విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 44
విశాఖజిల్లా రాయవరం గ్రామంలో వేంకటదాసు, కౌసల్యమ్మలకు జన్మించిన శ్రీ గురజాడ వేంకట అప్పారావుగారు నాటి సామాజిక రుగ్మతలైనటు వంటి కన్యాశుల్కం, వేశ్యావృత్తి, వితంతువుల వేధింపు, అరకొర విద్యాభ్యాసం వంటి వాటిని తన అక్షరాలతో శిక్షించారు. మనిషికి జబ్బొస్తే మాత్రలు పనిచేస్తాయి. మనసులకు జబ్బులొస్తే మాటలు పనిచేస్తాయి. కన్యాశుల్కం దీనికి అక్షరసాక్ష్యం. నాటి ఈ నాటకం నేటికీ ఓ మేటి నాటకమే. వాడుక భాషలో చేసిన రచనా వేడుక ఇది. వాడుక భాషోద్యమంలో గిడుగువారికి గొడుగు పట్టిన వారు గురజాడ. గురజాడ వారి ముత్యాల సరాలు ప్రతీ తెలుగువాడి మెడలో అణిముత్యాల హారాలు. మతం విమతంలో మత ఛాందసులు కళ్ళు తెరిచేలా చేశారు. 1910 లో వ్రాసిన “దేశమును ప్రేమించుమన్నా” అనే దేశభక్తి గేయం ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి ఎంతగానో దోహదపడింది. “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్” అని మానవత్వానికి నాంది పలికి, ఒట్టిమాటలు కట్టి పెట్టి గట్టిమేల్ చేయమని ఆనాడే నాటి నేతలకు గట్టిగా మొట్టికాయలు వేశాడు. నవయుగ వైతాళికుడు, ఆధునిక సాహిత్యానికి ఆద్యుడు, పూజ్యుడు శ్రీ గురజాడ వేంకట అప్పారావు పంతులుగారు నేటికీ మన ధ్రువతార.
(గురజాడ అప్పారావు జన్మదినం సెప్టెంబర్ 21, 1862)