ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈమధ్య స్టయిల్ మార్చారు. జనంతో ఇట్టే కలసి పోతున్నారు. జోకులు కట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనసు విప్పి నవ్వుతున్నారు. కళాకారులను కలసినప్పుడు మరింత ఆప్యాయంగా ఆనందంగా పలకరిస్తున్నారు… ఇదొక గొప్ప పరిణామం.
నిన్న మంగళవారం(7-7-2026) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్, కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోపాలకృష్ణ గారిని చంద్రబాబు గారు అభినందించారు. క్రమశిక్షణ, అంకితభావంతో కష్టపడి ఇంతటి స్థాయికి రావడం స్ఫూర్తిదాయకం అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు కూడా వస్తుందని ముందస్తు ఆశీస్సులు అందించారు.
గుమ్మడి గోపాలకృష్ణకు పురస్కారం అంటే తెలుగు పద్యాన్ని గౌరవించుకోవడమే అని చంద్రబాబు గారి నోట విన్నప్పుడు చాలా సంతోషం కలిగిందని ఆయన మరింత ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంలోనే నాటక వికాసం కోసం కళాకారుల సంక్షేమం కోసం తాను తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబుకు తెలియజేసినట్లు చెప్పారు. టిటిడి ధర్మ ప్రచార పరిషత్ నుంచి నాటక అకాడమికి కొంత అదనపు నిధులు కేటాయిస్తే నాటక సమాజాలను మరింత ప్రోత్సాహించేందుకు దోహద పడుతుందని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అలాగే ఇటీవల తన గ్రామస్థులు మేడూరు వాసులు తనను ‘స్వర్ణ కంకణ ధారణ’ చేసి సత్కరించారంటూ ఆ స్వర్ణ కడియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించగా, “యూ డిజర్వడ్” అంటూ భుజంపై చెయ్యి వేసి తట్టి అభినందించారని సంతోషంగా వివరించారు గుమ్మడి గోపాలకృష్ణ. ఇదే విషయాన్ని తన ఫోటోతో చంద్రబాబు గారి అఫీషియల్ పేజీలో ట్వీట్ చేయడం విశేషం అని సంతోషం వ్యక్తం చేశారు. తమ భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ టి.డి. జనార్దన్ గారు కూడా పాల్గొన్నారని కృతజ్ఞతలు తెలిపారు.
– డా. మహ్మద్ రఫీ
