నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ, గద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీ కున్న స్థానం అద్వితీయమైనదే, కానీ ఘంటసాలకు జరుగుతున్న విధంగా రఫీకి నివాళులు అందుతున్నాయా అంటే ‘నో’ అనే జవాబే వస్తుంది. ఘంటసాల ఈ లోకాన్ని వీడి నలభై యేళ్ళవుతున్నా, ఆయన పేరిట ఉత్సవాలు జరుగుతూనే వున్నాయి, కళాసంస్థలు వెలుస్తూనే వున్నాయి, సామాజిక మాధ్యమాలు నడుస్తూనే వున్నాయి.. నడుస్తూనే వుంటాయి కూడా. ఘంటసాల సంగీత చరిత్ర అభిమాన లోకానికి అవగతమే. డిసెంబరు 4 న ‘మేస్టారి’ 101 వ జయంతి రోజున వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుందాం.

మద్రాసు HMVలో లలితగీతంతో సంగీత ప్రస్థానం…

ఘంటసాల 1944లో మద్రాసులో అడుగుపెట్టి సినిమాలలో పాడేందుకు ప్రయత్నిస్తూ, HMV కంపెనీకి వెళితే, అప్పుడు రికార్డిస్టుగా వున్న లంకా కామేశ్వరరావు వాయిస్ టెస్ట్ చేసి “నీది మెటాలిక్ వాయిస్ కనుక నీ కంఠం మైకుకు సరిపడదు” అని నిరాశపరచినప్పుడు రికార్డిస్టు ఇన్-చార్జి గా ఉంటున్న పేకేటి శివరాం ఘంటసాలను పిలిపించి హార్మనిస్టు రతన్ రావు చేత రాయించిన ‘గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి’ అనే భావగీతాన్ని ఒకవైపు, ఎవరో అజ్ఞాతకవి రాసిన ‘నగుమోమునకు నిశానార్ధ బింబము తోడు’ అనే పద్యాన్ని సముద్రాల రాఘవాచార్యచేత సరిదిద్దించి రెండోవైపు రికార్డుచేసి 1946 జూలై లో (రికార్డు నెంబరు N.18795) మార్కెట్ కి విడుదల చేశారు. తర్వాత సముద్రాల రాఘవాచార్య ప్రోత్సాహం, అండదండలతో తెలుగు సినిమారంగంలో ప్రవేశంచేసి అమరగాయకునిగా మనకు ఎన్ని సుమధుర గీతాల భాండాగారాన్ని వదలి వెళ్లారో సంగీతప్రియులకు తెలియంది కాదు. సముద్రాల రాఘవాచారి ఘంటసాలకు మద్రాసులో తొలి గురువు. ఆయన సిఫారసుతోనే మద్రాసు ఆలిండియా రేడియో వారు ఘంటసాల స్వరాన్ని ఆడిషన్ చేసి యెంపిక చేసినప్పుడు మేష్టారు వాణిని రేడియోలో బాలాంత్రపు రజనీకాంతరావు ప్రసారం చేయించారు. ఘంటసాల చాలా సున్నిత మనస్కుడంటే.. స్వాతంత్య సముపార్జన సమయంలో తోలేటి వెంకటరెడ్డి ఘంటసాలతో ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కని’ పాటను, ‘ఆ మొఘల్ రణధీరులు’ అనే పద్యాన్ని పాడించారు. అందులో ‘మాతృదేశముగావ క్షాత్రవ్యుడై బోసు పడరాని ఇడుముల పడిన శ్రమయు’ అంటూ సాగే వాక్యాన్ని ఘంటసాల పొరపాటున ‘మాతృదేశముగా వక్షాత్రవ్యుడై బోసు’ అని పాడారు. రికార్డు విడుదలయ్యాక ఆ తప్పును తోలేటి గుర్తుచేసినప్పుడుగానీ ఘంటసాల గుర్తించలేదు. ఎవరూ విమర్శించకపోయినా తప్పు దొర్లినందుకు తనుమాత్రం చాలాకాలం బాధపడ్డారు. అంతటి సున్నిత మనస్కుడు ఘంటసాల. ఘంటసాల సంపాదనకు సముద్రాల గారే ‘సేవింగ్ బ్యాంక్’. తన సంపాదనకు సంబంధించిన లెఖ్కలు చూసుకోమని సముద్రాల చెప్పినప్పుడు “నన్ను చేరదీసి ప్రోత్సహించిన మీవద్ద నా లెఖ్కలు సరిచూసుకోవడమా? అపచారం గురువుగారూ” అని సున్నితంగా తిరస్కరించిన సంస్కారవంతుడు ఘంటసాల.

మతసామరస్యం…
ప్రముఖ పాకిస్తాన్ గాయకుడు ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ మొదటిసారి దక్షిణదేశంలో రెండు నెలలపాటు సంగీత కచేరీలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నుంచి తన పరివారంతో మద్రాసుకు వచ్చినప్పుడు, సరైన వసతి దొరకక తిరిగి వెళ్ళిపోవాలని సిద్ధమైన అతణ్ణి శాంతపరచి, వారికి సపరివారంగా తన ఇంటి మేడమీద బస యేర్పాటుచేసి, వంటలు కూడా చేసుకొనే సదుపాయం కల్పించిన మానవతావాది ఘంటసాల. అంతేకాదు ఆలీఖాన్ తో వున్న పదిమంది పరివారానికి తన భార్య సావిత్రి చేత రొట్టెలు చేయించి రెండుపూటలా ఆతిధ్యం ఇచ్చిన సంస్కారి ఘంటసాల. ఆలీఖాన్ ఆలపించే ‘రాగేశ్రీ’ అనే హిందుస్తానీ రాగం ఘంటసాలను యెంతో ప్రభావితం చేసింది. ఆ రాగాన్ని తను స్వరపరచిన “యెంత ఘాటు ప్రేమయో”, “అన్నానా భామిని”, “రాగాలా సరాగాలా” వంటి యెన్నో పాటలకు ఘంటసాల ఉపయోగించడం ఆయన సభ్యత. తన సంపాదన లెఖ్కలు చూసేందుకు ఒక హరిజన బాలుణ్ణి చేరదీసి తనతోబాటు తాము రోజూ తినే కంచంలోనే అతనికి అన్నంపెట్టి పోషించిన మనసున్న మనీషి ఘంటసాల. తన సంగీత బృందంలో సుభాన్ అనే ముస్లిం కళాకారుడు క్లార్నెట్ వాయించేవాడు. అలాగే జెడ్సన్ తబలా వాయించేవాడు. వారిని తన స్వంత మనుషుల్లా ఆదరించిన సహృదయత ఘంటసాల సమతా-మమతలకు తార్కాణం. 1956లో ఒకసారి ప్రముఖ కవి గుర్రం జాషువా తను రాసిన ‘పాపాయి’ పద్యాలు రికార్డింగు కోసం ఘంటసాల ఇంటికి వచ్చి బయట అరుగుమీద కూర్చుంటే ఘంటసాల భార్య సావిత్రమ్మ వారిని లోపలకు వచ్చి ఆసీనులు కమ్మంది. కానీ జాషువా నిరాకరించారు. రికార్డింగ్ నుంచి వచ్చిన ఘంటసాల అందుకు బాధపడుతూ, వారిని లోపలి ఆహ్వానించారు. “నేను కుల రీత్యా అంటరాని వాణ్ణి. లోపలి రాను” అంటే “అటువంటి భేద భావాలు మాకు లేవు. అందరూ మాకు సమానులే. మీరుముందు లోనికి రండి” అంటూ తోడుకెళ్ళి, సహపంక్తి భోజనం చేయించి అతిధి మర్యాదలు జరిపించిన మహోన్నతుడు.

Ghantasala family

స్నేహశీలి గా ఘంటసాల…
ముద్దు పాపారావు విజయనగరం జమీందారు వంశానికి చెందిన అబ్బాయి. సంగీత కళాశాలలో అతడు ఘంటసాలకు సహవిద్యార్థి, మిత్రుడు కూడా. ఘంటసాలకున్న ఆర్ధిక దుస్థితి తెలిసి అతడు ఘంటసాల వుండే సత్రానికి రోజూ వెళ్లి, ఘంటసాలను హోటలుకి తీసుకెళ్ళి పలహారం ఇప్పించేవాడు. “భగవంతుడు నీకు మధురమైన గొంతిచ్చాడు. ఎప్పటికైనా నీవు గొప్పవాడివై పేరు ప్రతిష్టలు సంపాదిస్తావు. అప్పుడు నీ గుర్తుగా నాకోక వాచీ కొనిపెట్టు” అనేవాడు. ‘లైలామజ్ను’ చిత్రం విడుదలైన సమయంలో ఘంటసాల పాపారావును వాచీ కొనుక్కోమని డబ్బు మనియార్డరు చేశారు. రాజాభారణాలు రద్దుచేయ్యడంతో పాపారావు కుటుంబం వీధిన పడింది. ఘంటసాల పాపారావు కుటుంబాన్ని ఆదుకొని వారి ముగ్గురు అమ్మాయిలకు తనే పెళ్ళిళ్ళు చేయించి వాళ్ళ అబ్బాయి నరసింగరావును తనవద్దే ఉంచుకున్నారు. వాళ్లందరూ తనపిల్లలే అని చెప్పేవారు. నరసింగరావు సావిత్రమ్మకు అండగా వుంటూ, సేవలు ఛేస్తూ కొంతకాలం క్రిందే దివంగతులయ్యారు.

