మా గణపవరం కథలు

డాక్టర్ రమణ యశస్వి రాసిన కథల సంపుటి ‘మా గణపవరం కథలు’ సంపుటిలో 33 కథలున్నాయి. దుగ్గరాజు శ్రీనివాసరావు ‘చికిత్స కథలు’, గోపరాజు నారాయణరావు ‘సామాజిక సంఘర్షణల చిత్రణే మా గణపవరం కథలు, డా. పి.వి. సుబ్బారావు సహజ సృజనాత్మక విల సితాలు మా గణపవరం కథలు’ శీర్షికలతో ఈ కథల వైశిష్ట్యాన్ని వివరించారు. బలభద్రపాత్రుని ఉదయశంకర్ ‘కథల యశస్వి’ అని తమ ముందు మాటలో కీర్తించారు.

రమణ యశస్వి గుంటూరు నగరంలో ‘ఆర్టోసర్జనుడు’. దాదాపు మూడు దశాబ్దాలుగా కలం పట్టుకుని అక్షర సేవ చేస్తున్నారు. నానీలు రాశాడు. కవితలు, గీతాలు, రెక్కలు అల్లాడు. ‘న్యూమరిక్కులు’ అనే కొత్త ప్రక్రియను సృష్టించాడు. ఇప్పుడు కథలు చెప్తున్నాడు. అతను చేస్తున్న ఇంత కృషీ సమాజంలో మార్పు కోసమే. అందుకే ‘సర్జనుడు’ కూడా గుర్తింపు పొందాడు.

మా గణపవరం కథలులో పేరును బట్టి చూస్తే ఓ మూడు కథలు మాత్రమే ఆ శీర్షికకు న్యాయం చేశాయి. మిగతా కథలన్నీ సామాజికాంశాలే. స్థానికతను అర్థం చేసుకుని యశస్వి కన్నా ముందే కొందరు కథలు రాశారు. గుంటూరు జిల్లా నుంచి అటువంటి కథ సాహిత్యాన్ని విస్తృతంగా వెలువడింది. మా గోఖలే కథలు చదివితే గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు గ్రామం ప్రత్యక్షమవుతుంది. గుంటూరు గ్రామీణ మాండలికంలో కథా కథనాలను నడిపి గోఖలే కథానికా ప్రక్రియలో ప్రసిద్ధి చెందారు. ఇంకా శంకరమంచి అమరావతి కథలు: డా॥ నక్కా విజయ్ రామరాజు భట్టిప్రోలు కథలు: మా ఊరి కథలు, పూదోట శౌరీలు సిలువగుడి కథలు: భావరాజు పద్మినీప్రియ మా బాపట్ల కథలు: సుజాత వేల్పూరి పల్నాడు ప్రాంతీయ కథా సంపుటాలు- ఇంకా అందే నారాయణస్వామి, పాపినేని శివశంకర్, వల్లూరు శివప్రసాద్, డాక్టర్‌ గురవారెడ్డి, పెనుమాక నాగేశ్వరరావులు రాసిన ప్రాంతీయ కథలున్నాయి. ‘గుంటూరు కథలు’ సంకలనంలో గుంటూరు సీమ జీవితాల్ని ప్రతిబింబించే కథలున్నాయి. గుంటూరు సీమ దాటి బయటికెళ్తే నామిని, ఖదీర్బబు, వంశీ, నిశాపతి మొదలగువారు ప్రాంతీయ కథా సాహిత్య సృష్టికర్తలు.

ఇంతకీ ఈ ప్రాంతీయ సాహిత్యం ఎందుకు కావాలి? ఎందుకు ఉపకరిస్తుంది? అని ప్రశ్నించుకుంటే ప్రముఖ చరిత్రకారులు వకుళా భరణం రామకృష్ణ చరిత్రకు సంబంధించి చెప్పిన మాటలు సాహిత్యానికీ వర్తిస్తాయి.
విస్తృత పరిధిలో చరిత్ర దృక్పథాన్ని అవగాహన చేసుకోవడానికీ, మానవ సమాజాలను సూక్ష్మస్థాయిలో విశ్లేషించుకోవడానికి ఈ ప్రాంతీయ చరిత్రలు, వాటిలో భాగంగా స్థానిక చరిత్రలు తోడ్పడ తాయి.
‘స్థానిక చరిత్ర సంస్కృతులు బృహత్ చరిత్రలో అంతర్భాగాలు. బృహత్ చరిత్ర నిర్మాణానికి ఇవి దోహదం చేసి, సంపన్నతను మరింత సమగ్రతను చేకూరుస్తాయి. ఆ మరో విషయం కూడా యిక్కడ ప్రస్తావిస్తాను. చరిత్రలో అప్పుడప్పుడు ఏర్పడిన ఖాళీలను సాహిత్యం పూర్తి చేస్తుంది.

