తెలుగు భాష – మూలాలు

తెలుగు భాషను కాపాడుకోవాలనే ఈనాటి ఆందోళనకు మూలాలు ఎక్కడ ?

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారు, ఈ దేశాన్ని అఖండంగా ఉంచగలిగే శక్తి ఒక్క హిందీ భాష కె ఉన్నదని ఏమంటూ ఉద్ఘాటించారో గానీ, యావద్దక్షిణ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డడి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఈ చర్చ ఈ దేశంలో ఒకప్పుడు ఆంగ్లానికి వ్యతిరేకంగా ఉండేది. కారణమేమైనా, ఆ రోజుల్లో ఆంగ్లాన్ని వ్యతిరేకించిన వారికన్నా అక్కున జేర్చుకుని ఆదరించినవారే అధికులు.

ఈ సెప్టెంబరు 21వ తేదీ, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప వైతాళికులలో ఒకరైన శ్రీ గురజాడ అప్పారావుగారి 153వ జయంతి. వారు రాసిన కన్యాశుల్కం నాటకంలో అనేక సామాజికాంశాలు ఆద్యంతం అంతర్లీనంగా ప్రవహిస్తాయి. వాటిలో బాల్య, వితంతు వివాహాలతోపాటు విద్య, భాష మొదలైన అంశాలు కూడా ప్రముఖ స్థానం ఆక్రమిస్తాయి.. నాటకంలో సందర్భం వచ్చినపుడల్లా సమాజంలో చదువుకు ఉన్న ప్రాధాన్యం, ప్రజల మీద దాని ప్రభావం, ఆరోజున పాత కొత్త చదువుల మధ్య తారతమ్యం మొదలైనవన్నీ చర్చకు వస్తాయి. నాటకంలోని దాదాపు అన్ని పాత్రలూ విద్యను గురించి ఆనాటి ఇంగ్లిషు చదువుల మంచీ చెడులను గురించి ఎప్పుడో ఒకసారి వ్యాఖ్యానించడం ఆనాటి సామాజిక జీవితంలో ఇంగ్లిషు ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

మధురవాణికి ఇంగ్లీషు అవసరం లేకున్నా నేర్చుకోవాలనే యావ ఉంది. రామప్పంతులుకి ఇంగ్లీషు బొత్తిగా రాకపోయినా నేర్చుకుని ఉంటే న్యాయస్థానాల్లో జడ్జీలను ఫెళఫెళలాడించి ఉందునని డంబాలు పలుకుతాడు. అగ్నిహోత్రావధానుల్లాంటి ‘అగ్రహారపు చేతికి ఇంగ్లీషు తెలియకపోవంవల్ల కోర్టు వ్యవహారాల్లో ఎన్నో చిక్కులు. చివరికి సంస్కృతాన్ని జీవనాధారమ్ చేసుకున్న కారటకశాస్త్రి కూడా పొట్ట పోషించు కోడానికి ఇంగ్లీషు అవసరమని నమ్ముతాడు. వీళ్లంతా ఇంగ్లీషు అవసరాన్ని గుర్తించి ఇంగ్లీసు నేర్చుకుని ఉంటే తమ బతుకులు మరింత ప్రయోజనకరమై ఉండేవని వాపోయారు.

ఇక కొద్దో గొప్పో ఇంగ్లీషు నేర్చి దానివల్ల సమాజంలో గుర్తింపు పొందిన వారిలో,పాశ్చాత్య విద్యవల్ల విజ్ఞానం వివేచన పెంపండించుకుని జీవితాన్ని సమాజాన్ని అర్ధం చేసుకుని పాత కొత్తల మేలికలయికగా సమాజాన్ని సంస్కరించాలని ఆకాంక్షించిన వాడు సౌజన్యారావు పంతులైతే, ఇంగ్లీషు విద్యవల్ల వికారం తప్ప వికాసం కలగదనీ, తన ‘బొట్లేరు ముక్కల’తో (భుత్లెర్ ఏంగ్లిష్) అమాయకులను మోసం చేస్తూ జీవించే పరాన్నభుక్కు గిరీశం.