సభ్యత, సంస్కారం…
సువర్ణసుందరి సినిమా హిందీ వర్షన్ లో పాటల రికార్డింగ్ కోసం లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ మద్రాసు వచ్చారు. “హాయి హాయిగా ఆమని సాగే” హిందీ వర్షన్ “కుహూ కుహూ గాయే కోయలియా” అనే పాటను పాడేందుకు రఫీ కాస్త ఇబ్బంది పడటం గమనించి, అక్కడే వున్న ఘంటసాలను లతాజీ తనతోకలిసి పాడమన్నారు. ఘంటసాల కుంటిసాకు చెప్పి బయటికొచ్చేశారు. అసలు విషయమేమిటంటే రఫీ పాడటానికి వచ్చినప్పుడు తను పాడితే అది సభ్యత కాదని ఘంటసాల భావించటమే! 1970లో ఘంటసాల విదేశీ ప్రయాణం చేసినప్పుడు, ‘ఇద్దరు అమ్మాయిలు’ చిత్రంకోసం సంగీత దర్శకులు మహాదేవన్ “నా హృదయపు కోవెలలో” అనే పాట ట్రాక్ ని బాలు చేత పాడించి రికార్డు చేశారు. ఘంటసాల తిరిగొచ్చాక ఆ ట్రాక్ ను బాలు చేత ఘంటసాలకు వినిపింపజేసి ఆయనతో పాడించేందుకు సిద్ధమైనప్పుడు, ఘంటసాల వారించి బాలు పాడిన ట్రాక్ బాగుందని, దాన్నే వుంచెయ్యమన్నారు. అక్కినేనికి అవసరమైతే తనే నచ్చజెప్పుతానని బాలుని ఎంకరేజ్ చేసిన దార్శనికుడు ఘంటసాల. తన వారసుడు బాలు అని ప్రకటించినవారు కూడా ఘంటసాలే! తన స్వంత సినిమా ‘పరోపకారం’ చిత్రంలో ఏ.ఎం.రాజా తో పాటలు పాడించారు. ఇక పిఠాపురం, మాధవపెద్దిల విషయం చెప్పవలసిన పనేలేదు. వాళ్లు పాడాల్సిన పాటలు వారికే పరిమితం చేసిన ఘన సంస్కారి ఘంటసాల.

గురుభావం…
ఆర్దిక చిక్కుల్లో ‘లవకుశ’ చిత్రం నిర్మాణదశలో వున్నప్పుడు నాగయ్య పాడవలసిన “సందేహింపకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా” అనే పాటను నిర్మాత శంకరరెడ్డి, నాగయ్య పాడితే పారితోషికం ఇచ్చుకోలేనని, ఘంటసాలనే ఆ పాట పాడమని కోరినప్పుడు ఘంటసాల బాధపడ్డారు. “అటువంటి మహానుభావునికి నేను పాడటమా. అంతకన్నా అపచారం ఉంటుందా” అని నాగయ్య వద్దకు వెళ్లి విషయం చెప్పారు. నాగయ్య అనుమతి తీసుకొని ఆ పాటను ఘంటసాల ఆలపించటం జరిగింది. విజయనగరం కళాశాలలో తనకి సంగీత పాఠాలు నేర్పిన గురువు పాట్రాయని సీతారామశాస్త్రి కొడుకు సంగీతరావుని చేరదీసి, హార్మోనియం నేర్పించి తనవద్దే వుంచుకున్న నిజమైన శిష్యుడు ఘంటసాల. అంతేకాదు సంగీతరావుకి పెళ్ళిచేసి అతని కుటుంబాన్ని తమ అవుట్ హౌసులో వుంచి పోషించిన మహానుభావుడు. శాస్త్రిగారు తనకు ఎప్పుడు స్మరణకు వచ్చినా ఘంటసాలకు త్యాగరాజు కీర్తన “హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్ల” గుర్తుకొచ్చేది. “గాత్ర సంగీత సాధనకు అలవరచుకోవలసిన శ్రుతి శుద్ధి, నాద శుద్ధి, తాళ, స్వరగత లయశుద్ధి నాకు నేర్పింది గురువుగారే. ఆయన పవిత్రాత్మ నేను యెక్కడవున్నా నన్ను వెన్నంటే వుంటుంది” అనేవారు ఘంటసాల. 1970లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘంటసాలను ఆస్థాన గాయకునిగా నియమించినప్పుడు, ఆలయ గర్భగుడికి ఎదురుగా కూర్చొని పాటలు ఆలపిస్తూ, వాగ్గేయకారుడు అన్నమయ్యే ఎదురుగా వున్నట్లు అనుభూతిని పొందిన సంగీత సామ్రాట్ ఘంటసాల. లతా మంగేష్కర్ తండ్రి వర్ధంతి హైదరాబాదులో జరిగినప్పుడు ఘంటసాల సంగీత కచేరి నిర్వహించారు. ఆకార్యక్రమంలో తను గానం చేసిన భగవద్గీత రికార్డును ఆమె ఘంటసాలకు బహూకరించారు. అది వినడంతో ఘంటసాలకు భగవద్గీతను సులభ శైలిలో పాడాలనే సంకల్పంకలిగింది. ఆరు నెలల అకుంఠిత దీక్షతో గీతను రికార్డుగా మలిచారు. గ్రామపోన్ కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం చేత రికార్డు విడుదలకాకుండానే ఘంటసాలకు దేవుడి వద్దనుంచి పిలుపొచ్చింది.

