సికింద్రాబాద్,ఏ.ఎస్.రావు నగర్ లో నివాసం వుంటున్న శ్రీమతి గాయత్రి కనుపర్తి క్రెడో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ డైరక్టర్ గా చేస్తూ, ప్రవృత్తి పరంగా కవయిత్రి, రచయిత్రి, మ్యూజిక్ లో వీణపై రాగాలు పలికించగలరు, ఆర్టిస్టు, మరియు కార్టూనిస్టు కూడా. అంతేకాదు సామాజిక మాధ్యమాలలో డబ్ స్మాష్, టిక్ టాక్ లలో హుషార్ గాలపాల్గొంటూ మోములో భావాలను చూపించగల బహుముఖ ప్రజ్ఞాశాలి-ప్రతిభాశాలి కూడా.
బాపు గారి కార్టూన్లను అధ్వయనం చేస్తూ, కార్టూనిస్టుగా రాణిస్తున్నారు. గాయత్రి చిత్రించిన బుజ్జి గణపయ్యతో ఉన్న పార్వతి దేవి, హోయలొలికే పల్లెపడుచు అందాలు, జానపద నృత్య జంట చిత్రాలు, గౌతమ బుద్దుడు చిత్రాలు, ఇలా మహిళా ఇతివృత్తంతో గీసిన చిత్రాలు, సహజమైన సౌందర్యం, ప్రకృతి రమణీయత మొదలగు పేయ్ంటింగ్స్ సామాజిక అసమానతలకు అద్దం పడతాయి. ఈ నేపథ్యంలో ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా తానా & తెలుగు రక్షణ వేదిక సంయుక్తంగా మూడు తరాల సాహితి సమావేశంల NTR ట్రస్ట్ భవన్ లో నటులు, మంచిమనిషి, రచయిత ఎల్.బి.శ్రీరామ్ గారి చేతులమీదుగా గౌరవపురస్కారం అందుకోవడం అదృష్టం అంటారు గాయత్రి గారు.
“ప్రతి హృదయంలో అంతర్గతంగా మదిలో దాగున్నటువంటి వ్యక్తిత్వ, మనస్తత్వ మనోభావాల రూపమే నా రాతలు-గీతలు”, నిద్రావస్థలోని మనిషి మనస్సుకి కొత్తగా పరిచయమయ్యే అజ్ఞాత భావాలు కళలా కావచ్చు, కథలా కావచ్చు తెలియని తన్మయత్వపు భావాల నీడలే” అంటారు.
కళాకారుని కుటుంబంలో జన్మించిన గాయత్రి గారు తొలి గురువైన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో 5/6 సంవత్సరాలు పాటు అనంత నారాయణ గారి శిష్యరికంలో నేర్చుకున్న మెళుకువలతో పాటు, కుటుంబ సభ్యుల ఉత్సాహపరచడం, ముఖ్యంగా జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో “మూడు అక్షరాలు-ఆరు చిత్రాలు” లా సాగుతున్న ప్రయాణంలో అందరి ఆదరాభిమానాలను పొందకలిగానని అంటారు.
సరదాగా కుంచెతో మొదలైన ప్రస్థానం కలంతో చిన్న చిన్న పదాలు జతకట్టింది. బొమ్మలు వేయడం దానికి తగ్గట్టుగా అందమైన కవితలు రాయడం-కవితకు తగ్గట్టుగా అర్థవంతమైన చిత్రాలు వేయడం…..ఇలా, ఈ నేపథ్యంలో గాయత్రి గారి సాధనలో భావ కవితలు-ఊహా చిత్రాలు కలిపి “ఇట్లు……నీ…..” పేరుతో ఓ పుస్తకాన్ని రూపొందించారు.
“భావం నాదే-చిత్రం నాదే” అంటారు. ఈ రెండింటి ప్రమేయంతో నాలో చాలా ఆనందం. సంతృప్తిఉన్నాయి. సాధన అనేది మనసుతో సంబంధించినది కాబట్టీ ఎప్పుడు-ఏ సమయంలో పేయింటింగ్ వెయ్యాలనుకుంటే అప్పుడే వేస్తాను. ఎప్పుడు వ్రాయాలనుకుంటే అప్పుడు కవితలు రాస్తానని చెప్పారు గాయత్రి గారు.
సమయం చాలక, ఇంకా నేర్చుకోవాలన్న తపన వుంది. ఎక్కువుగా ఆయిల్ పేయింటింగ్, అక్రిలిక్ లను వాడుతారు. నేను వేసిన చిత్రాలు చాలావరకు బహుమతులుగా ఇచ్చేసానని, ప్రస్తుతం తనదగ్గర 30-35 దాకా ఉన్నాయని వివరించారు. ఇంక కమర్షియల్ గా వెళ్లలేదంటూ….
చివరిగా “సొంత ఆలోచనలతో, భావంతో ఊహా చిత్రాలు వేసినప్పుడు మాత్రమే తృప్తి వుంటుందని” సాటి వారికి సలహాగా సెలవిచ్చారు శ్రీమతి గాయత్రి కనుపర్తి గారు.
డా. దార్ల నాగేశ్వర రావు