
పద్య నాటక రంగంలో కారణజన్ముడు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇవాళ కొన్ని ఫోటోలు పంపించారు. చూస్తే ఆయన శ్రీకృష్ణుడి మేకప్ లో వున్న ఫోటోలు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలో ఆయన షణ్ముఖ ఆంజనేయ రాజు ధరించే శ్రీకృష్ణుడు పాత్రను పోషిస్తున్నారట. ఆ చిత్రాలు అవి. కాసేపు అలాగే చూడాలనిపించింది. ఏం వర్చస్సు. నందమూరి తారక రామారావు తరువాత మళ్ళీ అందమైన శ్రీకృష్ణుడు మనకు గుమ్మడి గోపాలకృష్ణ లోనే కనిపిస్తారు. నేను 25 ఏళ్ల క్రితం గుమ్మడి గోపాలకృష్ణ ను శ్రీకృష్ణుడి వేషంలో చూసి “వహ్వా ఏం రాజసం” అనుకున్నాను. పద్య నాటక రంగంలో మెగాస్టార్ అని ప్రకటించాను. ఎప్పుడు ఆయన వేషం వేసినా అదే రాజసం. ఆ వేషం ఆయనకు బాగా కుదిరింది. శ్రీకృష్ణుడు అంటే పౌరాణిక పద్య నాటక రంగంలో గుమ్మడి గోపాలకృష్ణ తరువాతే అని కళాభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. అమెరికాలో ప్రవాస తెలుగు వారితో పాటు విదేశీయులు సైతం ఆయన్ని శ్రీకృష్ణుడు వేషంలో చూసి చేతులెత్తి మొక్కారు. బ్రహ్మ రథం పట్టారు. అందుకే ఇప్పటికి 23 సార్లు అమెరికా వెళ్లారు. ప్రతిసారి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు. అక్కడ పుట్టిన తెలుగు వారి పిల్లలకు పద్యం నేర్పించారు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాధుడు నాటకాలు నేర్పించి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేర్చారు.
ఇవాళ గుమ్మడి గోపాలకృష్ణ పంపిన ఫోటోలు చూస్తుంటే అసలు ఈయన వయసు ఏంటి? ఇంతలా వేషం కుదరడం ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది. ఆయన వయసు చూస్తే 70. శ్రీకృష్ణుడి వేషంలో ఆయన్ని చూస్తే ఆ వయసే కనిపించదు. చెదరని చిరునవ్వు, ముడుతలు పెద్దగా కనిపించని అందమైన ముఖారవిందం చూస్తే నిజంగా శ్రీకృష్ణుడు వేషం కోసమే పుట్టాడేమో, అదృష్టవంతుడు కారణజన్ముడు అనిపిస్తుంది.

గుమ్మడి గోపాలకృష్ణ ను నేటి నటులు స్ఫూర్తిగా తీసుకోవాలి. నటనా రంగంలో కొనసాగాలనుకునే వారు ఆదర్శంగా చూసుకోవాలి. ఒక ట్రిప్ లో అమెరికాలో ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. ఆయన క్రమశిక్షణ, జీవన శైలి, ఆహారం తీసుకునే విధానం, స్వర సాధన ఇలా ఒకటేమిటి… నిత్య విద్యార్థిగా ఆయన చేస్తున్న కృషి చూశాను. నాటక రంగంలో ఎక్కువ కాలం జనాదరణతో కొనసాగడం ఆషామాషి వ్యవహారం కాదు. ముందు ఒక లక్ష్యం ఉండాలి. క్రమశిక్షణ, పట్టుదల, నిత్య సాధన ఉండాలి. అవన్నీ పుష్కలంగా గుమ్మడి గోపాలకృష్ణ లో ఉన్నాయి. అంతేకాదు, పద్య నాటక కళాకారుడు అందంతో పాటు గళం కూడా కాపాడుకోవాలి. ఇందుకు ఎంతో శ్రమించాలి. నేను చాలా సార్లు గుమ్మడి గోపాలకృష్ణ ను అడిగాను… మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని? చాలాసార్లు దాట వేసినా, ఒకసారి మనసు విప్పారు. “ఏం లేదండి, కుళ్ళు కుతంత్రాలు లేకపోవడం, స్వచ్ఛంగా ఉండటం, నిరంతర సాధన చేయడం, జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవడమే” అని ఎంతో సింపుల్ గా చెప్పేసారు. కానీ అలా ఉండటం చాలా కష్టం. ఆయన ఈ సుసాధ్యాన్ని సాధించారు. అందుకే గుమ్మడి గోపాలకృష్ణ ఇన్నేళ్లు పద్య నాటక రంగంలో ఎవర్ గ్రీన్ గా కొనసాగగలుగుతున్నారు.
ఇన్నేళ్ల పరిచయంలో గుమ్మడి గోపాలకృష్ణ ను నేను గమనించాను. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. నిజానికి ఆయన ఏ డిగ్రీయో చేసి ఉంటారనుకుంటారు అతనితో మాట్లాడిన వారు. కానీ, ఆయన చదివింది స్కూల్ చదువే. 1982 లో వాళ్ళ మేడూరులో తెలిసిన వారు 300 రూపాయలు సాయం చేస్తే హైదరాబాద్ వచ్చారు. అదృష్టం కొద్దీ పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ దర్బార్ లో చోటు దొరికింది. నాటక రంగంలో మహామహుల సాంగత్యం లభించింది. మరో వైపు వడ్డేపల్లి నర్సింగరావు లాంటి వారితో స్నేహం కుదిరింది. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నాటక రంగంలో కొనసాగుతూ ముందుకు కదిలారు. డి.యస్.దీక్షిత్ దర్శకత్వంలో శ్రీకృష్ణ రాయబారం గొప్ప మలుపు తిప్పింది. ఆ తరువాత శ్రీకృష్ణ తులాభారం మరో సంచలనం. సత్య హరిశ్చంద్ర, చింతామణి లో బిల్వ మంగళుడు ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎందరో అభిమానుల హృదయాల్లో గూడు కట్టేసుకున్నారు. శ్రీనాధుడు, వేమన ఆయన నాటక రంగ జీవితంలో గొప్ప కీర్తి కిరీటాలుగా చెప్పుకోవచ్చు. ఆయన నాటకాలకు తప్పనిసరిగా హాజరై పద్యాలను జుర్రుకునే పద్మవిభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి ఆయన్ని “గుమ్మడి శ్రీనాథ కృష్ణ” అని ప్రేమగా పిలిచే వారు. ఇక సన్మానాలు సత్కారాలు, గండ పెండేరాలకు కొదవే లేదు! పద్య నాటక రంగ చరిత్రలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న చరిత్ర గుమ్మడి గోపాలకృష్ణదే. అమెరికాలో డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారు ఆయన వేషం పద్యం నాటకం చూసి పులకించిపోయి ఏకంగా 10 వేల డాలర్లు చదివించారు. ఇందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం.
ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, ఇటీవల కాలంలో సరస్వతి ఆయన చెంత చేరి పలికిస్తోంది. చదువు లేకపోయినా చందోబద్ధంగా పద్యాలు రాస్తున్నారు. చంద్రబాబు పై పాటలు రాసేస్తున్నారు. మళ్ళీ వాటికి స్వయంగా సంగీత స్వరకల్పన చేస్తున్నారు. హార్మోనియం నేర్చుకున్నారు. శాస్త్రీయ సరిగమల సంగీతం పై పట్టు సాధించారు. అద్భుతమైన గమకాలతో ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. “ప్రతి రోజూ సాధన చేస్తున్నా, సత్య సాయిబాబా ఆశీస్సులు, చంద్రబాబు ప్రోత్సాహం తనను ఈ స్థాయికి చేర్చాయని” ఎంతో వినమ్రంగా చెప్పుకున్నారు గుమ్మడి గోపాలకృష్ణ. గత నాలుగు రోజులుగా పఠాన్ చెరువు దగ్గరలోని కంజర్ల గ్రామంలో భారీ తిరుణాల సెట్ వేసి గరివిడి లక్ష్మి బయోపిక్ షూటింగ్ చేస్తున్నారు. అందులో గుమ్మడి గోపాలకృష్ణ కు కారవాన్ కేటాయించారు. రూపశిల్పి వెంకటస్వామి ప్రతిరోజు గుమ్మడి గోపాలకృష్ణ కు అద్భుతంగా మేకప్ చేసి అందమైన శ్రీకృష్ణుడిని కనుల ముందుంచుతున్నారు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఆ ఫోటోలను.
–డా. మహ్మద్ రఫీ