అమరగానం.. ఆణిముత్యం…
ఘంటసాల తెలుగు తల్లి గారాల స్వర పుత్రుడు. ఆయన కంఠస్వరం తెలుగు లలిత సంగీతాన్ని ఉత్తేజపరచింది. తెరమీద నటుని ముఖంలో ప్రదర్శించే భావాలను తన కంఠస్వరంలోనే విని(కని)పింపజేసే భావావేశం ఘంటసాల ప్రత్యేకత. అందుకే ‘దేవదాసు’ వంటి సినిమాలలో పాటలు అజరామరమై నిలిచాయి. ఘంటసాలకు ఇష్టమైన రాగం ‘కల్యాణి’. ఆ రాగంలో ఘంటసాల స్వరపరచిన పాటలు రాగరంజితాలుగా మిగిలాయి. ఘంటసాలతో తనకున్న అనుబంధాన్ని ఆచార్య ఆత్రేయ గుర్తు చేసుకుంటూ “కనపడకుండా వినపడటం మాకు అలవాటు చేసావు. కన్నీళ్లు కళ్ళకే గానీ, చెవులకు అడ్డురావుగా. అందుకే నిన్ను మేమనుదినం వింటాము” అని శ్లాఘించారు. ‘కీలుగుఱ్ఱం’తో మొదలెట్టి పాతాళ భైరవి, చిరంజీవులు, మాయాబజార్, లవకుశ, పాండవ వనవాసం, రహస్యం లాంటి సినిమాలకు ఘంటసాల అందించిన సంగీతం అమూల్యం. ఘంటసాల కొండొకచోట సెలవిస్తూ “భారతీయ సంగీత స్రవంతి ద్వివాహినిగా ప్రవహిస్తుంది. ఒకటి స్వర, రాగ, తాళమైనది. రెండవది జీవన ప్రయాణానికి లయ కలుపుతూ సుఖమయం చేసేది. ఒకటి స్థితి, మరొకటి గతి ప్రధానమైనది. హృదయ స్పందన కలిగించే రెండవరకం సంగీతం కర్ణపేయంగా వుండి మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అదే సినిమా సంగీతం” అంటూ సినీ సంగీతానికి భాష్యం చెప్పారు. ఈరకం సంగీతానికి ఆద్యుడు నౌషాద్ అంటారు ఘంటసాల. ఆయన సంగీత దర్శకుడిగా కనబరచిన ప్రతిభ, గాయకుడిగా అందించిన పాటలవలన కొంత మరుగున పడింది. లలిత సంగీతంతోబాటు యే రాగాన్ని యెక్కడ వాడినా రాగ లక్షణాలను చెడగొట్టలేదు. హిందోళరాగం యెప్పుడు వాడినా అందులో పంచమం పలికించేవారు. లలిత సంగీతంలో ఇతరులెవ్వరూ వాడని భైరవి, రంజని వంటి రాగాలను ‘పుష్ప విలాపం’, ‘కుంతీకుమారి’ లో వాడారు. ‘లాఫింగ్ పోలీస్ మాన్’ అనే ఇంగ్లీషు పాటను స్పూర్తిగా తీసుకొని మాయాబజార్ సినిమాలో “వివాహ భోజనంబు” పాటను స్వరపరచి, పోలీసు నవ్వుని ఘటోత్కచుడు చేసే వికటాట్టహాసంగా మార్చడం ఆయనకే చెల్లింది. ఘంటసాల శబ్దోచ్చారణే గొప్పది. అందులో మాధుర్యం ఇంకా గొప్పది. ఆ మాధుర్యంలో నాదం ఎంతో గొప్పది. అన్నిటికీ మించి ఘంటసాల గాత్రాన్ని, ఆయని పాటల్ని ఇంకా ఆదరిస్తున్న అభిమానుల ఆదరణ వెలకట్టలేనంత గొప్పది.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

  1. డిసెంబర్ 4, 2022 న జరిగినది మేష్టారి 100వ జయంతి మాత్రమే. 101 కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap