‘స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం
చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన “స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో విజయవాడ, పటమట దేవీ లిటిల్ స్టార్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మే 31 వరకు నిర్వహించబోతున్న ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులను స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డెరైక్టర్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ జనరల్ సెక్రటరీ స్ఫూర్తి శ్రీనివాస్, ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ మేడా రజని, సుధా టెక్నాలజీస్ అధినేత వి.జగన్ మోహన్ లు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులను…వారి తల్లిదండ్రులను ఉద్ధేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్ఫూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రలేఖనం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని అలాగే ఏకాగ్రత, పరిశీలనా శక్తి, సృజనాత్మకత, ఓర్పు,సహనం లాంటి మంచి లక్షణాలు అలవడుతాయని తద్వారా వారు రెగ్యులర్ స్టడీస్ లో కూడా ఉత్తమంగా రాణించగలరన్నారు. అనంతరం ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్, మేడా రజని మాట్లాడుతూ వినూత్నంగా ఆలోచించగలిగి ఓర్పుతో పనిచేయగలిగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని అన్నారు. మరొక ముఖ్య అతిథి సుధా టెక్నాలజీస్ అధినేత వి.జగన్ మోహన్ మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల కొలమానమే కాదని సృజనాత్మకతతో కూడిన పలు విభాగాల్లో ప్రతిభను చాటి వివిధ సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో సైతం రాణించగలిగినప్పుడే మనం చదివిన చదువుకు సార్థకత అన్నారు.
కార్యక్రమానికి స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భారతీదేవి వీరంకి పర్యవేక్షించగా ఇతర టీం సభ్యులు పద్మ, మాధురి, కవిత, లీపాక్షి, పద్మలత తదితరులు పాల్గొన్నారు.