కుల, మత, వర్ణ, వర్గ, రంగు బేధంలేకుండా అందర్నీ అన్ని జీవరాశుల్ని సమతాభావంతో చూడాలని దుఃఖంలేని సుఖవంతమైన జీవితాన్ని గడప టానికి 2500 ఏళ్లనాడు ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చేశాడు సిద్ధార్థ గౌతముడు. మూఢనమ్మకాలను, దురాచారాలను పాటించక ఉన్నది ఉన్నట్లుగా చూచి, ధర్మమార్గంలో పయనించాలని సూచిస్తూ, మానవాళితో పాటు సకల జీవరాశులు భవ చక్రాన్నుంచి బయటపడి నిర్వాహణపథాన్ని చేరుకోవటానికి పంచశీల, ఆర్య, అష్టాంగ మార్గాలను భోధించి, అనుభవపూర్వకంగా ప్రతి వ్యక్తి బుద్ధుడు గావచ్చని తెలియజెప్పిన మహనీయుడు. బుద్ధ పూర్ణిమను బుద్ధ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన పండుగ. ఇది బౌద్ధం స్థాపకుడిగా సిద్ధార్థ గౌతమ జననాన్ని, మరణానికి గుర్తుగా జరుపుకుంటారు. బౌద్ధ గ్రంధాల ప్రకారం, బుద్ధుడు నేపాల్లోని లుంబినిలో క్రీస్తుపూర్వం 563 సంవత్సరంలో వైశాఖ మాసం (ఏప్రిల్/మే) పౌర్ణమి రోజున బుద్ధుడు జన్మించాడు. ‘పూర్ణిమ’ అనే పదం సంస్కృతంలో ‘పౌర్ణమి’ని సూచిస్తుంది, ఇది పౌర్ణమి రోజున ఎందుకు జరుపుకోవాలో వివరిస్తుంది ‘జయంతి’. బుద్ధుడు అనే పదం ‘బోధి’ లేదా జ్ఞానాన్ని పొందిన వారికి ఇస్తారు. అందుకే జ్ఞానోదయం పొందిన తర్వాత సిద్ధార్థుడిని బుద్ధుడు అని పిలిచారు. ఇది సాధారణంగా హిందూ/బౌద్ధ చాంద్రమాన క్యాలెండర్లలో ‘వైశాఖి’ నెలలో జరుపుకుంటారు.
బుద్ధుడు తన ప్రారంభ జీవితాన్ని యువరాజుగా గడిపాడు. తరువాత జ్ఞానోదయం కోసం తన రాజ జీవితాన్ని త్యజించాడు. చాలా సంవత్సరాలు. ధ్యానం, స్వీయ-క్రమశిక్షణ తర్వాత భారతదేశంలోని బుద్ధగయలో బోధి చెట్టుకింద జ్ఞానోదయం సాధించాడు. బుద్ధుడు భారతదేశంలోని కుషీనగర్ 80 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు తన శిష్యులకు బౌద్ధమత సూత్రాలను బోధిస్తూ జీవితాంతం గడిపాడు. ఆయన బోధనలు కరుణ, అహింస, స్వీయ-అవగాహన ప్రాముఖ్యతను నొక్కిచెబుతాయి. అయినప్పటికీ, బుద్ధుని అనుచరులు ఆయన పుట్టినరోజును అధికారికంగా జరుపుకోలేదు. అనేక శతాబ్దాలుగా, బుద్ధుని గౌరవించే పండుగలు జరిగాయి. 1950 మే నెలలో శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బౌద్ధుల ప్రపంచ ఫెలోషిప్ మొదటి సమావేశంలో బుద్ధ పూర్ణిమను వెసక్ సందర్భంగా వేడుక నిర్వహించారు. పౌర్ణమి రోజున బుద్ధుడు మోక్షం పొందడం వల్ల మే నెలలో పౌర్ణమి రోజు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. బౌద్ధం జనాదరణ పొందటానికి కారణం అహింస, జీవితంపై గౌరవం, స్త్రీలకు సమానమైన ప్రాతినిధ్యం – సంప్రదాయం, పురోగతి, ఆధునిక ఆలోచనలు, బోధనలు కారణం. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు బౌద్ధ దేశాలుగా మార్పు చెందాయి. ముఖ్యంగా ఆసియాలో, ప్రతి సంస్కృతి ప్రధాన సిద్ధాంతాలను స్వీకరించి, సమీకరించు కోవడంతో బౌద్ధం ఉప- విభాగాలుగా విభజన జరిగింది. నేడు బౌద్ధమతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరిస్తున్నారు. బుద్ధుని జీవిత కాలంలోనే తెలుగు నేలపై బౌద్ధ ధమ్మం ప్రవేశించింది. అశోక చక్రవర్తి పోషణలో ధమ్మవాచికలు తెలుగు నేల నలుదిశలా వ్యాపించాయి. దాదాపు 300 బౌద్ధ స్థావరాలతో, స్థూపాలు, చైత్యాలు, విహారాలు, బుద్ధ ప్రతిమలతో తిసరణాలు మారుమోగాయి. బుద్ధుడు బోధించిన శాంతిమయ జీవనం తెలుగు వారిని ధార్మికులుగా తీర్చిదిద్దింది.
ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవుడు, దిన్నాగుడు, భావ వివేకుడు, బుద్ధ ఘోషుడు, ధర్మకీర్తి లాంటి బౌద్ధచార్యులు తెలుగునేలను మరింత ధార్మికంగా మలిచారు. కాలచక్ర మూల తంత్రాన్ని ధాన్యకటకంలో బోధించాడన్నది టిబెటిన్ల నమ్మకం. తీరాంధ్ర నుంచి బౌద్ధ ధర్మ వీచికలు శ్రీలంక, మైన్మార్, చైనా దేశాలకు ప్రసరించాయి. బుద్ధభగవానుని బోధనలను శిల్పకళ ద్వారా ప్రపంచవ్యాప్తం గావించిన ధాన్య కటక అమరావతి శ్రీపర్వత విజయపురి (నాగార్జున కొండ) ప్రపంచ బౌద్ధుల్ని వేల సంఖ్యలో ఆకర్షిస్తూ నేటి సమాజానికి బౌద్ధమే శరణ్యమన్న సందేశాన్ని అందిస్తున్నాయి. ఆనాడు బుద్ధుడు సమాజాన్ని మార్చాల్చిన అవసరాన్ని గుర్తించాడు. ఆనాటి తత్వశాస్త్రాలని నిశితంగా పరిశీలించి వాటికి ప్రాపంచిక దృక్పధాన్ని, అధిక్యతను వివరించిన మొదటి తత్వవేత్త. అంబేద్కర్ చెప్పినట్టు కొన్ని ఉపనిషత్తులు బుద్ధునిలా లోతుగా చర్చించాయి. కాని అవి బుద్ధినిలా ఆచరణకు పూనుకోలేదు. బుద్ధుడు ప్రజాజీవితంలో మమేకమై వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వైద్యం, విద్య, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ జీవించాడు. బుద్ధుని బోధనల ద్వారా ప్రపంచం ఎంతో ప్రభావితమైంది. బుద్ధుని కాలం నాటికి గ్రీస్తో భారతదేశానికి పూర్వం నుంచి సంబంధాలు వున్నాయి. ఆనాడు గ్రీకు తత్వశాస్త్రం ప్రాధమికస్థాయిలో ఉంది. గ్రీకు తత్వవేత్తలపై బౌద్ధం ప్రభావం ఉంది. ప్లేటో, అరిస్టాటిల్ కాలం నాటికి బౌద్ధం భారత దేశంలో ఒక బలమైన శక్తిగా అవతరించింది. చాలా మంది తత్వవేత్తలు గ్రంధాలు చదివి, ప్రజలలో ప్రత్యక్షంగా సంబంధం లేకుండా వారి భావాలు ప్రకటించారు. వాళ్ళ భావాలను వ్యతిరేకించినవారిని తీవ్రంగా వెంటాడారు.
బుద్ధుడు నేను చెప్పానని గాని, మరొకరు చెప్పారనిగానీ దేనిని నమ్మకు. ఏది సత్యమో దాన్ని నమ్ము, ఆచరించు అని తెలియజేసాడు. బుద్ధుడు సమతా, ప్రజ్ఞ, కరుణ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిపాదించారు. వర్ణ, కుల వ్యవస్థలు వీటికి వ్యతిరేకం ఇది. అట్టడుగు వారి ఉన్నతి కోసం ప్రతిపాదించారు. బ్రాహ్మణిజం ప్రయోజనాల కోసం నిర్మించారు. బౌద్ధం అట్టడుగు వర్గాల వారికి, వారి పైవారికి మధ్య మార్గాన్ని ప్రతిపాదించింది. వైరుద్యం, పరిణామం, గుణం, అభావం అనే మౌలిక గతితార్కిక సూత్రాలను విస్తతంగా చర్చించి జీవితానికి అన్వయించి, ఆచరించి ప్రాపంచిక దృక్పధంగా రూపొందించిన తొలి తత్వవేత్త సామాజిక, రాజకీయ శాస్త్రవేత్త, విప్లవకారుడు బుద్ధుడు. బౌద్ధం ప్రేమ, జ్ఞానం, విద్య, వైద్యం, ఐక్యతను ఆచరించింది. బౌద్ధం వ్యక్తిని, వర్గాన్ని, సమాజాన్ని పరిశీలించి సమజాన్నుంచి, వ్యక్తినుంచి రాజ్యం యొక్క అవసరం లేకుండా చేస్తుంది. అందువల్ల రాజ్యం అవసరం లేకుండా పోయింది. విద్య, వైద్యం, ప్రేమ ద్వారా సామజిక ఆచరణ అంశాల్ని మిగతా మతాలు స్వీకరించాయి. కానీ అయన చనిపోయాక బ్రహ్మాణీయులు దాని మతరూపంలోకి నెట్టారు. సమాజాన్ని జ్ఞానం, పరోపకారం ద్వారా అందరికి జ్ఞానాన్ని అందించటం సామాజిక సంస్కృతిలో జీవనాన్ని అందించే ముఖ్య లక్షణంగా సేవా దృక్పదంలో ముందుకు సాగింది.
–రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు,
భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్