పరిపూర్ణ జీవి  – గొల్లపూడి మారుతీరావు

వార్తాపత్రికల్లో కలం పదును చూపాడు. ఆకాశవాణి ద్వారా గళం వినిపించాడు. స్టేజీ పైన నాటికలు, నాటకాలను కూర్చాడు. వెండితెర వెలుగుకు కథలు సమకూర్చాడు, మాటలు రాశాడు. ఆ పైనే తానే నటుడయ్యాడు. బుల్లితెరకు వ్యాఖ్యానాలు చెప్పాడు. సాహిత్యంలో ఎక్కడ చూసినా తానే పరిమళాలు జల్లాడు- ఎనభై సంవత్సరాల జీవితంలో ఇన్ని పనులు ఒక్క వ్యక్తికి సాధ్యమా? అవును- సుసాధ్యం అని నిరూపిస్తూనే తన సుమధుర జ్ఞాపకాలన్నింటినీ భూమి పైన వదిలేసి దివికి వెళ్ళిపోయారు గొల్లపూడి మారుతీరావుగారు.

తనకు పధ్నాలుగో ఏటనే మొదటి కథ రాశాడు. అక్కడినుంచి చదువు, పని రెండూ కొనసాగాయి. నాటికలు, నాటకాలు, కథలు, నవలలు, కథా సంపు టిలు ఒక్కొక్కటిగా రాస్తూ సాహిత్యంలో మమేకం అయిపోయాడు. సినిమాకు కథ రాయగలనని అను కోకుండానే ‘డాక్టర్ చక్రవర్తి’తో తనలోని సినీ కథా రచయితను నిద్ర లేపాడు. ఆయన రచనలు కొన్ని వర్సిటీ పాఠ్యాంశాలు అయ్యాయంటేనే ఆ విజ్ఞానగని విలువ అర్థం కాగలదు. తెలుగు నాటకరంగం పై రాసిన పరిశోధనా వ్యాసాలు ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగానికి పాఠ్య పుస్తకమయింది. చురుక్కున తగిలే చతురత ఆయన ప్రత్యేక శైలి. సామాజిక, రాజకీయ అంశాలను సునిశితంగా విశ్లేషిస్తూ, విమర్శిస్తూ, వాస్తవాలను చురకలతో తెలియజెప్పడంలో తనకు తానే సాటి. రాస్తే, మాట ఎంతటి తూటా అవుతుందో గొంతు విప్పినా అంతే. ఏది మాట్లాడినా స్పష్టత ఖంగుమంటూ వినపడేది. మాటలో నిజం, వ్యంగ్యం, హాస్యం కల గలిపి తొణికిసలాడించడం బహుశా ఆయనలా ఎవ రికీ చేతకాదంటే అతిశయోక్తి కాదేమో.
ఇరవైల వయస్సులో సినిమాల్లోకి వచ్చి వందల సినిమాలు చెయ్యడం వేరు-నలభైలలో అంటే జీవితం సగానికి పైగా ముగిశాక వచ్చి రెండొందల యాభైకి మించి సినిమాల్లో నటించడం వేరు. అసలు తన ముఖాన్ని ప్రేక్షకులు స్వీకరించలేరు అనుకుంటూనే, అనుకోకుండా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో నటనను జీవితంలో భాగం చేసుకున్నాడు. అక్కడినుంచి ముప్పైఏళ్ళపాటు రకరకాల పాత్రల్లో జీవించాడు. విలక్షణ విలనిజాన్ని పరిచయం చేశాడు. ఏదో ఈ ఒక్క సినిమా పూర్తిచేస్తే చాల్లే అనుకున్న వ్యక్తి సహనటుడిగా, హాస్యనటుడిగా, విలన్‌గా, మధ్యతరగతి తండ్రిగా గుర్తుండిపోయే పాత్రలు పోషించాడు. విలనిజానికి వెటకారం, అర్థవంతమైన హాస్యం, భయ పెట్టే నైజం, తీయని మాటలు చెప్తూనే గోతులు తీసే క్రూరత్వం, జిత్తులమారి నక్కగా, పిసినారిగా, మధ్య తరగతి తండ్రిగా- ఏది చేసినా గొల్లపూడి మార్కు గురితప్పనేలేదు. పదేళ్ళ అనుభవం వుంటే కాని వచ్చే అవకాశాలు ఆయనకు తొలి ఐదు చిత్రాల్లోనే దక్కాయి.

పదీ, పదిహేను సంవత్సరాలపాటు సహనటు డిగా ఏడాదికి పాతిక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాతిక అన్నట్లు సినిమాలు సాగాయి. , ఏ కారు ఎక్కుతున్నానో, ఏ దుస్తులు ధరిస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో తెలియనంత బిజీగా రోజులు గడిచిపోయాయని ఆయన అప్పు డప్పుడు అంటుండేవారు. అలా అని సినిమాలకోసం సాహిత్యాన్ని, సాహిత్యం కోసం సినిమాలనో వదులుకున్నానని చెప్పిన సందర్భం ఒక్కటీ కనిపించదు. . సాహిత్యం సినిమాలు రెండింటి నడుమ ఖచ్చిత మైన బ్యాలెన్స్ పాటించేవారు. పుస్తక ప్రదర్శనలు, నాటక పోటీలు, సాహితీ గోష్టులు, సన్మాన కార్యక్ర మాలు- వేటికి ఆహ్వానించినా తీరికలేదనేవారు కాదు. కాదనకుండా హాజరయిన స్నేహశీలి.
రెండు వేల సంవత్సరం నుంచి ఆయన సినిమాలను తగ్గించి టెలివిజన్ పై దృష్టిసారించాడు. ఎవరైనా సినిమాలు తగ్గించారే అనడిగితే, తనదైన సహజ వ్యంగ్య, హాస్య ధోరణితో ‘అవే నన్ను తగ్గించాయి’ అని సమాధానం చెప్పేవాడు. టీవీలో ‘ప్రతిధ్వని’ వ్యాఖ్యాత అయ్యాడు. ధారా వాహికల్లో నటించాడు.
ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఏడుపదుల వయస్సులో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో నూరు మంది రచయితల వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి, వారి కథలను పరిచయంచేస్తూ టెలివిజన్ కార్య క్రమం చేసి, తెలుగు కథలకు గౌరవం సమకూర్చి పెట్టడమే కాదు- ‘వందేళ్ళ కథకు వందనాలు’ అన్న విలువైన గ్రంథం ప్రచురించాడు. ఇన్ని పనులు చేస్తూనే ‘అమ్మ కడుపు చల్లగా’ అంటూ తన ఆత్మకథ రాసుకున్నాడు. టాంజానియా తీర్థయాత్ర టావెల్ లాగ్ రాశాడు. . సందర్భోచితంగా వేదాల్లోని వాక్యాలను ఉటంకించడం గొల్లపూడివారి ప్రత్యేకత.
ఇంత శోధన మధ్య వేదన లేదా? అంటే ఉంది. చెట్టంత కొడుకు తొలి సినిమాకు దర్శకత్వం వహించ డాన్ని ప్రారంభించిన తొమ్మిది రోజులకే ప్రమాదవశాత్తూ మరణించడం ఆయనకు తట్టుకో లేని శోకం. అయినా శోకాన్ని లోపలే దాచేసుకుని కొడుకు ప్రారంభించిన ప్రేమ పుస్తకం’ సినిమా దర్శకత్వ బాధ్యతని తను ముగించాడు. అప్పటినుంచి ఏటేటా కొడుకు పేరిట కొత్త దర్శకుడికి లక్షన్నర నగదు, బాపు రూపొందించిన బంగారు జ్ఞాపిక అందిస్తూ వచ్చాడు. దుఃఖం మనస్సులో ఎంతుందో తెలియనంతగా నచ్చిన, వచ్చిన పనుల్లో నిమగ్నం అయిన సంపూర్ణ జీవి..

నలభై ఏళ్ళపాటు కుటుంబంలో ఆడసంతానమే లేకపోవడం వల్లనేమో తన నలుగురు మనవరాళ్ళంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. . ఆయన అందుకున్న సన్మానాలు, అవార్డులు లెక్కలేనన్ని వున్నాయి. ఇప్పుడాయన మనమధ్య లేరు. ఆయన కలం నుంచి ఇకపై చతురతలు వెలువడవు. ఆయన మాటల తూటాలు ఇక పేలవు. అయితేనేం- ఆయన అందించిన సకల విజ్ఞాన సంపద, ఆయన జ్ఞాపకాలు, పాత్రలు తరతరాలకూ తరగని సంపదగా మన మధ్య వుంటాయి. ఏనాడూ ఏ విషయంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేయని ఈ పరిపూర్ణ జీవి చెప్పిన జీవిత సత్యాలు నగ్నసత్యాలుగా గుర్తుండిపోతాయి. . పుల్ ఆఫ్ లైఫ్’కు పరిపూర్ణ ఉదాహరణ గొల్లపూడి మారుతీరావుగారు!!!

-స్వాతి

1 thought on “పరిపూర్ణ జీవి  – గొల్లపూడి మారుతీరావు

  1. ఆత్మీయమిత్రుడు గొల్లపూడి మారుతీరావు.50 ఏళ్ళ మా స్నేహం పరిపక్వత చెందినదని ఘంటాపథంగా చెప్పవచ్చు..మామధ్యన ఎన్నో , ఎన్నెన్నో అనుభవాలు,అనుభూతులు.మా మారుతీరావు కి స్మృత్యంజలి!

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap