గ్రేట్ షో మ్యాన్ రాజ్ కపూర్

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 15

తన హిందీ సినిమాల ద్వారా మన భారతీయతను ప్రపంచానికి చూపి ఎందరో విదేశీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న భారతీయ సినీ రారాజు రాజ్ కపూర్ అసలు పేరు రణబీర్ రాజ్ కపూర్. అతి చిన్న వయసులో క్లాస్ బోయ్ గా సినీ పరి శ్రమలో చేరి తన అసమాన సహజ నటనతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన అరుదైన నటరాజు రాజ్ కపూర్. తన 11వ యేట తొలిసారిగా ఇన్ క్విలాబ్ అనే సినిమాతో నటజీవితం ప్రారంభించి వెలుగులోనికి వచ్చాడు రాజ్ కపూర్. 24సం.ల వయసులో సొంత స్టూడియో, ఆర్.కె. ఫిలిమ్స్ స్థాపించి యువదర్శకుడిగా నాడు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. స్వయంగా నటించి, దర్శకత్వం వహించి, ఆగ్ అనే సినిమాలో నర్గీస్ తో కలిసి నటించాడు. అందాజ్ అనే సినిమా రాజ్ కపూర్ సినీ జీవితంలో తొలి హిట్ సినిమాగా నిలిచింది. పేదరికం లోనూ నవ్వుతూ, నవ్విస్తూ నిజాయితీకి మారు పేరుగా అమాయకత్వపు పాత్రల్లో నటించి – భారతీయ చార్లీ చాప్లిన్ గా పేరు గడించాడు రాజ్ కపూర్. సంగమ్ అనే హిందీ కలర్ సినిమా నిర్మించిన ఘనత రాజ్ కపూర్ కే దక్కుతుంది. తనకు ధనం అంతగా ఆర్జించి పెట్టకున్నాగాని మేరానాం జోకర్ సినిమా మాత్రం తనకెంతో ఇష్టమైన సినిమా అన్నాడు రాజ్ కపూర్. తరువాత కాలంలో రాజ్ కపూర్ తన పంథాను మార్చుకుని యువ ప్రేమికుల కథలవైపు దృష్టి మళ్ళించి తన కొడుకు రిషీకపూర్ డింపుల్ కపాడియాను హిందీ సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూ…. బాబీ సినిమా తీసి, అఖండ విజయం సాధించి హిందీ సినీ చరిత్రను తిరగరాశాడు రాజ్ కపూర్. డైరెక్టర్ ఆఫ్ మిలీనియం, ద షో మేన్, దాదా సాహెబ్ రాజ్ కపూర్ నేటికీ మన ధృవతార!

( రాజ్ కపూర్ జన్మదినం 14 డిశంబర్ 1924)

SA: