విజయవాడలో ‘గోరా’ 50 వ వర్ధంతి

“గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం చక్కని జీవన విధానం”

“గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వం సమాజంలో సమానత్వానికి, మానవత్వానికి, అభ్యుదయానికి ప్రతీక, వ్యక్తిలో వాస్తవికత ధృక్పథాన్ని, సంఘదృష్టిని, వ్యక్తిత్వాన్ని పెంచేటటువంటి చక్కని జీవన విధానం. అభ్యుదయాన్ని కోరే ప్రతి వ్యక్తి గోరాగారు ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వమే సమసమాజానికి అవసరం అని అంగీకరించమానరు” అని ప్రముఖ జీవ శాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డా. దేవరాజు మహారాజు పేర్కొన్నారు. జులై 26, 2025 విజయవాడ, నాస్తికకేంద్రంలో ఏర్పాటు చేసిన గోరా 50 వ వర్ధంతి సభకి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన “సంఘ సంస్కరణ-గోరా కృషి” విషయంపై ప్రసంగించారు. సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలని, అర్ధంపర్ధంలేని చాంధస భావాలని గోరా ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. మూఢ విశ్వాసాలపై రాజీలేని పోరాటం జరిపి, వ్యక్తిలో శాస్త్రీయ ధృక్పథం, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి చేసిన కృషి అమోఘమైనదన్నారు. సమసమాజ నిర్మాణానికి గోరా వేసిన బాట ఆచరణీయమైందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరొక ముఖ్య అతిధి నాగార్జున యూనివర్శిటీ మాజీ ఉపకులపతి డా. బాలమోహనదాస్ మాట్లాడుతూ ఆస్తికుడైన గాంధీ నాస్తికుడైన గోరాతో సంభాషణలు జరిపిన తర్వాత నా ఆస్తికత్వం ఒప్పనిగానీ, నీ నాస్తికత్వం తప్పనిగానీ అనలేనని, మనిద్దరం సత్వాన్వేషకులమని అన్నారు. ఎన్నో విషయాల్లో మహాత్మాగాంధీ గోరా సిద్ధాంతాలతో ప్రభావితమై, ఆయన ప్రతిపాదించిన పాజిటివ్ ఎథీజం ఎంత గొప్పదో తెలుస్తోందన్నారు. ఈ సమావేశానికి డా. సమరం అధ్యక్షత వహించగా తొలుత శ్రీ నియంత సభకు స్వాగత పలికారు. శ్రీమతి సకల వందన సమర్పణ చేసారు. ఉభయ రాష్ట్రాల నుంచి పలువురు గోరాగారి అనుయాయులు, యువత ఈ సమావేశంలో పాల్గొన్నారు.

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap