సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!

సుబ్బుగారు ఈ తరానికి తెలియక పోవచ్చు. తెలిస్తే, ఆశ్చర్య పోవాల్సిందే. అవును, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది సుబ్బుగారే.
సుబ్బుగారి పూర్తి పేరు సుబ్బారావు. కొడమంచిలి సుబ్బారావు. ఘంటసాలకు స్వయాన బావగారు. ఘంటసాల భార్యామణి సావిత్రిగారి సొంత అన్నయ్యే సుబ్బుగారు.

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెద పులివర్రు సుబ్బుగారి ఊరు. ఘంటసాల గారితో సావిత్రి గారి వివాహం అయ్యాక, ఘంటసాలగారి సంగీత పరిజ్ఞాన స్వరం చూసి, ఒకరోజు సుబ్బుగారు ప్రత్యేకంగా సీనియర్ సముద్రాల ఆచారి గారికి ఘంటసాలను పరిచయం చేశారు! అలా ఘంటసాల సినీ రంగ ప్రవేశానికి అడుగులు వేయించారు.

సుబ్బుగారు చెన్నై లో అదేలెండి అప్పటి మద్రాస్ లో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ఆ. రోజుల్లో జివిఎస్ ప్రొడక్షన్స్ లో పనిచేశారు. దగ్గరుండి నందమూరి తారక రామారావు గారికి తొలిసారి శ్రీకృష్ణుడు వేషం వేయించింది కూడా సుబ్బుగారే. తొలిసారి శ్రీకృష్ణుడు వేషంలో మురిసిపోయిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆ కాస్ట్యూమ్, కిరీటం తనకు కావాలని సుబ్బుగారిని కోరితే, ఇచ్చేశారట. పాండురంగ మహాత్యంలో మళ్ళీ అదే కాస్ట్యూమ్ ధరించారట ఎన్టీఆర్.

Mohamad Rafee with Subbu garu

ఇలా, ఎన్నో విశేషాలు సుబ్బు గారు అలా అలవోకగా చెబుతుంటే, ఇవాళ సమయం ఇట్టే గడచిపోయింది! ఎన్నో కబుర్లు. ఎన్టీవోడు, అక్కినేనిగాడు, కిష్టి గాడు, సోగ్గాడు శోభన్ బాబు, చిత్తూరు నాగయ్య…ఇలా వారితో ఆయన కలసి పనిచేసిన రోజులు చెబుతుంటే ఆశ్చర్యం ఆనందం నా వంతు. అంతే కాదు, దర్శకుడు పద్మశ్రీ కె.విశ్వనాధ్ గారు సుబ్బుగారు క్లాస్మేట్స్. ఇద్దరూ ఒరే అనుకునే మిత్రులు. ఇప్పుడు సుబ్బుగారి వయసు 92. వయసును జయించి చాలా హుషారుగా హాయిగా ఆనందంగా ఉన్నారు.

సినీ పరిశ్రమను వదిలేశాక చాలా కాలం సొంతూరులో అర్చకత్వం చేశారట. హైదరాబాద్ లో ముద్దుల మనవడు కిషన్ దగ్గరకు వచ్చారు. శ్రీనగర్ కాలనీలో చైతన్య ట్రావెల్స్ నిర్వహిస్తున్న మిత్రుడు కిషన్ ఇంటికి ఇవాళ శ్రీలంక వీసా దరఖాస్తు కోసం వెళ్ళాను. సుబ్బుగారి పరిచయ భాగ్యం కలిగింది. అదే అదృష్ట భాగ్యం! ఆనాటి సినిమా కబుర్లు బోలెడు చెప్పారు. మధ్యలో పాటలు పాడుతూ యమా హుషారు గా ఆయన! అదే హుషారు లో నేనూ!

  • డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link