కష్టజీవుల వెతలు, ఆకలి కేకలే ఆయన పాటలు

ఆ కలం పల్లె సౌందర్యాన్ని పాటగా మలిచింది. ఉద్యమ గీతాల్లో కరవాలం అయింది. గిరిజనుల గోసలు, కష్టజీవుల వెతలు, ఆకలి కేకలు.. ఇలా కడుపు కాలిన ప్రతి సందర్భానికీ ఆయన పాట అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. పాటను తన ఊపిరిగా, బాటగా మలుచుకొని, అక్షరాన్నే ఆయుధంగా చేసి అన్యాయాలను ప్రశ్నించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు, సినీగేయ రచయిత జయరాజు.

ప్రజాకవిగా, ఉద్యమ పాటలకు ప్రతీకగా పేరొందిన గొడిశాల జయరాజు స్వస్థలం మహ బూబాబాద్ సమీపంలోని గుముదూరు గ్రామం. తల్లిదండ్రులు చెన్నమ్మ, రాజయ్య. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో ఆయన చదువు సాగింది. డిగ్రీ వరకు చదువుకున్న జయ రాజు విద్యార్థి దశ నుంచే అన్యాయాన్ని ప్రశ్నించే వారు. తన పాటలతో నిలదీసేవారు. సింగరేణిలో ఫిట్టర్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్లారు.

పాటపాటలో కొత్త కోణం సాటి కార్మికుల కష్టాలు, ఆనాటి పల్లె తెలంగాణ స్థితిగతులే కవితా వస్తువుగా ఎంచుకొని వందల కొద్దీ గీతాలు రాశారు జయరాజు. ‘నిన్నెట్టా మరి చిపోదును చేరాల’, ‘ఎక్కడ ఉన్నారో అన్నలు’, ‘అమ్మా సింగరేణి’, ‘వానమ్మా వానమ్మా వానమ్మా ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా’ వంటి ఉద్యమ, సందేశాత్మక గీతాలు వందల సంఖ్యలో రాశారు. ఇవి ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఉద్యమ రచయితలు స్పృశించని అనేక అంశాలను పాటలుగా మలిచి తనదైన ముద్రను నిలుపుకొన్నారు. కష్టజీవుల బతుకుల మీద ఎన్నెన్నో పాటలు కట్టారు. ప్రకృతిపై ప్రేమతో రాసిన సాహిత్యా న్ని ‘అవని’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ‘భారత మార్క్స్ అంబేడ్కర్’, ‘వసంత గీతం’ వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు.

మొదటి పాట సూపర్ హిట్
పల్లెపదాలు, జానపద గీతాలతో తెలంగాణను హోరెత్తించి జయరాజు సినిమాల్లోనూ తనదైన శైలిలో అందమైన పాటలు రాశారు. ‘దండోరా’ సినిమాలో ఆయన రాసిన ‘ఓ.. కొండల్లో కోయిల పాటలు పాడాలి. అడవుల్లో అక్షరదీపం వెల గాలి..’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. గిరి జన బిడ్డలు అక్షరాలు దిద్దాలని, శ్రమించే చేతులు బలపం పట్టాలని.. ఈ పాటతో గూడెం గుండెల్లో అక్షరకాంతిని వెలిగించారు.

Singer Jayaraju with his wife

ప్రతీ పాట ఒక పాఠం
‘అడవిలో అన్న’ చిత్రంలోని ‘వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా.. సల్లంగ బతుకు కొడుకా నూరేళ్లు’ పాట జయరాజుకు ఎంతో పేరు తెచ్చిపె ట్టింది. ఆయనను శిఖరస్థాయికి చేర్చింది. ఇదే సిని మాలో ‘వెళ్లిపోయావా అమ్మా.. చెల్లిపోయావా’ అని సాగే విషాద గీతిక మనసున్న ప్రతి మనిషితో కంటతడి పెట్టిస్తుంది. అదే ఏడాది ‘సింగన్న’ సిని మాలో జయరాజు రాసిన ‘మోటరోల్ల కన్న కొడుకా.. నువ్వు రక్కసోల్ల బారిన పడ్డావా.. చిత్ర హింసల చెరలో చిక్కావా.. ఊరు ఏడ్చిందయా నీ బాధ చూసి’ అంటూ సాగే పాట కన్నీటి బతుకుల కథను కండ్లముందు నిలుపుతుంది. ఇదే సిని మాలో ఆయన రాసిన ‘కలగంటి కలగంటి కలగం టినమ్మా’ అనే పాటలో ‘అందనంత ఎత్తు నా చెల్లి ఎదుగునని, చుక్కల్లో చంద్రుడు నా తమ్ముడ వునని’ అనే పంక్తులు తోబుట్టువుల ప్రేమానురా గాలను తెలియజేస్తాయి.

అనురాగాల ఊట ‘చీకటి సూర్యులు’ సినిమా కోసం ‘దండాలో సామన్నా ఎర్రెర్రని దండాలన్నా’ అనే విప్లవగీతం రాశారు. ‘ఛలో అసెంబ్లీ’ చిత్రంలోని ‘ఓ బిడ్డా ఒక్కసారన్న వచ్చిపోవా నా బిడ్డా’ అనే పాట కొడుకు కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల ప్రేమ బంధాన్ని గుర్తుచేస్తుంది. మమకారపు మాధు ర్యాన్ని పదాల్లో నింపి రాసిన గేయం ఇది. ‘దేవర కొండ వీరయ్య’లో’తోడై నువ్వు ఉండాలమ్మా నూరేళ్లు.. మా కంట్లో పాపగ వెలగాలమ్మా వెయ్యేళ్లు’ అనే పాట తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ‘పీపుల్స్ వార్’లోని ‘భూగోళం తిరుగుతున్నది ధనం చుట్టూ చూడరా.. ఆ ధనమే తిప్పుతున్నది మనిషిని తన చుట్టూరా..’ అనే గీతం డబ్బు మనిషిని ఎలా నాశనం చేస్తున్నదో తెలియజేస్తుంది. ఇలా ఎన్నెన్నో పాటలు పల్లెపదాల్ని, ప్రాకృతిక మెరు పుల్ని, ఉద్యమ భావజాలాన్నీ తన కలం గొంతులో పలికించిన, పలికిస్తున్న జయరాజు పాటల రారాజు. ఆయన కలం నవరసాలకూ ప్రాతినిధ్యం వహిస్తుంది.

  • తిరునగరి శరత్ చంద్ర
SA: