హాసం అంటే నవ్వు. సకల ప్రాణికోటిలోను నవ్వ గలిగినవాడు మానవు డొక్కడే. భగవంతుడు ఇచ్చిన వరం నవ్వగలగడం. ఈ నవ్వు పలు రకాలు. వెకిలి నవ్వు, వెర్రినవ్వు, వికృతపు నవ్వు, వికారపు నవ్వు, వగైరా. కల్మషమెరుగని మృదు దరహాసం నలుగురిని అకట్టుకుంటుంది. ఈ ప్రాచీన తెలుగు సాహిత్యంలో హాస్య రసానికి తగిన స్థానం లేదని ఒక విమర్శ. ఈవిమర్శ చాలా వరకు యదార్ధమే. ఇందుకు కారణాలు అప్రస్తుతం. ఆధునిక యుగంలో చిలకమర్తి, పానుగంటి, విశ్వనాధ, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం, ముళ్ళపూడి, జరుక్ శాస్త్రి, మొదలైన వారు హాస్యరసానికి ప్రాధాన్యమిచ్చి హాస్యరచనలకు ఒరవడి దిద్దారు. దీనితో ఆధునిక తెలుగు సాహిత్యం కొత్తపుంతలు తొక్కింది.
మాడుగుల రామకృష్ణగారు ఆకాశవాణి, శ్రోతలకు సుపరిచితులు. మూడు దశాబ్దాలకు పైగా ఆకాశవాణికి సేవలందించారు. ఎన్నో హాస్య నాటికలు రచించి, నటించి మంచి హాస్యాన్ని పండించారు. వీరు స్వతహాగా హాస్యప్రియులు. వీరు రచించిన 18 హాస్యకథలను ఒకచోట చేర్చి ‘డజనున్నర హాస్యకథలు ‘ పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. హాస్యం ఇతరులను కించపరిచేలా, బాధించేలా, అసభ్యంగా వుండకూడదు. నలుగురు సుఖంగా నవ్వుకుని సంతోషించేదిగా వుండాలి. అదే నిజమైన హాస్యం. ఈ లక్షణం రామకృష్ణగారి కధలన్నిటిలో కనిపిస్తుంది. సాధారణ కధ వ్రాయటం కన్నా, హాస్యాన్ని పండిస్తూ కధ వ్రాయటం రచయితకు కత్తిమీద సాములాంటిది. ఈ కష్టమైన పనిని రామకృష్ణగారు సునాయాసంగా నిర్వహించి పద్దెనిమిది కధల్లో తన సత్తా ఏమిటో నిరూపించారు. అందుకు ఆయన రచనా సామర్థ్యం ఎంతైనా కొనియాడతగినది. ఈ హాస్య కధల్లో వాస్తవికత, సహజత్వం మనకి కనిపిస్తాయి. సమాజంలో నిత్యం మనకు తారసపడే సంఘటనలు, సన్నివేశాలకు హాస్యాన్ని మేళవించి అద్భుతమైన కధలను మనకందించారు శ్రీరామకృష్ణ. ఈ హస్య కధలను హాయిగా చదివి, నవ్వుకుని అనందించండి. ఆ నవ్వులను నలుగురికి పంచండి. మంచి హాస్య కధల సంకలనాన్ని మనకందించిన రామకృష్ణగారికి శతాధిక అభినందనలు.
-డా. మన్నవ సత్యనారాయణ