ప్రజా వాగ్గేయకారుడు వంగపండు

జానపదుల గుండె చప్పుళ్ళను తనపాటద్వారా ఊరూరా ప్రతిధ్వనించిన వాడతడు. జానపద బాణీలకు పోరాటపటిమను ఎర్రజెండగా ఎగురువేసినవాడతడు. సమాజం గర్భంలో రగిలిన మంటను పాటలు పొదిగి తూటాగా మార్చిన వాడతాడు. కర్షకుడిగా, కార్మికుడిగా పడిన పాటులన్ని పాటలుగా మారాయి. సామాన్య ప్రజలు బ్రతుకు కష్టాలు ఉత్తరాంధ్ర జానపదరీతులలో అనేకపాటలు వ్రాసారు, పాడారు.నాట్యమాడారు.
తన పాటలన్నింటికి ఉత్తరాంధ్రలోని జానపద బాణీలే మూలధార మంటారు. రామన చందినాలో వెన్నెలా రాజనీకొందానాలో’ అనే బాణీ కూడా ఉత్తరాంధ్రజానపద బాణీ అంటారు వంగపండు ప్రసాదరావుగారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం దరి పెదబొండపల్లి గ్రామంలో 1943 జూన్ 10 న చినతల్లి,జగన్నాథం దంపతులకు జన్మించిన వంగపండు ప్రసాదరావు తొలుత రైతు, తరువాతే విశాఖ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేశారు. గ్రామీణ తెలుగు భాషలో అసలు తెలుగుపాటను 1969లో రాసారు. సుమారు 300 విప్లవ గీతాలు, 20 సినిమా పాటలు రాసారు. శ్రీకాకుళం పోరాటంపై ‘సిక్కోలు యుద్ధం’ ఈయన రచనే. ఢిల్లీ నుంచి ఆంధ్రరాష్ట్రం వరకు వందలాది ప్రదర్శనలిచ్చారు. ఈయన మరో ప్రముఖ రచన ‘భూమి భాగోతం’. ఉత్తరాంధ్రలో భూస్వాముల దోపిడి, ఆనాటి నాయుడు, కరణం, మున్సబ్, పోలీస్ వ్యవస్థలను ఎండగడుతూ వ్రాసిన ఈ ‘భూమిభాగోతం’ జననాట్యమండలి ద్వారా 500 ప్రదర్శనలు పొందింది. మాట, ఆట, పాట ద్వారా జనాలను గంటల కొద్ది నిలబెట్టగలిగే సత్తావున్న వ్యక్తి వంగపండు. గ్రామాగ్రామాన ఆరోజులలో భూమి భాగోతం ప్రదర్శించే బృందాలు తయారైనాయి.

1960 ప్రాంతంలో కరువు కారణంగా శ్రీకాకుళం జిల్లా వాసులు వలసలకు నిదర్శనంగా ఏం పిల్లడో భిలాయి వెళ్తుమా! అనే పాట ఉండేది దాని బాణిలోనే ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ సినిమాలో

“శ్రీకాకుళం ఆసీమ కొండకు
ఏం పిల్లడో వెళ్దమస్తవ
ఏం పిల్లో వెళ్దమస్తావ” అనే పాట రాసారు.

షిప్ యార్డ్ లో కార్మికుడిగా చేరిన తరువాత కార్మిక సోదరుల కష్ట నష్టాలు అర్థం చేసుకొని కొన్ని పాటలు వ్రాసారు. అందులో ఎందరో శ్రమించి తయారు చేసిన ఓడను వ్యాపారి లాక్కుపోతుంటే కన్న కూతుర్ని మెడలో పసుపుతాడు వేసిలాక్కుపోతున్నప్పుడు తల్లితండ్రులు బాధపడినట్లు

‘ఓడా నువ్వెళ్లిపోకే
నీటిలోన కోటలాగ
ఎముకలోంచికట్టినాము’

అనే పాటలో వ్రాసారు. భూస్వామి పోలీసుల తోడుతో ఎలావస్తున్నాడో. ఈ పాట ద్వారా తెలియజేసారు.
“వత్తన్నాడొత్తన్నాడు భూములన్న ఋగతోడు పోలీసుల తోడు తోడు వత్తున్న డొత్తున్నాడు”

సిక్కోలు యుద్ధంలో..
“ఆకు చిక్కితే వాల్ల రత్తము
అక్కడ కారుద్దోయ్ నాయన
మొక్క పీకితే చిక్కని చెమటా
చుక్కలు పడతాయో నాయన”.

ఏరువాక, పొలికేక, జాలరి భాగోతం వంటి పాటల సంకలనాలు వ్రాసారు. ఆంధ్రజన నాట్యమండలి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

“యంత్రమె నడుస్తుఉందంటే….
రైలు, కారు, మోటార్ బండి

“బయలుదేరవే పిల్లా రైలుబండి ఎక్కెల్దాం” వంటి పాటలతో పాటు ఈయన రచించిన “అడవి దివిటీలు” (గిరిజన యువతి పోరాట రూపం) నాటిక విశాఖలో 50 రోజులు ప్రదర్శించబడింది. యంత్రమెట్లా నడుస్తుఉందంటే వంటి పాటలు ఇంగ్లీష్ బెంగాలి, హిందీ వంటి భాషల్లోకి అనువదించబడి దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈయన సాహిత్యంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి విద్యాలయాల పరిశోధనలు చేసి గ్రంథాలుగా వెలువరించాయి. మరికొన్ని పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి. బి.నరసింగరావు, టి. కృష్ణ వంటి సినిమా నిర్మాతలు ఈయన సాహిత్యమంటే ఇష్టపడేవారు. శ్రీశ్రీ కూడా ఈయన సాహిత్యాన్ని ప్రోత్సాహించారు. సినిమా వారు కూడా ఈయన సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారు. ప్రజా కళలు వ్యాపారం కోసం, అవార్డుల కోసం అమ్ముకో కూడదని నమ్మిన వ్యక్తి వంగపండు.

జజ్జనకరి జనారే!
జనకుజనా జనారే!!

వంటి ఎన్నోపాటలు ప్రజల నాలుకల మీద ఇంకా నిలిచిఉన్నాయి. కర్షకుడిగా, కార్మికుడిగా పడ్డపాటులన్నింటిని పాటలుగా మలచిజనం కోసం గుండె చప్పులు వినిపించిన అచ్చమైన ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర వాసి.తన పరిసర గ్రామాలలో జానపదాలు,పొలాలలో స్త్రీలు పాడు కొనే పాటలు ముఖ్యంగా జాలరి భాగోతం తన పాటకు ప్రేరణ అని చెప్పే వంగపండు ప్రసాదరావు 2020 ఆగస్టు 4 న కన్నుమూశారు.

ఈయన స్మృత్యర్థం విశాఖపట్నం బీచ్ లో నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించారు.

బద్రి కూర్మారావు
విజయనగరం (సెల్: 8309077607)

Share via
Copy link
Powered by Social Snap