ఎమ్మార్వీ సత్యనారాయణ గారి అనేక గ్రంథాల్లో ఎన్నదగిన గ్రంథం ‘గోదావరి నవ్వింది’ కథాసంపుటి. విహారి ముందుమాట ఈ పుస్తకానికి గీటురాయి. ప్రతి కథా చదవ దగ్గదిగాను, చదివించేదిగాను ఉన్నాయి. ఇందులోని ప్రతి కథా ప్రచురితమైనవే. కాకపోతే, డిజిటల్ మాధ్యమాల్లో అధికం. కథారచయిత ఆధునికత, వైజ్ఞానిక భావాలు కలిగిన సాంప్రదాయ రచయిత. ప్రతి కథలోను ఆధునిక భావాలతోను యువతను ప్రబోధించేలా మార్గనిర్దేశనంచేసేలా, సమస్యలకు చక్కని పరిష్కారాలను చూపుతూ – అణిముత్యాల్లాంటి పెద్దెనిమిది కథలను ఈ గ్రంథంలో పొందుపరచారు. ఒక్కో కథలో ఏముందో విహారి తన ముందుమాటలో స్పష్టంగా చెప్పారు. కథలపై, పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్న ప్రతి పాఠకుడు తప్పక చదవ వలసిన మంచి పుస్తకం ఇది.
కథారచనలో ఎమ్మార్వీ కలం మంచి పరిపక్వతానైపుణ్యాలను కలిగి ఉంది. మొదలు- ముగింపు ఎరిగిన కథకుడు. అతి వర్ణనలను, సన్నివేశాలను, పాత్రల ఔచిత్యాల వివరణల జోలికిపోక కథతోపాటు పయనిస్తూ పాఠకుడు అర్థం చేసుకునే స్వేచ్చను ఇచ్చారు. సమయ హరణం కాని కథాగమనాన్ని, కొన్ని పాత్రల వందేళ్ళ జీవిత కథనాన్ని పాఠకునికి కొద్ది వాక్యాలలోనే చెప్పగల సమర్థులు. ఆధునిక పాఠకునికి ఎంత క్లుప్తంగా చెప్పాలో అంతేక్లుప్తంగా చెప్పారు. పాత్రలను అతిగా సృష్టించక కథకు అవసరమైన పాత్రలనే సృజిస్తూ కథను నడుపుతారు. రచయిత నాటక రచనానుభవం ఇందులో స్పష్టంగాకనిపిస్తుంది.
నవరసాలను సమపాళ్ళలో కూర్చి కథాసంపుటిని రసమయంచేసారు. ద్వితీయ వివాహం కన్నా అనాధబాలలను తెచ్చి పెంచుకోవటం – రక్తదానం – అవయవ దానం – ఆర్థిక సాయం – క్యాన్సరు పేషంట్లను అక్కున చేర్చుకోవటం, విజ్ఞానదానం వంటివేకాక చేయవలసిన మరెన్నో సూక్ష్మమైన ఆధునిక సాయాలున్నాయని తెలియ చెప్పే కధలుగా వీటిని తీర్చిదిద్దారు. ఈ కధలన్నీ ఉభయగోదారి ఆచారవ్యవహారాలను, ఆహార విహారాలను, సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా అక్కడి పల్లెల్ని నగరాల్ని చుట్టివస్తాయి. ఆ ప్రాంతాలతో కొంత మనకు అవగాహన ఉన్నట్లయితే ఈ కథలు మరింతగా మనస్సుకు హత్తుకునే అవకాసం ఉంది.
‘గోదావరి నవ్వింది’ అన్న తొలికథలో వయస్సు తొలిపొద్దు అకర్షణలను పక్కనపెట్టి పెద్దల నిర్ణయాలతో మొదలెట్టిన జీవితాల్లో విధి ఆడిన వింత నాటకాన్ని మలిసంధ్య వేళకు తమదైన నిర్ణయాలతో విధిని ఎదిరించే ప్రేమారాధకులగా జీవనాన్ని సాగించుకున్న ఓ ప్రేమజీవుల కథ ఇది. కథకుడుగా ఎమ్మార్వీ సిద్దహస్తు అనడానికి “ఎక్కడ మొదలు పెట్టాలో కాదు ఎక్కడముగించాలో తెలిసినవాడే సమర్థుడైన కథకుడు” అనేలా వుంది ఈ కథ.
‘పల్లెతో బంధం’ అనే 2వ కథలో పల్లెతో బంధాన్ని, జీవితాలను ముడిపెట్టుకోవటం ఎలాగో ఎన్నో సన్నివేశాల ద్వారా రచయిత చూపుతారు. వీటిలో ఏ ఒక్కటి పాఠకునికి సాధ్యమయినా అందులో ఎటువంటి ఆనందం దక్కుతుందో స్వయంగా అనుభవించి తెలుసు కోవచ్చు.
బాహ్యసౌందర్యానికి, సిరిసంపదలపై అతి మక్కువ పెంచుకున్న ఆధునిక యువతకు – వీటికి అతీతమైన విథికూర్చే జీవిత సమీకరణాల ముందు మన నిర్ణయాలు లెక్కలు తప్పుతాయని సుస్పష్టం చేస్తుంది ‘అందం’ అనే 3వ కథ.
అవార్డు ప్రదాతలు ప్రతిభావంతులను గుర్తిస్తారు. అవార్డు గ్రహీత ఆ అవార్డుకు అర్హులైనవారిని వేదిక మీదకు తీసుకువచ్చి చూపినదే ఈ 4వ కథ ‘ఈ అవార్డు నాదికాదు’.
నాన్న తోడు లేని అమ్మ జీవన పయన షష్టిపూర్తిని ఊరి సంబరంగా మార్చిన తనయుని గాథ. ఆ తల్లి జీవితానికి చుక్కానిలా నిలిచిన రహస్యం ఏమిటో ఊరికి చూపిన కథ 5వదిగా ‘అమ్మకు ప్రేమతో…’
జీవిత వైకుంఠపాళిలో సాఫీగా సాగుతున్న ఒంటరి(ఉన్నత) జీవితాలు, నిలకడగా ఉన్ననాడు… పెట్టి ఉంటే పుట్టే ఉంటుందన్న సత్యాన్ని చాటిన 6వ కథ-‘ ప్రభాత కిరణాలు’.
వృద్ధాప్యంలో తోడు కావాలంటే మరో పెళ్ళే అక్కర్లేదు అనే జ్ఞానోదయంతో, ఒక అనాథ యువతిని దత్తత తీసుకున్న జగన్నాథం కథ 7వది-‘ తోడు’.
పిల్లల అభిరుచి మీద కట్టడి పనికిరాదు. వారిని వారిదారిన ఎదగనివ్వండి అనే హితోక్తి పలికే 8వ కథ ‘భళారే విచిత్రం’.
ఎదుటివారి సాధక బాధకాలు పట్టని స్వీయావసరాలను ఎకరువుపెట్టే తోటి సమాజాన్ని ఏకరువుపెట్టే హాస్యరస ప్రధానంగా సాగిన కథ 9వది ‘కూర్మారావు కుంభమేళా’.
ఆడ దిక్కు లేని ఇంటికి అద్భుతంలా అమ్మకాని అమ్మప్రత్యక్షమై ఆ ఇంటిని చక్కపెట్టిన కధనం 10వది ‘అమ్మ కావాలి’.
ధనవంతుడి ఉపకార చింతన, సమాజ సేవాభావన, వాటి ఆచరణ గురించిన వివరణాత్మక చిత్రణ 11వ కథ ‘ఆశ్రయ’.
అజ్ఞాత జీవనంలోవున్నా బలాన్ని దాచలేకపోయాడు భీముడు. రాఘవ తన పాండిత్యాన్ని, ప్రతిభను ఎంత దాచినా దాగక తగు సమయం వచ్చినప్పుడు “చేరవలసిన చోటు”కు ఎలా చేరుకున్నాడో చెప్పిన కథే 12వది.
ధనం అహంకరిస్తూనే ఉంటుంది. పేదరికం కష్టాల్లోను మానవత్వ పరిమాళాలను పూయిస్తూనే ఉంటుంది. అందుకు ఉదాహరణే 13 వ కథ ‘జీవన స్వరాలు’
తాతగారి దగ్గర చదరంగం ఆడడం నేర్చుకున్నాడు చైతన్య. అంతేకాదు జీవితాన్ని తనకు నచ్చినట్లు విజయపథంలో ఎలా నడిపించాలో తెలుసుకోవచ్చు14 వ కథ ‘నా మార్గం’లో.
“చదరంగానికి మనిషి జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చదరంగంలో చిన్న బంటు పోయినా, ఒక జంతువు నష్ట పోయినా విజయం సాధించడంలో చాలా కష్టపడాలి. మన జీవితంలో కూడా అంతే. చిన్న చిన్న పొరపాట్ల వలన మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చి మానసికంగా, ఆర్ధికంగా కృంగి పోవాల్సివస్తుంది. అయితే చదరంగం ఆటలో కొద్దిపాటి నష్టం జరిగినా మంత్రి, ఏనుగు మిగతా బలగాలతో చక్కని ఎత్తులు వేస్తూ ఆటలో విజయం సాధించవచ్చు. అలాగే జీవితంలో కూడా చేసిన చిన్న పొరపాట్లకు విచారిస్తూ బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో, నిరంతర కృషితో ఎంతో విలువైన జీవితాన్ని సంరక్షించుకోవచ్చు” అంటారు రచయిత. ఎమ్మార్వీ జీవితానుభవాన్ని పండించారు. పంటకోసారు. ఈపుస్తకరూపంలో మనకందించారు.
ఉన్నత ఉద్యోగాలు నిర్వహించినా వృద్దాప్యానికి చిన్నచిన్న కోర్కెలకు కూడా దూరమవడం పెద్దలకు భారమని చెప్పే కథే 15 వదిగా ‘బుడి బుడి అడుగులు’.
16వది అయిన ‘ముక్కామల మామయ్య’ కథలో మామయ్య సైకిలుపై ప్రయాణం, ఆయన తెచ్చిన తినుబండారాలు, పండ్లు – పిల్లలతో కబుర్లు మొదలైనవి చదివాక కాలం ఎంతగా మారిపోయిందో స్పష్టమవుతుంది. సెల్ ఫోన్లు తినుబండారాలను, అనుబంధాలను, ఆరోగ్యాలను ఎంతగా మార్చేసాయో తెలుస్తుంది.
రచయితకు, గోదావరి వాసులకు మినపసున్ని ఇష్టమైన తినుబండారంగా గుర్తించవచ్చు. ఈ రచయితలోను ముక్కామల మామయ్య కనిపిస్తాడు. రిటైర్డు అయిన వ్యక్తి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ఈ కథలోస్ఫష్టంగా చెప్పారు.
అద్భుత ప్రతిభలను అణచుకొని, తమస్థాయిలను కుదించుకొని, ఉత్తమ సాంప్రదాయాలను బతికించే రామశాస్త్రి కథ 17వ కథగా “రెండు కళ్ళు”. తామునమ్మిన ధర్మాలకై లక్ష్యాలను త్యాగం చేయటం భారతీయుల లక్షణంగా చూపారు.
తండ్రి చివరి చూపు అందుకునేందుకు వెళ్ళిన కూతురికి, ప్రాణాలకు తెగించి సహకరించిన పామరునికి ప్రాణనష్టం సంభవించిందని విలపించి, స్పందించిన సహృదయి గాథ “చివరి చూపు”. ఈ పుస్తకానికి చివరి కథ పద్దెనిమిదోవది.
కథలన్నీ శివపురం చుట్టూ తిరుగుతాయి. ఈ కథాసంపుటిని ‘శివపురం కథలు’ అన్నా చక్కగా అమరేది. ప్రతికథలోను కొన్ని పేర్లు పదేపదే రావటం, రచయితకు ఆ పేర్లపై వున్న ప్రీతి తేటతెల్లమవుతుంది.
ఈ కథలు చదివిన మధ్య వయస్కు పాఠకులకు తమ బాల్యం తప్పక గుర్తుకు రావలసిందే. ఈ గ్రంథానికి ముఖచిత్రాన్ని కూర్చిన కళాసాగర్ డిజిటల్ ప్రతిభ అమోఘంగాను, చూపులను ఆకర్షించేదిగాను అమరింది. రచయితగా జీవన వజ్రోత్సవ సంబరాలను జరుపుకుంటున్న రచయిత ఎమ్మార్వీ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను.
సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ, కవి-చిత్రకారుడు
ప్రతులకు: M.R.V. సత్యనారాయణ(రచయిత)
చరవాణి: 9848663735
మీ సాహిత్య ప్రోత్సాహం మరువలేనిది. ధన్యవాదాలు సార్