సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది. కళారంగం మూగ వోయింది. నాట్యరంగంలో ఎంతో మందిని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది. సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరిగారు కనుమూసారు. 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానంగా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు.
నేను అమెరికా లో ఉండటం వల్ల నాకు ఈ దుర్వార్త అలస్యంగా తెలిసింది. ఆత్మీయ మిత్రుని చివరి చూపుకు నోచుకోలేక పోయాను. శ్రీహరిగారి వయసు 88 అయినా వారు నవ యువకులుగా ఫీల్ అయ్యేవారు. వారు ధరించే డ్రెస్సులు కూడా యూత్ లా కనిపిపించేవి. ఆయనకు సరదాగా ఉండటం చాలా ఇష్టం. నన్ను అమితంగా ప్రేమిస్తారు. నేనొక సారి అడిగాను, 80 ఏళ్లలో కూడా మిస్టర్ ట్వంటే షర్ట్స్ వేస్తున్న రహస్యం ఏమిటని!? మనసు ఉల్లాసంగా ఉంటుందని చెప్పారు. మంచి కళారాధకులు.
హిందూ పత్రిక కంట్రిబ్యూటర్ గా పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన శ్రీహరి గారు మధ్య లో ఈనాడు, సితార, ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ బ్రాడ్ కాస్టర్ గా సేవలు అందించినా గత పాతికేళ్లుగా చివరి శ్వాస వరకు పాత్రికేయునిగా హిందూలో కొనసాగారు. వారు ఫ్రైడే పేజీలో రాసే ఆర్టికల్ కోసం కళాకారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. వారిని చూసి నేను వార్తలో ఫ్రైడే భువన విజయం పదేళ్ల పాటు రాశాను. ఈనాడులో శ్రీహరి గారు పాతికేళ్ళ పాటు రాసిన హరివిల్లు వంగ్య కాలమ్ ఒక సంచలనం. ముఖ్యమంత్రుల స్థాయి పరిచయాలు వున్నా, రాతల్లో మాత్రం ఎవ్వరిని లెక్క చేసే వారు కాదు. నిర్మొహమాటంగా విమర్శించే వారు. గొప్ప విమర్శకులుగా గుర్తింపు పొందారు. అయన రాసిన ఆర్టికల్ కళాకారులకు గొప్ప సర్టిఫికెట్. శ్రీహరిగారు సాంస్కృతిక రంగంలో చెదరని సువర్ణ లిఖిత సంతకం.
నన్ను కల్చరల్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఏర్పాటు చేయమని ప్రోత్సహించి పట్టుబట్టి వారు గౌరవ సలహాదారులుగా ఉండి నడిపించారు. అదొక సంచలన అధ్యాయం. పాత్రికేయ నాయకుడు శ్రీహరిగారు. ఇప్పటి పాత్రికేయులు సినిమా రంగం గురించి ఒక్క విమర్శ కూడా చేయలేరు గానీ, శ్రీహరిగారు మాత్రం విమర్శించడంలో ముందుండే వారు. అ రోజుల్లోనే ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ ప్రారంభించారు. అది ఇప్పటికి కొనసాగుతోంది. అసలు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ బిల్డింగ్ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకం.
జర్నలిజంలో విలువలు కనుమరుగయినా శ్రీహరిగారు మాత్రం చివరి వరకు విలువలతో కూడిన జర్నలిస్ట్ గా కొనసాగారు. కాలర్ ఎత్తుకునే తిరిగారు. ఆయనకు పాత మోడల్ కార్లు అంటే ఇష్టం. చాలా కాలం పద్మిని కారులో వచ్చేవారు. మొన్నటి వరకు ఫియట్ కారు వాడారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్టం. మంచి వార్త రాస్తే ఫోన్ చేసి మరీ అభినండించే వారు. కల్చరల్ లో నేను విమర్శకుడిని. నా తరువాత నువ్వు ఒక్కడివే. నీ తరువాత ఇక విమర్శనాత్మక జర్నలిస్టులు లేనట్లే. నువ్వే చివరి బెస్ట్ జర్నలిస్ట్ అని ఎన్నో సార్లు కితాబునిచ్చారు శ్రీహరి గారు. నేను అవార్డ్స్ కమిటీ ల్లో వున్నప్పుడు ఉత్తమ జర్నలిస్ట్ గా పలు మార్లు వారిని సత్కరించుకునే అదృష్టం నాకు లభించింది. అతిదులుగా వారితో కలసి అనేక వేదికలు పంచుకున్నాను.
గత ఏడాది వారి శ్రీమతి డాక్టర్ లక్ష్మిగారు కనుమూయడంతో బాగా కుంగిపోయారు. బయటకు రావడం తగ్గించారు. ఫ్రైడే పేజీ లో వార్తలు రాస్తూనే వున్నారు. వారం క్రితం ఇంట్లో జారి పడటం తుంటి ఎముక ఫ్రాక్చర్ అవడం, నిమ్స్ లో శస్త్ర చికిత్స చేయించుకోవడం అన్నీ సాఫీగా జరిగినా పోస్ట్ ఆపరేషన్ వయసు రీత్యా సమస్యల వల్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు తుది శ్వాస విడిచారు ఎస్. ఆర్. నగర్ లోని వారి స్వగృహంలో. ఎంత రాసినా వారి గురించి తక్కువే అవుతుంది. శ్రీహరి గారు ఒక లెజెండ్. పద్మశ్రీ కోసం పరి తపించారు. కానీ అదొక్కటే రాలేదు. అదొక్కటే ఆయన తీరని కోరిక. వారికి అశ్రు నివాళి. కుమార్తెకు, కుమారుడికి నా ప్రగాఢ సానుభూతి.
- డాక్టర్ మహ్మద్ రఫీ
(వాషింగ్టన్ నుండి)