మా గణపవరం పుస్తకంలోని కథా సాహిత్యం ద్వారా రమణ యశస్వి తన జన్మభూమి అయిన గణపవరం ప్రస్తావన వచ్చే కథలు కాటీడుకోక, అమ్మ వున్న ఇల్లు, ఎర్ర బర్రె వున్నాయి. ‘కాటీడు కోక మనకెవరికీ తెలియని ఒక గ్రామీణ సంప్రదాయాన్ని గణపవరం భాషలో పరిచయం చేస్తుంది. ‘అమ్మ వున్న యిల్లు’లో సెల్ఫోనన్ను పూర్తిగా స్వాధీనం చేసుకుని తన ప్రపంచాన్ని సృష్టించుకున్న మోడ్రన్ బామ్మ’ విశేషాలు తెలుపుతుంది. ఆ బామ్మకు కుటుంబంతో వున్న బాంధవ్యాన్ని కాక తన గ్రామంతో ఆమెకున్న అనుబంధాన్ని తెలుపు తుంది. అలాగే ‘ఎర్రబర్రె’ మనిషికీ పశువుకీ వుండే బాంధవ్యాన్ని వివరించింది. గ్రామీణ జీవితంలో వుండే ఒక సాధారణ దృశ్యాన్ని మన కళ్ళముందుంచారు రమణ యశస్వి.

అవినీతికి కొత్త అర్థం ‘నదినీతి’గా చెప్తారు రమణ యశస్వి. Work delayed is money అని అవినీతి భాగోతాన్ని కొత్త తరహాలో మనకు ‘ఈ మొగుడు నాకొద్దు’ కథలో వివరించారు. నదీ ప్రవాహం ముందుకే గానీ వెనక్కు రాదు. అయితే విదేశాలకు వెళ్ళినవారు వెనక్కు తిరిగి రావటాన్ని ‘తిరిగొచ్చిన నది’ కథలో దేశభక్తిని ప్రతి పాదిస్తూ చక్కగా చెప్పారు. కులమత రహిత సమాజాన్ని ఆశించే యువజంట ఆదర్శాలను మనకందించిన కథ ‘చైతన్యదీపం’. కరోనా కష్టకాలంలో ఒక పెద్దమ్మ తనజీవిత కార్యాచరణను సమాజ సంక్షేమం కోసం ప్రకటించడం ‘పెద్దమ్మ’ కథలో చదువుతాం. సాంకేతిక పరిజ్ఞానం వెర్రితలలు వేస్తుండటాన్ని “గొట్టంగురు’ కథానిక ద్వారా వ్యంగ్యధోరణిలో చెప్పారు. ‘తెలుగు ప్రాణం’ కథ “ఏ దేశమేగినా ఏ పీఠమెక్కినా’ తల్లిభాషకు దూరం కావద్దు అనే సందేశాన్నిస్తుంది. డాక్టర్ రమణ యశస్వి అచ్చులో చూసుకున్న తొలికథ ‘మదరమ్మ’లో సుందరమ్మ మదరమ్మగా ఆమె ఆదర్శవంతమైన జీవన చర్య ద్వారా రూపొందటాన్ని రచయిత చూపిస్తారు. రమణ యశస్వి కథల్లో దేశభక్తి, తెలుగు కోసం తపన, వైద్య విశేషాలున్నాయి. ఆడపిల్లలు వద్దనే వారిపట్ల తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని తన కథల్లో ప్రదర్శించారు. వ్యంగ్యం, హాస్యం మలుపులూ స్త్రీల పట్ల అత్యంత గౌరవం, ఆదరణ ప్రబోధించారు. కుటుంబ జీవితం ఉత్కృష్టం అన్నారు. కుటుంబ వ్యవస్థ పట్ల యశస్వికి ఎంతో గౌరవం వుందని తెలిపే కథలున్నాయిందులో. తీరిక లేమితో వైద్యవృత్తిలో వుండి కూడా డాక్టర్ రమణ యశస్వి ప్రవృత్తిపరంగా చేస్తున్న సాహిత్య కృషి అభినందనీయం.

పెనుగొండ లక్ష్మీనారాయణ

మా గణపవరం కథలు
పేజీలు: 220
వెల రూ. 200/-

ప్రతులకు:
డాక్టర్ రమణ యశస్వి
Mobile: 98480 78807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap