తెలుగు కార్టూన్ పయణం వందేళ్ళకు చేరువలో వుంది. సుమారు రెండు వందల మంది కార్టూనిస్టులున్న మన తెలుగు కార్టూన్ రంగం సుసంపన్నమైనది. తలిశెట్టి నుండి నాగిశెట్టి వరకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఈ మధ్య కాలంలో చాలా మంది కార్టూనిస్ట్ మిత్రులు తమ తమ కార్టూన్ల సంకలనాన్ని ప్రచురిస్తున్నారు. ఇది శుభపరిణామం. గతంలోనే ఒక కార్టూన్ సంకలనాన్ని ప్రచురించిన కమల్ గారు ఇప్పుడు ‘గిరీశం’ మీద గీసిన నూరుకు పైగా కార్టూన్లతో మరో కార్టూన్ల సంకలనం తో మనముందుకొచ్చారు.
గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు గారు సృష్టించిన కాల్పనిక పాత్ర. అటు తెలుగు సాహితీ రంగంలోనే కాకుండా… ఇటు తెలుగు నాటక రంగంలోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్న పాత్ర. ఇప్పుడు కమల్ గారి ఆలోచనలలో కార్టూన్ కేరెక్టర్ గా రూపుదిద్దుకుంది. కన్యాశుల్కం నాటకంలో ‘గిరీశం’ ది హీరో పాత్ర కాదుగాని ప్రధాన్యత వున్న పాత్రే. అడపా దడపా వచ్చీరాని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ… కళాపోషణ, సంఘ సంస్కరణ అంటూ లెక్చర్లు ఇస్తూ, హాస్యాన్ని పండించే కేరెక్టర్ అది. అలాంటి కేరెక్టర్ తో కార్టూన్లు గీయొచ్చని ఆలోచన చేసిన కార్టూనిస్టులు వుండవచ్చు గాని, దాన్ని ఆచరణలో చూపి అనేక కార్టూన్లు గీసి పుస్తకంగా అచ్చెయ్యడం కమల్ గారికి మాత్రమే దక్కిన అవకాశం, అదృష్టం కూడా.
గిరీశం వేశ్యాసాంగత్యం, మోసాలు, అబద్ధాలు, ఆడంబరాలు మరిగిన పాత్ర. అవసరానికి ఏదోక చక్రం అడ్డువేసి రోజులు గడుపుకుంటూ, వీలుంటే కొండకు వెంట్రుక వేద్దామని చూస్తూంటాడు. ఈ పాత్ర లక్ష్యం, దాని సిద్ధి, అసలు స్వభావంలోని కీలకం మయినటువంటి విషయాల మీద అద్భుతమైన కార్టూన్లు సృష్టించారు కమల్. ఉదాహరణకు ‘బుచ్చమ్మతో ఫాదర్స్ డే సందర్భం, లండన్ క్లాక్ టవర్న్ మోసుకురావడం, చంద్ర మండలం పై పొగాకు మొక్క నాటాలనడం, గిరీశమే న్యూటన్ అయితే, బుచ్చమ్మతో తన పెళ్ళి జరిపించకుండా నాటకం ముగించారని గురజాడ వర్ధంతి రోజున వాపోవడం…’ లాంటి కార్టూన్లు కమల్ లోని హాస్యచతురతకు మచ్చుతునకలు.
గిరీశం కేరెక్టర్ ని కార్టూన్ బొమ్మగా చాలా చక్కగా మలచుకున్నారు. పుస్తక ముఖచిత్రంలో తన భుజంపై గిరీశం చేయివేసినట్టు గీసిన బొమ్మ సందర్భోచితంగా వుంది. కన్యాశుల్కం నాటకానికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానమున్నట్టే, కమల్ ‘గిరీశం కార్టూన్ల సంకలనం కూడా తెలుగు కార్టూన్ రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోగలదు అనడంలో సందేహంలేదు. ఒక మంచి పుస్తకంతో పాఠకుల ముందుకు వచ్చిన కమల్ కు కార్టూనిస్టుగా మరెంతో గుర్తింపు, పబ్లిషర్ గా ఆర్థికంగా ప్రోత్సాహం కలగాలంటే కార్టూన్ ప్రియులందరూ ఈ పుస్తకం కొనిచదవాలి.
-కళాసాగర్ యల్లపు
గిరీశం కార్టూన్లు, పేజీలు: 200
వెల: రూ. 260/-
ప్రతులకు: కార్టూనిస్ట్ కమల్ (97051 62419)
Thank you sir for review of my book.
Kamal