అక్టోబర్ 20 ఆయన పుట్టిన రోజు సందర్భంగా...
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు.
గుంటూరు శేషేంద్ర శర్మ అక్టోబర్ 20, 1927లో నెల్లూరులో తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు. ‘నా దేశం – నా ప్రజలు’ ‘శేషజ్యోత్స్న’, ‘రక్తరేఖ’, ‘గొరిల్లా’, ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశం’, ‘రుతుఘోష’, ‘మండేసూర్యుడు’, ‘స్వర్ణహంస’, ‘రామాయణ రహస్యాలు’ వంటి రచనలు చేశారు. ‘కవిసేన మేనిఫెస్టో’ ఆయన సుప్రసిద్ధ రచన. ఆయన సాహిత్యకృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. కవిత్వం, సాహిత్య విమర్శ ఇతర వచన రచనలన్నీ కలిపి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి.
ధన్ రాజ్ గిరి సాహచర్యంతో రాణివాసానికి వెళ్ళి సాహిత్య సామ్రాట్ గా మారినట్లు కనిపించినా, ఆయన చివరి దాకా ఎస్టాబ్లిష్ మెంట్ కు దూరంగానే ఉన్నారు. ఉద్యోగం తొలిరోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘాన్ని ఐ.వి. సాంబశివరావుతో కలిసి నిర్మాణం చేసి కమ్యూనిస్టుగా ముద్రపడి ఆయనను నిర్బంధ పదవీ విరమణకు గురిచేసింది. 1955 ఆంధ్రా ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ వైపు నిలబడిన శ్రీశ్రీ దాదాపు మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆయనకు అండగా కవిత రాసి ఓటమి తాత్కాలికమే అని ప్రోత్సహించిన కవి శేషేంద్ర. ఇంక 1991 నుంచి గల్ఫ్ యుద్ధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదాన్ని స్థిరంగా వ్యతిరేకించిన శేషేంద్ర ‘నీతులు చెప్పే అమెరికా – ఇదీ నీ చరిత్ర’ అని వ్యాస సంపుటి వలువరించారు.
“సముద్రం ఒకటి కాళ్ల దగ్గర కూచుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు
పర్వతం ఎవడికీ వొంగి సలాం చెయ్యదు
నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది”
అన్నప్పుడు జాతీయోద్యమ కాలంలోని వందేమాతరం నినాదం గుండెల్లో మార్మోగుతుంది. తన జీవన సాఫల్యకృషిలాంటి ‘ఆధునిక మహాభారతం’ జాతికి యిచ్చే శక్తి ఏమిటో ఆయన ఇలా వివరించారు. “ఆధునిక మహాభారతం వింటే, గులాం మనస్తత్వ కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలంవచ్చి,మనిషి కాళ్లు నిటారుగా నిలుస్తాయి. దానిపైన వంగి వంగి సలాములు చేసిచేసి వంకర టింకర్లు అయిపోయిన వెన్నెముక ఇసుకచువ్వలా నిలబడుతుంది. సిగ్గు విడిచి, తలవొంచి వొంచి వేలాడే తల ఒక్కసారిగా భుజాల మీద వేచి నిర్భయంగా నిలబడుతుంది. మనిషి మనిషిగా మారిపోతాడు. భూగోళానికి ఇరుసు అవుతాడు” ఒక కావ్యం సాధించగల పరమార్థం ఇంతకంటే ఏముంటుంది? అంతటి శక్తివంతమైన సాహిత్యం అందించాడు కనుకనే శేషేంద్రను విమర్శకులు ‘విప్లవభాషా ప్రదాత’ వంటి బిరుదులతో సంబోధించారు.
30 మే, 2007 న ఆయన కన్నుమూసారు.
Great poet and handsome personality.
నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది”