ఉమ్మడి తెలుగు రాషాలో పిల్లల్లో, పెద్దల్లో, దాగివున్న సృజనను వెలికితీసి, వారి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందించిన అతికొద్ది మందిలో విశాఖపట్నంకు చెందిన గిడుతూరి కన్నారావు ఒకరు. అర్ధశతాబ్దం పైగా ఆయన కళామాతల్లికి నిస్వార్థ సేవలందించారు.
నారాయణమ్మ – పెంటయ్య దంపతులకు 1931 జులై 15న జన్మించిన కన్నారావుకు చిన్నతనం నుండి చిత్రకళ అంటే అభిమానం. తండ్రి వడ్రంగి పనులు కళాత్మకంగా రూపొందించేవారు. తను పుట్టిన విశాఖలోనే పాఠశాల విద్య ముగించి, అనంతరం ఐ.టి.ఐ. లో సివిల్ డ్రాప్టుమెన్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పొందారు. వెంటనే విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో ఉద్యోగంలో చేరి రెండున్నర దశాబ్దాలపాటు సేవలందించారు. అంతేకాక గృహనిర్మాణాలకు అవసరమైన ప్లాన్లను కూడా రూపకల్పన చేసేవారు. వృత్తిపరంగా తీరికలేకపోయినా, ప్రఖ్యాత
జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు నిర్వహణలోనున్న చిత్రకళా పరిషత్ గౌరవ కార్యదర్శిగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
పరిషత్ లోని కొందరు సభ్యుల కారణంగా పదవికి రాజీనామా చేసి, సొంతంగా స్థానిక కళాకారులు, కళాభిమానులు సహకారంతో లలిత కళాపరిషత ను 1971లో స్థాపించి, ఇటీవల వరకు నిరాటంకంగా చిత్రకళాపోటీలు, ప్రదర్శనలు, ప్రతిభావంతులకు సత్కారాలు నిర్వహించారు. 1989 సం. లలిత కళల కోసమే న్యూఢిల్లీలో నిర్వహించిన సెమినారు వారితో పాటు నేను హాజరయ్యాను.
విశాఖపట్టణంలో ఎన్నో విశిష్ట కార్యక్రమాలు ఆయన స్థానిక రాంనగర్ లో గల లయన్స్ సామాజిక భవనంలో నిర్వహించారు. చిన్న, పెద్ద అందరితో సౌమ్యంగా మాట్లాడటం, స్నేహభావంతో మెలగడం వారి ప్రత్యేకత. న్యూఢిల్లీకి చెందిన లైవ్ ఇండియా ఫైన్ ఆర్డు అండ్ క్రాఫ్ట్ – న్యూఢిల్లీ చే వెటరన్ ఆర్టిస్టుగా సత్కారం పొందారు.
షియార్డ్ నుండి రిటైర్ అయ్యారు. గత 30 సంవత్సరమల నుండి పూర్తిగా పరిషత్ కార్యక్రమాలకు అంకితమయ్యారు. తొమ్మిది పదులకు చేరువవుతున్నా, కళాకార్యక్రమాలు నిర్వహించాలన్న ఉత్సాహం ఆయనలో ఏ మాత్రం తగ్గలేదు. ప్రముఖ చిత్రకారులు వి.ఆర్. చిత్ర గురించి మరో ప్రముఖ చిత్రకారులు పిలకా లక్ష్మీనరసింహమూర్తి రచించిన గ్రంధాన్ని ముద్రించాలని చివరిగా ఆయన నన్ను కోరారు. త్వరలో ఆ కార్యక్రమం పూర్తిచేసి, వారి కోరిక తీర్చడం నా కర్తవ్యం. మార్చి 27న ఆకస్మికంగా కన్నుమూసిన వారికి, భార్య పైడి రత్నం, కుమార్తెలు నాగమణి, విశాలాక్షి, కుమారులు శ్రీనివాస రవి, విశ్వనాధకుమార్, హరికృష్ణ, చంద్రశేఖర్ వున్నారు. ఆయన మృతి తెలుగు చిత్రకళారంగానికి తీరని లోటు.
- సుంకర చలపతిరావు