ప్రపంచ సినీ మార్కెట్ లో హైదరాబాదీ సినిమాకు మంచి గుర్తింపు ఉందని, గల్ఫ్, అరబ్ దేశాలలో లక్షల సంఖ్యలో హైదరాబాదీ సినిమాల సిడీలు అమ్ముడుపోయాయని, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కుటుంబంతో కలిసి పురానాపూల్ లోని సినిమా థియేటర్ కు వెళ్ళి సినిమాలు చూసేవాడని, అంతేకాకుండా భారతదేశంలో సినిమా అవార్డులు ప్రారంభించడానికి ముందు 1944లోనే మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదు రాజ్యంలో సినిమాలకు అవార్డులు ఇచ్చాడని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, ఆగస్టు 21న ‘ద్వ’ మరియు ‘డర్ కా కరోబార్ (చిచ్చా మచ్చా షో ఎపిసోడ్ నెం.9)’ లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణగారు చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా, హరికృష్ణగారు మాట్లాడుతూ… షార్ట్ ఫిల్మ్స్ అనేవి సినిమారంగానికి విజిటింగ్ కార్డు లాంటివని, మంచి కంటెంట్ తో ఫిల్మ్స్ తీస్తున్నవారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసమే సినివారం వేదికను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. లక్ డౌన్ కి ముందు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా పలుజాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించుకున్నామని, అదే తరహాలో రాబోయే రోజులలో మళ్ళీ ఫిల్మ్స్ ఫెస్టివల్స్ నిర్వహించబోతున్నామని, అందులో దిలీప్ కుమార్ ఫిలిం ఫెస్టివల్, సత్యజిత్ రే ఫిలిం ఫెస్టివల్ వంటివి ఉంటాయిని తెలిపారు.
ఈనాటి సినివారంలో ‘కామెడీ, సెటైర్ తో హైదరాబాదీ భాషలో’ ఉస్మాన్ జలాల్ దర్శకత్వం వహించిన “డర్ కా కరోబార్ (చిచా మచా షో ఎపిసోడ్ నెం.9)”, ‘చెల్లెలి బాగుకోసం అన్న పడుతున్న తపన’ నేపథ్యంలో ఫిల్మియన్ దర్శకత్వం వహించిన “ద్వ” సినిమాలు వినోదాన్ని సందేశాన్ని అందించాయని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి, తనకు ప్రోత్సాహం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారిగారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజుగారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.