ఇక ఆ తరువాతి తరం వెంకటేశం, మహేశం కూడా ఇంగ్లీషు విద్యలో గొప్పవాళ్ళు కావాలనో, పొట్ట పోషించు కోవాలనో ఆరాట పడ్డవాళ్ళు. మొత్తం మీద పాత చదువులు నిరుపయోగమవుతూ మరుగవుతుంటే జీవనానికి ఉపకరించే కొత్త చదువులు ముందుకొస్తున్న సంధికాలం అది. చదువనేది పొట్ట పోషించు కోడానికే” అని కరటకశాస్త్రి అనడంలో ఉద్యోగాలతో నిమిత్తం లేనివాళ్లు ఏ పనికిరాని చదువలన్నా చదవచ్చుగానీ, ఉద్యోగాలతోనే జీవన యాత్ర గడిపే మధ్య తరగతివాళ్ళు విధిగా పొట్టనింపే చదువును చదవాలనే భావం వెల్లడైంది

గిరీశం అన్నట్టు ‘తెల్లవాళ్ళ స్కూళ్లలో తెలుగుకు ఖాతరీ లేదు’ ఇంగ్లీషు తప్ప విజ్ఞానాన్ని అందజేయటానికి మరొక భాష పనికిరాదన్న మెకాలే అభిప్రాయం ప్రకారం అంతా ఇంగ్లీషు మయమై గవర్నమెంటు స్కూళ్లలోనూ ఒకటవ తరగతి నుంచే ఇంగ్లీషు మొదలు పెట్టెవరకూ వెళ్ళింది.. ఇంగ్లీషు మాట్లాడటం ఒక గొప్ప. “ఈ వెధవ ఇంగ్లీషుతో తమ సంస్కృతీ సంప్రదాయాలూ, ఆచారాలూ మంటగలిసి పోతున్నాయ’ని ఘోషించే పూర్వాచార పరాయణులు కూడా తమ పిల్లలు ఇంగ్లీషు చదువుకోవాలని కోరుకున్నారు. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడితే తెగ మురిసిపోయారు. ప్రభుత్వానికి కూడా ప్రజలకు తమ మాతృభాషలో చదువు చెప్పి విజ్ఞానవంతుల్ని చేద్దామన్న దృష్టి లేదు.

ఇంగ్లీషు రాకముందు సంస్కృతం, దానికంటే ముందు మరే ప్రాకృతమో తప్ప తెలుగువారికి కూడా తెలుగు ఎప్పుడూ రాజభాష కాలేకపోయింది. ఇంగ్లీషు రాకతో సంస్కృతానికి నూకలు చెల్లిపోయాయి సరే, రాజ్యం మారినా ఇంగ్లీషు మాత్రం రాజ్యమేలుతూనే ఉందే!. అప్పుడు గిరీశం ఇంగ్లీషు మాట్లాడితే జనం నోరు వెళ్ళబెట్టుకుని విన్నారు.ఇప్పుడూ పల్లెటూళ్లలో ఇంగ్లీషు మాట్లాడే వాడికే గౌరవం, గొప్పదనం ఆపాదించడం జరుగుతూనే ఉంది ఇంగ్లీషు మాయనుంచి ఆంధ్రదేశం ఇప్పటికీ మేలుకోలేదు. ఇప్పటికీ వలసవాద సంస్కృతి, పరిపాలనా నియంతృత్వం తెలుగు ప్రజలను మాతృభాషకు చేరువ కానివ్వడం లేదు. తెలుగును అధికార భాషగా, శాస్త్ర, శాసన భాషగా, విద్యా బోధనా మాధ్యమ భాషగా లేకుండా జరిగిన అన్యాయాన్ని గురజాడ తన కాలంలోనే గుర్తించాడు. కనుకనే విద్యా బోధన మాతృభాషలో జరగాలని ఆశించాడు తెలుగు, సంస్కారవంతమైన ఇంగ్లీషుకు దీటుగా నడవాలి. ఇంతకాలం మాతృభాషను నిర్లక్ష్యం చేసిన వాళ్ళే ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయటానికి సమర్ధులని ఆయన అభిప్రాయం.

అది వందేళ్ల క్రితం కావచ్చు అంతకు పూర్వం కావచ్చు, ఎప్పుడైతే తెలుగు భాషను అలక్ష్యం చేయడం, చిన్న చూపు చూడటం, ఇంగ్లీషును నెత్తినెక్కించుకోవడం, ఇంగ్లీషు మాట్లాడటమే ఆధునిక నాగరికత అని భావించడం, తెలుగు సరిగ్గా మాట్లాడలేని తెలుగు వాణ్ని గొప్పవాడిగా, ఇంగ్లీషు బాగా మాట్లాడలేని వాణ్ని అవివేకిగా ముద్రవేయడం జరిగిందో, తెలుగును కాపాడుకోవాలనే ఈనాటి ఆందోళనకు బీజాలు అప్పుడే పడ్డాయి.
-తులసిదాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap