు. ఈ చిత్ర నిర్మాణానికి కేవలం 8 రోజులు మాత్రమే పట్టింది. అయితే ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి వినియోగించినంత సమయాన్ని ‘కాళిదాస’ కు కేటాయించలేకపోవడంతో నాణ్యత తగ్గింది. ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో వలె కాకుండా నటీనటులు ఇందులో వారి వారి సొంత భాషల్లో సంభాషణలు పలికారు. రాజలక్ష్మి తమిళంలోనూ, వెంకటేశన్ తెలుగులోనూ, ఎల్.వి. ప్రసాద్ హిందీ లోను సంభాషణలు పలికారు. అందుకే ‘కాళిదాస’ చిత్రాన్ని తొలి తమిళ టాకీ అనేదానికన్నా, తొలి భారతీయ బహుభాషా చిత్రం అని వ్యవహరిస్తే బాగుంటుందని కొందరు సినీ పండితుల అభిప్రాయం. ‘కాళిదాస’ చిత్రానికి పాటలు, సంగీతం సమకూర్చినవారు భాస్కరదాస్. ఈ చిత్రాన్ని మొదట మద్రాస్ కిన్నెర సెంట్రల్ థియేటర్ లో విడుదల చేశారు. ఎనిమిది రోజుల్లో తయారైన ఈ సినిమా ఆరోజుల్లోనే 75 వేల రూపాయల వసూళ్లు రాబట్టి హిట్ అయింది. తరవాత హెచ్.ఎం. రెడ్డి సీతా స్వయంవర్, జాజ్ ఆఫ్ లైఫ్ వంటి మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆరోజుల్లో హెచ్.ఎం. రెడ్డి ఎక్కువగా కొల్హాపూర్ లో వుండేవారు. అక్కడే కొల్హాపూర్ ఫిలిం కంపెనీకి పనిచేస్తూ శాలిని సినీ టోన్ స్టూడియోలో సినిమాలు నిర్మిస్తూ వుండేవారు. ‘భక్తప్రహ్లాద’ సినిమా విజయంతో బొంబాయి సాగర్ ఫిలిం కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా వున్న చున్నీబాయి దేశాయి తెలుగు సినీరంగంలోకి దిగి ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’ అనే రెండు చిత్రాలు నిర్మించారు. అయితే ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు వచ్చినంత పేరుగాని, ఆదాయం గాని ఈ సినిమాలకు రాలేదు. అయినా టాకీ సినిమాలు ప్రేక్షకులకు కొత్త కావడంతో బాగానే ఆడాయి. తరవాత 1935 ప్రాంతంలో విజయవాడ కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు తెలుగు టాకీ నిర్మించే ఉద్దేశ్యంతో హెచ్.ఎం. రెడ్డిని కలిసి తమకు ఒక సినిమా నిర్మించి ఇవ్వమని ఆడిగారు. అప్పుడు తన అన్న కుమారుడు హెచ్.వి. బాబు దర్శకత్వంలో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చిత్రాన్ని నిర్మింపజేశారు. యడవల్లి సూర్యనారాయణ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నెల్లూరు నగరాజరావు, చొప్పల్లి సూర్యనారాయణ, వేమూరు గగ్గయ్య, కన్నాంబ, రామతిలకం వంటి మేటి రంగస్థల నటీనటులతో ఆ చిత్రం నిర్మించబడింది. మల్లాది అచ్యుతరామశాస్త్రి విరచించిన నాటకానికి మునువంటి వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాకు పోటీగా లక్ష్మి ఫిలిమ్స్, మద్రాసు సంస్థ ఎం. జగన్నాథ స్వామి దర్శకత్వంలో దైతా గోపాలం చేత స్క్రిప్టు రాయించి ఇదే కథను ‘ద్రౌపదీ మానసంరక్షణము’ పేరుతో సినిమా నిర్మించి 1936 లో సమాంతరంగా విడుదల చేసింది. ఇందులో బళ్ళారి రాఘవ (దుర్యోధనుడు), బందా కనకలింగేశ్వరరావు(కృష్ణుడు), పారుపల్లిసుబ్బారావు(ధర్మరాజు), మంత్రవాది వెంకటశేషయ్య (భీష్ముడు), సురభి కమలాబాయి (ద్రౌపది) ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఈ చిత్రం ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ ముందు నిలవలేకపోయింది.
‘గృహలక్ష్మి’తో రోహిణీ పిక్చర్స్ ఆవిర్భావం…
హెచ్.ఎం. రెడ్డి సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలు నిర్మించాలని సంకల్పించి, బి.ఎన్. రెడ్డి (ప్రముఖ నిర్మాత, దర్శకుడు), బి. నాగిరెడ్డి (ప్రముఖ నిర్మాత), మూలా నారాయణస్వామి (ప్రముఖ వ్యాపారవేత్త) లను భాగస్వాములుగా చేర్చుకున్నారు. కె.వి. రెడ్డి (ప్రముఖ దర్శకనిర్మాత)కి నిర్మాణ శాఖను కేటాయించారు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు. ఇక కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకునిగా, సముద్రాల రాఘవాచార్య ఆస్థాన రచయితగా నియమితులయ్యారు. హెచ్.వి. బాబు, డి.ఎల్. రామచందర్ లు దర్శకత్వ శాఖలకు కుదిరారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలు నిర్మించిన హెచ్.ఎం. రెడ్డి సాంఘిక చిత్రాల బాట పట్టారు. సోమరాజు రామానుజరావు ప్రఖ్యాత నాటిక ‘రంగూన్ రౌడీ’ హక్కులు కొని ఆ నాటికకు అసంఖ్యాక మార్పులుచేసి ‘గృహలక్ష్మి’(1938) చిత్రాన్ని నిర్మించారు. ప్రభల సత్యనారాయణ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రామనాథ్ ఛాయాగ్రహణం అందించగా శేఖర్ శబ్దగ్రాహకుడిగా పనిచేశారు. ఇందులో ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రకు మంచి పేరు సంపాదించిన రామానుజాచారిన హీరోగా, కన్నాంబ, కాంచనమాల, నాగయ్య, గౌరీపతిశాస్త్రిలను ముఖ్యతారాగణంగా పెట్టి సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి స్పెన్సర్ కంపెనీ వారు సెట్టింగులు సమకూర్చగా, చిత్రాన్ని మద్రాసులోని గ్రీన్ వేస్ రోడ్ లో వున్న కార్తికేయ ఫిలిమ్స్ స్టూడియోలో నిర్మించారు. ఈ సినిమా పతాక సన్నివేశంలో కన్నాంబ పారిస్ కార్నర్ రోడ్ లో పిచ్చిదానిలా “దేవుడు లేడూ…సత్యం జయించదూ” అంటూ బస్సులకు అడ్డంగా పరిగెడుతూ ఉంటే, ఆ వేగాన్ని యూనిట్ అందుకోలేకపోయింది. ఆమె నిజంగానే పిచ్చిదని భావించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను పూల బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్మాతలు, యూనిట్ సభ్యులు వచ్చి ఆమెను విడిపించాల్సి వచ్చింది. ఆరోజుల్లోనే కన్నాంబకు హెచ్.ఎం. రెడ్డి పదివేల పారితోషికాన్ని ఇచ్చి గౌరవించారు. ‘గృహలక్ష్మి’ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. అయితే బి.ఎన్. రెడ్డి కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో హెచ్.ఎం. రెడ్డితో విభేదించి తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని బయటకు వచ్చేశారు. తరవాత బి.ఎన్.రెడ్డి నాగిరెడ్డి, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సముద్రాల రాఘవాచార్యను కూడా బయటకు తీసుకొని వచ్చి వాహినీ సంస్థను నెలకొల్పారు. గృహలక్ష్మి చిత్రం తరవాత వెంపటి సదాశివబ్రహ్మం చేత కథ రాయించి హెచ్.ఎం. రెడ్డి ‘తెనాలి రామకృష్ణ’ (1941) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పి. కోటేశ్వరరావు, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఎల్.వి. ప్రసాద్, రామతిలకం, పువ్వుల అనసూయ, పారుపల్లి సుబ్బారావు, గంగారత్నం నటించారు. గండోపంత్ వలవల్కర్ సంగీతం సమకూర్చారు. సదాశివబ్రహ్మంకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. సినిమా విజయవంతమైంది. తరవాత 1942 నుంచి 1951 మధ్యకాలంలో ఘరానా దొంగ, సతీ సీత, నిర్దోషి సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్దోషి చిత్రాన్నే తమిళంలో నిరపరాధి పేరుతో సమాంతరంగా నిర్మించారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం విశేషం. అప్పటిదాకా విలన్ వేషాలు వేస్తున్న ముక్కామలను ఈ చిత్రంలో హీరోగా చేయడం, హీరోయిన్ పాత్రల్లో బిజీ అవుతున్న అంజలీదేవిని వ్యాంప్ పాత్రలో నటింపజేయడం ఆయనకే సాధ్యమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొదలుపెట్టిన ‘అమృత హస్తం’ అనే చిత్రాన్ని హెచ్.ఎం. రెడ్డి పూర్తిచేయలేకపోయారు. తరవాత బెంగుళూరుకు మకాం మార్చి ‘మైసూర్ మూవీ టోన్’ అనే సంస్థను నెలకొల్పారు. మధ్యకాలంలో బొంబాయి వెళ్లి ‘జస్టిస్’ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1949లో బొంబాయినుంచి మరలా మద్రాసు వచ్చేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘నిర్దోషి’ (1951) చిత్రం విజయవంతం కావడంతో హెచ్.ఎం. రెడ్డి మద్రాసులో రోహిణీ స్టూడియో నిర్మించారు. 1953 లో హెచ్.ఎం. రెడ్డి ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కాంతారావు ని హీరోగా, రాజనాలను విలన్ గా పరిచయం చేశారు. ప్రస్తుతం జెమినీ సర్కిల్ వద్ద గల పాంగ్రోవ్ హోటల్ వున్న స్థలం ప్రక్కనే హెచ్.ఎం. రెడ్డి బంగాళా వుండేది. తను కారులో స్టూడియోకి వెళ్తున్నప్పుడు ఎవరైనా సినిమా టెక్నీషియన్ కనపడితే వారికి లిఫ్ట్ ఇవ్వడం హెచ్.ఎం. రెడ్డికి అలవాటు. తరవాతి కాలంలో పోషణ లేక విరుగంబక్కం లోని రోహిణీ స్టూడియో గోల్డెన్ స్టూడియోగా మారిపోయింది. ఆ స్థలంలో ఇప్పుడు ఫుడ్ కార్పోరేషన్ వారి గిడ్డంగులు దర్శనమిస్తున్నాయి. హెచ్. ఎం. రెడ్డి మంచితనానికి జేజేలు పలుకుతూ ఈ మీసాల పులిని ఆప్యాయంగా అందరూ ‘పప్పాజీ’ అని పిలుస్తుండేవారు. ‘గజ దొంగ’ సినిమా నిర్మాణంలో వుండగా జనవరి 14, 1960 న ఈ మీసాల పులి మద్రాసులో తనువు చాలించింది.
-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)