అక్కినేని స్ఫూర్తి ప్రదాత – కె.వి.రమణాచారి

హైదరాబాదులో సెప్టెంబర్ 26 న వైభవంగా జి.వి.ఆర్ – అక్కినేని అవార్డులు ప్రదానం
బాబాయ్ గుదిబండి వెంకటరెడ్డి లేరు. కానీ ఆయన ఆశయాలు ముందుకు వెళుతున్నాయి. ఆయన స్థాపించిన జి.వి.ఆర్ కల్చరల్ ఫౌండేషన్ కార్యక్రమాలను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి, కార్తీక డెవలపర్స్ అధినేత వంగా వీర రాఘవరెడ్డి నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక సంస్థల్లో సహజంగా పేరుకే కార్యవర్గం ఉంటుంది. కానీ చక్రం తిప్పేది వ్యవస్థాపకుడే. ఆ పెద్ద దిక్కు చనిపోతే ఇక ఆ సంస్థ ఆచూకి మాయమైనట్లే. శాండిల్య, సినీ గోయర్స్, కళా వేదిక రమణమూర్తి, ఢిల్లీ తెలుగు అకాడమి నాగరాజు ఇలా వీరి అనంతరం ఆ సంస్థల పేర్లు సరిగా వినపడటం లేదు. కానీ, వై.కె.నాగేశ్వరరావు మరణానంతరం ఆ సంస్థను సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, లంక లక్ష్మీనారాయణ నడిపిస్తూ వై.కె.నాగేశ్వరరావును చిరంజీవిని చేశారు. ఇప్పుడు జీవిఆర్ కల్చరల్ ఫౌండేషన్ ను వీర రాఘవరెడ్డి భుజాలపై వేసుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.

బాబాయ్ ఉండి ఉంటే అక్కినేని అవార్డుల కార్యక్రమం ఎలా నిర్వహించేవారో అలాగే చిక్కడపల్లి, త్యాగరాయ గానసభలో బుధవారం వీర రాఘవరెడ్డి వైభవంగా నిర్వహించారు. వివిధ రంగాలలో శిఖర స్థాయిలో ఉన్న ప్రముఖులకు సత్కార కార్యక్రమం శోభాయమానంగా జరిగింది.
సభను దక్షిణ మధ్య రైల్వే పూర్వ జనరల్ మేనేజర్ సి.రామకృష్ణ ప్రారంభించారు. బాబాయ్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఈయన ఉండేవారు. బాబాయ్ కు అత్యంత ఆత్మీయులు యువకళావాహిని సంస్థ అధ్యక్షులు లంక లక్ష్మీ నారాయణ సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారులు పూజ్యులు కె.వి. రమణ గారు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు నటవైదుష్యాన్ని కొనియాడారు. 73 ఏళ్ళు నటించి ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం నటించిన రెండవ వ్యక్తిగా రికార్డు సృష్టించారని వివరించారు. అక్కినేని స్ఫూర్తి ప్రదాత అని, వారి పేరిట పురస్కారాలు మరింత స్ఫూర్తినిస్తాయని ఆయన తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డా.మహ్మద్ రఫీ మాట్లాడుతూ అక్కినేనితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఇంకా ఈ వేడుకలో న్యాయవాది వడ్లకొండ వెంకట్రావు, ఆరాధన సంస్థ అధ్యక్షులు లోకం కృష్ణయ్య, రామరాజు ఫౌండేషన్ చైర్మన్ డా.రామరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, కళా విపంచి సంస్థ అధ్యక్షులు బొప్పన నరసింహారావు, విద్యావేత్త ఎ.వి.ఎస్.అర్.ఎల్.కామేశ్వరరావు, వీణ విద్వాంసురాలు రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, సీనియర్ సినీ పాత్రికేయులు అడ్ల రాంబాబు, ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయ, డా.వి.సంపత్ కుమార్ లు జివిఆర్-అక్కినేని అవార్డులు స్వీకరించారు. సభకు ముందు రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ వీణ కచేరీతో వీనుల విందు చేశారు. లలిత, టి.వి.రావు, సుదర్శన్, డా.సంపత్, ఏడుకొండలు అక్కినేని నటించిన సినిమాలలోని పాటలు ఆలపించారు. పిఎంకె గాంధీ, బుర్రా మోహనకృష్ణ వ్యాఖ్యానం చేయగా హర్షిత సహకారం అందించారు, వీర రాఘవరెడ్డి పర్యవేక్షించారు.

డా. మహ్మద్ రఫీ

ఫోటోలు: కంచె శ్రీనివాస్

Share via
Copy link
Powered by Social Snap