జానపదచిత్ర రారాజు అంట్యాకుల పైడిరాజు

 “Love at first site”
ఎవరు ఎప్పుడు ఎందుకు  ఈ మాటను అన్నారో నాకైతే తెలియదు కాని ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది .సాధారణ పరిభాషలో అది ఒక సౌన్దర్యవంతమైన అమ్మాయి లేదా అబ్బాయిల మధ్య  ఒకరికొకరికెదురైన ఒక మధురమైన అనుభూతిని తెలిపే పదంగా దీనిని  మనం భావిస్తున్నప్పటికీ ఈ పదం మిగిలిన ఎన్నో సందర్భాలకు కూడా వర్తిస్తుంది.

 అది 1995 వ సంవత్సరం తొలిసారిగా నేను ఉపాధ్యాయుడిగా ముమ్మిడివరం లో నియమింప బడిన  ఏడాది .అక్కడ పంచాయితి లైబ్రరీ లో తొలిసారిగా  నా కంటపడిన 1960 వ దశకం నాటి  చలసాని ప్రసాదరావు గారి సంపాదకత్వంలో వెలువడ్ద “ కళ “అనే పుస్తకం లో ప్రచురింపబడ్డ ఒక చిత్రం నాకలాంటి అనుభూతినే  కలిగించింది .  ఒక అచ్చమైన పల్లెపడుచు జడ నిండా పూలు పెట్టుకుని పొడవైన  వాలు జడను వయ్యారంగా ముందుకు వేసుకుని ముస్తాబు చేసుకుంటూ చివరిలో నుదుటను తిలకం దిద్దుకుంటున్న దృశ్యం అది. నిజానికి మన భారతీయ శిల్ప కళా చరిత్రలో ఇలాంటిది ఒక సాధారణ దృశ్యమే ,ఎందుకంటే పదహారవ శతాబ్దం నాటికే హోయసాలుల బేలూరు హళిబీడు శిల్పాలలో నుదుట తిలకం దిద్దుకుంటున్న శిల్పాలను ఆనాటి శిల్పి చెక్కియున్నాడు .అయితే ఈ చిత్రకారుడు శిల్పి కూడా అయినప్పటికీ ఇక్కడ  రచించింది శిల్పం కాదు… చిత్రం , అందునా ఆ శిల్పానికి ఈ చిత్రకారుడి చిత్రానికి ఒక్క అలంకరణ అన్న పదం తప్ప మిగిలిన  ఏ విషయంలోను పోలిక లేదు. ఈ చిత్రంలో అలంకరణ చేసుకుంటున్న అమ్మాయిది కూర్చున్న బంగిమ .ముందు పేర్కొన్న కాలం నాటి శిల్పాల్లోలా నిల్చున్న బంగిమ కాదు.ఆ కూర్చున్న భంగిమలో కూడా  ఒక అందమైన లయ ,రూపంలో అచ్చమైన జానపదం , నిండైన తెలుగు దనం,మరియు రంగుల్లో మనసును తాకేటి మట్టి వాసన, వెరసి వీక్షకుడి మానసాన్ని  హత్తుకునేటి ఒక నవ్యరీతి అది పూర్తిగా తెలుగు వాడిది అన్నంతగా భావించే ఒక అనుభూతి తొలిసారిగా చూసినప్పుడు నాకు  కలిగింది .ఆ తర్వాత మరలా కొన్నాళ్ళకు విజయవాడ లో మొన్నటివరకు వుండే విక్టోరియా మ్యూజియం లో అనుకుంటాను ఇదే చిత్రకారుడి వేరొక ఒరిజినల్ చిత్రం “ చేటలో బియ్యం పోసుకుని అందలి రాళ్ళు ఏరుతున్నమరొక  పల్లె పడుచు “ను చూసాను ఈ చిత్రంలో కూడా అదేశైలి అదే ఆకర్షణ మరలా నాలో. ఇప్పటికి ఓ ఇరవై మూడేళ్ళ  క్రితం తన చిత్రం ద్వారా  నన్ను  అంతలా ఆకట్టుకున్న ఆ చిత్రాకారుడే మనమంతా గర్వపడే ప్రఖ్యాత జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు గారు.

 రంగులతో రేఖలతో సృస్టింపబడ్డ కళ చిత్రకళ , అయితే కేవలం రంగుల కలయిక వర్ణ చిత్రం కాదు , అలాగే కేవలం రేఖల కలయిక కూడా  రేఖా చిత్రం కాదు రంగులు అద్దడంలో ఒక పొందిక వున్నప్పుడు రేఖల అమరికలో ఒక లయ కుదిరినప్పుడు మాత్రమే అది ఒక వర్ణ చిత్రంగాను లేదా రేఖా చిత్రంగాను మారుతుంది అలా కాకుంటే అవి కేవలం వొట్టి రేఖలు లేదా శుద్ద వర్నాలుగానే మిగిలిపోతాయి.

 కేవలం రేఖలతో చిత్రాలు సృష్టించేవాల్లు కొందరైతే కేవలం రంగులతోనే  చిత్రాలను సృష్టించే వాళ్ళు  ఇంకొందరు . కేవలం రూపాలను మాత్రమే చిత్రించే వాళ్ళు కొందరైతే కేవలం నైరుపాలను చిత్రించే వాళ్ళు ఇంకొందరు . కేవలం భావ సహిత చిత్రాలను సృస్స్టించే వాళ్ళు కొందరైతే కేవలం భావరహిత చిత్రాలను సృష్టించే వాళ్ళు మరికొందరు రంగు , రేఖ రూపం నైరుపం భావం అభావం ఏది ఎలా ఎందుకు ఎప్పుడు ఏ విదంగా  సృష్టించినప్పటికి అన్నింటి ఉద్దేశ్యం వీక్షకుడి మనసును  రంజింపజేయడమే .అలా అని కేవలం రంజింప జేయడం మాత్రమే  కాదు ఆలోచింపజేయడం , ఇంకా ఎదో సందేశం ఆ చిత్రం ద్వారా ఈయడం కూడా ముఖ్యం . ఇలా చూసినప్పుడు పైడి రాజు గారి చిత్రాల్లో కేవలం రేఖలే ఉండవు అలాగని కేవలం రంగులే వుండవు. రంగులు రేఖలు రెండు కూడా పొందికగా అమరి వుంటాయి . ఆ రేఖలలో కొన్ని  రుపాలుంటాయి ఆ రూపాలలో  ఒక సాంప్రదాయం వుంటుంది. ఒక జాన పదం వుంటుంది తరతరాల తెలుగు నుడికారం వుంటుంది . ఒక జాతి  గొప్పతనాన్ని సగర్వంగా చెప్పుకునే ఒక రీతి వుంటుంది ఒక తిలకం , ఒక పేరంటం , ఒక వీణా పాణి , పూలమాలకట్టే స్త్రీలు , ముంగిట ముగ్గు పెట్టె మగువలు  లాంటి చిత్రాల్లో ఎంతటి లలితమైన భావణా రీతి మనకు కనిపిస్తుందో , పంట కోసే స్త్రీలు ,  సంతకేగు స్త్రీలు , కార్మికులు , కర్షకులు , కృషీ వరులు లాంటి చిత్రాలలోపనిపాటలు చేసుకునే జనావలిలో వుండే  ఒక విదమైన మొరటుతనం కూడా కనిపించేలా చేసినప్పటికీ కట్టు బొట్టు వస్త్రధారణ  అన్నింటా సంప్రదాయాన్ని విస్మరించని ఒక తెలుగు దనాన్ని పైడిరాజుగారి చిత్రాల్లో మనం చూస్తాము. గ్రామాలలోని పూరి పాకలు పైడిరాజు గారి చిత్రాల్లో పాలరాతి భవనాలను మించిన సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. పూరి పాకలు లేకుండా ఏ ప్రకృతి చిత్రాన్ని పూర్తి చేయకపోవడం పైడి రాజు గారి ప్రకృతి చిత్రాల మరొక ప్రత్యేకత.

ఒక చిత్ర కారుడు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్హింప బడాలి అంటే ఆ చిత్రకారుడి సృజనలో స్వచ్చత  వుండాలి . తనదే అయిన శైలి కావాలి అది సమాజంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొనేదిగా కూడా వుండాలి అప్పుడే వారి చిత్రాలు ప్రముఖంగా పెర్కొనబడతాయి . పైడి రాజు గారి చిత్రాలు పై లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాయి కనుకనే “ఆఫ్టర్ బాత్ “అన్న వీరి చిత్రం ఆఫ్ఘన్ రాజు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా ఈజిఫ్ట్ సేకరించిన “ ఎ న్యూ రోడ్ “అన్న చిత్రం గాని రష్యా వారు కొనుగోలు చేసిన “టు ది మార్కెట్ “అన్న చిత్రం  లతో పాటు సాలార్ జంగ్ మ్యుసియం  లాంటి సంస్థలతో పాటు ఎందఱో పబ్లిక్ అండ్ ప్ప్రైవేట్ వ్యక్తుల సేకరణలో ఉండడానికి కారణం అయ్యింది.

 ఇప్పటికి నూరేళ్ళ క్రితం అనగా 1919 లో బొబ్బిలి నందు  జన్మించిన పైడి రాజు గారు   చిన్న తనమునందే చిత్రకళలో తనదైన శైలిని ఏర్పరుచుకొని ప్రఖ్యాత చిత్రకారుడు మరియు శిల్పి అయిన రాయచౌదరి గారి గురుత్వంలో ఎన్నో దూషణ భూషణలని కష్ట నష్టాలను ఎదుర్కొని దిగ్విజయంగా చిత్రకళను అబ్యసించిన వీరు తనలా ఎవ్వరు చిత్రకళ అభ్యసనకు కస్టాలు పడరాదనే ఉద్దేశ్యంతో  తానే స్వయంగా 1949లో స్వంతంగా విజయనగరంలో ఒక  చిత్ర కళాశాలను ప్రారంబించి ఎందరో చిత్రకారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప చిత్రకారుడు శ్రీ అంట్యాకుల పైడిరాజు గారు.

 రాయచౌధరి సాంప్రదాయానికి చెందిన ఈ చిత్రకారుని పై లేపాక్షి అజంత చిత్రకళల ప్రభావంతో పాటు జామినిరాయ్ ప్రభావం కూడా వుందని చెప్పవోచ్చు ఆ  ప్రభావంతో తనదైన ఒక జానపద శైలిని సృష్టించి ఒక గొప్ప చిత్రకారునిగా కీర్తి నార్జించిన పైడి రాజు గారు గొప్ప శిల్పి , కవి, మరియు నటుడు  గాయకుడూ కూడా కావడం గొప్ప విశేషం . అక్షర శిల్పాలు అన్న పేరుతో ఎన్నో గేయాలను వీరు రాయడం జరిగింది.

 జీవితం అశాశ్వతం కాని కళ మాత్రం శాశ్వతం అన్నారు పెద్దలు .పైడి రాజు గారు  ఈ భువి పైకి వొచ్చి వందేల్లయ్యింది. ఈ భువిని వీడి దివికేగి కుడా  అప్పుడేఇరవయ్యేల్లయ్యింది . కాని ఆయన సృష్టించి మనకు వొదిలి వెళ్ళిన ఆయన కళ మాత్రం ఇంకా మనతో సజీవంగా వుంది , మన తర్వాత కూడా  సజీవంగానే నిలిచివుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

 వెంటపల్లి సత్యనారాయణ  (9491378313)

SA:

View Comments (9)